నందిగాన వేంకటశాస్త్రులు


బ్ర.శ్రీ. నందిగాన వేంకటశాస్త్రులువారు బొబ్బిలి దగ్గర బిటివాడ అను గ్రామమున 1853 వ సం. న జన్మించిరి. వీరు బ్ర.శ్రీ. గుమ్మలూరి వేకంటశాస్త్రులు వారి దగ్గర వీణ ను, గాత్రమును అభ్యసించిరి. బొబ్బిలి మాహారాజావారి ఆస్థాన సంగీత విద్వాంసులుగా యుండిరి. శ్రీ పట్నం సుబ్రమహ్మణ్ణయ్య గారి సమకాలికులు. విద్యనంతయును గురుసన్నిధిని పూర్తి చేసుకొని దక్షిణదేశము వెళ్ళి అచ్చట 15 సం. లుండి అక్కడ ఉన్న విద్వాంసులందరిలో ఎన్నిక కెక్కిరి.

వీరు వీణ వాయించుచు గాత్రమును కలిపి పాడు నపుడు రెంటికి భేదము కనుపడునది కాదు. ఒక్కొక్క రాగమునకు మూడురాత్రులకు కూడా మించివేసిన సంగతి వేయకుండ పాడేవారు. నాలుగు స్థాయిల గాత్రము వీరిది. నాలుగు స్థాయిలలోను ఒక్కొక్క సంగతిని పెంచుకొని పైస్థాయిలలో సంచారముచేసి తిరిగీ మంద్రానుమంద్రములలో గాత్రము పూరించి పాడునపుడు శ్రోతల కందరుకును భూమిలోనుండి అనేకనాదములు వినపడునవి. తారక స్థాయిలో పాడునపుడు ఉత్తమమైన స్త్రీ శారీరమువలె వినపడునది.వీరు కేవలము రాగము పాడునప్పుడుకూడ అన్ని అవస్థలను కనబరచి శ్రోతలందరిని తన్మయులను చేసి అన్ని అవస్థలలో నుంచువారు.

ఒకసారి బ్రహ్మపురమున డిస్ట్రిక్టు జడ్జీగా ఉన్న దాక్షీణాత్యుల ఇంట సావేరి రాగమును పాడుచుండగా వరు పరవశులై ఆనందించి రూ.500 ఖరీదు గల వజ్రపుటుంగరము బహుమానమొసంగిరి. విజయనగరము న ఒక రాత్రి పాడుచుండగా అచ్చటి విద్వాంసులుందరును తమకంటె వీరి గానము తక్కువ అనిపించుటకు వీరితో పాడనారంభింపగా ఎవరును పాడలేకపోయిరి. మంద్రస్థాయిలో పాడ నారంభించునపుడు పైవారి మాదిరి తన పాటను కనబరచి పిమ్మట తారకస్థాయిలో వారికి మించిన పాటను కనబరచి వారి నోడించిరి. తారకస్థాయిలో పాట అభ్యాసము కలవారు పాడినవెంటనే వారి మాదిరిగా పాడి తిరిగీ మంద్రస్థాయిలో నాదమును పూరించి పాడి వారి నోదించువారు.

ఒకనాటి రాత్రి బొబ్బిలిలో వీణ వాయించుచుండగా అందరును తన్మయులై వినుచుండగా అందరిని తప్పించుకొని వచ్చి ఒక పెద్ద నాగుపాము పడగనెత్తి వీరి యెదుట ఆడుచుండెను.

వీరు అనేకులకు విద్యార్థులకు తమ ఇంట భోజనము పెట్టి విద్య నేర్పిరి. వీరి శిష్యులలో ముఖ్యులు శ్రీ తుమరాడ సంగమేశ్వరశాస్త్రులు గారు.

వేంకటశాస్త్రులు వారికమితమగు పల్లవి జ్ఞాఅనము ఉంది. అనేకులు మార్దంగికులు పల్లవి పాటకు సరిగా వాయించలేక మద్దెలకు కన్నముపడునట్లు గట్టిగా కొట్టి తప్పించుకొనేవారట.

వీరు అంత్యదశలో పీఠికాపురమున నుండువారు. వార్ధక్యదశలో వీణా వాద్యము చాలకాలము నుండి అభ్యాసములేని సమయమున ఒకనాడచ్చట పెద్ద గృహస్థుల ఇంట తమ శిష్యులగు సంగమేశ్వరశాస్త్రులు వీణ కచేరి పెట్టిరి. మృదంగము, తంబుర, ఫిడేలు, వీణ అన్నియును శ్రుతులు గూర్చుకొని తమ శిష్యులు వీణ ప్రారంభించే సమయమున అన్ని శ్రుతులు వినినతోడనే శాస్త్రులుగారు ఉత్సాహముతో శిష్యునిచేతిలో నున్న వీణను తాము తీసుకొని చాలకాలమునుంచి వీణను ముట్టకపోయినను రెండు గంటల కాలము అపురూపమైన సంగతులతో వాయించగా అందరును తన్మయులై విని ఆశ్చర్యము నొందిరి.

అటులనే ఇక నాలుగైదు దినములకు పోవుదురనగా జబ్బుతో మంచముమీద నుండగా వీరి ఆప్తులొకరు వీరిని చూచుటకు వచ్చిరి, కొద్దిగా పాడమనియు వచ్చిన వారిని కోరిరి. వచ్చినవారు తంబుర శ్రుతివేసుకొని హనుమంతుని యెదుట కుప్పిగెంతులు వైచినట్లు మీయెదుట నేను పాడగలనా అనుచు క్షమాపణను కోరి పదినిముషలు పాడునప్పటికి అంతజబ్బుతో లేవలేని స్థితిలో నున్నను శాస్త్రులువారికి శ్రుతులు విని పాటవినునప్పటి కొకవిధమైన ఉత్సాహము కలిగి బలమును తెచ్చుకొని మమచముమీదనుండి మెల్లగ క్రిందకు దిగి కూర్చొని గాత్రము శ్రుతులలో కలిపి రెండు గంటలసేపు అపరిమితముగా పాడిరి. సహజముగా పెద్ద గాత్రము కలవారు కావున ఊరిలోనివారందరికి వినిపించగా అందరును యెవరో క్రొత్తవారు పాడుచున్నారని గుంపులుగా వచ్చి విని అపరిమిత ఆనందమునొందిరి. పాడునప్పుడు ఆరుమైళ్ళకు పైగా వారి పాట వినిపించేది. బొబ్బిలిలో శ్రీమహారాజావారి కోటలో పాడునప్పుడు పాలతేరను గ్రామములోనికి వినబడి వారందరును తన్మయులగుచుండిరి. ఇట్టి ముచ్చట లెన్నియోకలవు.

వీరు 1917 సం. న పీఠికాపురమున శ్రీ కుక్కుటేశ్వర స్వామి సన్నిధిని స్వర్గస్థులైరి.