దృష్టాంతాలంకారము

అలంకారము : రెండు వాక్యముల యందు ఉపమానోపమేయముల యొక్క వేరు వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించుట దృష్టాంతాలంకారము. అనగా రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావముతో వర్ణించి చెబితే దానిని దృష్టాంతాలంకారము అని అంటారు.[1]

దృష్టాంతాలంకారం కేవలం కవిత్వప్రయోజనాలకే కాక, తర్కానికి కూడా మన దేశంలో ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు వివేక చూడామణిలో దృష్టాంత పద్ధతి ద్వారా చాలా విషయాలను బోధపరిచారు.

ఉదాహరణలు మార్చు

ఉదా:1 : త్వమేవ కీర్తిమాన్ రాజన్! విధురేవ కాంతిమాన్[2].దీని అర్థము: ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు; చంద్రుడే కాంతిమంతుడు.

వివరణ: ఉపమాలంకరాములో ఉపమేయము, ఉపమానము, సమానధర్మము చూస్తాము. కానీ దృష్టాంతాలంకారంలో సమానధర్మం ఉండదు. కాకపోతే ధర్మాలకు మధ్యన పోలిక ఉంటుంది. ఉదాహరణ కీర్తికి, కాంతికి కొంత పోలిక ఉంది. రెండూ అన్నివైపులా ప్రాకుతాయి. అందుచేత వీటికి పొసిగింది. సూటిగా రాజుని చంద్రుడు అని కానీ, కీర్తి కాంతి వంటిది అని కానీ అనకపోయినా, రెండు వాక్యాల నిర్మాణం దాదాపు ఒకేలాగ ఉండటం వలన ఇది అర్థమౌతోంది.

శంకరాచార్యుని వివేక చూడామణిలో ఉదాహరణలు మార్చు

 1. శత్రువులను జయించకుండా "నేను రాజుని" అన్నంత మాత్రాన రాజువు కావు. మాయని నశింపజేసి ఆత్మ తత్త్వం తెలుసుకోకుండా "బ్రహ్మం" అన్నంత మాత్రాన ముక్తి రాదు.
 2. దాచిపెట్టి ఉన్న నిధి "నువ్వు రా" అన్నంత మాత్రాన వచ్చిపడదు. మాయ అడ్డుగా నిలబడిన ఆత్మతత్త్వం  వాదనల వలన తెలియదు.
 3. చూస్తున్నది పాము కాదు, తాడు అని తెలిస్తే భయం పోతుంది. ఎదుటనున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది, మోక్షం కలుగుతుంది.
 4. ఈశ్వరుడి ఉపాధి మహత్, జీవుడి ఉపాధి పంచకోశం -- ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే -- అది బ్రహ్మం. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, డాలు పట్టుకున్నవాడు భటుడు. సింహాసనం, డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే.

సినిమాలలో మార్చు

 1. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.[3]
 2. కన్నీటికి కలువలు పూచేనా? కాలానికి ఋతువులు మారేనా?[4]
 3. మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా? మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?[4]

మూలాలు మార్చు

 1. "అలంకారములు - telugu vyakaranamu". sites.google.com. Archived from the original on 2023-02-18. Retrieved 2020-04-15.
 2. చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి
 3. చిత్రం: ప్రాణం ఖరీదు, రచన: కీ. శే. జాలాది రాజారావు
 4. 4.0 4.1 చిత్రం: మాతృదేవోభవ, రచన: కీ. శే. వేటూరి సుందరరామమూర్తి