మెదక్ జిల్లా

తెలంగాణా రాష్ట్రానికి చెందిన జిల్లా

మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1] మెదక్‌ పట్టణం హైదరాబాదుకు 100 కి మీ ల దూరంలో ఉంది. మెదక్ జిల్లాకు ముఖ్యపట్టణం మెదక్ పట్టణం.

  ?మెదక్
తెలంగాణ • భారతదేశం
View of మెదక్, India
View of మెదక్, India
అక్షాంశరేఖాంశాలు: 18°02′N 78°16′E / 18.03°N 78.27°E / 18.03; 78.27
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 9,699 కి.మీ² (3,745 చ.మై)
ముఖ్య పట్టణం మెదక్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
30,31,877 (2011 నాటికి)
• 313/కి.మీ² (811/చ.మై)
• 1524187
• 1507690
• 53.24(2001)
• 65.52
• 40.68
పటం
మెదక్ జిల్లా

జనాభా లెక్కలు

మార్చు

1981 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 18,07,139, స్త్రీ, పురుషుల నిష్పత్తి 98:100, అక్షరాస్యత 21.38 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని 1985) 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 30,31,877. జనసాంద్రత 313/కి.మీ² (811/చ.మై), పురుషులు 15,24,187, స్త్రీలు 15,07,690. 2001 భారతీయ జనాభా గణనను అనుసరించి అక్షరాస్యత 66 %. పురుషుల అక్షరాస్యత 74%. స్త్రీల అక్షరాస్యత 57%. జనాభాలో 6 సంవత్సరాలకు దిగువన ఉన్న వారి శాతం 13%.

చరిత్ర

మార్చు

పూర్వం సిద్దాపూర్‌ అని పిలువబడే నేటి మెదక్, కాకతీయుల కాలంలో ఉచ్ఛస్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్ లో ఉంది. మెతుకుసీమగా తరువాతి కాలంలో పిలువబడేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో, కృష్ణానది దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని, ఐతే హైదరాబాద్ నగరం దాటిన తరువాత నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.[2]

జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు

మార్చు

భౌగోళిక స్వరూపం

మార్చు
 

మెదక్ జిల్లాను భౌగోళికంగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు 46 రెవెన్యూ మండలాలుగా విభజించారు.[3].

పూర్వపు 46 మండలాలతో ఉన్న మెదక్ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→

మెదక్ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలు

మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 47 పాత మండలాల నుండి 19 మండలాలుతో సంగారెడ్డి, 13 మండలాలుతో సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పడగా,15 పాత మండలాలుతో మెదక్ జిల్లాను పునర్య్వస్థీకరించారు. అధికారికంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు

మార్చు

సిద్దిపేట జిల్లాలో చేరిన మండలాలు

మార్చు

సంగారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు

మార్చు

పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన 19 పాత మండలాలతో సంగారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 7 మండలాలు ఏర్పడినవి.[4]

మెదక్ జిల్లా ప్రస్తుత మండలాలు

మార్చు

పునర్య్వస్థీకరణ తరువాత పాత మండలాలు 15 కాగా,మెదక్ జిల్లాల గ్రామాల నుండి వ.సంఖ్య16 నుండి 20 వరకు గలవి 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.[5] 21 సంఖ్య గల మాసాయిపేట మండలం 2020 డిసెంబరులో ఏర్పడింది.

 • గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
 • గమనిక:* చివరి మాసాయిపేట 2020 డిసెంబరులో ఎల్దుర్తి మండలం లోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలు మొత్తం 9 గ్రామాలుతో కొత్తగా మండలంగా ఏర్పడింది.[6]

రవాణా వ్వవస్థ

మార్చు
రోడ్డు రవాణా

మెదక్ జిల్లా గుండా 2 జాతీయ రహదారులు వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తర-దక్షిణముగా వెళ్ళుచుండగా, 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా పోవుచున్నది. ఇవే కాకుండా సంగారెడ్డి-నాందేడ్ రహదారి, హైదరాబాదు-కరీంనగర్ రహదారి, మెదక్-నిజామాబాదు రహదారి, మెదక్ - సిద్ధిపేట్ రహదారి జిల్లా గుండా వెళ్ళు ప్రధాన రహదారులు.

రైలురవాణా

జిల్లాలో మొట్టమొదటిసారిగా 1886లో రైలుమార్గము వేయబడింది.[7] సికింద్రాబాదు నుండి వాడి వరకు వేయబడిన రైలుమార్గము జిల్లాలో దక్షిణ ఆగ్నేయములో కొంతదూరం జిల్లా నుండి పోవుచున్నది. ఇది కాకుండా వికారాబాదు-పర్లివైద్యనాథ్ మార్గం, కాచిగూడ-మన్మాడ్ మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది.

సంస్కృతి

మార్చు

మెదక్ జిల్లాలో చాలా రకాల మతాలవారు,కులాలవారు నివసిస్తున్నారు.

పశుపక్ష్యాదులు

మార్చు

హైదరాబాదుకు 115 కిలోమీటర్ల దూరంలో అలాగే మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో పోచారం అటవీ ప్రాంతం ఉంది. ఇది 20వ శతాబ్దం ఆరంభంలోనే అడవి జంతువుల శరణాలయంగా ప్రకటించబడింది. ఇది ఒకప్పుడు నిజాంకు ప్రియమైనా వేటప్రదేశం. పోచారం సరస్సు రూపుదిద్దుకున్న తరువాత దీనికి ఈ పేరు పెట్టబడింది. ఇది 9.12 కిలోమీటర్లదూరం విస్తరించబడి ఉంది. ఇది దట్టమైన వృక్షాలతో అలరారుతుంది. జంతు సంపద, వృక్షసంపదలతో అలరారుతున్న ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది బార్-హెడ్డెడ్ గూస్, బ్రహ్మిణీ బాతులు, ఓపెన్ బిల్డ్ స్ట్రోక్ వంటి విదేశీ పక్షులను ఆకర్షిస్తుంది. పరస్పరాధారిత పర్యావరణ వ్యవస్థకు పేరు పొందిన పర్యాటనకు ఇది ప్రసిద్ధి పొంది ఉంది. ఇక్కడ పర్యాటకులు జింకలు, దుప్పి జాతి మృగాలను సందర్శించ వచ్చు. వేసవి ఉష్ణోగ్రతలు 46°సెంటీగ్రేడ్, శీతాకాలం 6 ° సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ శరణాలయంలో చిరుత, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, గుంటనక్క, దక్షిణ ఎలుగుబంటు, కృష్ణజింక, నాలుగు కొమ్ముల దుప్పి వంటి జంతువులు ఉన్నాయి.

విద్యాసంస్థలు

మార్చు

మెదక్ జిల్లాలో ప్రముఖ విద్యాలయాలలో కొన్ని: ఐఐటి, హైదరాబాద్, ఎమ్ ఎన్ ఆర్ మెడికల్ కాలేజ్, ఎమ్ ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, పఠాన్ చెరువులోని గీతం (జి ఐ టి ఎ ఎమ్) విశ్వవిద్యాలయం, సుల్తంపుర్ లో జె.ఎన్.టి.యూ.

ఆకర్షణలు

మార్చు

కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ దుర్గం నిర్మించారు. వ్యూహాత్మకంగా ఒక గుట్టపైన నిర్మించిన ఈ దుర్గాన్ని మెతుకుదుర్గం అని ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అని అనేవారు. ముఖద్వారం వద్ద కాకతీయుల ముద్ర రెండు తలల గండభేరుండం ఠీవిగా ఉంటుంది. కాకతీయుల నిర్మాణ ధురీణతకు ఈ కోట తార్కాణంగా నిలుస్తుంది. కోటలోని ఒక బావినుండి గొట్టాల ద్వారా కోటలోకి నీటి సరఫరా జరిగేది. కోటకు మూడు ద్వారాలున్నాయి: "ప్రథమ ద్వారం", గర్జిస్తున్న రెండు సింహాల మూర్తులతో కూడిన "సింహ ద్వారం", ఇరువైపులా రెండు ఏనుగుల ప్రతిమలు కలిగిన "గజ ద్వారం". కోటలో 17 వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన శతఘ్నిని చూడవచ్చు. సహజ సిద్ధమైన భౌగోళిక రూపురేఖలను చక్కగా వినియోగించుకున్న ఈ కోటకు చుట్టు ఉన్న గండ శిలలు సహజ రక్షణగా నిలుస్తున్నాయి.

నిర్మాణ, శిల్పకళల చాతుర్యాన్ని ప్రదర్శించే దేవాలయాలెన్నో మెదక్ జిల్లాలో ఉన్నాయి. బొంతపల్లి లోని వీరభద్ర స్వామి దేవాలయం (హైదరాబాదు నుండి 25 కి మీ), జరసంగం, మంజీరా నది ఒడ్డున గల ఏడుపాయలు లోని కనకదుర్గ ఆలయం (మెదక్‌ నుండి 8 కి మీ), నాచగిరి లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (హైదరాబాదు నుండి 55 కి మీ), సిద్ధిపేట లోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం వీటిలో కొన్ని. సాంప్రదాయిక తెలంగాణా సంస్కృతికి మెదక్ జిల్లా నెలవు.

మెదక్‌ నుండి 60 కి మీ ల దూరంలో గల కొండాపూర్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు, బౌద్ధ నిర్మాణాలు బయట పడ్డాయి. పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్న సంగ్రహాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ 8,100 పురాతన వస్తువులు ప్రదర్శన కోసం ఉంచారు. శాతవాహనుల నాణేలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నాణేలను బట్టి కొండాపూర్‌ కూడా శాతవాహనులకు చెందిన 30 నగరాల్లో ఒకటిగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. బౌద్ధ స్థూపాలు, చైత్యాల అవశేషాలు కూడా కొండాపూర్‌లో లభించడంతో ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధమత కేంద్రంగా వెలిగిందని కూడా తెలుస్తోంది. రోమను చక్రవర్తి ఆగస్టస్‌కు చెందిన బంగారు నాణెం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఇంకా వెండి నాణేలు, పూసలు, మట్టి గాజులు, దంతం, రాగి, గాజుతో చేసిన అందమైన వస్తువులు ఉన్నాయి.

మెదక్‌కు 15 కి మీ ల దూరంలో గల పోచారం అడవి నిజాము నవాబు వేటకు వెళ్ళే స్థలం.20 వ శతాబ్దపు తొలినాళ్ళలో దీనిని అభయారణ్యముగా ప్రకటించారు. పోచారం చెరువు పేరిట ఏర్పడిన ఈ అడవి 9.12 చ.కి.మీ ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఎన్నో రకాల వృక్ష, జంతు జాతులకు నెలవైన ఈ అడవికి ఏటా రకరకాలైన పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న పర్యావరణ యాత్రా స్థలంలో ఐదు రకాల లేళ్ళను, దుప్పులను చూడవచ్చు. వేసవిలో 46 °C‌ దాటే ఉష్ణోగ్రత, శీతాకాలంలో 6 °C‌కు పడిపోతుంది. ఈ అభయారణ్యంలో చిరుతపులి, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, నక్క, ఎలుగుబంటి, సాంబార్‌ దుప్పి, నీల్గాయి, చింకారా, నాలుగు కొమ్ముల దుప్పి మొదలైన జంతువులు ఉన్నాయి.

ప్రకృతి ఆరాధకులకు మెదక్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాదుకు 35 కి మీ ల దూరంలో గల నర్సాపూర్ అడవి, గుమ్మడిదల, నర్సాపూర్‌ ల మధ్య 30 చ.కి.మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. మెదక్‌కు 75 కి.మీ ల దూరంలో ఉన్న మంజీర అభయారణ్యం 20 చకి మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ అడవి సగటు వెడల్పు 500 నుండి 800 మీటర్లు. మంజీర, సింగూరు ఆనకట్టల మధ్య విస్తరించి ఉన్న ఈ అడవి తొమ్మిది చిన్న చిన్న దీవుల సమాహరం. ఎన్నో రకాల వలస పక్షులు, బురద మొసళ్ళు మొదలైన వాటికి ఈ ప్రాంతం ఆలవాలం.

ఆలయాలు

మార్చు

మెదక్ జిల్లా శిల్పకళా సౌందర్యం ప్రతిబింబిస్తున్న పలు ఆలయాలకు పుట్టిల్లు. గణేశ్‌గడ్డకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్దనూరు, ప్రతిసంవత్సరం వైభవోపేతంగా జాతర జరుపుకుంటున్న సంగారెడ్డి వద్ద ఉన్న ఇస్మాయిల్ఖాన్ పేటలో ఉన్న సౌధమ్మమాతా ఆలయం, హైదరాబాదు నుండి 35 కిలోమీటర్లదూరంలో ఉన్న సప్తప్రాకారయుత భవాని మాతా ఆలయం, హైదరాబాదుకు ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం, మెదక్‌కు 45 కిలోమీటర్లదూరంలో ఉన్న సంగమేశ్వరాలయం, మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదీ తీరంలో ఉన్న కనకదుర్గాలయం, నాచగిరి ఆలయాలు, హైదరాబాదుకు 55 కిలోమీటర్లదూరంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం, సైదాపేటలో ఉన్న కోటిలింగేశ్వరాలయం, శ్రీసరస్వతిక్షేత్రం, సైదాపేటకు 22 కిలోమీటర్లదూరంలో కరీంనగర్ వెళ్ళే దారిలో ఉన్న అనంతసాగర్ ఆలయం, కర్ణంపల్లి వద్ద ఉన్న చేగుంట సాయిబాబా దేవస్థానం, కల్యాణవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవాలయం, స్వయంభూ మహాలక్ష్మీ దేవస్థానం, ఆంజనేయస్వామి ఆలయం ప్రముఖమైనవి. ఇంకా ఈ జిల్లాలో జోగిపేట పట్టణం ఆందోల్ మండలంలో చితుకుల పల్లెలో ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం, మంజీరా నదీతీరంలో రామయ్య చేత నిర్మించబడిన ప్రబలమైన శక్తి ఆలయం, జోగిపేటలో ఉన్న జోగినాధాలయం, అందొల్ గ్రామంలో కల శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,  హైదరాబాదుకు 60 కిలోమీటర్లదూరంలో కౌడిపల్లి మండలంలో ఉన్న తుణికిలో ఉన్న పోచమ్మ ఆలయం, పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డి గూడెంలో ఉన్న జగదాంబమాతా, కర్నల్పల్లి, చేగుంటమండలంలో సాయిబాబా ఆలయం, ప్రబల రేణుకా ఎల్లం దేవీ ఆలయం, కర్నల పాల్లి వాసుల చేత నిర్మింపబడిన ఆంజనేయ ఆలయం ఉన్నాయి.

సిద్ధిపేట సత్యనారాయణుని ఆలయం: సత్య దేవుని ఆలయం సిద్ధిపేటలో స్థానిక భక్తులు, దాతలు కలిసి విరాణాలు సేకరించి 2011 లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. గర్భగుడిచుట్టూ విష్ణుమూర్తి దశావతారల విగ్రహాలు చెక్కించారు. ఇందులోని అద్దాల మండపము ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రంగు రంగుల పాల రాతిని తెప్పించి అద్దాల మండపాన్ని నిర్మించారు.అదే విధంగా అనేక రంగుల అద్దాలను తెప్పించి అనేక డిజైన్ల ప్రకారం కోసి మండపానికి అతికించారు. మండపంలో పైభాగానికి అమర్చిన అష్టదళ పద్మం ఈ మండపానికే వన్నె తెచ్చింది. విద్యుత్తు దీపాల వెలుగులో ఈ అద్దాల మండపాన్ని చూడడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి వుత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరిలో గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయం సిద్ధిపేటకు తలమానికంగా వెలుగొందుతున్నది.

 • మెదక్ నుండి 12 కి.మీ. దూరంలో గల తిమ్మానగర్ గ్రామంలో గల హరి హర దేవాలయం, గట్టు మైసమ్మ తల్లి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినవి
 
ఆసియాలోనే పెద్ద చర్చిగా భావించబడుతున్న చర్చ్ ఆఫ్ ఇండియా కాథలిక్ చర్చ్
 • మెదక్ కేథలిక్ చర్చి - మెదక్ లోని మెదక్ కేథలిక్ చర్చి చర్చి ఒక అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఇది ఆసియా లోకెల్లా పెద్దదైన డయోసీసే కాక వాటికన్‌ నగరం తరువాత ప్రపంచంలోనే పెద్దది కూడా. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో వచ్చిన కరువు సందర్భంగా ఈ చర్చిని నిర్మించారు. ఛార్లెస్‌ వాకర్‌ పోస్నెట్‌ అనే ఆయన అప్పట్లో ఫాదర్ గా ఉండేవాడు. మూడేళ్ళపాటు పీడించిన కరువు బీభత్సానికి చలించిన ఆయన 1914లో ఈ చర్చిని నిర్మించ తలపెట్టాడు. కళాత్మకమైన ఈ చర్చి నిర్మాణం పూర్తి చెయ్యడానికి పదేళ్ళు పట్టింది. ఒకేసారి 5000 మంది పట్టగల అతి పెద్ద చర్చి ఇది. - ప్రపంచంలో రెండవ అతిపెద్ద చర్చి.నాలుగు గోపురాలతో 173 అడుగుల ఎత్తైన గోపురము కలిగి తెల్లని గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడిన చర్చి.
 • గోట్టంగోట - జహీరాబాదుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చారిత్రక ఆలయాలు, దట్టమైన అడవి, పెద్ద సరస్సు ఉన్న ప్రదేశం.
 • పోచారం అడవి & అడవిజంతువుల అభయారణ్యం - ఇది పలు అడవి జంతువుల పుట్టిల్లు, నిజాం నవాబుకు ప్రియమైన వేటప్రదేశం.
 • సీగూర్ ఆనకట్ట - సంగారెడ్డి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 • మెదక్ కోట - ఈ కోటను ముందుగా కాకతీయ రాజైన రుద్రుని చేత నిర్మించబడింది. కోటంతా ఇనుప పైపుల సహాయంతో నీటి వసతి కల్పించినట్లు ఈ కోట యాజమాన్యం సగర్వంగా చెప్పుకుంటున్నది.
 
మెదక్ కోట
 • నిజాం సాగర్ - నిజాం సాగర్ ఆనకట్ట - గోదావరీ నది ఉపనది అయిన మంజీరా నది మీద నిర్మించబడిన ఈ ఆనకట్ట మెదక్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సహజ అందాలకు ఈ ప్రదేశం పేరు పొందినది. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ ఆనకట్ట మీద వాహనాలు నడుపగలిగిన వసతి ఉంది.
 • మంజీరా అడవి & పక్షుల శరణాలయం - తొమ్మిది ద్వీపసమూహం కలిగిన ఈ శరణాలయం దేశీయ, విదేశీయ వలస పక్షులకు శరణాలయంగా ఉంది.
 • సరస్వతీ క్షేత్రము - అనంతసాగరం - సిద్దిపేట విభాగం. ఈ ఆలయం అష్టకల నరసింహ శర్మ (అష్టావధాని)చేత 1980 నుండి 1990 ల మధ్య నిర్మించబడింది.
 • వెలుగొండ తుంబురునాధ దేవాలయం - రాష్ట్రకూట రాజుల చేత నిర్మించబడింది. తుంబురునాధస్వామి (సంగీత దేవత) దేవాలయాలలో ఇది అతి పెద్దదిగా భావించబడుతుంది. స్త్రీలు పురుషులు నృత్యగానాలు చేస్తున్న అందమైన శిల్పాలకు ఇది ప్రసిద్ధి చెంది ఉంది. టెక్మల్ మండలంలోని ఎలుగొండలో ఉన్న ఈ ఆలయం మెదక్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 • ఏడుపాయల దుర్గా భవానీ గుడి - ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రా సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఈ ప్రదేశవర్ణన మహాభారతంలో ఉంది. అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఇక్కడ సర్పయాగం చేసినట్లు విశ్వసించబడుతుంది. మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది. ఏడు పాయల వద్ద నిర్వహించబడే జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు.

దేవాలయాలు

మార్చు
 • శ్రీ రంగనాధస్వామి ఆలయం- రంగంపేట గ్రామం.
 • నరసింహస్వామిఆలయం - జక్కన్నపేట.
 • సిద్ధ రామేశ్వర ఆలయం - మెదక్ పట్టణానికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉంది.

ప్రముఖ వ్యక్తులు

మార్చు

మెదక్ పార్లమెంటు సభ్యుల జాబితా

మార్చు
 
2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 3. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో మెదక్ జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
 4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 239, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
 5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
 6. "కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్‌ విడుదల". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-05-23.
 7. Andhra Pradesh District Gazetteers, Medak District, Published in 1976, Page 86

వెలుపలి లంకెలు

మార్చు