నిష్కలంక్ మహాదేవ్ ఆలయం

నిష్కలంక్ మహాదేవ్ ఆలయం గుజరాత్ లోని భావ్‌నగర్ సమీపంలోని సముద్రం లోపల వున్న శివాలయం. సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనూ, నదీ తీరంలోను, సముద్రం తీరంలోను, వుంటాయి. కానీ ఈ ఆలయం సముద్రంలో ఉంది.[1]

నిష్కలంక్ మహా దేవ్ ఆలయం గుజరాత్ లోని భావ్ నగర్ కి 23 కిలో మీటర్ల దూరంలో, అరేబియా సముద్ర తీరంలో కొలియాక్ గ్రామం వున్నది. అక్కడ సముద్ర తీరంలోపల మూడు కిలోమీటర్ల దూరంలో వెలసింది. ఈ ఆలయంలోని శివుడిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునే వీలుండదు. ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ ఆలయం నుండి మూడు కిలో మీటర్ల ముందు వరకు ఉధృతమైన అలలు వచ్చేస్తాయి. దాంతో ఆ గుడి సముద్రంలో మునిగి పోతుంది. అప్పుడు గుడి ఆనవాళ్లు కూడ కనబడవు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడి బయటికి కనబడుతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికే భక్తులు సముద్ర తీరానికి వస్తారు.[2]

స్థల పురాణం

మార్చు

మహా భారత యుద్ధంలో పాండవులు గెలిచినా వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడిని శరణు కోరగా శ్రీకృష్ణుడు 'ఒక నల్లని ఆవుకు నల్లని జండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్లమని, ఎప్పుడైతే ఆ ఆవూ, జండా రెండు తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపం నుంచి ముక్తి లభిస్తుందని ' చెప్తాడు. ఆ మేరకు పాండవులు రోజులతరబడి ఆ ఆవు వెంట నడిచి వెళతారు. చివరికి కొలియాక్ గ్రామం సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరగానె ఆవు, జెండా తెల్లగా మారిపోతాయి. ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ఆ పంచ పాడవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. ఆనందంతో పాండవులు ఆ అయిదు లింగాలకుపూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ విధంగా పాండవులకు కళంకాలు తొలిగిపోగా ఆ ప్రదేశమే నిష్కలంక్ మహాదే వాలయంగా ప్రసిద్ధి పొందిందని పురాణ గాధ[3].

దైవ దర్శనం

మార్చు

ఉదయం పది గంటలకే భక్తులు సముద్ర తీరానికి వస్తారు. రానురాను అలల ఉదృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఓ స్తూపము, ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు వెళ్లి ఆ లింగాలకు పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, మహా శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. మరణించిన తమ పెద్దల అస్తికలను అక్కడ సముద్రంలో కలిపితే వారి అత్మ శాంతిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకోసం జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు[4].

వెళ్ళే మార్గం

మార్చు

సికింద్రాబాద్ నుండి వెళ్లే భావనగర్ ఎక్స్‌ప్రెస్ లో భావనగర్ చేరి అక్కడి నుండి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా కొలియాక్ వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. "ఈనాడు ఆదివారం 19 జనవరి, 2020".
  2. "NISHKALANK MAHADEV TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-02-02.
  3. "Nishkalank Mahadev Temple History | Nishkalank Mahadev Bhavnagar Gujarat". PavitraTour (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-18. Archived from the original on 2020-02-02. Retrieved 2020-02-02.
  4. "Nishkalank Mahadev Temple – The Miraculous Temple of Lord Shiva which Disappears only to Reappear !!". Gosthala (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-13. Retrieved 2020-02-02.