దేవరకొండ కోట

దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో ఉంది. ఈ కోట మూడు కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు నిర్మించారు. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడంకోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు.[1]

దేవరకొండ కోట
దేవరకొండ కోట

చరిత్రసవరించు

గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన భేతాళ నాయకుడు సంతతి వారు దేవర కొండ రాజ్యాన్ని స్థాపించి నట్టుగా చారిత్రిక ఆధారలను బట్టి తెలుస్తున్నది. వీరి తరంలో రెండవ మాదానాయుడు కాలంలోనె దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది. ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ ధుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.

పద్మనాయక రాజులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు 195 సంవత్సరాలపాటు పాలించారు. నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు, దేవరకొండ రాజ్యాన్ని 150 సంవత్సరాల పాటు వారు పాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొని పాలించినవారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజులలో 6వ తరం వాడైన ఎర్రదాచమనేని మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు చారిత్రక కథనం. ఈ తరం తరువాతి వారైన సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో పాటు 3వ మాద నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు.[2]

విశేషాలుసవరించు

దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు కొండల ప్రాంతాల నడుమ సుమారు 520 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది.[2]

కాకతీయ రాజుల ఏలుబడిలో దేవరకొండ కోట చాలాకాలం పాటు ఉంది. కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాచకొండ కోటతో పాటు దేవరకొండ కోటను కూడా వారు తమ వశం చేసుకున్నారు. సుమారు 1230 సంవత్సర ప్రాంతంలో దేవరకొండను ఆధారంగా చేసుకొని కాకతీయులు తమ రాజ్యపాలనను గావించారం. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు ఉన్నాయి.

ఈ కోటలో ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు ఉన్నాయి. పూర్తి గ్రానైట్‌ రాయితో చెక్కబడిన 9 ద్వారాలపై అనేక కాకతీయుల రాజ చిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి. 9 ప్రధాన ప్రాకారాలు మాత్రమే కాకుండా కోట లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు.

అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల అవసరాల కోసం ఆరు డ్యాం వంటి నిర్మాణాలు, అయిదు వరకు చెరువుల నిర్మాణాలు మనకు ఈ కోటలో కనిపిస్తాయి. శత్రువులు నెలల తరబడి కోటను చుట్టుముట్టినా నీటికి కొరతలేకుండా ఇన్ని నీటి నిర్మాణాలు ఈ కోటలో అలనాటి రాజులు చేపట్టటం గొప్ప విశేషం.

కోటకు 360 బురుజులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి.

ప్రస్తుత పరిస్థితిసవరించు

ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తుశాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమౌతున్నాయి. దుండగులు గుప్తనిధుల కొరకు జరిపిన త్రవ్వకాలలో అనేక విలువైన కళాఖండాలు ధ్వంసం చేయబడ్డాయి.

ఎక్కడున్నదిసవరించు

హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో మల్లెపల్లి గ్రామం ఉంది. అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ దుర్గం ఉంది.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. yrcnews.com. "దేవరకొండ కోట, నల్గొండ". yrcnews.com. Retrieved 19 November 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  2. 2.0 2.1 magazine.telangana.gov.in. "దేవర 'కొండ'". magazine.telangana.gov.in. Retrieved 19 November 2016. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలుసవరించు