చందమామ
చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది[1].చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి (వీరు తెలుగు, తమిళ భాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.[2] కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం, ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.
సంపాదకులు | ప్రశాంత్ ములేకర్ |
---|---|
వర్గాలు | బాలలు |
తరచుదనం | మాసపత్రిక |
మొదటి సంచిక | 1947 |
సంస్థ | Geodesic Information Systems Limited |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు సంస్కృతం అస్సామీ హిందీ ఒరియా ('Janhamaamu' గా) ఆంగ్లము కన్నడం మరాఠీ('చందోబా' గా) తమిళం |
చందమామ కథలు
మార్చుభారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి. కాని, అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు. దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు. అయితే, చందమామలోని కథలు అటువంటి కారణంలేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు. చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా, మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి. అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దాం అనిపించేది. దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గానీ పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు. సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి - ఒకటి, మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు, రెండు, కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు. దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ, వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూవచ్చాయి.
చందమామ ధారావాహికలు
మార్చుచందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. "చిత్ర", "శంకర్" వేసిన అద్భుతమైన బొమ్మలతో, ఎంతో ఆసక్తికరమైన కథనంతో, సరళమైన భాషతో ఒక్కొక్క ధారావాహిక అనేక నెలలపాటు సాగేది. ప్రతినెల ఒక ఆసక్తికరమైన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు ఆసక్తితో చదువరులు ఎదురు చూసేట్లు చేసేవారు. పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవికాదు. "చిత్ర" ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేస్తారో, ధారావాహిక పూర్తయేవరకు కూడా, ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి. ప్రతి ధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు: శిఖిముఖి - విక్రమకేసరి, ధూమకుడు - సోమకుడు, ఖడ్గవర్మ - జీవదత్తుడు మొదలగు నాయకద్వయాలు పాఠకులను ఎంతగానో అలరించేవి. కథానాయికలు చాలా తక్కువగా కనిపించేవారు. కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు. శిథిలాలయంలో ఒక్క నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామమాతృలే. నవాబు నందిని, దుర్గేశ నందిని తప్ప, మిగిలిన ధారావాహికలన్నీ భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలోనూ రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికులకు సంబంధించిన పాత్రలు, కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమైన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి. అంతేకాకుండా, పురాణాలు, చరిత్రకు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు. అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్ నైట్స్), ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు, ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీక్ పురాణాలైన ఇలియడ్, ఒడిస్సీ, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలేగాక ఇతర భాషా సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దలైన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు. ఈ ధారావాహికల వివరాల కోసం చందమామ ధారావాహికలు చూడండి.
బేతాళ కథలు
మార్చుప్రధాన వ్యాసం:చందమామలో బేతాళ కథలు
ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతిమాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని) తో మొదలయేది. అలాగే, మరొక సంఘటన (రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు) తో అంతమయేది. ప్రతి కథనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని బేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని చక్కగా చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న (లు) వేసేవాడు.అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్న(ల)కు సమాధానం తెలిసీ చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చిన పని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్రాణానికే ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పనిసరి పరిస్థితిలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి కథచెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌనభంగం చేసి, అతను వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది. అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో (గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. మొదటి బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల ఆసక్తిని గమనించిగాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1972 జూలైలో మొదటి బేతాళ కథను రంగుల్లో పునర్ముద్రించారు. మరి కొన్ని పిల్లల పత్రికలు బొమ్మరిల్లు వంటివి ఇదేపద్ధతిలో కథలను (కరాళ కథలు) సృష్టించడానికి ప్రయత్నించాయి గాని, అంతగా విజయం సాధించలేదని చెప్పవచ్చు.
చందమామలో జానపద కథలు
మార్చుజానపద కథలకు చందమామ కాణాచి. చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం, ముందుచూపు, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.
చందమామ శైలి, ఒరవడి
మార్చుచందమామ శైలి సామాన్యమైన పదాలతో, చక్కటి నుడికారాలు, జాతీయాలు, సామెతలతో కూడినది. పాఠకులను చీకాకు పరిచే పదప్రయోగాలూ, పదవిన్యాసాలూ ఉండేవి కావు. చదువుతుంటే కథగానీ మరేదైనా శీర్షికగానీ అందులోని భావం హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉండేది. కొడవటిగంటి కుటుంబరావు (ఎక్కువకాలం చందమామకు సంపాదకులు)ఏ దేశ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకు సరిపోయేట్టు మలిచి వ్రాసేవాడట. చందమామలోని మరో ప్రత్యేకత - తేనెలూరే తియ్యటి తెలుగు. అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. కథ, కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో, ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి, మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది. చందమామ శైలిని, ఒరవడిని, ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని, కొత్త శైలినిగాని ఒరవడినిగాని ఇంతవరకు సృష్టించలేక పోయారు.
ఇతర శీర్షికలు
మార్చుమహోన్నతమైన భారతీయ సాంస్కృతిక వైభవానికీ, వైవిధ్యానికీ అద్దం పట్టే శీర్షికలు అనేకం చందమామలో వచ్చాయి. సుభాషితాలు, బేతాళ కథలతోబాటు దశాబ్దాల కాలం నుంచి నిరాఘాటంగా నడుస్తున్న శీర్షిక ఫోటో వ్యాఖ్యల పోటీ. ఈ పోటీలో, రెండు చిత్రాలను ఇస్తారు. పాఠకులు ఆ రెండు చిత్రాలను కలుపుతూ ఒక వ్యాఖ్య పంపాలి. అన్నిటికన్న బాగున్న వ్యాఖ్యకి బహుమతి. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన కథల పోటీల్లాంటివి పాఠకుల సృజనాత్మకతకు పదును పెడుతున్నాయి. పిల్లలకు విజ్ఞానం, వినోదం, వికాసం అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త శీర్షికలతో ప్రయోగాలు చేయడం చందమామ ప్రత్యేకత.
ప్రత్యేక సంచికలు
మార్చుఅప్పుడు
మార్చుచందమామ, మంచి ప్రాభవంలో ఉన్న రోజుల్లో వడ్డాది పాపయ్య, బాపు గార్ల రంగుల బొమ్మలతో, ప్రతి పేజీక్రింద అంచులలో దీపాల బొమ్మలతో, దీపావళికి ప్రత్యేక సంచిక ఉండేది. అలాగే, మనిషి మొట్టమొదటిసారి, చంద్రుడిమీద కాలుపెట్టిన చారిత్రాత్మక సంఘటన (జులై, 1969) సందర్భంగానూ, మహాత్మా గాంధీ శతజయంతి (1969 అక్టోబరు) సందర్భంగానూ ప్రత్యేక చందమామలు వేయబడ్డాయి. అలాగే, విజయా సంస్థ వారు హిందీలో "ఘర్ ఘర్ కి కహానీ" ప్రముఖ నటులు బల్రాజ్ సహానీతో తీసినపుడు, ఆ చిత్రం గురించి చందమామలో ప్రత్యేకంగా వ్రాసారు. ఆ చిత్రంలో, కుటుంబంలో తండ్రి - పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చక్కగా చూపారు. అందుకనే కాబోలు, చందమామలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఈ సంచికలు చందమామ ప్రతులు పోగుచేసేవారికి ఎంతో విలువైనవి, బంగారంతో సమానమైనవి.
ఇప్పుడు
మార్చు2000 సం. నుండి ప్రతి సంవత్సరం నవంబరు సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 14 ఏళ్ళలోపు బాలబాలికలచేత కథలు వ్రాయించి, ఎంపికచేసిన బాల చిత్రకారుల్ని చెన్నై రప్పించి, ఆ కథలకు వారిచేత బొమ్మలు వేయిస్తున్నారు.
ఇతర భాషల్లో చందమామ
మార్చుచందమామ ప్రస్తుతం తెలుగు (1947 జూలై నుంచి), తమిళం (1947 ఆగస్టు - అంబులిమామ), కన్నడం (1948), హిందీ (1949 - చందామామ), మరాఠీ (1952 - చాందోబా), మలయాళం (1952 - అంబిలి అమ్మావన్), గుజరాతీ (1954), ఇంగ్లీషు (1955), ఒరియా (1956), బెంగాలీ (1972), సింధీ (1975), అస్సామీ (1976), సంస్కృత (1979) భాషల్లోనేగాక 2004 ఆగస్టు నుంచి సంతాలీ (చందొమామొ) అనే గిరిజన భాషలోకూడా వెలువడుతోంది (మొత్తం పదమూడు భాషలు). ఒక గిరిజన భాషలో వెలువడుతున్న మొట్టమొదటి పిల్లల పత్రిక చందమామ కావడం విశేషం. సింధీలో 1975 లో మొదలై కొంతకాలం నడచి ఆగిపోయింది. గురుముఖి (పంజాబి భాష యొక్క లిపి), సింహళ (1978 - అంబిలిమామ) లో కూడా కొంతకాలం నడచింది. పంజాబ్, శ్రీలంక ఘర్షణల తర్వాత ఆ భాషల్లో ప్రచురణ నిలిచిపోయింది. చందమామను చూసి ముచ్చటపడిన అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి, కొన్ని నెలల పాటు సింహళ సంచికకు కథలు కూడా అందించాడు. అంధుల కోసం 4 భాషల్లో (ఇంగ్లీషు, తమిళం, హిందీ, మరాఠి) బ్రెయిలీ లిపిలో (1980 నుంచి) కూడా కొంతకాలం నడచి 1998లో ఆగిపోయింది. 2004 సంవత్సరం నుండి తెలుగు, ఇంగ్లీషు బ్రెయిలీ లిపి (గుడ్డివారు చదవగలిగిన లిపి) సంచికలు తిరిగి ప్రచురించడం మొదలయింది.[1][permanent dead link].
అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల కోసం రెండుభాషల సంచిక (ఒకే పుస్తకంలో రెండు భాషల చందమామ) లు తెలుగు-ఇంగ్లీషులలో వెలువడుతున్నాయి. అలాగే, తమిళం-ఇంగ్లీషు, హిందీ-ఇంగ్లీషు భాషల్లో కూడా వెలువడుతున్నాయట. గుజరాతి-ఇంగ్లీషు ద్విభాషా పత్రిక కూడా విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వినికిడి. ఇక సింగపూరులోని పాఠకులకోసం ప్రత్యేకంగా అంబులిమామ పేరుతో ఇంగ్లీషు-తమిళ భాషల్లో ద్విభాషా సంచిక వెలువడుతోంది. కొత్తలో ఈ నెలలో తెలుగులో వచ్చిన చందమామ, పై నెలలో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చేది. ఎందుకంటే ఆ సంపాదకులకు తెలుగు చదవడంవచ్చు. ఆ తరువాతి నెలలో తమిళంనుంచి మలయాళంలోనికీ, హిందీ నుంచి మరాఠీ, గుజరాతీల్లోకీ అనువాదం అయేది. ఏ భాషకా భాషలో వరస తప్పకుండా సంచికలు వచ్చేవి కనక ఎవరికీ ఇబ్బంది ఉండేదికాదు. ఇతర భాషల పాఠకులకు తెలుగే ఒరిజినల్ అని తెలిసేది కూడా కాదు. తమిళంలో అంబులిమామా, మలయాళంలో అంబిలి అమ్మావన్, మరాఠీలో చాందోబా ఇలా ప్రతిదీ దేనికదిగా ప్రసిద్ధి చెందిన పత్రిక లైపోయాయి. అయితే 1990ల నుండి, ముఖ్యంగా మనోజ్ దాస్ రచనలు ఎక్కువయ్యేకొద్దీ ఈ వరస తిరగబడింది. ఆయన చేసే రచనలు ముందుగా ఒరియా, ఇంగ్లీషు భాషల్లోనూ, ఆ తర్వాత తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ వస్తున్నాయి.
సంపాదకులు, ప్రచురణకర్తలు
మార్చుచందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి. చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే. 1975లో చనిపోయే వరకూ ఎనలేని సేవచేశాడు. ప్రస్తుతం నాగిరెడ్డి కుమారుడైన విశ్వనాథరెడ్డి చందమామ వ్యవహారాలు చూస్తూ, సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు.
చందమామ సంపాదకుల వ్యాఖ్యలు
మార్చు- "బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి...పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు...దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు...కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ". -కొడవటిగంటి కుటుంబరావు
- "ప్రతి ఒక్కరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలను గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను పదిలపరచి ఒక తరాన్నుంచి ఇంకో తరానికి అందించడమే లక్ష్యంగా చందమామ పని చేస్తోంది. గతానికీ, వర్తమానానికీ మధ్య వారధిగా నిలుస్తోంది." -బి.విశ్వనాథరెడ్డి-విశ్వం (చందమామ ప్రస్తుతపు సంపాదకులు (2008), వ్యవస్థాపకులలో ఒకరైన నాగిరెడ్డి కుమారుడు)
చందమామకు ప్రముఖుల ప్రశంసలు
మార్చు- వివిధ ఎడిషన్ల గురించి మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ: "అసామాన్యమైన విషయం"
- ప్రథమ భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాదు: "అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి"
- పూర్వ ప్రధాని మొరార్జీ దేశాయ్: "పిల్లలకు చక్కని ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోంది"
- పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ: చందమామ ఎన్నో భాషల్లో నిరంతరాయంగా ఒక్కమారు వస్తున్నది. ఇది పిల్లల్లో ఊహలను పెంచుతుంది. కళ పట్ల అవగాహన కలిగిస్తుంది. నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తుంది. సమాజంలోనూ, లోకంలోనూ కలసి మెలసి బ్రతికే సుగుణం నేర్పుతుంది.
- పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్: భారతదేశపు సుసంపన్న, బహువిధ సాంస్కృతిక వారసత్వము నుండి ఏర్చి కూర్చిన కథలతో చందమామ లక్షలాది చిన్నారుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది. ఇన్ని భాషలలో ప్రచురించే సాహసాన్ని పెద్దయెత్తున అభినందించాలి.
- మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్: (జూనియర్ చందమామగురించి) ఇది యువతరాన్ని చైతన్యపరుస్తుంది.
- అమితాబ్ బచ్చన్ "నా చిన్నతనంలో నేను పశ్చిమ దేశాలకు చెందిన 'కామిక్స్' ప్రభావంలో ఉండేవాడిని. నా తల్లి తండ్రులు, నాకు చందమామను పరిచయం చేసినప్పటినుండి, ఆ పుస్తకాన్ని వదలలేదు. భారతదేశంలో చందమామ కథలు ప్రాచుర్యంలో లేని గృహం ఉంటుందని నేననుకోవటంలేదు...... నేను చందమామను నా మనమలకు, మనమరాళ్ళకు పరిచయం చేస్తాను" (చందమామ 60వ వార్షికోత్సవ సందర్భంగా, ప్రత్యేక సంచికను విడుదల చేస్తూ. - హిందు దిన పత్రిక, 2008 ఏప్రిల్ 18 నుండి)[2] Archived 2008-04-22 at the Wayback Machine
60 వసంతాల చందమామ
మార్చుభారతదేశ స్వాతంత్ర్యానికి సరిగ్గా ఒక నెల ముందు ప్రారంభించబడిన చందమామ 2006 జూలైకి 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపాదకుడు విశ్వనాథరెడ్డి తన తండ్రిని, చక్రపాణిని గుర్తు చేసుకున్నాడు. పత్రిక ఇంకా వారు చూపిన బాటలోనే సాగుతోందని తెలిపాడు. నేటి తరం పిల్లల కోసం పత్రిక స్వరూపాన్ని మార్చే అలోచనేది లేదని తెలిపాడు.[3]. ఈ మధ్యనే ప్రముఖ భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ, ఇన్ఫోసిస్ యొక్క సాంఘిక సేవా విభాగం,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కర్ణాటకలో 6,000 కన్నడ, ఇంగ్లీషు సంచికలు గ్రామీణ బాలలకు ఇవ్వడానికి చందమామతో ఒప్పందం కుదుర్చుకుంది.
చందమామ రచయితలు/చిత్రకారులు
మార్చుకొడవటిగంటి కుటుంబరావు: 1952 నుంచి 1980లో చనిపోయే వరకూ చందమామకు సంపాదకుడిగా విశేషమైన కృషి చేశాడు (సంపాదకుడి పేరు వెయ్యటం చందమామ సంప్రదాయం కాదప్పట్లో). పురాణ గాథల్నీ, పరభాషా కథలను తేట తెలుగులో పిల్లలకు అందించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. మొదట్లో బయటి రచయితలు పంపిన కథల వంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. రకరకాల మారుపేర్లతో కథలు, శీర్షికలన్నీ ఆయనే రాసేవాడు. మంచి కథలు ఎవరైనా పంపితే వాటిని అవసరమనిపిస్తే కొడవటిగంటి కుటుంబరావు "మెరుగుపరిచి" తిరగరాసేవాడట. ఇతర భాషలలో వచ్చిన కథ నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది. 1970ల తరువాత బైటినుంచి రచనలు రావడం, వాటిని "సంస్కరించి" ప్రచురించడం ఎక్కువైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి "గాంధీగారి భాష" అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు.
కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథా/నవలా రచయిత కావటంవల్ల, ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా, ప్రతి మాసం మలచేవాడు. దీనికి తోడు, ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది. కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు. ప్రతి కథా చాలా సూటిగా, కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది.
ఇతర రచయితలు
మార్చు- విద్వాన్ విశ్వం
- మొదట్లో చందమామలో కథలతో బాటు గేయాలు/గేయకథలు కూడా వస్తూ ఉండేవి. అప్పట్లో చందమామలో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విద్వాన్ విశ్వం. తర్వాతి కాలంలో ఈ కథలను ఆయన చేతే చక్కటి వాడుక భాషలోకి మార్చి చందమామలో ప్రచురించారు. చందమామలో ఈ కథలకు బొమ్మలు వేసింది వడ్డాది పాపయ్య కాగా ఈ కథలను ద్విపద రూపంలోనూ, వచనరూపంలోనూ టి.టి.డి. వాళ్ళు ఒకే పుస్తకంగా ప్రచురించినప్పుడు బాపు చేత బొమ్మలు వేయించారు.
- ఉత్పల సత్యనారాయణ
- ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈయన చందమామలో వ్రాసిన గేయాలు సుప్రసిద్ధం.
- వడ్డాది పాపయ్య
- వపా కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన దేవీభాగవతం కథలను పూర్తి చేసింది ఆయనే. విష్ణుకథ పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
- దాసరి సుబ్రహ్మణ్యం
- చందమామలో దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం ఒకడు. మొదటి రంగుల సీరియల్ ఆయన ప్రత్యేకత. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్ తగ్గింది. దాంతో దాసరినకలానికి మళ్ళీ పనిపడింది. చక్రపాణి అభిరుచి, పాఠకుల అభిరుచి వేరని రుజువయింది.
- ఏ.సి. సర్కార్
- ప్రజల్లో బాగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడానికి కొడవటిగంటి కుటుంబరావు చందమామ ద్వారా ప్రయత్నాలు చేశాడు. మహిమల పేరుతో అమాయక ప్రజలను మోసగించేవారి గుట్టుమట్లను బయట పెడుతూ ప్రత్యేకంగా ఏ.సి.సర్కార్ అనే ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు వ్రాయించాడు.
- వసుంధర
- ఒక్క చందమామలోనే ఏడు వందలకు పైగా కథలు రాసిన ఘనత వీరిది.
- బూర్లే నాగేశ్వరరావు
- ఈయన చాలా చక్కటి కథలు అనేకం రాశాడు.
- మాచిరాజు కామేశ్వరరావు
- చందమామలో దాదాపు గత ఇరవయ్యేళ్ళ కాలంలో వచ్చిన దయ్యాలు, పిశాచాల కథలన్నీ ఈయన రాసినవే.
- మనోజ్ దాస్
- ప్రస్తుతం భారతదేశంలో చిన్నపిల్లల కోసం రచనలు చేస్తున్న వారిలో అగ్రగణ్యుడు. మాతృభాష అయిన ఒరియా, ఇంగ్లీషు భాషల్లో విరివిగా వ్రాయడమే గాక చందమామ కోసం వివిధ దేశాల జానపద, పురాణ గాథలను అనువదించాడు. చందమామలో జానపద సీరియల్ రచయిత పేరు వెయ్యడం ఒకేసారి జరిగింది. 1990లలో వచ్చిన "బంగారు లోయ" సీరియల్ రచయితగా మనోజ్ దాస్ పేరు వేశారు.
వీరు కాక ఎందరో ఇతర రచయితలు (పేరు పేరునా ఉదహరించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది) వారివంతు కృషి చేసి చందమామను చక్కటి పత్రికగా తీర్చి దిద్దారు.
చిత్రకారులు
మార్చు"చందమామ"కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి. చక్రపాణి అంతవరకూ ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీ లోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు, కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాగా అరవయ్యేళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది. చందమామలో బొమ్మలు వేసిన కొందరు ప్రముఖ చిత్రకారులు:
- వడ్డాది పాపయ్య
- ఒక్క ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలన్నిట్లోనూ ముఖచిత్రాలు వడ్డాది పాపయ్య గీసినవే.
- ఎం.టి.వి. ఆచార్య
- 1952 ప్రాంతాల్లో ఎం.టి.వి. ఆచార్య "చందమామ"లో ఆర్టిస్టుగా చేరాడు. మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశాడు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించాడు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశాడు. భీష్మ సినిమాలో ఎన్. టి. రామారావు ఆహార్యమంతా "చందమామ"లో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. ఆ తరువాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయాడు.
- చిత్రా (టి.వి. రాఘవన్)
- మొదట్లో "చందమామ"కు చిత్రా ప్రధాన ఆర్టిస్టుగా ఉండేవాడు. ప్రారంభ సంచిక ముఖచిత్రం ఆయనదే. చిత్రా చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశాడు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఒక సందర్భంలో బాపు చిత్రా బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం, ఆయన గీసే పద్ధతి తనకు బాగా నచ్చుతుందనీ అన్నాడు. అమెరికన్ కామిక్స్ "చందమామ" ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవాడు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు. దాసరివారి సీరియల్‌కు చిత్రా బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యం "మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు" మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవాడు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా బొమ్మలవల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.
- శంకర్
- బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని, ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్ళతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ వేసిన బొమ్మ అని. తమిళనాడుకు చెందిన ఆయన ఆర్ట్ పాఠశాలలో చిత్రకళ నేర్చుకుని వచ్చినవాడు. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత. మొత్తంమీద వీరిద్దరూ వివరాలతో కథలకు బొమ్మలువేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు.
- బాపు
- కొన్ని సంచికలకు బాపు కూడా బొమ్మలు వేశాడు. "చందమామ" ఫార్మాట్‌లో గీసినా ఆయన తన శైలిని మార్చుకోలేదు. ఉత్పల సత్యనారాయణాచార్య గేయ కథలకు ఆయన మంచి బొమ్మలు గీశాడు.
జయ, వీరా, రాజి లాంటి మరికొందరు చిత్రకారులు చందమామలో ఎక్కువగా బొమ్మలు వేసేవారు.
ముద్రణ
మార్చుచందమామ అందంగా రూపొందడానికి గల మరో కారణం నాణ్యమైన ముద్రణ. నాగిరెడ్డి తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి (ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్ గా పనిచేశాడు) పేరుతో నడుపుతున్న బి.ఎన్.కె. ప్రెస్సులోనే మొదటినుంచి చందమామ ముద్రణ జరుగుతోంది. నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్.కె.ప్రెస్ "చందమామ"ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చక్రపాణి "సాఫ్ట్‌వేర్"కు నాగిరెడ్డి "హార్డ్‌వేర్" తోడై "చందమామ"ను విజయవంతంగా తీర్చిదిద్దింది. అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే. శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పని మీద చక్రపాణి అక్కడికి వచ్చాడు. తర్వాత నాగిరెడ్డి-చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర.
చందమామ మూసివేత- పునఃప్రారంభం
మార్చు1998 అక్టోబరు నెలలో అనివార్య పరిస్థితుల్లో ప్రచురణ ఆగిపోయిన చందమామ 1999 డిసెంబరు నెలలో తిరిగి మొదలైంది. మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సేథి, కార్వీ కన్సల్టెంట్స్ కు చెందిన సుధీర్ రావు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఎస్. నీలకంఠన్, ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ కుమార్, మార్కెటింగ్ నిపుణుడు మధుసూదన్ లు చందమామ పునఃస్థాపనకు మూల కారకులు. చందమామ ప్రత్యేకతలుగా గుర్తింపు పొందిన కథన శైలి, సాంకేతిక నైపుణ్యాలను రంగరించి పంచతంత్రం, జాతక కథలు లాంటివాటిని బొమ్మల కథలుగా రూపొందించి ఇతర పత్రికలకు అందజేయడానికి సిండికేషన్ ద్వారా ముందుకు వచ్చింది చందమామ. తెలుగు, ఇతర భాషల్లో అనేక పత్రికలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి.అప్పటి వరకూ పూర్తిగా బి.నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే పరిమితమై ఉన్న చందమామ ప్రచురణ, నిర్వహణ హక్కులు కొత్తగా స్థాపించబడిన చందమామ ఇండియా లిమిటెడ్ కు బదిలీ చేయబడ్డాయి. అందులో బి.నాగిరెడ్డి కుమారుడైన బి.విశ్వనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 40% వాటా, వినోద్ సేథి, సుధీర్ రావు, ఇతరులకు 60% వాటా ఇవ్వబడ్డాయి. బి.విశ్వనాథరెడ్డి (విశ్వం) చందమామ సంపాదకుడుగానూ, ప్రచురణకర్తగానూ, చందమామ ఇండియా లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్ గానూ కొన్నేళ్ళు కొనసాగాడు. చివరికి 2009 నాటికి చందమామ యాజమాన్యం ముంబైకి చెందిన జియోదెశిక్ అనబడే సాప్ట్‌వేర్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోను చందమామ సంపాదకుడు, ప్రచురణకర్త ఎల్. సుబ్రహ్మణ్యన్.
మూలాలు
మార్చు- ↑ Disney set to tell Chandamama stories
- ↑ Reddi, B. Viswanatha (1 December 2012). "A true karma yogi". The Hindu. Chennai, India.
బయటి లింకులు
మార్చు- చందమామ తెలుగు వెబ్సైటు Archived 2009-05-03 at the Wayback Machine
- ఈమాట-చందమామ గురించి కొన్ని విషయాలు
- "చందమామ" జ్ఞాపకాలు Archived 2006-05-19 at the Wayback Machine
- ప్రచురణ పునరుద్ధరించిన చందమామ
- ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డితో ఇంటర్వ్యూ
- చందమామ చరిత్ర , ప్రొఫైల్ గురించి ప్రచురణకర్త, సంపాదకుడు విశ్వనాథరెడ్డి
- చందమామ సింగపూరు తమిళం-ఇంగ్లీషు ద్విభాషా సంచిక
- సంతాలీ భాషలో చందమామ విడుదల
- 60 వసంతాలు జరుపుకుంటున్న చందమామ
- ఆగస్ట్ 1947 మాసం నాటి చందమామ[permanent dead link]
- సెప్టెంబర్ 1947 మాసం నాటి చందమామ[permanent dead link]
- అక్టోబర్ 1947 మాసం నాటి చందమామ[permanent dead link]
- నవంబర్ 1947 మాసం నాటి చందమామ[permanent dead link]
- డిసెంబర్ 1947 మాసం నాటి చందమామ[permanent dead link]
- జనవరి 1948[permanent dead link]
- ఫిబ్రవరి 1948[permanent dead link]
- మార్చి 1948[permanent dead link]
- ఏప్రిల్ 1948[permanent dead link]
- మే 1948[permanent dead link]
- జూన్ 1948[permanent dead link]
- జులై 1948[permanent dead link]
- ఆగస్ట్ 1948[permanent dead link]
- సెప్టెంబర్ 1948[permanent dead link]
- అక్టోబరు 1948[permanent dead link]
- నవంబర్ 1948[permanent dead link]