నృసింహ జయంతి
నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.
"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"
అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.
శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగా త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.
నృసింహ పురాణ కథ
మార్చుఇది ప్రహ్లాదుని పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంబంధించిన కథ.
అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి.