తెలుగు నాటకాలు - జాతీయోద్యమం

తెలుగు నాటకాలలో కనిపిస్తున్న జాతీయోద్యమ ప్రభావాన్ని వివరిస్తూ డా. రావి రవి ప్రకాశ్‌ రాసిన పరిశోధనాత్మక గ్రంథం - తెలుగు నాటకాలు – జాతీయోద్యమం. 2005వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పట్టా పొందిన సిద్ధాంత వ్యాసాన్ని ఇటీవల పుస్తకంగా ప్రచురించారు.

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటనల్ని నాటక రచయితలు వివిధ నాటకాలుగా మలిచి ప్రజల్ని చైతన్య పరిచిన విధానాన్ని రచయిత దీనిలో చక్కగా నిరూపించారు. ప్రజలు తాము నివసిస్తున్న నేల మీద అభిమానాన్ని ప్రకటించడం, స్వజాతి జనుల మీద ప్రేమను పెంపొందించుకోవటం జాతీయతలో కనిపించే కొన్ని ముఖ్యాంశాలు. తరతరాలుగా కొనసాగుతున్న స్థానిక సత్సంప్రదాయాలపై ప్రగాఢమైన అభిమానం; నిర్దిష్ట పాలనా వ్యవస్థకి అనుగుణంగా మనుగడ సాధించే మానసిక స్థితిని కలిగి ఉండటం జాతీయత అనవచ్చు.

సర్వసాధారణంగా ప్రజలు తమ అస్తిత్త్వాలకు తీవ్రంగా భంగం కలుగుతుందని భావించినప్పుడల్లా ఈ జాతీయతా భావాలు ఉద్యమ రూపంలో కనిపిస్తుంటాయి. భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలంతా తరతరాలుగా కలిసిమెలిసి జీవించేవారని చరిత్ర చెబుతుంది. బ్రిటీష్‌ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి, క్రమేపీ పాలనాధికారాన్ని చేజిక్కించుకోవడంతో వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయుల్లో జాతీయతా స్ఫూర్తి అంకురించింది.

అది ఆంగ్ల విద్యాప్రభావంతో మరింతగా విస్తరిల్లింది. అనేక సాహితీ ప్రక్రియల్లో సాహిత్యం సృజనీకరించబడి ప్రజల్లో జాతీయతా భావాలు వేగంగా వ్యాపించాయి. ఈ పరిస్థితి అన్ని భాషల్లోనూ కనిపిస్తుంది. అలాగే తెలుగులోనూ జాతీయోద్యమ ప్రభావంతో భిన్న ప్రక్రియల్లో సాహిత్యం వెలువడింది. కవిత్వం, నవల, వ్యాసం, నాటకం వంటి సాహిత్య ప్రక్రియలు జాతీయోద్యమాన్ని వేగంగా ప్రసరించడంలో నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించాయి.

జాతీయోద్యమ ముఖ్య లక్ష్యం పరదేశీయుల్ని పారద్రోలడమే ప్రధాన ధ్యేయమైనప్పటికీ, నాటకాల్లో నాడు జాతీయోద్యమం సామాజిక రంగంలో కనిపించే అనేక సమస్యల్ని పరిష్కరించేదిశగా పయనించిన కోణాన్ని కూడా రచయిత ఈ గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు. వందేమాతరం, విదేశీవస్తు బహిష్కరణ, సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైన చారిత్రక ఘట్టాలను తెలుగు నాటకాల్లో ప్రతిఫలించిన తీరు ఈ గ్రంథంలో కనిపిస్తుంది.

కేవలం 1947 ఆగస్టు 15 వరకు మాత్రమే కాకుండా, 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యేవరకూ చరిత్రను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు మాత్రమే, ఆంధ్రప్రాంతానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించినట్లవుతుందంటారు రచయిత. అందుకనే ఈ గ్రంథంలోని అయిదో అధ్యాయంలో తెలుగు నాటకాలపై చూపిన తెలంగాణా సాయుధ పోరాట ప్రభావాన్ని వివరించారు.

వేదాంతకవి 1948 లో రాసిన ఛలో హైదరాబాద్‌, వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణలు కలిసి రాసిన మాభూమి నాటకాలపై సుదీర్ఘమైన విశ్లేషణ చేశారు. ఈ రెండు నాటకాలు చదివితే తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటం చాలా వరకూ అవగాహన కొస్తుంది. నిజాం నిరంకుశ పాలనలో అమీనులు, దేశ్‌ముఖ్‌లు సాగించిన దురంతాల పై నాటి సామాన్య ప్రజలు సహితం పోరాడిన సంఘటనలన్ని జాతీయోద్యమంలో భాగంగానే చూడాలనేది ఈ గ్రంథంలో కనిపించే ఒక ప్రతిపాదన. తెలంగాణా సాయుధ పోరాటంలో స్త్రీల పాత్రను కూడా చిత్రించిన నాటకాలను వివరించారు. స్త్రీ చైతన్యాన్ని కూడా ఆయా నాటకాల్లో ప్రతిఫలించిన తీరుని వివరించారు.

సాధారణంగా పరిశోధనలో ఒక్క కొత్త అంశాన్నైనా బహిర్గత పరచాలి. అది అన్ని వేళలా సాధ్యం కానప్పుడు, ముఖ్యంగా సాహిత్య పరిశోధనలో కొత్త సమన్వయాన్నైనా అందించాలి. ఈ పరిశోధన గ్రంథంలో ఈ రెండంశాలూ కనిపిస్తున్నాయి. ఆరు ప్రధాన అధ్యాయాలుగా ఫలితాంశాలు చివరి అధ్యాయంగానూ గ్రంథాన్ని విభజించారు. తాను పరిశీలించిన అన్ని నాటకాల్లోకనిపించే ప్రధానాంశాలను రచయిత ఇలా వర్గీకరించారు. అవి: సంఘ సంస్కరణ, దేశభక్తి, సమగ్ర జాతీయతా భావం, మద్యపాన నిషేధం, విదేశీ వస్తు, శాసనోల్లంఘన, ఖద్దరు వస్త్రాలను ధరించడం, గాంధీజీ సూక్తులు పాటించడం, సత్యాగ్రహం, శాంతి సౌహార్ద్రభావం, అస్పృశ్యతా నివారణ వంటి వన్నీ జాతీయోద్యమంలో అంతర్భాగంగా కొనసాగిన సంస్కరణలని రచయిత వింగడించి విశ్లేషించారు.

మొదటి అధ్యాయంలో కొండ అద్దమందు చూపినట్లుగా జాతీయోద్యమంలోని ముఖ్యఘట్టాల చారిత్రక క్రమపరిణామాన్ని వివరించారు.

రెండవ అధ్యాయంలో జాతీయోద్యమ నాటక నేపథ్యాన్ని వివరిస్తూ పూర్వపరిశోధనల్ని పేర్కొంటూనే తనదైన ప్రతిపాదనలను పాఠకుల ముందుంచారు. దేశభక్తి పూరితాలైన తెలుగు నాటకాలను పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలుగా విభజిస్తూనే, స్వాతంత్ర్య సమరాన్ని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించిన రాజకీయనాటకాలనే విభజన కూడా చేస్తే బాగుంటుందన్నారు.

పౌరాణిక నాటకాల్లో ఆయా పాత్రల ద్వారా జాతీయ భావాలను ప్రబోధించారని సోదాహరణంగా నిరూపించారు. దౌల్తాబాదు గోపాల కృష్ణారావు1932 లో రాసిన సంపూర్ణ భారతం అనే నాటకంలో అర్జునుడు శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం కోరతాడు. ఆ అస్త్రమే కోరడంలో గల ఆంతర్యాన్ని తెలపమన్నశివుడితో అర్జునుడు నిరంకుశ ప్రభువులను దండించి భారతీయుల దాస్యాన్ని రూపుమాపటానికని చెప్తాడు.

తిరుపతి వేంకట కవుల రచించిన ప్రఖ్యాత నాటకం పాండవోద్యోగము ( 1938) లో ధర్మరాజు వంటి గుణ సంపన్నుడిగా గాంధీజీని కవులు వర్ణించారని ఈ పరిశోధకుడు చేసిన సమన్వయం బాగుంది. ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు…’ అనే పద్యంలో ధర్మరాజు పాత్ర చిత్రణలో గాంధీజీ జాతీయోద్యమ స్వభావం ఉందని పరిశోధకుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఊటకూరు సత్యనారాయణ గారి అభిమన్యు ( 1938) నాటకంలో భర్తపై ఉండే ప్రేమ కొద్దీ ఉత్తర అభిమన్యుణ్ణి యుద్ధరంగానికి పోవద్దన్నా, తానూ సారథియై వస్తానని పలకడం, భర్త వద్దన్నా, స్త్రీలు కూడా యుద్ధంలో పాలుపంచుకోవాలని వాదించడంలో నాటి స్వాతంత్ర్య సమరంలో స్త్రీలను చైతన్యపరచడమేనంటారు రచయిత!

చారిత్రక నాటకాల్లో మహమ్మదీయుల పాలనలో హిందూధర్మానికి జరిగిన హానిని ప్రస్తావిస్తూ వ్రాసిన నాటకాలు అధికంగా ఉన్నాయి. పౌరాణిక పురుషులకంటే చారిత్రక పురుషులు స్వాతంత్ర్యయోధులలో, ప్రజలలో మరింత ఉత్సాహాన్ని నింపారని, ఆ నాటకాలను సోదాహరణంగా వివరించారు.

ముత్తరాజు సుబ్బారావు “చంద్రగుప్త’ ( 1932), శేషుబాబు అశోకరాజ్యము’ (1945), ప్రభులింగాచార్యుల పల్నాటి వీరచరిత్రము’ (1928), ఉన్నవ లక్ష్మీనారాయణ “నాయకురాలు’ ( 1926), నండూరి బంగారయ్య “ఆంధ్రతేజము’ (1938), వేదం వేంకటరాయశాస్త్రి “ప్రతాపరుద్రీయము’ ( 1897), పోతుకూచి సుబ్బయ్య “ఆంధ్రవాణీ సామ్రాజ్యము’ (1944), కోలాచలం శ్రీనివాసరావు “సుల్తాన్‌ చాంద్‌ బీ’ ( 1900) కాళ్ళకూరి సాంబశివరావు “రంగరాయ కదన సమవాకారం’ ( 1899), శ్రీపాద కృష్ణమూర్తి “బొబ్బిలి యుద్దం’ ( 1908), కొప్పరపు సుబ్బారావు “రోషనార’ (1921), పడాల రామారావుఅల్లూరి సీతారామరాజు’ ( 1950) మొదలైన నాటకాల్లో దేశవ్యాప్తంగానూ, ఆంధ్రదేశంలోనూ ప్రజారంజకంగా పాలన అందించిన పాలకుల స్ఫూర్తినీ, వారి పోరాట పటిమనీ, వారు మహమ్మదీయులు, విదేశీయులతో పోరాడిన చారిత్రక సంఘటనలను వర్ణించారన్నారు. ఇవన్నీ జాతీయోద్యమ ప్రభావంతో రాసిన నాటకాలేనని నిరూపించారు.

సాంఘిక, రాజకీయ నాటకాల్లో గాంధీజీ చేసిన ఉద్యమప్రభావం అత్యధికంగా కనిపిస్తుందన్నారు. గాంధీజీ ఒకవైపు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే, దేశం సమైక్యంగా ఉండాలంటే అంతర్గతంగా జరగాల్సిన వాటిని గుర్తించారన్నారు. దీనిలో భాగమే ఆయన కొనసాగించిన హరిజనోద్యమం అనీ దీనికి నాటక కర్తలు ఎంతో ప్రభావితులైయ్యారని ఆ నాటకాలను సోదాహరణంగా నిరూపించారు.

సుమారు 280 పేజీలున్న ఈ పుస్తకంలో జాతీయోద్యమంలో పాల్గొన్న కొంతమంది నాయకుల, కొంతమంది నాటక కర్తల ఛాయా చిత్రాల్ని కూడా ప్రచురించారు.

మొత్తం మీద తెలుగు నాటక వికాసాన్ని అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం ఒక ముఖ్య ఆకరంగా ఉపయోగపడుతుంది. అనేక నాటకాలను సేకరించి, జాతీయోద్యమ ప్రభావాన్ని వివరించిన పరిశోధకుడు అభినందనీయుడు. ప్రతి విద్యాలయంలోనూ ఉండదగిన పుస్తకం. మరోసారి మన భారతీయ జాతీయోద్యమ స్ఫూర్తి రగిలించుకొని, నేటి సామాజిక సమస్యలపై ఎలా స్పందించాలో అవగాహన చేసుకోవడానికీ పుస్తకం దోహదపడుతుంది.

ఈ పుస్తకాన్ని మీడియా హౌస్‌ పబ్లికేషన్స్,304 శ్రీ దత్త హోమ్స్, అయ్యప్ప దేవాలయం దగ్గర, బాగ్ అంబర్ పేట్, హైదరాబాదు-13 వాళ్ళు ప్రచురించారు. దీని ఖరీదు 180 రూపాయలు.