డ్రిల్ బిట్ (Drill bit) అనేది ఏదైనా పదార్థములో రంధ్రం చేయుటకు ఉపయోగించే ఒక సాధనం. డ్రిల్ మిషన్‌కు డ్రిల్ బిట్‌ను బిగించి రంధ్రములు చేస్తారు. సాధారణంగా ఎక్కువ డ్రిల్ బిట్లు వృత్తాకార రంధ్రములు చేస్తాయి. కొన్ని రకాల డ్రిల్ బిట్లతో చతురస్రాకార రంధ్రములు కూడా చేయవచ్చు. డ్రిల్ బిట్‌ను డ్రిల్ యంత్రంతో జత చేసి ఉపయోగిస్తున్నప్పుడు డ్రిల్ బిట్ భ్రమణం చెందుతూ రంధ్రము చేయు పదార్థమును డ్రిల్ బిట్ తొలచివేస్తూ, బయటకు నెట్టుతుంది, తద్వారా అక్కడ రంధ్రము ఏర్పడుతుంది. డ్రిల్ బిట్లు అనేక పరిమాణాలలో, ఆకారాలలో లభిస్తున్నాయి, ఇవి అనేక రకాల పదార్థాలలో రకరకాల రంధ్రాలను సృష్టించగలవు. డ్రిల్ మిషన్‌లో ఒక భాగమైన చక్‌లోని షాంక్ అని పిలువబడే పళ్ళ బిట్, డ్రిల్ బిట్‌ను గట్టిగా పట్టుకుంటుంది. షాంక్ డ్రిల్ బిట్‌ను గట్టిగా పట్టుకొనుటకు లేదా డ్రిల్ నుండి డ్రిల్ బిట్‌ను వేరు చేయడానికి చక్‌ను చక్‌ కీ ద్వారా త్రిప్పుతారు. డ్రిల్ బిట్స్ వివిధ ప్రామాణిక పరిమాణాలలో లభిస్తాయి. వృత్తాకార రహిత క్రాస్-సెక్షన్‌తో రంధ్రాలను సృష్టించగల కొన్ని ప్రత్యేకమైన డ్రిల్ బిట్‌లు కూడా ఉన్నాయి.[1] డ్రిల్ బిట్లను ఎక్కువగా ఉపయోగించినప్పుడు డ్రిల్ బిట్ అరుగుతుంది, అరిగిన డ్రిల్ బిట్‌లు వేగంగా పనిచేయలేవు, అప్పుడు డ్రిల్ బిట్‌కి సానపట్టి ఉపయోగించుకోవచ్చు. లేదా కొత్త డ్రిల్ బిట్లను ఉపయోగించాలి. డ్రిల్ బిట్ నేరుగా ఉండేలా చూసుకొని ఉపయోగించాలి, ఎందుకంటే డ్రిల్ బిట్ వంగేలా ఒకవైపు వంచి డ్రిల్ చేస్తే డ్రిల్ బిట్ విరిగిపోయే అవకాశముంది. డ్రిల్ బిట్లను ఎక్కువగా గోడలలో, చెక్కలలో, లోహలలో రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు. గాజు వంటి పదార్థములో రంధ్రము చేయడానికి డైమండ్ పూత పూసిన డ్రిల్ బిట్లను ఉపయోగిస్తారు.

పలు రకాల డ్రిల్ బిట్లు
డ్రిల్ బిట్ (ఎగువ ఎడమ), పిస్టల్-గ్రిప్ కార్డెడ్ డ్రిల్‌లో బిగించబడివున్నది.
తాపీపనికి సంబంధించిన డ్రిల్ బిట్ల సెట్
డైమండ్-పూత పూసిన 2 మిమీ బిట్స్, వీటిని గాజు వంటి పదార్థాలను డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగిస్తారు

తీసుకోవలసిన జాగ్రత్తలు

మార్చు
  • డ్రిల్ బిట్ ఉపయోగించిన వెంటనే తాకరాదు, లేదా పట్టుకోరాదు, ఎందుకంటే పదార్థంలో వేగంగా భ్రమణం చెందిన డ్రిల్ బిట్ చాలా వేడిగా ఉంటుంది, కావున కాలే అవకాశముంది.

మూలాలు

మార్చు
  1. "Practical demonstration of square-hole bit, YouTube video". Youtube.com. Retrieved 2014-05-10.