ధుబ్రి ఫుల్బారి వంతెన
ధుబ్రి-ఫుల్బారి వంతెన ఈశాన్య భారతదేశంలో అస్సాం, మేఘాలయల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.
2028 నాటికి పూర్తి కానున్న ధుబ్రి-ఫుల్బారి వంతెన, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ తర్వాత నీటిపై భారతదేశంలో నిర్మించిన రెండవ అత్యంత పొడవైన వంతెన అవుతుంది. 19 కి.మీ. కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ వంతెన అస్సాంలోని ధుబ్రీని మేఘాలయలోని ఫుల్బారితో కలుపుతుంది. ఇది పశ్చిమ, మధ్య మేఘాలయలోని తురా, నాంగ్‌స్టోయిన్ తదితర పట్టణాలకు రోడ్డు మార్గంలో ధుబ్రీని కలుపుతూ జాతీయ రహదారి 127B లో మిస్సింగ్ లింకును పూరిస్తుంది. సివిల్ పనులు 2019–2020లో ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ద్వారా నిధులు సమకూర్చుకుంటోంది. NHIDCL దీనిని నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రపై ప్రతిపాదిత 6 వంతెనలలో ఇది ఒకటి.
లార్సెన్ అండ్ టూబ్రో (L&T) ఈ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును పొందింది. ఇందులో 12.625 కి.మీ. వంతెన, దుబ్రి వైపు 3.5 కి.మీ. పొడవున, ఫుల్బారి వైపు 2.2 కి.మీ., అప్రోచ్ వయాడక్టులు ఉంటాయి. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు ఇంటర్‌ఛేంజ్‌లతో అనుసంధానించబడి ఉంది.[1]
దాదాపు రూ. 4,997 కోట్లతో నిర్మించనున్న ఈ వంతెన, నదిని దాటేందుకు ఫెర్రీ సేవలపై ఆధారపడిన అస్సాం, మేఘాలయ ప్రజల చిరకాల డిమాండ్‌ను తీర్చనుంది. రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సిన 205 కి.మీ దూరం ఈ వంతెన వలన 19 కి.మీలకు తగ్గిపోతుంది.