నిర్మలానంద
నిర్మలానంద అనే పేరుతో తెలుగు సాహితీవేత్తగా చిరపరిచితుడైన ఇతని అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. ఆయన "ప్రజాసాహితి" మాసపత్రిక గౌరవ సంపాదకుడిగా, జనసాహితి సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు[1].
నిర్మలానంద | |
---|---|
జననం | ముప్పన మల్లేశ్వరరావు 1935 అక్టోబరు 20 |
మరణం | 2018 జూలై 24 | (వయసు 82)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్, రాజ్ , వాత్సాయనుడు |
వృత్తి | గౌరవ సంపాదకుడు, ప్రజాసాహితి |
జీవిత భాగస్వామి | రుక్మిణి |
పిల్లలు |
|
జీవిత విశేషాలు
మార్చుఆయనఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లిలో 1935, అక్టోబర్ 20వ తేదీన జన్మించారు. జాతీయోద్యమ ప్రభావం ఉన్న తండ్రి మల్లిఖార్జునుడు సలహాతో ఆయన హైస్కూల్ చదువు పూర్తయ్యే నాటికే హిందీలో పరీక్షలు పాసయ్యాడు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రయ్య పంతులు ఆయనని ఎంతో ప్రొత్సహించారు. స్వతాహాగా ఉన్న సాహిత్య పిపాస నిర్మలానందను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. హిందీ , ఒరియా, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. నిర్మలానంద వృత్తిరీత్యా రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రవృత్తి అయిన సాహిత్య రంగంలో తన ఆఖరి గడియలు వరకు కొనసాగారు. దాదాపు 67 ఏళ్లపాటు సాహిత్యరంగాన్ని వీడని వ్యక్తిత్వం ఆయనది.[1].
సాహిత్య కృషి
మార్చుహిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. తర్వాత అనకాపల్లిలో ఉండగానే నవ్వుల రాణి, బాలమిత్ర వంటి పత్రికల్లో చిన్న కథలు, కవితలు ప్రచురించబడినా 54 నుంచి ఆయన ఆప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. "తెలుగుదాసు", "విపుల్" విపుల్ చక్రవర్తి, రాజ్ కలంపేర్లతో కూడా రచనలు చేసినా నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠుడయ్యాడు. 1957లో ఉద్యోగ రీత్యా ఒడిషాలోని ఝార్సుగూడలో దాదాపు 18 ఏళ్లు ప్రవాస జీవితం గడపాడు. తెలుగు సాహిత్యాన్ని తెలుగేతర ప్రాంతాలకు చేరవేయాలని సంకల్పంతో 1958లో తెలుగు సాహిత్య ప్రచార సమితి అనే సంస్థ స్థాపించారు. చలం మొదలుకుని ఇనాటి ఖదీర్ బాబు వరకు వందలాది అలనాటి, ఈనాటి యువరచయితలు రాసిన కథలు, కవితలు, నాటికలను హిందీలోకి అనువాదం చేశారు.. దేశంలో ఎక్కడ సాహితీ సభలు, బుక్ ఎగ్జిబిషన్ జరిగినా హాజరయ్యేవారు. 1957 మొదలుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతటా విస్తృతంగా తిరిగారు. 1960ల్లో కాళోజీ నారాయణ రావు సోదరులు, భీమ్ సేన్ నిర్మల్ తో సాన్నిహిత్యంతో వరంగల్, హైదరాబాద్ లో జరిగే సాహిత్య సభలు,సమావేశాలకు తరచు తిరుగుతుండే వారు. 1970లో విశాఖలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి ఆహ్వన కమిటీలో సభ్యుడు. 1972లో ట్రాన్స్ ఫర్ మీద శృంగవరపు కోటకు వచ్చిన నిర్మలానంద 1979లో విజయనగరంలో జనసాహితి రెండో మహాసభలకు ఆహ్వానసంఘ సభ్యునిగా కృషి చేశాడు. ఆ సభల్లోనే ఆయన జనసాహితి సభ్యునిగా చేరాడు. 1981లో గుడివాడలో జరిగిన జనసాహితి 3వ మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరాడు. 1981 సెప్టెంబర్‌లో చైనా ప్రజారచయిత లూషన్ శతజయంతి సందర్భంగా ప్రజాసాహితి ప్రత్యేక సంచికను రూపుదిద్దటంలో ఆయన కృషి వుంది. మళ్లీ 1981లో ఒడిషాలోని కోరాపుట్ బదిలీ మీద వెళ్లాడు. 1991 వరకు పని చేసి మే 31న పదవీ విరమణ పొందాడు. అప్పటి నుంచి సాహిత్య సేవకే అంకితమయ్యాడు. ఆయన 18 ఏళ్లు ప్రజాసాహితి పత్రికకు వర్కింగ్ ఎడిటర్‌గా కొనసాగారు.[2]. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత మహా శ్వేతాదేవితో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు తెలుగు నుంచి చలం, శ్రీశ్రీ,రావి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పాలగుమ్మి పద్మరాజు, వి.రాజారామ్మోహన్ రావు, అల్లం శేషగిరి రావు, బలివాడ కాంతారావు, భాలగంగాధర్ తిలక్, కుందుర్తి, శేషేంద్ర శర్మ, శీలా వీర్రాజు, శివారెడ్డి, ఛాయరాజ్, శీలా సుభద్రా దేవీ, కొప్పుల భానుమూర్తి, ఖదీర్ బాబు రచనలను హిందీ, మలయాళం, సింధీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, మైథిలీ, డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింప చేశారు.. కేరళ నుంచి వెలువడే యుగ ప్రభాత్ పత్రికలో 1960లో అప్పటి పత్రిక ఎడిటర్ రవి వర్మ సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ఉగాది ప్రత్యేక సంచికలను హిందీలోకి తీసుకు వచ్చారు. హిందీతో సహా పలు భారతీయభాషల నుంచి వందలాది కథలను , కవితలు, వ్యాసాలు, నాటికలు తెలుగులోకి అనువదించారు. ఆల్ ఇండియా రేడియోలో కొన్ని నాటికలు, ఆయన రాసిన దాదాపు 50 లలిత గీతాలు బ్రాడ్ కాస్ట్ అయ్యాయి. ఆయన రచనలలో ముఖ్యమైనవి:
- ‘ఆగ్ ఉగల్తా హువా! ఆస్మాన్ కీ ఒర్ బఢతా హువా’ - (శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా కవితలకు హిందీ అనువాదం)
- ‘మేరే బీనా (కుందుర్తి కవితల అనువాదం)
- ‘లూషన్ వ్యక్తిత్వం- సాహిత్యం’ (సంపాదకత్వం)
- ‘నేను నేల కొరిగితే’ - (పాలస్తీనాపై కథలు, కథనాలు, కవితలు)
- ‘నా నెత్తురు వృథాకాదు’ - (భగత్ సింగ్ రచనల అనువాదం)
- ‘పాష్ కోసం.. (అమరుడు పంజాబ్ కవి అవతార్ సింగ్ పాష్ కవితలు)
- ‘విత్తనాలు (బెంగాలీ రచయిత్రీ మహాశ్వేతా దేవి కథల సంపుటి)
- ‘మన్యం వీరుని పోరు దారి’ - అల్లూరి సీతారామరాజుపై రాసిన వ్యాసాల సంపుటి.
- ‘శనిచరీ(బెంగాలీ రచయిత్రీ మహాశ్వేతా దేవి కథల అనువాదం)
- ‘తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళులు
- ‘విప్లవనారీ దుర్గాబాభీ
- ‘కలాల కవాతు (కవితా భారతీయం)
- ‘ఆజ్ కా సందర్భ్ బిల్ కుల్ (శీలా వీర్రాజు కవితలు)
మరణం
మార్చుఇతడు 2018, జూలై 24వ తేదీన హైదరాబాదులో తన 84వ యేట మరణించాడు.[1],[2].