దివాకర
దివాకర (క్రీ.శ 613-687), క్రీ.శ. 7వ శతాబ్దంలో చైనాకు వచ్చిన ఒక భారతీయ బౌద్ధ సన్యాసి. ప్రసిద్ధ బౌద్ధ అనువాదకుడు. త్రిపీటకాలలో నిష్ణాతుడైన గురువు. ఇతను టాంగ్ రాజవంశపు చక్రవర్తి గాజోంగ్ పాలనలో చైనాలో స్థిరపడ్డాడు. ప్రఖ్యాత చైనీస్ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ భారతదేశం నుండి తీసుకువచ్చిన సంస్కృత బౌద్ధ గ్రంథాలలో కొన్నింటిని అనువదించాడు. లలితావిస్తారం వంటి క్లాసిక్ గ్రంథాలతో పాటు అనేక సూత్రాలను సంస్కృతం నుండి చైనీస్ లోకి అనువదించాడు. ఇతని అనువాదాలలో ఉష్ణీశ విజయ ధారణి సూత్రానికి చైనీస్ భాషలో చేసిన తొలి అనువాదం ముఖ్యమైనది. ఇతనిని చైనాలో రిజావో (Rizhao) అనే పేరుతొ కూడా పిలుస్తారు.
ఆధార గ్రంధాలు
మార్చుదివాకర గురించిన చారిత్రిక వివరాలు, టాంగ్ రాజవంశంలోని ప్రముఖ సన్యాసుల జీవిత చరిత్రల వాల్యూమ్-II (Biographies of Eminent Monks in Tong Dynasty), కైయువాన్ కాలంలో బౌద్ధమతానికి సంబంధించిన డైరెక్టరీ వాల్యూం-IX (Directory for Buddhism in Kaiyuan Period), మహా వైపుల్య బుద్ధ అవతంశక సూత్ర వాల్యూమ్-I మొదలగు చైనీయ గ్రంథాల నుండి లభ్యమవుతున్నాయి.
ప్రారంభ జీవితం
మార్చుదివాకర క్రీ.శ. 613 లో మధ్య భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] అతను సౌమ్యుడుగా మాత్రమే కాదు ఆకర్షణీయంగా కూడా ఉండేవాడు. బాల్యం నుండి చదువులో మేటిగా రాణించాడు. బౌద్ధధర్మం పట్ల ఆకర్షితుడై ప్రశాంతమైన చిత్తంతో బౌద్ధ సూత్రాలను చక్కగా అనుసరించేవాడు. పిన్న వయస్సులోనే సన్యాసిగా మారాడు. ఆ తరువాత మహాబోధి ఆలయం, నలందా మఠంలో అనేక సంవత్సరాలు గడిపాడు.[1] పంచ సూత్రాలలోను ముఖ్యంగా మంత్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. అనతికాలంలోనే త్రిపీటకాలలో గొప్ప గురువుగా ఖ్యాతి పొందాడు. అతనికి సూత్ర, వినయ, చర్చ, మంత్రోచ్ఛారణలతో కూడిన ఎనిమిది రకాల కానన్ (బృహత్తర గ్రంథ కోశం) పై అద్భుతమైన పట్టు వుండేది. అలాగే తర్క, శాస్త్ర, ధర్మ, వైద్య, ప్రకటన వంటి ఐదు జ్ఞాన రంగాలపై అతనికి విస్తృతమైన అవగాహన వుండేది. ఆ రోజులలో ప్రఖ్యాత చైనీస్ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ భారతదేశంలో క్రీ.శ. 625 నుంచి 645 వరకు విస్తృతంగా పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగా హుయాన్ త్సాంగ్ నలందలో ఐదేళ్ల పాటు వున్నప్పుడు దివాకర అతనితో స్నేహం చేసాడు. భారతదేశంలో పర్యటన ముగిసిన తర్వాత హుయాన్ త్సాంగ్ చైనాకు తిరిగి వస్తాడని తెలుసుకున్నాడు, అందువల్ల దివాకరలో కూడా అతని మాదిరిగానే దూరప్రయాణాలు చేయాలనే కోరిక పెరిగింది.
క్రీ.శ. 676 లో దివాకర తన అరవైలలో, చైనాను టాంగ్ రాజవంశం పాలిస్తున్నకాలంలో చైనా రాజధాని చాంగన్ కు వెళ్ళాడు.[1] ఆనాడు చైనాను టాంగ్గ్ వంశానికి చెందిన గాజోంగ్ (Gaozong క్రీ.శ. 628-683) చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. గాజోంగ్ చక్రవర్తి, త్రిపీటక గురువైన హుయాన్ త్సాంగ్ని గౌరవించినట్లే దివాకర్ ని కూడా గౌరవించాడు.[1] ఈ చక్రవర్తి పాలనా కాలంలోనే ప్రఖ్యాత చైనీస్ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ భారతదేశంలో పర్యటించడం జరిగింది. భారతదేశం నుంచి 600 కు పైగా బౌద్ధ గ్రంథాలతో చైనాకు తిరిగి వచ్చిన హుయాన్ త్సాంగ్ తన శేష జీవితాన్ని తాను తెచ్చిన గ్రంథాలను అనువదించడంలోనే గడిపాడు. క్రీ.శ. 664 లో హుయాన్ త్సాంగ్ మరణంతో అతను తెచ్చిన గ్రంథాల అనువాదాన్ని కొనసాగించవలసిన అవసరం చక్రవర్తికి కలిగింది. ఆ అనువాద కార్యక్రమం నిర్వహించడానికి భారతదేశం నుండి వచ్చిన దివాకర సన్యాసిని తగిన సమర్దుడిగా ఎంచిన చక్రవర్తి, బౌద్ధ గ్రంథాల అనువాదం కొనసాగించ వలసిందిగా దివాకరుని అభ్యర్థించడం జరిగింది.
అనువాద కృషి
మార్చుక్రీ.శ. 680 లో బౌద్ధ సూత్రాలను సంస్కృతం నుండి చైనీస్‌లోకి అనువదించడంలో దివాకరకు సహాయం చేయమని చైనా చక్రవర్తి, పది మంది నిష్ణాతులైన సన్యాసులను ఆదేశిస్తూ రాజాజ్ఞను జారీ చేసాడు.[1] అతని ఆదేశానుసారం దివాకర, లోయాంగ్ (Loyang) లోని తూర్పు తైయువాన్ ఆలయం (నేటి డఫుక్సియన్ ఆలయం) లో నివసిస్తూ అనువాద కార్యక్రమంలో నిమగ్నుడయ్యాడు. తరువాత చాంగాన్ లోని పశ్చిమ తైయువాన్ ఆలయం (నేటి పశ్చిమ చోంగ్ఫు ఆలయం) లోను, ఆపై జిజింగ్‌లోని ప్రసిద్ధ గ్వాంగ్‌ఫు ఆలయంలో (Guangfu Temple) అనువాద కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అనువాద కార్యక్రమం కొనసాగించాడు. ఆనాటి చైనీయ పండితులనేకమంది అతని ఆధ్వర్యంలో జరుగుతున్న బృహత్తర అనువాద కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. దివాకరుని ఆధ్వర్యంలో అనువాద కృషి సామూహికంగా జరిగినప్పటికీ అతను వహించిన కీలక పాత్ర కారణంగా, అనువాదమైన గ్రంథాలలో చాలా వరకు అతనికే ఆపాదించబడ్డాయి.
ఈ అనువాద కార్యక్రమంలో మొదటగా జంటావో (Zhantuo) శ్రమణుడు, ప్రజ్నా దేవలు సంస్కృతంలో వున్న అసలు వచనాన్ని ప్రాథమికంగా అనువదించేవారు. తరువాత ఆ వచనంలోని ప్రతీ వాక్యానికి దివాకర అర్ధాన్ని, భావాన్ని విశిదీకరించడంతో పాటు చైనీస్ భాషలో తన అనువాదాన్ని సైతం తెలియచేసేవాడు. ఒకపక్క దాని సంస్కృత అర్ధాలను హుయిజీ (Huizhi) నిపుణుడు సమీక్షిస్తుంటే మరోపక్క డాచెంగ్ (Daocheng), బోచెన్ (Bochen), జియాషాంగ్ (Jiashang), యువాన్స్ (Yuance), లింగ్బియన్ (Lingbian), మింగ్సున్ (Mingxun), హువైడు (Huaidu) వంటి ప్రసిద్ధ పండితులు ఆ వాక్యాలను పునఃసమీక్షిస్తూ వాటికి వ్యాఖ్యలు, మార్పులు, చేర్పులు సూచించేవారు. చివరగా నిర్దేశితమైన అనువాద వాక్యాలను సిక్సువాన్ (Sixuan), ఫులీ (Fuli) లు చైనీస్ లిపిలోకి మార్చేవారు. మొత్తమ్మీద ఈ సామూహిక ప్రయత్నంలో, విస్తృత చర్చల అనంతరం, దివాకర ఆమోదంతోనే అనువాదం పూర్తయ్యేది. ఇలా పూర్తయిన అనువాదాలకు బౌద్ధ మతావలంబకురాలైన నాటి చైనా సామ్రాజ్ఞి “వు జెటియన్” (Wu Zetian క్రీ.శ. 685-688) స్వయంగా తొలి పలుకు (preface) రాయడమే కాకుండా మొదట్లో ఆ గ్రంథప్రతులకు తగిన శీర్షిక (Titles) లు కూడా నిర్ణయించేవారు.
దివాకరుని కృషి ఫలితంగా మహాయాన సూత్రంపై రెండు సంపుటాలు, మహాయాన యొక్క పంచ సంకలనాల (the Five Aggregates of Mahayana) పై ఒక సంపుటి, ధర్మధాతులోని మహావైపుల్య బుద్దావతంశక సూత్రంపై ఒక సంపుటి వంటి అనేక అనువాద గ్రంథాలు వెలువడ్డాయి. మొత్తం మీద టాంగ్ వంశపు చక్రవర్తి "గాజోంగ్" కాలం నుండి సామ్రాజ్ఞి "వు జెటియన్" కాలం వరకు దివాకరుని పర్యవేక్షణలో అనేక ప్రసిద్ధ మహాయాన గ్రంథాలు, సూత్రాలు చైనీస్ భాష లోకి అనువాదమయ్యాయి.
తన పనిని పూర్తి చేసిన తరువాత, దివాకర తన తల్లిని మళ్లీ చూడాలని కోరుకుంటూ భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించమని చక్రవర్తిని వేడుకున్నాడు.[1] అయితే అనుమతి లభించినప్పటికీ, దురదృష్టం వెన్నాడి అతను అనారోగ్యం పాలయ్యాడు దానితో భారతదేశానికి తిరిగి వెళ్లే యోచనను విరమించుకోవాల్సి వచ్చింది.
అనువదించిన ముఖ్య బౌద్ధ గ్రంధాలు
మార్చుదివాకర కృషికి ఆపాదించబడిన చైనీయ బౌద్ధ అనువాదాలే కాకుండా, అతను స్వయంగా అనువదించిన మరికొన్ని క్లాసిక్ గ్రంథాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దివాకరుడు చైనాలో వున్న ఆరేళ్లలో ముప్పై-నాలుగు సంపుటాలలో పద్దెనిమిది గ్రంథాల చైనీస్ అనువాదాలను రూపొందించాడు.[2] అతని అనువాదాలలో ముఖ్యమైనవి.
- సాక్షాత్కారానికి సంబంధించిన మహాయాన సూత్రం-రెండు సంపుటాలు (Mahayana Sutra on Realisation)
- మహాయాన యొక్క పంచ సంకలనాలు (the Five Aggregates of Mahayana) -ఒక సంపుటి
- ధర్మధాతులోని మహావైపుల్య బుద్దావతంశక సూత్రం-ఒక సంపుటం
- లలితవిస్తారం-12 సంపుటాలు
- ఘన వ్యూహ సూత్రం-3 సంపుటాలు
- వజ్రచ్ఛేదికా ప్రజ్ఞాపారమిత సూత్రం యొక్క అవినాభావ పరికల్పన (Indestructible Hypothesis) -రెండు సంపుటాలు
- మహాయాన 100 పవిత్ర సూత్రాలకు సంబంధించి ఒక్కో సూత్రం ఫై ఒక్కోక్క సంపుటి.
- చతుర్ధర్మ సూత్రం గురించిన బోధిసత్వ అభ్యాసంపై బౌద్ధ ప్రబోధం
- సార్వత్రిక ప్రకాశం యొక్క మహాయాన సూత్రం (Mahayana Sutra of Universal Brightness)
- పదరహితమైన ధర్మ-ముఖ (Wordless Dharma-mukha)
- సింహనాద సూత్రం
- ఉష్ణీశ విజయ ధారణి సూత్రం (Sutra of the Buddha Crown Superb Victory Dharaṇī)
- కర్మ శుద్ధికరణంపై ఉష్ణీశ విజయ ధారణి సూత్రం (Usnisa Vijaya Dharani Sutra on Purifying Karma)
- మహా కుండీ ధారణి సూత్రం
ఉష్ణీశ విజయ ధారణి సూత్ర: సంస్కృతంలో వున్న ఈ మహాయాన సూత్రాన్ని తొలిసారిగా దివాకర చైనీస్ లోకి అనువదించాడు. ఇది చైనాలో విస్తృతంగా ప్రజాదరణ పొంది, తూర్పు ఆసియా అంతటా వ్యాపించింది. టాంగ్ రాజవంశం పాలనా కాలంలో తొలిసారిగా అనువదించబడిన ఈ సూత్రం, దివాకరుని అనువాదం తరువాత క్రీ.శ. 679 నుండి 988 ల మధ్య మొత్తం ఎనిమిది సార్లు సంస్కృతం నుండి చైనీస్‌లోకి అనువదించబడింది.[3]
మరణం
మార్చుక్రీ.శ. 687 లో దివాకరుడు తన మరణాన్ని ముందే ఊహించి, తన శిష్యులను పిలిచి తన మరణాన్ని ముందుగానే ప్రకటించాడు. చివరకు క్రీ.శ 687 లో, చైనాలో దివాకర తన డెబ్బై ఐదేళ్ల వయస్సులో ఎటువంటి అనారోగ్యం లేకుండా మరణించాడు. నాటి చైనా సామ్రాజ్ఞి వు జెటియన్ (Wu Zetian) అతని మృతికి సంతాపం తెలిపింది. ఆమె ఆదేశానుసారం, అతని పార్థివ దేహాన్ని యిషుయ్ (Yishui ) నదికి సమీపంలో ఉన్న లుయోయాంగ్ (Luoyang) లోని లాంగ్‌మెన్ పర్వతం యొక్క దక్షిణ భాగంలో ఖననం చేసారు. కొద్దికాలం పిదప ప్రిన్స్ లియాంగ్ అభ్యర్థన మేరకు, అతన్ని ఖననం చేసిన ప్రదేశంలో జియాంగ్‌షాన్ ఆలయం (Xiangshan Temple) నిర్మించబడింది.
గ్రంథ సూచిక
మార్చు- "Divakara". Tibetan Buddhist Encyclopedia. 2016.
బయట లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Tibetan Buddhist Encyclopedia 2016.
- ↑ "Divakara". tibetan Buddhist Encyclopedia. 2016.
- ↑ "The Korean Buddhist Canon: A Descriptive Catalog (K 319)".