తిరుమల శ్రీవారి కొలువు

బంగారు వాకిలికి అనుకుని లోపల వున్న గదిని స్నపన మండపం అంటారు. ఇక్కడే శ్రీవారికి ప్రతిరోజూ ఆస్థానం జరుగుతుంది. సన్నిధిలో వున్న కొలువు శ్రీనివాసమూర్తిని ఛత్రచామరాది మర్యాదలతో, మంగళవాద్య పురస్సరంగా స్నపనమండపంలో ఉంచిన బంగారుసింహాసనంపై వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామికి కొలువు నిర్వహించబడుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం, ఆలయ అధికారులు, అర్చకులచే నిర్వహించబడుతుంది. ఉదయం 4.30లకు ప్రారంభమవుతుంది.

తిరుమల శ్రీవారి ఆభరణాలు

ఈ మూర్తికి షోడశోపచారాలు నిర్వహించి, ధూపదీప హారతులు సమర్పిస్తారు. అనంతరం అర్చకులు శ్రీవారి చేత తాంబూలం, దక్షిణతో కూడిన బియ్యాన్ని దానంగా స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. ఆస్థానసిద్ధాంతి శ్రీనివాసప్రభువునకు పంచాంగ శ్రవణం చేస్తూ, ఆనాటి, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినిపిస్తూ, నాటి ఉత్సవవిశేషాలను శ్రీవారికి తెలుపుతారు. అదేవిధంగా మరునాటి తిథి, వార, నక్షత్రాదులను కూడా వినిపిస్తారు. నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు. బొక్కసం (లెక్కల) గుమాస్తా, శ్రీవారికి సమర్పింపబడిన ముందునాటి ఆదాయ వివరాలను, ఆర్జితసేవలవల్ల, ప్రసాదాల విక్రయం వల్ల, హుండీద్వారా, కానుకలుగా వచ్చిన బంగారు, వెండి, రాగి, ఇతర లోహపాత్రలు, నగలు, వగైరాల ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాససార్వభౌమునికి వివరంగా వినిపించి, భక్తి ప్రపత్తులతో సాష్టాంగనమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు.