నాగసూరి వేణుగోపాల్
నాగసూరి వేణుగోపాల్ - జనరంజక విజ్ఞాన రచయిత, మాధ్యామాల విశ్లేషకుడు, సాహిత్యాంశాల పరిశీలకుడు, పాఠ్యాంశాల రచయిత, ఆకాశవాణి ప్రయోక్త. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి.(1985) ఎం.ఫిల్.(1987), ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పి.హెచ్‌డి (2010) గడించాడు. 1978లో ఆంధ్ర పత్రిక దినపత్రిక లో కవిత ప్రచురణతో రచనా ప్రయాణం మొదలైంది. జనరంజక విజ్ఞానం, పర్యావరణం పత్రికారంగం, టెలివిజన్, సాహిత్యం, సామాజికం - వంటి విభిన్న అంశాలలో సుమారు రెండువేల వ్యాసాలు రాసాడు. ముప్ఫై పుస్తకాలకు రచయితగా, ఇరవై పుస్తకాలకు పైగా సంపాదకుడిగా పనిచేశాడు.
నాగసూరి వేణుగోపాల్ | |
---|---|
జననం | నాగసూరి వేణుగోపాల్ 1961 ఫిబ్రవరి 1 కొనతట్టుపల్లి, సోమందేపల్లె మండలం, అనంతపురం జిల్లా |
వృత్తి | ఆకాశవాణి ప్రయోక్త |
1988లో ఆకాశవాణి ఉద్యోగంలో చేరిన నాగసూరి వేణుగోపాల్ - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, బయటా వివిధ కేంద్రాలలో పనిచేశాడు. 2016 ఆగస్ట్ నుంచి తిరుపతి కేంద్రంలో సంచాలకులుగా ఉద్యోగం చేసారు. పరిశీలన, పరిశోధన, ప్రణాళికతో ఇతను నిర్వహించే ఆకాశవాణి కార్యక్రమాలలో విభిన్న వర్గాల భాగస్వామ్యం, సామాజిక ప్రయోజనం వుండడంతో, అవి బహుళ ప్రాచుర్యం పొందాయి.[1]
నాగసూరి మూర్తిమత్వం
మార్చు''విస్తృత అధ్యయనం, లోతైన ఆలోచన, సృజనాత్మక అనువర్తన, సమాజ శాస్త్రాల ప్రాముఖ్యాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం, పారిభాషిక పదాల అన్వేషణ, పర్యావరణ ప్రాముఖ్య అవగాహన, విజ్ఞానశాస్త్రం పట్ల నిబద్ధత, నిజాయితీ, శాస్త్రవేత్తల పరిశోధక జీవితాలను, మానవీయ పార్శ్వాల్ని ప్రామాణికంగా పరామర్శించి చూపించడం, సైన్స్‌కూ-కళకూ మధ్య ఉండే అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేయడం, సూచనప్రాయంగా, సవినయంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, సొంపైన నుడికారం, మానవ విలువల కోసం తాపత్రయం, మత మౌఢ్యాన్ని, మూఢ నమ్మకాల్ని నిరసించడం, పెట్టుబడివాద సామాజిక రుగ్మత అయిన వస్తువినియోగతత్వాన్ని ఈసడించుకోవడం, డబ్బు వ్యామోహాన్ని నిరసిస్తూ, సమాజవాద విలువలైన ప్రేమ, సమిష్టిభావన, ఇతరులను గురించి పట్టించుకోవడం అంటే ప్రాపంచిక దృక్పథం ఉండడం, సూపర్ కంప్యూటర్ కన్నా మనిషి మెదడు గొప్పదనడం, సంప్రదాయం, ఆధునికతల మధ్య వారథి నిర్మించడం, వీటన్నిటినీ మించి మాతృభాషను ప్రేమతో, మమత్వంతో అభివృద్ధి పరచి, ఆదరించి, స్వీకరించాలని భావించడం, అందుకు అన్ని స్థాయిలలోనూ తెలుగే బోధనా మాధ్యమంగా ఉండాలని ప్రతిపాదించడం, ఆంగ్ల ఆధిపత్యాన్ని ఎదిరించడం'' - ఇదీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మూర్తిమత్వాన్ని వివరించే డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి అక్షరచిత్రం.
నేపథ్యం
మార్చునాగసూరి గౌరమ్మ, సంజీవయ్య దంపతుల పదిమంది సంతానంలో ఎనిమిదవ బిడ్డగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లిలో ఫిబ్రవరి 1, 1961న జన్మించారు. వీరి చదువు కొనతట్టుపల్లి, పాల సముద్రం, హిందూపురం, పుట్టపర్తి, తిరుపతి ప్రాంతాలలో సాగింది. ఈ నిరంత కృషీవలుని జీవితంలో మంచి చేయూతగా మారిన వీరి అర్థాంగి హంసవర్థిని చిత్తూరు జిల్లాకు చెందినవారు. గ్రామీణ నేపథ్యం, చవిచూసిన పేదరికం, అధ్యయనం చేసిన భౌతికశాస్త్రం, చదువుకొంటున్న సాహిత్యం, ఇష్టపడే సామాజిక దృక్పథం, వివిధ రాష్ట్రాలలో-ప్రాంతాలలో చేసిన ఆకాశవాణి ఉద్యోగం, కొనసాగిస్తున్న మీడియా పరిశోధనలు అర్థవంతంగా మేళవించి హేతుబద్ధత, మానవత, ప్రజాస్వామ్య విలువలు గల రచయితగా, ప్రయోక్తగా, మేధావిగా తీర్చిదిద్దాయి.
విలక్షణ కృషి
మార్చునాగసూరి వేణుగోపాల్ 1999 నుండి రెండేళ్ళపాటు 'వార్త' దినపత్రిక ఆదివారం అనుబంధంలో రాసిన 'ప్రకృతి-వికృతి' కాలమ్ విలక్షణమైనదే కాదు, తెలుగులో తొలి పర్యావరణ కాలమ్ (నియత శీర్షిక). చక్కటి అవగాహన, లోతయిన శోధనతో 2011 లో సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్‌గా వెలువరించిన 'విద్వాన్ విశ్వం' పుస్తకం మంచి గుర్తింపు పొందింది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల గురించి నాగసూరి వెలువరించిన 'సైన్స్ వైతాళికులు' గ్రంథాన్ని 2003 నుంచి 2014 దాకా సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాల బి.ఇడి. కోర్సు ఫిజికల్ సైన్స్ విద్యార్థులు వారి సిలబస్‌లో భాగంగా అధ్యయనం చేశారు. 1997 నుంచి 2010 దాకా ఆంధ్రభూమి, వార్త దినపత్రికల్లో టెలివిజన్ గురించి రాసిన సుమారు వెయ్యిలోపు వ్యాసాలు ఎనిమిది పుస్తకాలుగా రూపు దిద్దుకుని వివిధ విశ్వవిద్యాలయాల జర్నలిజం, తెలుగు ఎం.ఎ. విద్యార్థులకూ, ఇంకా పరిశోధకులకూ అధ్యయన ఆకరాలుగా రూపొందాయి. ఈ వారం, ప్రజాశక్తి పత్రికలు, న్యూవేవ్స్ పోర్టల్‌లో రాసిన పత్రికారంగ విశ్లేషణలు ఆదరణ పొందాయి. వంద పైచిలుకు భారతీయ శాస్త్రవేత్తల గురించీ, మదరాసు ప్రాంతంలో కృషి చేసిన నిన్నటితరం తెలుగు మహనీయులు పొట్టి శ్రీరాములు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అన్నమయ్యగార్ల గురించి (దక్షిణాంధ్ర దారిదీపాలు) త్వరలో పుస్తకాలు వెలువడనున్నాయి.
పరిశోధనా కృషి
మార్చుప్రఖ్యాత తెలుగు సంపాదకుల గురించి - ''తాపీ ధర్మారావు, నార్ల బాట, నవతరానికి నార్ల, శ్రీపాద సుబ్రమ్మణ్యశాస్త్రి - ప్రబుద్ధాంధ్ర పోరాటాలు (రెండు భాగాలు); సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం'' జర్నలిజానికి సంబంధించినవి కాగా, ''సాహితీ వీక్షణం, సాహితీ స్పర్శ, శతవసంత సాహితీ మంజీరాలు, మన తెలుగు, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, వెలుగు జాడ, నేటికీ శ్రీపాద'' సాహిత్య సంబంధమైనవి. 1927 నుంచి 2010 మధ్యకాలంలో వెలువడిన తెలుగు సైన్స్ ఫిక్షన్ కథల సంకలనం-'వైజ్ఞానిక కథలు', 1991 నుంచి 2010 దాకా వెలువడిన పర్యావరణ కథల సంకలనం-'కథావరణం' తెలుగులో తొలి ప్రయత్నాలు. మదరాసు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించే కథల సంకలనం-'మదరాసు బదుకులు' 2017 లో సంకలించబడింది. డా|| ఎన్.భాస్కరరావు, కె.పి.శ్రీనివాసన్, ప్రయాగ వేదవతి, విహారి, పున్నమరాజు నాగేశ్వరరావు, సామల రమేష్‌బాబు, నామిని సుధాకర నాయుడు, భువన చంద్ర, రాయదుర్గం విజయలక్ష్మి, కోడీహళ్ళి మురళీమోహన్ వంటి ఎంతోమందితో కలిసి చేసిన సమిష్టి ప్రయోగాలు పుస్తకాలుగా గౌరవం పొందుతున్నాయి.
'ఎ.పి.జె.అబ్దుల్ కలాం-ఇండియా 2020' పుస్తకానికి తెలుగు అనువాదం రాశారు. సైన్సుకు ఉండే తాత్త్విక కోణం, సామాజిక ప్రయోజనం వంటి పార్శ్వాలను చర్చించే 'సైన్స్‌వాచ్', 'శాస్త్రం-సమాజం', 'సైన్స్-దృక్పథం', 'ప్రగతికి ప్రస్థానం-సైన్స్', 'ఆధునికతకు చిరునామా-సైన్స్' వ్యాస సంకలనాలు తెలుగువారికి సమగ్ర సైన్స్ ఆలోచనను పరిచయం చేశాయి. 'అత్యున్నత కళారూపం-సైన్స్' పేరున సైన్స్‌కూ, కళలకూ ఉండే సారూప్యతలను చర్చించే వ్యాససంకలనం విలక్షణ గ్రంథం.
ఆకాశవాణి మైలురాళ్ళు
మార్చుఅనంతపురం వంటి చిన్న ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రధాన నిర్ణాయక కేంద్రమైన డైరెక్టోరేటు ( ఢిల్లీ) దాకా-నాలుగు రాష్ట్రాలలో-విజయవాడ, విశాఖపట్నం, కడప, హైదరాబాదు, మద్రాసు, తిరుపతితో కలసి ఎనిమిది కేంద్రాలలో పనిచేసిన పనిచేసిన నాగసూరికి విభిన్న భాషల నేపథ్యం, విలక్షణ సంస్కృతుల విశిష్టత మాత్రమే కాదు, ఆకాశవాణి కార్యక్రమాలు, కార్యక్రమాల పాలనా నిర్వహణ కూడా బాగా తెలుసు. అనంతపురం ఆకాశవాణి తొలి రోజుల్లో ఆ కేంద్రం రూపశిల్పిగా, రెండు దశాబ్దాల తర్వాత మద్రాసు తెలుగు శాఖకు కొత్త జీవం పోసిన చైతన్య మూర్తిగా వారు సాధించిన విజయాలు విలువైనవి. అంతేకాదు, ఈ రెండింటి నడుమ సహస్రాబ్ది సమయానికి అటూ-ఇటూ దాదాపు ఐదేళ్లకు పైగా విజయవాడలో ఉదయరేఖల ద్వారా చేసిన సాహిత్య, సామాజిక, సైన్స్ కార్యక్రమాలు నాగసూరికే కాదు, ఆకాశవాణికీ గర్వకారణాలు.
ప్రఖ్యాతులైన పండితులను ఆకాశవాణికి ఆహ్వానించి, కలకాలం గుర్తుండిపోయే రీతిలో ప్రతి కేంద్రంలోనూ లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. కొత్త కేంద్రానికి పోగానే అక్కడి చరిత్ర, సంస్కృతి, కళలు ఇత్యాదివి అధ్యయనం చేసి, అందుబాటులో ఉండే నిపుణుల కోసం అన్వేషించిన తర్వాత విజయవంతమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయటం వీరి బాణి. రేడియో పరిచయాలు, చర్చలు నిర్వహించడంలో; ప్రసంగాలు, ధారావాహికలు రూపొందించడంలో అందె వేసిన చేయి. తెలుగు ప్రాంతాలలోని ప్రతి మేధావి ప్రతి రచయితా, ప్రతి కళాకారుడు ఆయనకు తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు. శతాబ్దపు తెలుగు సాహిత్యం పరిచయం చేసిన 'శత వసంత సాహితీ మంజీరాలు' (విజయవాడ); తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగువారి కర్తవ్యాలను గుర్తుచేసిన 'మన తెలుగు' (హైదరాబాదు), అన్నమయ్య సాహిత్య, సంగీత సౌరభాన్ని విశ్లేషించిన 'అన్నమయ్య పదగోపురం' (కడప); జిల్లా జానపద కళలను పరిచయం చేసిన ప్రయత్నం (అనంతపురం); పాత తరం ప్రముఖులను గుర్తు చేసిన 'నాన్నకు నమస్కారం' (మద్రాసు) వంటి ప్రయోగాలతో పాటు, జి.వి.కృష్ణరావు (విజయవాడ), గురజాడ అప్పారావు (విశాఖపట్నం), శ్రీపాద సుబ్రమ్మణ్య శాస్త్రి (విశాఖపట్నం) సాహిత్య కృషిని సమగ్రంగా పరిచయం చేసిన తీరు మాత్రమే కాక, సీమ కథలు, అమరావతి కథలు, ప్రళయ కావేరి కథలు, తెలుగరవ కథలు, చిత్తూరు కథలు, ఇలా కథా సాహిత్యాన్ని శ్రోతలకు మరింత చేరువ చేశారు.
హెచ్.ఐ.వి.-ఎయిడ్స్ సమస్యను నెల్లూరు నుండి తూర్పు గోదావరి దాకా ఎంత తీవ్రంగా ఉందో ఒక రెండేళ్ళపాటు ఉభయ రాష్ట్రాల ఆకాశవాణి కేంద్రాలకు 'జీవన బింబం' ద్వారా అవగాహన కలిగేటట్లు దేశంలోనే ఏ ఇతర ఆకాశవాణి కేంద్రం చేయని రీతిలో విజయవాడ లో చేశారు. అలాగే వివాఖపట్నంలో ఆదివాసుల ఉత్పత్తులకు సరయిన విలువను కల్పిస్తూ, వారి జీవితాలలో వెలుగు చిందించిన 'ఆదివాసీ అంతరంగం' ధారావాహిక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు ఒకటిన్నర సంవత్సరం ప్రసారం అయి కొత్త చరిత్ర సృష్టించాయి. ఇక మద్రాసులో సీనియర్ సినీ ప్రముఖులతో నిర్వహించిన 'తారా మణిహారం' నిజంగా మణిమకుటమే కాదు, నేటికీ ఇతర కేంద్రాల శ్రోతలను అలరిస్తోంది.
ఇక సైన్స్ రచయితగా ఖ్యాతి పొందిన నాగసూరి ఆకాశవాణిలో సైన్స్ కార్యక్రమాలు చేయకుండా ఉంటారా? 1991లో అనంతపురంలో ప్రారంభించిన 'విజ్ఞానపథం' నుంచి ఇపుడు తిరుపతి ఆకాశవాణిలో ప్రసారం అవుతున్న 'రండి చూసొద్దాం తారామండలం', 'అడగండి, తెలుసుకోండి' దాకా ప్రతీదీ విలక్షణమైన ప్రయోగమే! ఢిల్లీ నుండి 1995 లోనే 'రేడియోస్కోపు' అనే ఆంగ్ల సైన్స్ సంచికా కార్యక్రమం దేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమై వారికి ఎంతో గుర్తింపు తెచ్చింది. పర్యావరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆకాశవాణి తరపున 'ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ' మనీలా (ఫిలిప్పీన్స్) లో నిర్వహించిన సదస్సులో 2010 లో పాల్గొన్నారు. నాగసూరి ఒకరకంగా ఆకాశవాణికి గుర్తింపు, కీర్తి పెంపొందించిన అపురూప రేడియో మూర్తి - ఆకాశవాణికి ఓ పర్యాయపదం డా|| నాగసూరి వేణుగోపాల్!
అవార్డులు-పురస్కారాలు
మార్చుమీడియా సంబంధమైన కృషికి తాపీ ధర్మారావు పురస్కారం, నార్ల వెంకటేశ్వరరావు పురస్కారం; పాపులర్ సైన్స్ వ్యాస ప్రచురణకు డా|| పరుచూరి రాజారాం గౌరవం, జమ్మి శకుంతల పురస్కారం, మల్లాది సూరిబాబు పురస్కారం, సాహిత్య సంబంధమైన పరిశ్రమకు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, భాషా సంబంధమైన కృషికి అధికారభాషా సంఘం అవార్డు పొందారు. ఇటీవల జరిగిన లేపాక్షి ఉత్సవంలో నాగసూరి సమగ్ర కృషికి నందమూరి బాలకృష్ణ పురస్కారం అందజేశారు.
కొసమెరుపు
మార్చునాగసూరి వేణుగోపాల్ గారు ఏ రంగంలో సాగినా అందులో సృజన, పరిశోధన, ప్రణాళిక, సామాజిక స్ఫూర్తి, మానవత, సైన్స్-దృష్టి ఆకట్టుకునే గుణం విశేషంగా గోచరమవుతాయి. ఆయన ప్రస్తుతం తిరుపతి ఆకాశవాణి కేంద్ర సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రాసిన పుస్తకాలు
మార్చు- సైన్స్ వైతాళికులు
- టీవీ ముచ్చట్లు
- చానళ్ళ హోరు - భాష తీరు
- చానళ్ల సందడి-టెక్నాలజీ హడావుడి
- వార్తామాధ్యమాల విశ్వసనీయత
- పర్యావరణం - సమాజం
- ప్రకృతి - పర్యావరణం
- ద్రావిడ శాస్త్రవేత్తలు
- సైన్స్ వైతాళికులు
- పాత్రికేయ పాళి
- నార్లబాట
- సమాచారం బాట - సంచలనాలవేట
- మీడియానాడి
- మీడియాస్కాన్
- మీడియా వాచ్
- సైన్స్ వాచ్
- సాహితీవీక్షణం
- నవతరానికి నార్ల
- శాస్త్రం-సమాజం
- అత్యున్నతకళారూపం సైన్స్
- శ్రీపాద ప్రబుద్ధాంధ్ర పోరాటాలు (రెండు భాగాలు)(సంపాదకత్వం)
- సైన్స్ ధృవతారలు
- ప్రసారభాషగా తెలుగు(సంపాదకత్వం)
- బుల్లితెర విశ్వరూపం
- సామాజిక మార్పుకోసం విద్య(అనువాదం)
- రేడియో-ఎఫ్.ఎమ్.రేడియో
- సైన్స్ దృక్పథం
- ఇండియా 2020(ఎ.పి.జె.అబ్దుల్ కలాం రచనకు అనువాదం)
- విద్వాన్ విశ్వం (కేంద్రసాహిత్య అకాడెమీకి వ్రాసిన మోనోగ్రాఫ్)
- శతవసంతసాహితీమంజీరాలు (సంపాదకత్వం)
- వెలుగుజాడ(సంపాదకత్వం)
- నేటికీ శ్రీపాద(సంపాదకత్వం)
- పర్యావరణ శాస్త్రం
- సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం (సంపాదకత్వం)
- జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు (సంపాదకత్వం)
- సాహితీస్పర్శ
పొందిన అవార్డులు
మార్చు- నార్ల మెమోరియల్ అవార్డు
- పరుచూరి రాజారాం అవార్డు
- తాపీ ధర్మారావు స్మారక పురస్కారం 10.10.2009.