నాగా శాంతి ఒప్పందం

భారత ప్రభుత్వానికి, ఎన్‌సిఎస్‌ఎన్‌కు 2015 లో కుదిరిన ఒప్పందం

నాగా శాంతి ఒప్పందం, ఈశాన్య భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రంలో తిరుగుబాటును అంతం చేయడానికి భారత ప్రభుత్వం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN) ల మధ్య 2015 ఆగస్టు 3 న కుదిరిన శాంతి ఒప్పందం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో, నాగా శాంతి చర్చలలో ప్రభుత్వ సంభాషణకర్త అయిన ఆర్‌ఎన్ రవి భారత ప్రభుత్వం తరపున సంతకం చేయగా, ఎన్‌ఎస్‌సిఎన్ తరపున లెఫ్టినెంట్ ఇసాక్ చిషి స్వూ, జనరల్ సెక్రటరీ థ్యూంగాలెంగ్ ముయివా సంతకం చేశారు.[1][2]

నాగా శాంతి ఒప్పందం
2015 నాగా శాంతి ఒప్పందం
రకంఆంతి
సంతకించిన తేదీఆగస్టు 3, 2015 (2015-08-03)
స్థలంన్యూ ఢిల్లీ
ఒరిజినల్
సంతకీయులు
కక్షిదారులు
భాషEnglish

నాగా శాంతి చర్చలు

మార్చు

నాగా శాంతి చర్చలు, దశాబ్దాల నాటి వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం, నాగాలాండ్‌లోని వివిధ వాటాదారుల మధ్య జరిగిన చర్చలు. ఈ సమస్యలలో కొన్ని వలసరాజ్యాల కాలం నాటివి. నివేదికల ప్రకారం, నాగాలాండ్, దాని పొరుగు రాష్ట్రాలు, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసే గ్రేటర్ నాగాలాండ్ లేదా నాగాలిమ్‌ డిమాండ్ నాగా జాతీయవాదంలో ముఖ్యమైన భాగం. ఇది దశాబ్దాలుగా ఉన్న డిమాండు. 1918లో నాగా క్లబ్ ఏర్పాటు చేయడంతో మొదటిసారిగా స్ఫటికీకరించబడింది. "పురాతన కాలంలో ఉన్నట్లుగా, మాకు మేమే నిర్ణయించుకోవడానికి" నాగాలను ఒంటరిగా వదిలేయాలని నాగా క్లబ్, సైమన్ కమీషన్‌కి నివేదించింది.

1947 ఆగష్టు 14 న అంగామి జాపు ఫిజో నేతృత్వంలోని నాగా నేషనల్ కౌన్సిల్ (NNC) నాగాలాండ్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఫిజో 1952లో అజ్ఞాత నాగా ఫెడరల్ గవర్నమెంట్ (NFG) ను, నాగా ఫెడరల్ ఆర్మీ (NFA)ని కూడా ఏర్పాటు చేసాడు. దీనిని భారత ప్రభుత్వం నాగాలాండ్‌లో సైన్యాన్ని పంపడం ద్వారా, సాయుధ దళాల (ప్రత్యేక) అధికారాల చట్టం లేదా AFSPAని అమలు చేయడం ద్వారా అణిచివేసేందుకు ప్రయత్నించింది.

చరిత్ర

మార్చు

నాగాలాండ్‌లో తిరుగుబాటు కొనసాగుతున్నప్పటికీ, తిరుగుబాటుదారులను చర్చలకు తీసుకురావడానికి కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

1975లో ప్రభుత్వం, NNC ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. షిల్లాంగ్ ఒప్పందం అనే ఈ ఒప్పందం ప్రకారం, NNC ఆయుధాలను వదులుకుంటానని హామీ ఇచ్చింది. అయితే NNCలోని పలువురు సీనియర్ నాయకులు ఈ ఒప్పందాన్ని అంగీకరించకుండా, పార్టీ నుండి విడిపోయి తమతమ స్వంత వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి ఒక వర్గం NSCN గా ఏర్పడింది. ఆ తరువాత ఇది మళ్ళీ విడిపోయి NSCN(IM) వర్గంగా ఏర్పడింది.

1997లో NSCN(IM), ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది.[3] NSCN (IM) కేడర్ పైన, దాని నాయకత్వానికి వ్యతిరేకంగానూ ప్రభుత్వం తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టరాదు, అలాగే వారి పక్షాన ఉన్న తిరుగుబాటుదారులు సాయుధ దళాలను లక్ష్యంగా చేసుకోరాదని ఆ ఒప్పందం పేర్కొంది.

2015 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దృఢంగా అధికారంలో ఉండటం, వివాదానికి సత్వర పరిష్కారాన్ని తీసుకురావడానికి ప్రధాని ముందుకు రావడంతో, ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. ఇది శాంతి చర్చలకు వేదికగా నిలిచింది.

ఫ్రేంవర్క్ ఒప్పందం

మార్చు

ప్రధాని మోదీ "చారిత్రాత్మకం"గా పేర్కొన్న ఈ ఒప్పందం ప్రభుత్వం, వివిధ వాటాదారుల మధ్య 80 రౌండ్ల చర్చల తర్వాత సంతకం చేయబడింది. అయితే ఒప్పందం యొక్క ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటనలో "నాగాల విశిష్ట చరిత్ర, సంస్కృతి, స్థానం, వారి మనోభావాలు, ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించింది. NSCN భారత రాజకీయ వ్యవస్థ, పాలనను అర్థం చేసుకుని, ప్రశంసించింది" అని తెలిపింది.

ది హిందూ నివేదిక ప్రకారం, నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ (NNGP) ఆధ్వర్యంలో ఇతర నాగా సాయుధ సమూహాలను బోర్డులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నాగాలాండ్‌లోని వివిధ వర్గాలలో అసౌకర్యం ఏర్పడింది. నాగాలాండ్‌లోని కొన్ని వర్గాలు నాగాల మధ్య ఉన్న విభజనలను ఉపయోగించుకునేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని అనుమానిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

2020 ఆగస్టులో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ గోప్యంగా ఉన్న ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ (FA) కాపీలను విడుదల చేసింది.[4] సంభాషణకర్త ఆర్‌ఎన్ రవిని మార్చాలని నాగా వర్గాలు పట్టుబట్టాయి. ఒప్పందం కాపీల విడుదల ఈ డిమాండ్ నుండి ఉద్భవించిన సంఘటనల ఫలితమే.[5][6] 2020 అక్టోబరులో కరణ్ థాపర్‌కి ఇచ్చిన 55 నిమిషాల సుదీర్ఘ ఇంటర్వ్యూలో NSCN-IM ప్రస్తుత చీఫ్ థ్యూంగాలెంగ్ ముయివా ఒప్పందానికి వ్యతిరేకంగా బలమైన అభ్యంతరాలను వ్యక్తం చేశాడు.[7]

గడువు తేదీలు

మార్చు

ప్రత్యేక జెండా, రాజ్యాంగాల కోసం NSCN (IM) చేస్తున్న డిమాండ్ నెరవేరదని కేంద్రం తరఫున సంభాషణకర్త, నాగాలాండ్ గవర్నర్ RN రవి పేర్కొంటూ, సంస్థ చర్చలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. పరిష్కారాన్ని ఆలస్యం చేయడానికి ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) "జాప్యం చేసే వైఖరి" తీసుకుందని రవి చెప్పాడు.

అక్టోబరు 28 న NSCN (IM), దాని ప్రధాన కార్యదర్శి థ్యూంగాలెంగ్ ముయివా, రవి నేతృత్వంలోని బృందం నాగాలకు ప్రత్యేక జెండా, రాజ్యాంగాల జటిల సమస్యను పరిష్కరించడం ద్వారా "గౌరవనీయమైన" పరిష్కారాన్ని కనుగొనే మార్గాలను చర్చించడానికి మళ్లీ సమావేశమైంది. "నాలుగు గంటలకు పైగా సాగిన ఈ చర్చ అసంపూర్తిగా ముగిసింది. త్వరలో మళ్లీ కలవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే, NSCN (IM), ప్రభుత్వం మధ్య తుది ఒప్పందం 2019 అక్టోబరు 31 లోపు జరిగే అవకాశం లేదు" అని ఒక అధికారి చెప్పాడు.

2020 అక్టోబరు నాటికి, తుది ఒప్పందం జరగలేదు. NSCN (IM) చేస్తున్న ప్రత్యేక జెండా, రాజ్యాంగం, గ్రేటర్ నాగాలిమ్‌ కోసం డిమాండ్ల కారణంగా విభేదాలు తలెత్తాయి. చర్చ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

ప్రభావం

మార్చు

ఒక విషయం ఏమిటంటే, NSCN (IM) యొక్క నాగాలిమ్‌ ఆలోచనలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అనే వాస్తవం ఆ రాష్ట్రాలను ఆందోళనకు గురి చేసింది. మూడు రాష్ట్రాల్లోని పౌర సమాజ సంస్థలు తమ ప్రాదేశిక సమగ్రతపై ఎలాంటి రాజీని అంగీకరించబోమని పేర్కొన్నాయి. NSCN (IM) అధునాతన ఆయుధాలను కలిగిన, ఉప-ఖండంలోని అతిపెద్ద తిరుగుబాటు సమూహాలలో ఒకటి. దాని చర్యలు రాష్ట్రాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆయా రాష్ట్రాల వారు జాగ్రత్తగా ఉండటానికి ఇవే కారణాలు. అయితే తుది శాంతి ఒప్పందాన్ని ప్రకటించే వరకు వేచి చూడాలనే వైఖరిని అవలంబించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Peace at last, peace at last. Thank God Almighty, peace at last. - Rediff.com India News". Rediff.com. 2015-08-04. Retrieved 2015-10-31.
  2. "PHOTOS: Modi govt signs historic Naga peace accord - Rediff.com India News". Rediff.com. Retrieved 2015-10-31.
  3. Waterman, Alex (2020-09-16). "Ceasefires and State Order-Making in Naga Northeast India".
  4. "Four Reasons Why the NSCN(I-M) Released the Confidential Nagaland Framework Agreement". thewire.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-17.
  5. "NSCN (I-M) Blames Interlocutor – the Nagaland Governor – for Peace Accord Delays". thewire.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-17.
  6. "Clamour for changing RN Ravi as Naga interlocutor grows". NORTHEAST NOW (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-17.
  7. "Exclusive | Nagas Will Never Join Indian Union Nor Accept India s Constitution : NSCN (I-M) Chief". thewire.in. Retrieved 2020-10-17.