నూతి శంకరరావు

నూతి శంకరరావు (Nooti Shankar Rao) [1] ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి నాయకుల ప్రసంగాల వల్ల ప్రభావితుడైనాడు. టేక్మల్ లో ఆర్యసమాజ సమ్మేళనం జరిపించాడు. 1948 మార్చిలో అరెస్టు కాబడి విమోచనోద్యమం అనంతరం విడుదలైనాడు. 1951లో రెవెన్యూశాఖలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం పొంది పదోన్నతులు పొంది డిప్యూటి కలెక్టరుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు[2].

జననంసవరించు

నూతి శంకరరావు 1930, ఫిబ్రవరి 13న మెదక్ జిల్లా, టెక్మల్‌లో జన్మించాడు. అతను 1942లో కేశవ్‌ మెమోరియల్‌ పాఠశాలలో 5వతరగతి చదివేందుకు హైదరాబాదు వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 12 సంవత్సరాలు. ఉత్తరభారతదేశం నుంచి ఆర్యసమాజ ప్రచారకులు తరచుగా ఆ పాఠశాలకు వచ్చి దయానంద సరస్వతి ఉపన్యాసాలను బోధించేవారు. పండిత నరేంధ్ర జీ వంటి వారి ఉపన్యాసాలు అతని లాంటి ఎంతో మందిని ప్రభావితం చేశాయి. నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రతువులో ఆర్యసమాజ్‌ ముఖ్య పాత్ర పోషించింది. 1947 అక్టోబరులో స్వామి రామానంద తీర్థ హైదరాబాద్‌ను స్వతంత్య్ర భారతలో విలీనం చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు కోర్టులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు ఉత్తేజితులలైన కార్యకర్తలు బి. సత్యనారాయణరెడ్డి, బల్వంతరెడ్డి, మహదేవ్‌సింగ్‌తో పాటు బంద్‌కు పిలుపిచ్చారు.. 60మంది విద్యార్థులు కలిసి సుల్తాన్‌ బజార్‌లో నిత్యం 6నెలల పాటు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు.[3] ఈ సత్యగ్రహ కార్యక్రమాలు చేసిన ఆ 6నెలలు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లోనే అందరూ నివాసం ఉన్నారు. బయట ఉంటే పోలీసుల వారిని అనుమానిస్తారని భావించి, రాజా బహదూర్‌ వెంకటరామిరెడ్డిని కలిసి వారి వసతిగృహంలో ఉండేందుకు అనుమతి కోరారు. అందుకు అంగీకరించిన అతను " మీ కార్యక్రమాలు మీరు చేయండి కానీ, పోలీసులకు మాత్రం నా పేరు చెప్పకండి" అని నవ్వుతూ అన్నాడు. ప్రతి రోజూ నిరసన ర్యాలీలు, నినాదాలతో సుల్తాన్‌బజార్‌ మారుమోగుతుండేది. పోలీసులకు దొరక్కుండా వారు చేసిన కార్యక్రమ సమాచారాన్ని సికింద్రాబాద్‌లోని డెక్కన్‌క్రానికల్‌ ఆంగ్ల పత్రిక కార్యాలయానికి అందించేందుకు రాత్రి 8గంటల ప్రాంతంలో రోజుకొకరు చొప్పున మారువేషాల్లో వెళ్లేవారు. అలా అతకసారి యాచకుడి వేషంలో వెళ్లాడు.

ప్రభాత భేరిసవరించు

1948, మార్చి8న అబిడ్స్‌ నుంచి సుల్తాన్‌ బజార్‌ వరకు ప్రభాత భేరి పేరుతో 200 మంది విద్యార్థులు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సుల్తాన్‌బజార్‌ చేరేసరికి ఆ సంఖ్య 500మందికి చేరింది. అది చూసిన పోలీసులు వెంటనే ఫోర్స్‌ను దింపి, 200మంది విద్యార్థులను అరెస్టు చేశారు. చివరకు 21మందిని మాత్రం జైలుకుపంపారు. వారిలో శంకరరావు ఒకడు. వారిని అరెస్టు చేసిన రోజు సామాన్య ప్రజలు కోపోద్రేకులై ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. దాంతో ఆ కేసులు కూడా వారిపై బనాయించి జైలు శిక్ష విధించారు. జైలులోకూడా వారంతా కలిసి ‘‘పయామె నౌ’’ పేరుతో 100 పేజీల రాతప్రతిలో 3నెలలపాటు ఉర్థూ మాస పత్రికను తీసుకొచ్చారు.

మూలాలుసవరించు

  1. మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, 2007, పేజీ 151
  2. "చరిత్రలో ఈరోజు :13-02-2020 న ఏం జరిగిందో తెలుసా..? - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-06.
  3. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.