దశాదేశాలు

(టెన్ కమాండ్‌మెంట్స్ నుండి దారిమార్పు చెందింది)

టెన్ కమాండ్‌మెంట్స్ లేదా పది దైవాదేశాలు నిర్గమ కాండము (ఎక్జొడస్‌) 20: 2-17 లోనూ, బైబిల్‌ ఐదవ పుస్తకం ద్వితియోపదేశ కాండము (డ్యూటెరానమీ) 5:6-21లోనూ ఉన్నాయి. ఐతే రెండు చోట్లా ఇవి పది కంటే ఎక్కువే కనిపిస్తాయి. ఇవి గాక నిర్గమ కాండము (Exodus) 34వ అధ్యాయంలో రెండవ సారి శిలా ఫలకాలను ఇచ్చిన ఘట్టంలోనూ దైవం తన ఆజ్ఞలను తెలియజేయడం కనిపిస్తుంది.

దశాదేశాలు

సాధారణంగా టెన్‌ కమాండ్‌మెంట్స్‌ అని తటస్థపడే అంశాలు ఈ రెండు (బైబిల్‌) పుస్తకాలలోనివే. పది దైవాజ్ఞలు ఇవీ:

1. నేనే భగవంతుడిని. నన్ను తప్పించి మరో దేవుడెవరినీ కొలవకండి.

2. విగ్రహారాధన చేయకండి.

3. దేవుడి పేరును వృధాగా వాడకండి.

4. శాబ్బత్‌ను (సబ్బాత్‌ అని కూడా వ్యవహరిస్తున్నారు) మరవకండి/ పాటించండి. (శాబ్బత్‌ అంటే వారానికి ఒకసారి వచ్చే విశ్రాంతి రోజు. శుక్రవారం రాత్రి మొదలై, శనివారం రాత్రి వరకు ఒక రోజు. కొందరు ఆదివారం శాబ్బత్‌ పాటిస్తారు.

5. తల్లి దండ్రులను బాగా చూడండి.

6.హత్యలు చేయకండి.

7. వ్యభిచారం చేయకండి.

8. దొంగతనం చేయకండి.

9. తప్పుడు (దొంగ) సాక్ష్యాలు చెప్పకండి.

10. పొరుగింటి వారి (స్త్రీగానీ, పురుషుడుగానీ) మీద కన్ను వేయకండి. వారి వస్తుజాలం కోసం గానీ, భోగభాగ్యాల కోసం గానీ ఆశపడకండి.

ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న సీనాయి (సైనాయ్‌) కొండ మీద సాక్షాత్తు భగవంతుడే మోసెస్‌ (మోషె) కు ఈ పది ఆజ్ఞలను వ్రాసిన రెండు శిలాఫలకాలను ఇచ్చాడని ఐతిహ్యం. ఇది క్రీస్తు పూర్వం పదహారు, పదమూడు శతాబ్దుల మధ్య జరిగి ఉండవచ్చునని కొందరు పరిశోధకుల ఊహ. సీనాయి (సైనాయ్‌) కొండ మీద నుంచి క్రిందికి వచ్చిన మోసెస్‌ (మోషె) కు తన సోదరుడే ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేయించి పూజిస్తున్న దృశ్యం కంటపడింది. కోపంతో, బాధతో మోసెస్‌ (మోషె) తన చేతిలోని శిలా ఫలకాలను నేలకేసి కొట్టాడనీ, అవి తునాతునకలై పోయాయనీ, తరువాత దైవం ఆదేశం మీద ఆయన తిరిగి కొండమీదికి వెళ్లి మరోసారి రెండు ఫలకాలను తెచ్చాడనీ అంటారు. సీనాయి కొండ సరిగా ఏ కొండ అనే విషయంలో భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. ఈ కొండ దక్షిణ సైనాయ్‌ ప్రాంతంలో ఉంది. రెండు కొండల మధ్య 3750 రాతి మెట్ల బాట ఉంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ మెట్లు ఎక్కిదిగే ఒక ఆచారం ఉంది. మౌంట్‌ హోరెబ్‌ అనీ, జెబల్‌ మూసా అనీ, మౌంట్‌ మూసా అనీ కూడా ఈ కొండకు పేర్లు ఉన్నాయి. (చివరి రెండు పేర్లు ఆరబిక్‌ పదాలు.)