నారు నాగనార్య

(నారు నాగ నార్య నుండి దారిమార్పు చెందింది)

నారు నాగనార్య (జులై 3, 1903 - జనవరి 18, 1973) సాహితీవేత్త.

నారు నాగనార్య
Naarunaaganaarya.jpg
నారు నాగనార్య
జననంనారు నాగనార్య
జులై 3, 1903
కడప జిల్లా రైల్వే కోడూరుమండలం రాఘవరాజుపురం అగ్రహారం గ్రామం
మరణంజనవరి 18, 1973
ప్రసిద్ధిప్రముఖ కవి, పండితుడు
పదవి పేరువిద్వత్కవి, కవితాకళానిధి
మతంహిందూ
తండ్రినరసింహము
తల్లిసుబ్బమ్మ

జీవిత విశేషాలుసవరించు

నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు.

సాహిత్యసేవసవరించు

ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణమును మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించాడు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.

రచనలుసవరించు

 • వీరపూజ
 • శ్రీ పృథ్వీరాజవిజయము
 • తిలోత్తమాసాహసికము
 • మనువు పుట్టువు
 • మెచ్చులపచ్చ మ్రుచ్చిలి
 • శకుంతల
 • ఊర్వశి
 • వెన్నెల పెళ్ళి
 • రామకత
 • ఉషారాజ్ఞి
 • ధ్యానమాలిని
 • ప్రణయిని
 • శ్రీ రమణాభ్యుదయము
 • ఆర్యవాణి
 • తెలుగుతల్లి శతకము
 • సౌందర్యలహరి
 • శ్రీ మలయాళ సద్గురు దండకం
 • శ్రీ రమణానుగ్రహ స్తుతి
 • కేనోపనిషత్తు
 • యతిగీతం
 • శ్రీ హృదయాభ్యుదయము
 • శ్రీరామహృదయం
 • లక్ష్మణహృదయం
 • దేవయాని
 • కష్టజీవి
 • పరాధీన భారతం
 • సత్యాన్వేషి
 • ఉద్బోధ
 • వెన్నెలపెండ్లి
 • వసంతోదయం ...మొదలైనవి

రచనలనుండి ఉదాహరణలుసవరించు

పనిపాటు విడియూరు నాడుఁ దిరుగన్ బాల్వడ్డ బైరాగి పో
రనుతిండిన్ బ్రదుకంగలాడచటికాహా! వచ్చెనా! వచ్చి యే
మనిచెప్పెన్ మనయందగాఁడు బదులేమందించెఁగన్గీటి రు
క్మిణి యేమాడెను డాఁప కంతయును గూర్మింబల్కరాదే!చెలీ!
దాసానిరంగు చీరన్
బాసి, వెలఁది మడుఁగుఁగట్టి - పంచల సొమ్ముల్
వేసి, కయిదమ్మిఁదునుకలు
సేసి,చెలిన్ గొదుకు బ్రదుకుఁ - జిడిముడి పడుచున్
నీరున్నకాఱు మబ్బున
జేరిన రిక్కవలె 'సత్య'- చెలువంబఱిపం
చారించి యలుకగీమున
దూరెను సకులలుగఁ జేయుదురుగద! యిట్టుల్
-మెచ్చులపచ్చ మ్రుచ్చిలి (అచ్చతెలుగు పారిజాతాపహరణము)నుండి
వాగర్ధంబులవోలె నిర్వురొకటై వైరి ప్రకాండంబును
ద్వేగాకంపిత దేహవల్లరులరీతిన్ స్వప్రతాపక్రియా
వేగోదీర్ణబల ప్రభంజనతఁ గల్పింపన్ సముద్దిష్ట దీ
క్షాగర్వంబున లేళ్లపై నుఱుకువ్యాఘ్రంబుల్ వలెన్ దూఁకినన్
బలవన్నాగవరంబేన్
జవిచీమల చేతఁజిక్కిచచ్చినయటులీ
బలియుఁడు మాచే సిలుఁగుల
గలఁగఁడె యిపుడొంటి పాటు గదిసినకతనన్
అనియుప్పొంగుతలంపులన్ బెనఁగు మిథ్యాపౌరుషోద్రేక సం
జనిత క్రోధ విఘూర్ణనోత్థచటులోచ్ఛాయ క్రియన్ బ్రాఙ్మనో
జనితాఖండజయేప్సితార్థ ఫలమిచ్చాస్ఫూర్తి నర్థించి, మిం
చిన వేగంబున వీరుపైఁగవిసి నిస్త్రింశోగ్ర ధారాహతిన్
-వీరపూజనుండి
గుత్తపు పట్టుఱైకబిగి కుట్టు పటుక్కునఁ బిక్కటిల్లి స్వా
యత్తముఁ దప్పిపోఁబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు
వెత్తున నొత్తరించి వలపింపఁగవుంగిటనించి పల్లు కెం
పొత్తిలి మోవితేనెఁజవులూరఁగొనెన్ 'విధు'డా 'తిలోత్తమన్'
-తిలోత్తమాసాహసికమునుండి

బిరుదములుసవరించు

 • విద్వత్కవి
 • సత్కవి
 • ఆర్య
 • కవితాకళానిధి

బయటి లింకులుసవరించు

 • రాయలసీమ రచయితల చరిత్ర - మొదటిసంపుటి