సైమన్ కమిషన్

సైమన్ అధ్యక్షతన ఏడు బ్రిటిష్ సభ్యుల పార్లమెంటు సభ్యులు వర్గం

సైమన్ కమీషన్ (Simon Commission) అనగా సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ (రాజ్యాంగాధికారముతో నియమించబడ్డ విచారణ సంఘము). సైమన్ విచారణ సంఘము ( Simon committee) భారతదేశానికి 1928 సంవత్సరము ఫిబ్రవరి మాసములో పర్యటించుటకు వచ్చింది. ఆ విచారణ సంఘముయెక్క నియామకము, భారతదేశ పర్యటన గవర్నర్ జనరల్ (వైస్రాయి) లార్డు ఇర్విన్ పరిపాలించుచుండిన (1925-1931) కార్యకాలమందు జరిగిన ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు. సర్ జాన్ సిమన్ అధ్యక్షతవహించిన ఆ సంఘమునందు ఆరుగురు ఇతర సభ్యులలో లేబర్ పార్టీ సభ్యుడు క్లెమెంట్ అట్లీ (Clement Attlee) కూడా యుండెను (తదుపరిగా (1945-1951) బ్రిటన్ కు ప్రధానమంత్రిగాయుండెను). సైమన్ సంఘముయెక్క సభ్యులందరు బ్రిటన్ దేశ రాజకీయనాయకులైన పార్లమెంటు సభ్యులు. భారతీయ ప్రతినిదిలేని ఆ సైమన్ కమీషన్ 1927సంవత్సరము ఇంగ్లండులో నియామించబడిన వెంటనే భారతదేశములో 1927 మద్రాసులో జరిగిన భారతజాతీయ కాంగ్రెస్ మహాసభలో తీవ్రముగా ఖండించుతూ ఆ విచారణసంఘమును బహిష్కరించ వలసినదని తీర్మానము చేయబడింది. 1928 ఫిబ్రవరిలో ఆ సంఘ సభ్యులు ఓడపై సముద్రయానముచేసి భారతదేశములోని బొంబాయి తీరముతాకగనే యావద్భారతదేశములోని ప్రజలు, ప్రజానాయకులు తీవ్ర ఆందోళనచేపట్టారు. భారతదేశ ప్రతినిధిని ఆ సైమన్ కమిటీలో నియమించకపోవుటవలన ఆ సంఘముయొక్క భారతదేశ పర్యాటన తీవ్ర వ్యతిరేకత కలిగించింది.

సైమన్ విచారణ సంఘమునియమించబడిన ఉద్దేశ్యములు, పూర్వోత్తర సంధర్బములు

మార్చు


విచారణ సంఘము నియమించుటలోని ఉద్దేశములు: 1919 సంవత్సరములో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము (చూడు మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము) విడుదలచేయు సమయములో తదుపరి 10 సంవత్సరముల తరువాత ఇంకయూ రాజ్యాంగసంస్కరణలు చేయవలసిన అవసరమును నిర్ణయించెదమని బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటించబడింది. ఆ సమయపరిధి దగ్గరపడుచున్నందున్న సర్ జాన్ సైమన్ అధ్యక్షతక్రింద ఒక విచారణ సంఘమును (Simon Commission) నియమించారు. ఆర్భాటముగా వెలువడించబడిన బాహ్యోద్దేశ్యము అదే అయినప్పటికీ భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలోకల్లా అమూల్యమైన ఆభరణమని ఒక శతాబ్ధపునకు పూర్వమే వారి ప్రతినిధి, వంగరాష్ట్రపు గవర్నర్ రాబర్టు క్లైవు ద్వారా తెలుసుకునటమేగాక తదుపరి 1905 సంవత్సరములో విజ్ఞానకరముగా అధ్యయనముచేసిన గవర్నర్ జనరల్ (వైస్ రాయి) లార్డ్ కర్జన్ యొక్క పునః ఉద్ఘాటనతో భారతదేశానికి స్వతంత్ర పరిపాలననిచ్చు అవకాశము కలుగనీయకుండుటకు చేదోడుగా వంతుపలుకెడి విచారణ సంఘమను పేరట ఉపశమనకార్యముగా భారతయుల కన్నీళ్ళ తుడుపుచేయుట అంతఃరోద్దేశ్యము.

పూర్వోత్తర సందర్భములు: సైమన్ కమిటీ భారతదేశము పర్యాటనకు కొద్దిరోజుల మునుపు 1927సంవత్సరమున మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహా సభలో సైమన్ విచారణ సంఘమును అనేకవిధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది. వివిధ జాతి మతములు కలిగియున్న భారతదేశానికి సర్వసమ్మతమైన రాజ్యాంగమును నిర్మాణించుట దుర్లభమని ఆనాటి (1927) ఇంగ్లండులోని బ్రిటిష్ విదేశాంగ ఇండియా రాజ్యమంత్రిగా నుండిన లార్డు బిర్కన్ హెడ్ సవాలుచేసియుండెను. ఆ సవాలుకు జవాబుగా కాంగ్రెస్స అగ్రనాయకులు ఫిబ్రవరి 1928లో అఖిలపక్షములనుండి సభ్యులతో సమావేశములు జరిపి భారతదేశానికి రాజ్యాంగ చిత్తు ప్రతిని నిర్మించుటకు మోతీలాల నెహ్రూ అధ్యక్షతన 10సభ్యులతో ఒక సంఘమునేర్పరచి .(అప్పటి జాతీయ కాంగ్రెస్ అద్యక్షులు అయ్యాంగార్) ఆ పదిమంది సభ్యులలో ముస్లిమ్ లీగ్ మాజీ అధ్యక్షులైన సర్ అలీ ఇమామ్, షుయాబ్ క్వెరేషి కూడా నుండెను. ఆ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేధిక అని ప్రసిధ్దిచెందియుండెను. 1928 సంవత్సరములోనే ( సైమన్ కమిటీ వారి పర్యటానంతరము, వారి నివేదిక బహిరంగము కాక మునుపే ) భారతదేశమునందు సర్వపక్ష సమావేశ సభ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన చేసిన తీర్మానము ప్రకారము భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ (కెనడా దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యము ప్రసాదించినట్టి డొమీనియన్ స్టేటస్ వంటి) అధినివేశ స్వరాజ్యము కావలయునని అపేక్షించబడింది. ఆ తీర్మానము ప్రకారము భారతదేశానికి సుముఖమైన డొమీనియన్ స్టేటస్ రాజ్యాంగము చిత్తుప్రతి నిర్మాణించబడింది. సైమన్ విచారణ సంఘములో భారతీయప్రతినిదిత్వములేదని తెలియగనే మద్రాసులో 1927లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సైమన్ కమీషన్ ను బహిష్కరించవలయునని తీర్మానించబడింది. అటుతరువాత 1928 లో జరిగిన కాంగ్రెస్సుమహాసభలో డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) కనుక ఇవ్వకపోతే సంపూర్ణస్వరాజ్యము స్థాపించెదమని బ్రిటిష్ సామ్రాజ్యప్రభుత్వమునకు ఇంకా తీవ్రమైన అంత్యహెచ్చెరిక (ultimatum) జారీచేయబడింది. 1929 డిసెంబరు 31 వ తేదీ న కాంగ్రెస్సు మహా సభలో బ్రిటిష్ వారితో సంబంధము లేకనే సత్యాగ్రహము సాధనముగా సంపూర్ణ స్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానము చేయబడింది. 1930 జనేవరి 26 తేదీన ప్రథమ స్వాతంత్ర్యదినోత్సవము దేశములో అన్ని ఊర్లలో జయప్రథముగా జరుపకొన బడింది. దేశము దాస్యమునకు, దారిద్ర్యమునకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణమని కూడా తీర్మానించబడింది. దేశప్రజలకు రాజకీయ హక్కులివ్వక భారతదేశమును బానిస రాజ్యముగా పరిపాలించుచున్న బ్రిటిష ప్రభుత్వమునకు కనీసపు ముఖ్య సంస్కరణలు చేయమని పదకొండింటిని గాంధీజీ ప్రతిపాదించెను. కానీ బ్రిటిష్ ప్రభుత్వము అవిత్రోసిపుచ్చి మరింత కఠినవైఖరి అవలంబించి నిర్బంద, నిషేధములు విధించెను. అట్టి పరిస్థితులలో గాంధీ 1930 మార్చి 12 వ తేదీన ఉప్పు-సత్యాగ్రహము, విదేశ వస్తు బహిష్కరణ మొదలగు ఉద్యమములు ప్రారంభించి ఏప్రిల్ 6 వతేదీన దండి మార్చి అనబడిన చారిత్రాత్మక ఉప్పు చట్ట తిరస్కారముచేసి శాసనోల్లంఘనమును చేసెను. ఆ సందర్బన యావద్భారతదేశమున కోకొల్లలుగా దేశ ప్రజలు జైలుకు పంపబడిరి. చూడు ఉప్పు-సత్యాగ్రహము. శాసనసభా సభ్యులనేక ప్రముఖులు రాజీనామా చేసిరి. అందు విఠల్ భాయి పటేలు (శాసన సభాద్యక్షుడు) తన అధ్యక్షపదవికి రాజీనామా చేసి చెరసాలకేగెను.[1] ఒకప్రక్క యావద్భారతదేశము సైమన్ కమీషను బహిష్కరించి నల్లజండాలు చూపగా భారతదేశమున ఈశాన్యదిశలోనుండిన (Northeast India) పర్వతపరగణాలు ఏవైతే బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీవారు మొదటి బర్మాయుద్ధం (1824-26) గెలుపొంది (చూడు "బర్మా బ్రిటిష్ బర్మాగా మారిన చరిత్ర" డల్ హౌసీ ) బర్మారాజుతో చేసుకున్న యండబూ సంధి ఫలితముగా బ్రిటిష్ ఇండియాలో భాగముగా పరిపాలించబడేవో ఆ పరగణాలోనివసించెడి (ఇప్పటి నాగాలాండ్ రాష్ట్రము) నాగజాతి బహుజనవాసుల నాయకులు కొద్దిమంది నాగాక్లబ్ (Naga Club) అను పేరుతో సైమన్ కమీషన్ ను కలుసుకుని తమ నాగ జాతి పరగణాలకు సైమన్ కమీషన్ వారు చేయబోవు సంస్కరణలు వర్తించకుండునటుల కోరుచూ వినతిపత్రము సమపర్పించిరి.[2].[3]

సైమన్ కమిటీలోని సభ్యులు

మార్చు

సైమన్ కమిటీలోని ఏడుగురు సభ్యలు. వారందరు బ్రిటన్ దేశ పార్లమెంటు సభ్యులే. (1) జాన్ సైమన్ (Sir John Simon), (2) క్లెమెంట్ అట్లీ (Clement Attlee), (3) హ్యారీ లెవీలాసన్ (Harry LevyLawson), (4) ఎడ్వర్డ్ కెడొగన్ (Edward Cadogan), (5) వెర్నాన్ హర్టసన్ (Vernon Hartshorn), (6) జార్జి లేన్ఫాక్స్ (George LaneFox), (7) డొనాల్డ్ హోవార్డు (Donald Howard)

సైమన్ విచారణ సంఘము బహిష్కరించబడిన కారణము, బహిష్కరోద్యమము

మార్చు

భారతదేశములో సైమన్ విచారణసంఘము బహిష్కరించబడిన కారణము; బహు ముఖ్యమైన ఆ విచారణ సంఘమున ఒక్క భారతీయుడు తగడని సభ్యునిగా నియమించకపోవుటయే. సైమన్ కమీషన్ బహిష్కరించ వలెనన్న నిర్ణయము డిసెంబరు మాసము, 1927 సంవత్సరమున మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్సు సదస్ససున జరిగింది. శక్తివంతమైన తీర్మానముచేయబడింది. కాంగ్రెస్సు పార్టీ వారే కాక భారతదేశములో అప్పటిలో పలుకుబడిగలిగియున్న హిందు మహాసభ మరియూ ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వమందలి ముస్లిమ్ లీగ్ మొదలగు పార్టీలు (ఒకటి, రెండు పార్టీలు తప్ప), ప్రజా నాయకులు కూడా సైమన్ కమీషన్ ను బహిష్కరించ నిశ్చయించిరి. అందుచే బహిష్కరణ కార్యక్రమములో భాగముగా సైమన్ సంఘ సభ్యులు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వారిని తిరస్కరించుటకు ఒక ఉద్యమముగా కార్యక్రమము నెలకొల్పి, గొప్పజాతీయభావముతో యావద్భారతదేశములో అమలుచేయబడెను. సైమన్ కమిటీ పర్యటించిన ప్రతి ఊరిలో హార్తాళ్ ప్రకటించి నల్ల జండాలతో తిరస్కారభావముచూపబడెను. బ్రిటిష్ ప్రభుత్వము నిషేధాజ్ఞలు ప్రకటించి ఆందోళనకారులపై పోలీసు లాఠీ ఛార్జీలు జరిగినవి. అప్పటి బహిష్కరోద్యమములో పోలీసు లాఠీఛార్జీవల్లన అనేకులు గాయపడిరి. అందులో ప్రముఖులు లాహోరు నగరములో లాలా లజపతిరాయ్, లక్నో నగరములో గోవింద్ వల్లభ్ పంత్, జవహర్లాల్ నెహ్రూ.[1]

బహిష్కరణాందోళన - లాలా లజపత రాయి మరణము

మార్చు

వందేమాతరోద్యమకాలము (1907-1916) " బాల్ లాల్ పాల్ " అని ప్రసిద్ధిగాంచి, బ్రిటిష్ ప్రభుత్వమువారిచే ప్రవాసమునకంపబడిన ముగ్గురు తీవ్రజాతీయవాదులలో పంజాబ్ కేసరి అని ప్రసిధ్దిగాంచినట్టి లాలా లజపతిరాయ్ 1927 సంవత్సరపు సైమన్ కమీషన్ నియామకమునకు తీవ్ర వ్యతిరేకతచూపెను. పంజాబ్ శాసన సభలో సైమన్ విచారణ సంఘమును బహిష్కరించవలయునన్న తీర్మానము ప్రవేశపెట్టెను. సైమన్ కమిటీ సభ్యులు 1928 అక్టోబరు 30న లాహోర్ లో పర్యటించుచున్నప్పుడు లజపత రాయి నాయకత్వమున శాంతియుతముగా జరుగుచున్న నిరసన ప్రదర్శనలపై పోలీసు వారు జోక్యముచేసుకుని లాఠీ ప్రయోగముచేసెను. పోలీసు సూపరింటెండెంట్ స్కాట్ (James A. Scott) ఆదేశముల ప్రకారం ప్రత్యేకముగా లజపత రాయి పై దెబ్బలు కురిపించబడినవి. గాయపడియుండియూ లజపత రాయి నిరసన కార్యక్రమములు కొనసాగించి తదుపరికూడా బహిరంగ సభలలో ప్రసంగములుచేసి, సైమన్ గోబ్యాక్ (Simon go back) అను నినాదమును మారుమ్రోగించి లాఠీదెబ్బల ప్రభావమునుండి కోలుకొనలేక జబ్బుపడి చివరగా 1928 నవంబరు 17 తేదీన మరణించాడు. సైమన్ కమీషన్ భారతదేశ పర్యటన బ్రిటిష్ ఇండియా చరిత్రలోనూ, భారతదేశ స్వాతంత్ర్యపోరాట చరిత్రాంశములోనూ ఒక ప్రముఖమైన ఘటన.

బహిష్కరోద్యమ ఫలితములు

మార్చు


(1) బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పరిపాలన తిరస్కరించుతూ భారతదేశానికి స్వపరిపాలిత రాజ్యాంగము కావలయునన్న ఆంకాంకక్ష ఏక కంఠముతో వెల్లడించటమైనది

(2) వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభువులతో భేటీ

(3) సైమన్ కమీషన్ నియామకము, పర్యటన పట్ల భారతీయులలో కలిగిన తీవ్ర విరోధమైన అసమ్మతి, ఆందోళన పరిస్థితులు వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభువులకు తెలిపి దేశములో కొంత శాంతి కలుగచేసి ప్రజల అపోహలను పోగొట్టుటకు, కనీసము కొందమంది భారతీయ ప్రజానాయకులనైననూ సంతృప్తి పరచుట అవసరమని బ్రిటిష్ ప్రభువులకు నచ్చచెప్పి వారి సమ్మతితో 1929 అక్టోబరు 31 వ తేదీన చేసిన ప్రకటన ఉల్లెఖన " 1917 వ సంవత్సరమున చేయబడిన ప్రకటనను బట్టి భరతఖండ రాజ్యాంగాభివృధ్దియొక్క సహజపరిణామము అధినివేశరాజ్యాంగ పధ్దతియేయని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారి అభిప్రాయము....... ఈ ఉద్దేశ్యము పరిపూర్ణముగా నెరవేరుటకు భరతఖండములోని సంస్థానములు కూడా రాజ్యాంగమున స్థానమొసగి ఒక విదమగు అఖిలభారత-ఐక్యత కోరువారి ఆశకు భంగము లేకుండా ప్రస్తుతపు రాజ్యాంగవిధానమునందలి వ్యవహారములు జరుగువలయుననియు, ఇందుకొరకు సైమన్ సంఘము వారు రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన తమ నివేదికను ప్రకటించిన పిదప పైన చెప్పబడిన సంగతులు చర్చించి యాలోచించుటకును బ్రిటిషు-భారత రాజ్యాంగ సమస్యయు, అఖిల భారత రాజ్యాంగసమస్యయు చర్చించుటకు బ్రిటిషురాజ్యమునందలి ప్రతినిధిలును రౌండుటేబిలుసభ కాహ్వానింపబ డుదరనియు ఈ మార్గమున చర్చించపబడిన సమస్యలలో నాసభవారి ఆలోచనలయందు అధిక సంఖ్యాకులసమ్మతినిబడసిన విషయములు శాసనము చేయగలందులకు పార్లమెంటు వారికి నివేదింబడును".[1]
(4) వైస్ రాయి లార్డ్ ఇర్విన్ యొక్క పరిపాల లోని తొలిరోజులలోని నిరంకుశత్వము తగ్గుముఖం పడి చివరి కార్యాచరణముగా 1931 సంవత్సరములో గాంధీజీతో రాజీకి వచ్చి గాంధీ-ఇర్విన్ సంధి జరుగుట సైమన్ కమీషన్ బహిష్కరోణద్యమ ఫలితమే అనవచ్చు
(5) ఏడు సంవత్సరముల తరువాత 1935 సంవత్సరములో శాసించిన ఇండియా రాజ్యాంగ చట్టము నిర్మించుటకు తోడ్పడినది. చూడు 1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము

వెలువడిన సైమన్ కమీషన్ నివేదికలోని చరిత్రాంశములు

మార్చు

మే నెల,1930 సంవత్సరమున ప్రచురించబడిన సైమన్ కమీషన్ లో సూచించినట్టి రాజ్యాంగ సంస్కరణలు 1919 సంవత్సరపు రాజ్యాంగ చట్టమునకు ( మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ) సవరణలు
(1) 1919 చట్టములో ప్రతిపాదించి అమలు చేసిన ద్వంద పరిపాలనా పధ్దతి (DYARCHY) ని రద్దుచేయుట
(2) వైస్రాయికి ఇవ్వబడిన విశిష్టాధికారములు యధాతధమగా కొనసాగుట
(3) మూడవ బర్మా యుద్ధానంతరం అనగా 1885 సంవత్సరమునుండి బ్రిటిష్ ఇండియాలో భాగముగా చూపబడుచున్న బర్మాను బ్రిటిష్ సామ్రాజ్యములో వలసరాజ్యమైన వేరు దేశముగా చూపబడవలెనని సూచించ బడింది.
(4) ధేశ పరిపాలనను కేంద్రీకృతపరిచకుండా ఎన్నికలద్వారా ఎన్నుకునబడిన సభ్యులతో ఫెడరల్ శాసన సంఘమును (Central or Federal Assembly) నియమించవలెననియూ (ఇప్పటి లోక్ సభలాగ) అట్టి సంఘమునకు చేదోడుగా రాష్ట్ర శాసన సభల (Provincial Councils) నుండి ఏరిన సభ్యులతో కూడిన ఉపసంఘము (State Council) (ఇప్పటి రాజ్య సభలాగ). 1909లో రాజ్యాంగ చట్టము ద్వారా ( చూడు మింటో-మార్లే సంస్కరణలు) రాష్ట్ర శాసన సభలు నెలకొల్పబడినవి.

బయటి లింకులు

మార్చు


http://www.gktoday.in/simon-commission-1927/
https://en.wikipedia.org/wiki/Simon_Commission
http://www.gktoday.in/recommendations-of-simon-commission-1930/

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "The British Rule in India" D.v. Siva Rao(1938) ఆంధ్ర గ్రందాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp402-408
  2. "Ethnonationalism in India" Edited by Sanjib Baruah(2012) Oxford India Paper Back pp243-252
  3. "the longest August" Dilip Hiro (2015) Nation Books pp43-44