వస్త్రాలను నేయు పనివానిని నేతకారుడు అని సాలె అని సాలి వాడనిఅంటారు. వీరు చేయు వృత్తిని చేనేత అంటారు. మగ్గం అనే సాధనము ఉపయోగించి వీరు చీరలు, పంచెలు వంటివి నేస్తారు.గ్రామీణ జీవనోపాధికి వ్యవసాయం తరవాత చేనేత రంగం ప్రధాన ఆయువుపట్టు. రాష్ట్ర జనాభాలో దాదాపు 12శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పాలకుల నిరాదరణకు గురవుతున్న ఈ పరిశ్రమ ప్రస్తుతం తిరోగమనంలో పయనిస్తోంది. ఆదుకుంటామన్న హామీలు వట్టిమాటలు అవుతుండటంతో పొట్టకూటికోసం చేనేత కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలు అన్వేషించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అటకెక్కుతున్న మగ్గాలే దీనికి నిదర్శనం. తమిళనాడు తరవాత అధిక సంఖ్యలో చేనేతకారులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. పాలకులు తీసుకొంటున్న చర్యలవల్ల తమిళనాడులో చేనేతరంగ వైభవం వెలుగులీనుతోంది. నేతకారులకు ముడిసరకు సరఫరా చేయడమే కాక, నేసిన వస్త్రాన్ని సైతం అక్కడి ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తోంది. అలాంటి చొరవ మనరాష్ట్రంలో కొరవడటమే, చేనేత రంగం కొడిగట్టిన దీపం కావడానికి పకాటన్‌ మిల్లులు, మరమగ్గాల నిర్వాహకుల నుంచి చేనేత పరిశ్రమకు చావుదెబ్బలే తగులుతున్నాయి. నేత కార్మికుల రెక్కల కష్టాలపై 11 రకాల వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. మిల్లు యాజమానులు, మరమగ్గాల నిర్వాహకులు రాత్రికి రాత్రి యంత్రాలపై వాటిని తయారుచేస్తున్నారు. ఫలితంగా మగ్గంనేసే కార్మికులకు పనిలేకుండా పోతోందని ప్రణాళిక సంఘమే నిరుడు ఓ అధ్యయనంలో నిగ్గుతేల్చింది.