నాగులవంచ వసంతరావు
నాగులవంచ వసంతరావు ఒక కవి, రచయిత. అతని బ్లాగులో అతను తనను గురించి వ్రాసుకొన్న పరిచయ విషయాలు ఇవి -
సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడు. 2004 ఫిబ్రవరి మాసంలో సద్భావనా స్రవంతి ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని రచించి ప్రచురించాడు. 60 ఆధ్యాత్మిక వ్యాసాలుగల ఈ పుస్తకం పలువురు ఆధ్యాత్మిక వేత్తల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ దిన పత్రికలో 12 ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.
చేతన సచివాలయ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో వరుసగా 2006, 2007 సంవత్సరాలలో పరానుకరణ జీవితం అనే కవితలకు జ్ఞాపికలు, శాలువాతో సత్కారం జరిగింది. సుగంధ సాహిత్య సౌరభాలు సంస్థ ఆధ్వర్యంలో 2007 మార్చి 19వ తేదీన నిర్వహింపబడిన ఉగాది కవి సమ్మేళనంలో జీవితం కవితకు సన్మానం, జ్ఞాపిక లభించాయి. 2007 సంవత్సరంలో రచించిన చైతన్య స్రవంతి (కవితా సంకలనం), నిత్య సత్యాలు (పద్య శతకం) పలువురి ఆధ్యాత్మిక వేత్తల, మేధావుల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.
- రచననుండి ఉదాహరణ
నవ యువకులార లేవండీ!
నవ యువకులార లేవండీ నడుంకట్టి నడవండీ భరతమాత భవిష్యత్తు మీ చేతిలొ గలదండీ
దేశ ప్రగతికోసం రథచక్రాలై తిరగండీ మాతృదేశ పురోగతికి సమిధలుగ మారండీ
కుళ్ళు రాజకీయాలు మనకసలే వద్దండీ కపట నాటకాలు మీరు మానుకుంటె ముద్దండీ
భరతదేశ భవిష్యత్తూ యువత మీద గలదన్న స్వామి వివేకానంద మాట సత్యంబని నమ్మండీ
తళుకు బెళుకు ఆకర్షణ మత్తులోబడి పోకండీ తాత్కాలిక ఆనందం అభివృద్దికి చేటండీ
దురలవాట్లన్నింటికి దూరంగా ఉండండీ బలహీనతలకు లోనైతే భవిష్యత్తు లేదండీ
వృత్తితో సంతృప్తి పడక ప్రవృత్తిని గాంచండీ ఇష్టమైన ప్రవృత్తిలొ అభీష్థం నెరవేర్చండీ
కష్టించి పనిచేసి కర్మయోగివి గమ్మురా కృషియందే అదృష్టం గలదని నువు నమ్మరా
ఉరకలెత్తు ఉత్సాహం ఉప్పొంగనీయరా ఆకసంబె నీ హద్దని నిరూపించి చూపరా
ఉదయించే సూర్యున్ని ఎవ్వరాప గలరురా యువతలోని ఉత్సాహం ఊరకుండిపోదురా
అంతులేని ఆర్ద్రతను గుండె నిండ నింపరా స్పందన కరువైన బ్రతుకు మోడు వృక్షమేనురా
సామాజిక స్పృహను బొంది చక్కగ నువు నడవరా సర్వ జనుల క్షేమంబును సతతం కాంక్షించరా
అద్భుతాలు సృస్థించి చరిత్రలో నిలవరా ఆకసాన దృవతారగ సతతం నువు వెలగరా