జ్యోతీరావ్ ఫులే

భారతీయ సామాజిక సంస్కర్త
(జ్యోతీబా గోవిందరావ్ ఫులే నుండి దారిమార్పు చెందింది)

అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు[1][2] అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే.

భారత ప్రథమ సామాజికతత్వవేత్త

మార్చు

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు.ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.[3] సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే. జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

అమెరికా స్వాతంత్య్రపోరాటం అతనిని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు. 13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది.[4] విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు.[5] కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.

బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారికి కూడా బోధించవలసిరావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.[6] పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో "బాలహత్య ప్రతిబంధక్ గృహ" స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు.

కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు. 1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషయాలపై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1868లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేశాడు. 1877లో సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు.

దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపై బ్రాహ్మణుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883లో కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడి చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన తన 'హెచ్చరిక' (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి, 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.

ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. సత్యశోధక సమాజం తరపున ప్రారంభించిన 'దీనబంధు' వారపత్రికలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు.[7] శెత్కర్యాచ అస్సోడ్‌ (కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌) పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు.[8]

సమన్యాయ సత్యశోధకుడు

మార్చు

భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.

బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మానిపించారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించి బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడయ్యాడు.

తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, తోటమాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్ళిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో పుణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా ఫూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు ఫూలే.

ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబరు 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.[9]

జ్యోతిరావ్ ఫూలేపై వచ్చిన వ్యాసాలు

మార్చు

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న మున్నూరు కాపు బిడ్డ . నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు. ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి.

అందులో బొంబాయి నిర్మాణానికి తెలంగాణ నుండి వలస వెళ్ళి ఎదిగిన మున్నూరుకాపులే అధికం.బొంబాయిలో సత్యశోధక్ సమాజ్ శాఖ పుట్టింది సయాజీ నాగు మున్నూరుకాపు ఇంటిలోనే.

వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్పవిద్యావంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఆయన రచించిన ‘ఈశ్వరునికి ప్రార్థన’ను మరాఠీలోని తొలి వ్యంగ్యరచన గా గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు కోరుతున్నారు. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.

వెంకయ్య కుటుంబ సభ్యులు సావిత్రీబాయి జీవిత చరిత్రను కూర్చి, మూడుమార్లు ప్రచురించారు. సాహు మహారాజ్‌కు ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన భాస్కర్‌రావ్ జాదవ్, రామయ్య తీర్చిదిద్దిన ఆణిముత్యాలలో ఒకరు మాత్రమే. జాదవ్ సత్యశోధక ఉద్యమ నాయకునిగా అన్ని వర్గాల గుర్తింపును పొందారు. ఫూలే ఆలోచనల వ్యాప్తికి, కార్మిక సమస్యలను వెలుగులోకి తేవడానికి కృషిచేసిన ‘దీనబంధు’ పత్రికకు ఆయనే వెన్నెముకై నిలిచారు. ఫూలేకు అడుగడుగుడునా అండదండగా నిలిచి, ఆయన తర్వాత కూడా సత్యశోధక సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది. (సాక్షి 28-11-12).

మూలాలు

మార్చు
  1. Bhadru, G. (2002). "Contribution of Shatyashodhak Samaj to the Low Caste Protest Movement in 19th Century". Proceedings of the Indian History Congress. 63: 845–854. JSTOR 44158153.
  2. "Life & Work of Mahatma Jotirao Pule". University of Pune. Archived from the original on 11 మార్చి 2009. Retrieved 4 అక్టోబరు 2019.
  3. Rowena Robinson; Joseph Marianus Kujur (17 August 2010). Margins of Faith: Dalit and Tribal Christianity in India. SAGE Publishing India. ISBN 978-93-86042-93-4.
  4. Phule, Jotirao (1991). Selections: Collected Works of Mahatma Jotirao Phule Vol II. Mumbai: Government of Maharashtra. pp. xv.[permanent dead link]
  5. Phule, Jotirao (1991). Selections: Collected Works of Mahatma Jotirao Phule Vol II. Mumbai: Government of Maharashtra. pp. xvi.[permanent dead link]
  6. O'Hanlon, Rosalind (2002). Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth-Century Western India (Revised ed.). Cambridge University Press. p. 118. ISBN 978-0-521-52308-0.
  7. Charlesworth, Neil (2002). Peasants and Imperial Rule: Agriculture and Agrarian Society in the Bombay Presidency 1850–1935 (Revised ed.). Cambridge University Press. p. 277. ISBN 978-0-52152-640-1.
  8. సూర్య వార్తాపత్రికలో వ్యాసం, 28 ఫిబ్రవరి 2012
  9. ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యాసం, 28 నవంబరు 2012

ఇతర లింకులు

మార్చు