సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి[2].
సావిత్రిబాయి పూలే | |
---|---|
![]() 1998లో విడుదలైన భారత తపాలా బిళ్ళ | |
జననం | నైగాన్, మహారాష్ట్ర (ప్రస్తుతం సతారా జిల్లా, మహారాష్ట్ర ) | 3 జనవరి 1831
మరణం | 10 మార్చి 1897 పూణె, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా | (వయస్సు 66)
మరణ కారణం | బుబోనిక్ ప్లేగు |
జాతీయత | భారతీయులు |
జీవిత భాగస్వాములు | జ్యోతీరావ్ ఫులే |
జీవిత విశేషాలుసవరించు
ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నరు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతీరావు ఫూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా "నా విధిని నేను నిర్వహిస్తున్నాను" అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. [2]
ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.
ఉపాధ్యాయురాలిగాసవరించు
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతు గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణిగాసవరించు
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. జెండర్ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా, వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి నoపెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్ సమాజ్’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన ఏమండీ కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్ సమాజ్ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.
భర్త మరణంసవరించు
జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.
మరణంసవరించు
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది[3]. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు[4].
మూలాలుసవరించు
- ↑ Mariam Dhawale. "AIDWA Observes Savitribai Phule Birth Anniversary". Retrieved 3 March 2014.
- ↑ 2.0 2.1 chj. "భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిందేమిటో తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2019-12-27.
- ↑ "ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే". Sakshi. 2015-01-03. Retrieved 2019-12-27.
- ↑ "తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-12-27.
ఇతర పఠనాలుసవరించు
- A Forgotten Liberator – The Life And Struggle of Savitribai Phule, Mountain Peak Publishers, New Delhi ISBN 978-81-906277-0-2
- Rao, Parimala V. (2002). "Educating Women - How and How Much: Women in the Context of Tilak's Swaraj". In Bhattacharya, Sabyasachi (ed.). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India. Orient Blackswan. ISBN 978-8-12502-192-6.
ఇతర లింకులుసవరించు
- Navayan.com – Events, Life-sketch, Books, Poems, Photos of Bodhisattva Savitribai Phule
- మానవ హక్కుల వైతాళికురాలు
- http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jan/3navya1[permanent dead link]
Wikimedia Commons has media related to Savitribai Phule. |