తిగుళ్ళ శ్రీహరిశర్మ

కవి, పండితుడు, అవధాని

తిగుళ్ళ శ్రీహరిశర్మ సంస్కృతాంధ్ర భాషలలో అనేక అష్టావధానాలను చేసిన పండితుడు. కవి.

తిగుళ్ళ శ్రీహరిశర్మ
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవిత్వాన్ని చదువుతున్న తీగుళ్ళ శ్రీహరి
జననంతిగుళ్ళ శ్రీహరిశర్మ
(1951-06-04) 1951 జూన్ 4 (వయసు 73)
రాజన్న జిల్లా జిల్లా (పాత కరీంనగర్ జిల్లా), తంగళ్ళపల్లి మండలం (పాత సిరిసిల్ల మండలం), చీర్లవంచ గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు, ఉపన్యాసకుడు
ప్రసిద్ధిఅవధాని, కవి, పండితుడు
తండ్రివెంకటయ్య
తల్లిఅలివేలమ్మ

జీవిత విశేషాలు

మార్చు

తిగుళ్ళ శ్రీహరిశర్మ 1951, జూన్ 4వ తేదీన కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల మండలం (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం) చీర్లవంచ గ్రామంలో అలివేలమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించాడు.[1] ఇతడు ప్రాథమిక విద్యను చీర్లవంక గ్రామంలో చదివాడు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో సంస్కృతం అధ్యయనం చేశాడు. తరువాత హైదరాబాదులోని శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో చదివి డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. పట్టాలను పొందాడు. తరువాత ఆంధ్ర సారస్వత పరిషత్తులో చదివి తెలుగు భాషా సాహిత్యాలు అభిమాన విషయాలుగా బి.ఎ., ఎం.ఎ. పరీక్షలు ఉత్తీర్ణుడైనాడు. బొంబాయి హిందీ విద్యాపీఠం నుండి "సాహిత్య సుధాకర" పట్టాను సంపాదించాడు. ఇతనికి తెలుగు, సంస్కృత భాషలతో పాటు ఇంగ్లీషు, హిందీ , తమిళ భాషలలో ప్రావీణ్యం ఉంది.

ఇతడు కరీంనగర్ జిల్లా యస్వాడ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూలులో ఒక సంవత్సరం పాటు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తరువాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా చేరి ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా 2009లో పదవీ విరమణ చేశాడు.[1]

అవధాన పర్వం

మార్చు
 
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా 2016, మార్చి 21న తిగుళ్ళ శ్రీహరిని సత్కరిస్తున్న మామిడి హరికృష్ణ

ఇతడు మామిడిపల్లి సాంబశివరావు, శ్రీభాష్యం విజయసారథి, మునుగోటి కృష్ణమూర్తి గార్ల వద్ద అవధాన విద్యను నేర్చుకున్నాడు. ఇతడు 108 తెలుగు అష్టావధానాలు, 9 సంస్కృత అష్టావధానాలను ప్రదర్శించి మన్ననలను పొందాడు. ఇతడు కరీంనగర్, నిజామాబాద్, వేములవాడ, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మెట్‌పల్లి, జనగామ, పెద్దపల్లి, ధర్మపురి, కాళేశ్వరం, నారాయణపురం, వెంకటాపురం, గంభీరావు పేట, వడ్లూరు, దుంపేట, తంగళ్ళపల్లి, గోదావరిఖని, కాగజ్‌నగర్, హైదరాబాదులతో పాటు తెలంగాణేతర ప్రాంతాలైన బెంగళూరు, పూనా, లక్నో తదితర ప్రాంతాలలో తన అష్టావధానాలను చేశాడు.[1]

ఇతని అవధానాలలో నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, న్యస్తాక్షరి, సద్యోవర్ణన, పురాణపఠనం, ఛందోభాషణం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలు ఉంటాయి. ఇతని అవధానాలనుండి మచ్చుకు కొన్ని పూరణలు:

  • సమస్య:దుగ్ధ పయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో

పూరణ

దగ్ధు డనంగుడయ్యె హర దాహకపాల ధృగగ్ని నన్న సం
దిగ్ధత లేని వార్త విని తీవ్రత నేడ్చెను లక్ష్మి వక్షమున్
ముగ్ధత మోడుకొంచు నట బూసిన చందన ధూళి లేవగా
దుగ్ధ పయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో!
  • వర్ణన: శరదృతువును అమ్మవారితో పోల్చి వర్ణన చేయమనగా

పూరణ

శారద చంద్ర చంద్రికలు సౌమ్యమహాకవి వాక్కులట్టులన్
నీరద నీలిమన్ గనని నిర్మల మభ్రము, నిర్మలాంబువుల్
సారస పుష్పశోభితము సారస హంస విహార రమ్యమున్
శారదకాల శీతగతి చక్కగ నుండును శారదోపమన్
  • దత్తపది: సరిగ - గరిమ - నీసరి - నిగమ పదాలను ఉపయోగించి త్యాగరాజుపై పద్యం

పూరణ

సరిగమ సుస్వరములొక సంగతి రాగ మహత్వమొప్ప, నీ
గరిమను జూపు రామవిభు కావ్యము కీర్తన లల్లినావు, నీ
సరి నిగమమ్ము లెల్ల ఘనసత్కృతులయ్యెను శ్రావ్య గీతులై
సరస పదాఢ్య త్యాగధన సౌమ్య! సుగాయక రాజ! మ్రొక్కెదన్

బిరుదములు

మార్చు

ఇతనికి ఈ క్రింది బిరుదాలను వివిధ సందర్భాలలో ప్రదానం చేశారు.[1]

  1. అవధాన ప్రవీణ
  2. అభినవ తిక్కన
  3. అవధాన కళాభూషణ
  4. అవధాన కేసరి
  5. అవధాన చతురాస్య
  6. అవధాన కళావాచస్పతి
  7. ఉభయ భాషారత్న

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 రాపాక ఏకాంబరాచార్యులు (1 June 2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 624–627.