తోడా వీరరాఘవన్

(టి.వి.రాఘవులు నుండి దారిమార్పు చెందింది)

తోడా వీరరాఘవన్ (టి.వి.రాఘవులు) "చిత్రా" గా సుపరిచితుడైన చందమామ ప్రధాన చిత్రకారుడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను 1912 మార్చి 12న జన్మించాడు. అతను మద్రాసుకు చెందిన తెలుగు వాడు. అతను ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నాడు. అతనికి 1942లో వివాహం జరిగింది. అతను వి.ఆర్.పి.వార్డెన్ గా ఉండేవాడు. 1947 జూన్ 2న చందమామ పత్రికలో చేరకముందు అతను కొంతకాలం పాటు క్లైన్ అండ్పెరోల్ లో బ్లాక్ మేకర్ ఫోటోగ్రాఫరుగానూ, ఆక్స్‌ఫర్డు ప్రెస్ లో సేల్స్‌మన్ గా, చిత్రకారునిగా పని చేసాడు. అతను స్వతహాగా ఛాయాగ్రాహకుడు. ఫోటోగ్రఫీలో ఎన్నో బహుమలులు కూడా పొందాడు. అతను వేసే చిత్రాలు ఫోటోల్లాగ ఉంటాయి.[1]

చిత్రకళలో ప్రవేశం

మార్చు

అతను చిత్ర లేఖనంలో శిక్షణ పొందలేదు. స్వయంకృషితో మంచి ఆసక్తితో అభ్యాసం చేసి నేర్చుకుని చిత్ర కళలో నైపుణ్యం సంపాయించి, భారత దేశం లో ఉన్న బాలలందరినే కాక పెద్దలను కూడ దశాబ్దాలపాటు అలరించాడు.

చిత్రాగారి స్వస్థలం తిరువళ్లూరు . చిత్రా చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశాడు. మద్రాసులో స్కూల్లో చదువు పూర్తయ్యాక మౌంట్‌రోడ్ లోని ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ వంటి చోట్ల పనిచేశాక 1947లో చందమామలో చేరాడు. అతను 1947 జూలైలో వెలువడిన ‘చందమామ’ మొదటి సంచికకు ముఖచిత్రం వేశాడు. 1955 సెప్టెంబరులో వచ్చిన తొలి బేతాళ కథకు అపురూప చిత్రం సమకూర్చాడు. చందమామకు పదివేల చిత్రాలు వేసి చిన్నలనూ పెద్దలనూ కూడా అలరించాడు. 1952 జనవరిలో చందమామ సంపాదక వర్గంలో సభ్యుడయ్యాడు. ఆయన బొమ్మల ప్రత్యేకత వాస్తవంగా కదులుతున్నట్టు ఉండేవి.

ఒక సందర్భంలో బాపు చిత్రా బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం, ఆయన గీసే పద్ధతి తనకు బాగా నచ్చుతుందనీ అన్నాడు. అమెరికన్‌ కామిక్స్‌ "చందమామ" ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవాడు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు. దాసరివారి సీరియల్‌కు చిత్రా బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యం "మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు" మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవాడు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా బొమ్మలవల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.

చిత్రా చిత్రలేఖనం పాశ్చాత్య శైలి నుండి ప్రేరణ పొందింది. ప్రజలను చిత్రించేటప్పుడు , చిత్రంలోని వ్యక్తి ప్రవర్తన, కండరాలు, మాంసం, ఇతర వివరాల వంటి విషయాలను నొక్కిచెప్పేటట్టు చిత్రించేవాడు; మరోవైపు, శంకర్ స్పష్టంగా అజంతా-బెంగాలీ శైలి నుండి ప్రేరణ పొందాడు. శంకర్ వ్యక్తి యొక్క ఆకృతులకు, రూపం యొక్క సౌమ్యతకు ఎక్కువ విలువను ఇచ్చేవాడు. దీని ప్రకారం, చిత్రకు అద్భుతమైన, ఊహా సంబంధిత గొప్ప కథల కోసం స్కెచ్‌లు గీయడానికి అవకాశం లభిస్తే, శంకర్ మన సంప్రదాయం, చరిత్ర, ఇతిహాసాల కథల కోసం స్కెచ్‌లు గీయడానికి అవకాశాలు లభించాయి. రెండింటి స్కెచ్‌లు భావాల వ్యక్తీకరణలతో నిండి ఉండేవి. [2]

చిత్రా వేసిన బొమ్మలు, కథను చిత్రాల ద్వార చెప్పటమే కాకుండా, కథలో చెప్పని అనేక విషయాలను వ్యక్త పరిచేవి. బొమ్మ చూడగానే కథను చదివించే శక్తి, మన మనసులను సూదంటు రాయిలాగ ఆకర్షించి, మన ఊహా లోకాలలో ఆ కథా విషయం, కథా కాలం, ఆ కథలలో ఉన్న పాత్రల స్వబావ స్వరూపాలు వెంటనే మన మనసులకు హత్తుకు పొయ్యేట్టుగా ఆయన వేసిన బొమ్మలు చందమామను ఎంతో ప్రసిధ్ధ పత్రికగా నిలబెట్టినాయి.

బొమ్మలను చందమామలో ఎలా, ఎక్కడ వెయ్యలి అన్న విషయంలో చక్కటి కొత్త శైలిని ప్రవేశపెట్టారు, చక్రపాణి గారు. ఆయన ప్రవేశపెట్టిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక ఒరవడిగా తీర్చిదిద్దిన ఘనత చాలావరకు చిత్రాగారిదే. ఇప్పటికీ పిల్లల పత్రికలన్ని కూడ, చందమామ వారు ఏర్పరిచిన పంథానే అవలింభిస్తున్నాయి. చివరకు చందమామ "వ్యాపార కంపెనీ" పరమయ్యి, కొత్త పోకడలకు పాకులాడి, చందమామ ముద్రించే పద్దతి మార్చినప్పుడు, తీవ్ర నిరసనను ఎదుర్కుని, మళ్ళీ తమ పాత పద్ధతిలోనే ప్రచురిస్తామని మాట ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ప్రాచుర్యం పొందింది, చందమామ ప్రచురణ పద్ధతి.

చిత్రాల ప్రత్యేకత

మార్చు

అసలు బొమ్మలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఆ బొమ్మలో ఉన్న పరిసరాలు, వస్తువులు, మనుష్యులు మధ్య ఉండవలసిన నిష్పత్తి. ఒక మనిషి మేడపైనుంచి చూస్తుంటే, కింద వస్తువులు అతనికి ఎలా కనిపిస్తాయి, లేదా, కిందనుండి పై అంతస్తులో ఉన్న వ్యక్తితో మాట్లాడే వ్యక్తి మెడ ఏ కోణంలో వెయ్యాలి, అతనికి మేడమీద వ్యక్తులు ఎలా కనిపిస్తారు లాంటి విషయాలు చక్కగా ఆకళింపు చేసుకుని చిత్రాగారు బొమ్మలను వెయ్యటం వల్ల ఆయన బొమ్మలు ఎంతగానో పేరు తెచ్చుకున్నాయి. కథను క్షుణ్ణంగా చదివిన తరువాతగాని బొమ్మ వెయ్యటం మొదలు పెట్టేవారు కాదన్న విషయం, ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ కనపడుతుంది. ఆయా పాత్రల ముఖ కవళికలు, కథలోని పాత్రల మనస్తత్వాలను సరిగ్గా చిత్రీకరించేవారు.

చిత్రాలన్నీ కూడ బొమ్మలోని కథ ఏ ప్రాంతంలో జరిగిందో, ఆయా ప్రాతాంల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించేవి.అక్కడి మనుషులు ఎలా ఉంటారు, ఎటువంటి జంతువులు దర్శనమిస్తాయి, అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడతారు వంటి అనేక విషయాలు అధ్యయనం చేసి తమ బొమ్మలలో వేసి పిల్లలకు కథలో చెప్పని ఎంతో విలువైన సమాచారం ఇచ్చేవారు చిత్రాగారు. మనం ఇంక ఆ ప్రాంతం గురించి పెద్దగా తెలుసుకునే అవసరం ఉండేది కాదు. అలాగే, కథలోని పాత్రల హోదా బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కేశాలంకరణలు, దుస్తులు మారిపొయ్యేవి, చక్కగా కథలో వ్రాసిన విషయానికి నప్పేవి.

1978 మే 6న మద్రాసులో కన్నుమూశాడు.

మూలాలు

మార్చు
  1. "Chandamama - Good Old Stories in Telugu". www.chandamama.in. Retrieved 2020-07-15.
  2. "Chandamama's Luminescence | Prekshaa". www.prekshaa.in. Retrieved 2020-07-15.

బాహ్య లంకెలు

మార్చు