నాట్ గ్రిడ్

(నేషనల్ ఇంటిలిజెన్స్ గ్రిడ్ నుండి దారిమార్పు చెందింది)

నాట్ గ్రిడ్ (NAT GRID) అనేది భారత ఆర్థిక, రక్షణ, గూడచార తదితర రంగాలకు సంబంధించిన వివిధ కీలక నిఘా సంస్థల మధ్య సమాచారాన్ని మార్పిడి (sharing) చేసే ఒక సమీకృత ఇంటిలిజెన్స్ గ్రిడ్ ప్రాజెక్ట్. దీని ద్వారా ప్రతీ పౌరుడికి సంబంధించి 21 రకాల అంశాలకు చెందిన సమస్త వివరాల డేటా బేస్ సేకరించబడి కీలక ఇంటిలిజెన్స్ సంస్థలకు క్షణాలలో అందచేయబడుతుంది. తద్వారా దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్రవాద ముప్పు వాటిల్లే ప్రయత్నం జరగక ముందే, పొంచివున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఎదుర్కొనే విధంగా నాట్ గ్రిడ్ రూపొందించబడింది. ఒక విధంగా కౌంటర్ టెర్రరిజం నిర్వహించడానికి నిఘా సంస్థలకు తోడ్పడే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

ఆవశ్యకత

మార్చు

ప్రపంచ దేశాలలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్, నైజీరియా సిరియా దేశాల తరువాత ఉగ్రవాద చర్యల ప్రభావిత దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. మొత్తం 124 దేశాల జాబితా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారత్ కు 6వ స్థానంలో ఉంది. ఒకప్పుడు భారత్ దేశంలో తీవ్రవాద దాడులు పంజాబ్, కాశ్మీర్, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల వరకే పరిమితమై వుంటే నేడు ఉగ్రవాదుల దాడులు దేశం నలుమూలలకు, లోతట్టు ప్రాంతాలకు కూడా విస్తరించాయి.[1]

విచారణతో సంబంధం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా అనుమానితులను నిర్భందించే ప్రివెంటివ్ చట్టాలు (నాసా యాక్ట్–1980, టాడా యాక్ట్– (1985-95), పోటా యాక్ట్– (2002-04), కోకా యాక్ట్-1999 వంటి పదునైన చట్టాలు ఎన్నున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం లోని లోపాలను అదనుగా చేసుకొని విధాన లోపాల వైఫల్యంతో చెలరేగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు కట్టడి చేయడానికి దేశంలోని అన్ని కీలక నిఘా వర్గాలు మద్య మరింత సమన్వయం ఏర్పడాల్సినవసరం ఉంది.

ఉగ్రవాదుల దాడుల కీలక సమయంలోను, దాడులు జరగకుండానే ప్రమాదాన్ని ముందస్తుగానే పసిగట్టడంలో భారత దేశ నిఘా వ్యవస్థలు ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో), రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) తరుచుగా వైఫల్యం చెందుతున్నాయి. ముఖ్యంగా 2008 లో ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో వివిధ నిఘా వ్యవస్థల మధ్య జరుగుతున్న తీవ్ర సమన్వయలోపాన్ని సరిదిద్దాల్సినవసరం ఏర్పడింది.[1]

నేపద్యం

మార్చు

2008 లో 26/11 ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడితో మన దేశ నిఘా వ్యవస్థల ఘోర వైఫల్యం బయటకు వెల్లడైంది. ముంబై దాడులకు ముందుగా పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ లష్కర్ తీవ్రవాది డేవిడ్ హాడ్లీ అనేకసార్లు భారతదేశాన్ని సందర్శించాడు, చేయబోయే దాడులకు ముందస్తుగా రెక్కీని కూడా విజయవంతంగా నిర్వహించాడు, భారతదేశం నుండి తరుచుగా పాకిస్తాన్, పశ్చిమాసియా మీదుగా అమెరికాకు తిరుగు ప్రయాణాలు సాగించాడు. అనేకసార్లు ఆతను అసాధారణంగా సందర్శిస్తున్నా, అతని అనుమానాస్పద రాకపోకలను దేశీయ నిఘావర్గాలు ఏ దశలోనూ సందేహించకపోవడం, ఆరా తీయకపోవడం జరిగింది. ఫలితంగా ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడితో (26/11) దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

అనుమానాస్పద వ్యక్తులను, ప్రయాణాలను సందేహించక పోవడంలోను, ఉగ్రవాద దాడిని ముందే పసిగట్టడంలోను, కీలక సమాచారాన్ని సేకరించడంలోను, సేకరించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడంలోను, సమాచారాన్ని సమన్వయం చేయడంలోను నిఘా సంస్థల వైఫల్యం కొట్టచ్చినట్లు కనబడటంతో భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నో చర్చల తరువాత కేంద్ర హోం శాఖ ఆధీనంలో జాతీయ నిఘా గ్రిడ్ (నేషనల్ ఇంటిలిజెన్స్ గ్రిడ్ – NAT GRID) 2009 డిసెంబరు న ఏర్పాటు చేసింది.

నాట్ గ్రిడ్ నిర్మాణం

మార్చు

నాట్ గ్రిడ్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇతరులేవరైనా నాట్ గ్రిడ్ లోనికి జొరబడి డేటా బేస్ ని సంగ్రహించదానికి గాని, హాకింగ్ చేయడానికి గాని వీలులేని విధంగా, అత్యంత సురక్షితమైన, అభేద్యమైన విధంగా నాట్ గ్రిడ్ నిర్మాణం జరిగింది. ఈ గ్రిడ్ లోనికి అనుమతించబడిన సంస్థలు మాత్రమే ప్రవేశించగలవు. అదేవిధంగా పౌరుల సమాచారం దుర్వినియోగం కాకుండా అదీకృత లైసెన్స్ కలిగిన కీలక అధికారులు మాత్రమే నాట్ గ్రిడ్ ను ఉపయోగించేటట్లుగా రూపొందించారు. నాట్ గ్రిడ్ అనేది డేటాను నిల్వ (store) చేయదు. 21 డేటా బేస్ లనుండి డేటాను సేకరించి వివిధ నిఘా సంస్థల మధ్య అ డేటాను ట్రాన్సఫర్ మాత్రమే చేస్తుంది.

2011 లో 3400 కోట్ల రూపాయల నాట్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (C.C.S) క్లియరెన్స్ ఇచ్చింది. నాట్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణం 4 దశలలో అమలుచేయబడుతుంది. మొదటి దశలో 21 డేటా ప్రొవైడర్ ఆర్గనైజేషన్ ల నుండి సమాచారం సేకరించబడి 11 ఏజెన్సీల మద్య డేటా మార్పిడి జరుగుతుంది. తరువాత రాబోయే దశలలో మరిన్ని సంస్థలనుండి సమాచారాన్ని సేకరిస్తూ, రాష్ట్రాల ఏజెన్సీ ల మధ్య కూడా డేటా మార్పిడి జరుగుతుంది. నాట్ గ్రిడ్ తొలి సి.ఇ.ఓ.గా రఘురామన్ 01.12.2009 న నియమితులయ్యారు.

ఉగ్రవాద దాడుల సంఘటనలు జరిగినపుడు తీసుకొనే చర్యల కన్నా అసలు సంఘటనలు తలెత్తకుండా మొదట్లోనే పసిగట్టి నివారించే విధంగా, ఒక విధంగా కౌంటర్ టెర్రరిజం నిర్వహించడానికి తోడ్పడే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నాట్ గ్రిడ్ తొలి సి.ఇ.ఓ.అయిన రఘురామన్ మాటలలో చెప్పాలంటే “నాట్ గ్రిడ్ అనేది నిఘా సంస్థలకు తోడ్పడే ఒక నేపధ్య పరికరం (background tool) వంటిది. దిక్సూచి లాంటిది. నిఘా సంస్థలకు ఒక పరిస్థితిపై లేదా అనుమనితుని పై 360 డిగ్రీల కోణంలో సమగ్ర సమాచార దృశ్యాన్ని అందచేస్తుంది.“

నాట్ గ్రిడ్ ద్వారా ఉగ్రవాద సంబంధిత సమాచార మార్పిడి అత్యంత వేగంగా, చక్కని సమన్వయంతో దేశంలోని అన్ని కీలక నిఘా సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఉగ్రవాద చర్యలు ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడవచ్చు.

నాట్ గ్రిడ్ - సమాచార మార్పిడి

మార్చు

ఒక విధంగా నాట్ గ్రిడ్ వివిధ నిఘా సంస్థల మధ్య కీలక సమాచార మార్పిడికి ఒక సమన్వయ వేదికగా (ప్లాట్ ఫాం) పనిచేస్తుంది. దీని ద్వారా క్రింద పేర్కొన్న 11 సంస్థల మధ్య మాత్రమే ఉగ్రవాద సంబంధిత సమాచారం అత్యంత రహస్యంగా పకడ్బందీగా మార్పిడి జరుగుతుంది.

  1. ఇంటిలిజెన్స్ బ్యూరో (I.B)
  2. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (R.A.W)
  3. సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (C.B.I)
  4. డైరక్టరేట్ అఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (D.R.I)
  5. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (E.D)
  6. నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (N.I.A)
  7. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (N.C.B)
  8. ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (F.I.U)
  9. సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (C.B.D.T)
  10. సెంట్రల్ బోర్డు అఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (C.B.E.C)
  11. డైరక్టరేట్ జనరల్ అఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటిలిజెన్స్ (D.G.C.E.I)

అలాగే ప్రతీ పౌరుడికి సంబంధించిన 21 అంశాలకు చెందిన పూర్తి సమాచారం ( బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు ట్రాన్సఫర్ వివరాలు, మనీ ట్రాన్సఫర్ వివరాలు, సెబి లావాదేవీలు, రైల్వేస్, ఎయిర్ లైన్స్, ట్రావెల్ వివరాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, వీసా, ఇమ్మిగ్రేషన్ వివరాలు, టెలికాం ఫోన్ కాల్స్, నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCB), క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం (CCTNS) తదితర 21 అంశాలు) సేకరింఛి, వడపోసి డేటా బేస్ ను సిద్ధంచేస్తుంది. అనుమానిత వ్యక్తుల, సంస్థల కీలక సమాచారాన్ని క్షణాలలో అవసరమైన నిఘావర్గాలకు అందచేస్తుంది. ఈ కీలక సమాచారాన్ని అంది పుచ్చుకొన్న ఇంటిలిజెన్స్ వర్గాలు ఉగ్రవాద దాడులు జరగకుండా తదనుగుణమైన ముందస్తు సమీకృత చర్యలను చేపట్టి రాబోయే ప్రమాదాలను నివారించగలుగుతాయి.

అవరోధాలు

మార్చు

నాట్ గ్రిడ్ ప్రాజెక్ట్ 2009 లో ప్రారంభమై 6 సంవత్సరాలు కావస్తునప్పటికీ ఇంకా ఒడ్డున పడలేదు. ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు.ఆధార్ కార్డుల నుండి సమాచారాన్ని పొందడంలో ఉత్పన్నమైన న్యాయ వివాదాలు మొదలగునవి ప్రారంభంలో దీని ప్రగతిని మందగింప చేసాయి. అనేక రూపాలలో వున్న డేటాను ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఏకీకృతం చేయడంలో ఇబ్బందులు, సేకరించిన డేటా ఏకీకృతంగా లేకపోవడంవలన డేటా మార్పిడి లోను అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా 2015 నాటికి కూడా అనగా ప్రారంబించిన 6 సంవత్సరాలకు కూడా మొదటి దశలోనే నాట్ గ్రిడ్ ప్రాజెక్ట్ కొనసాగుతూ వస్తుంది.

విమర్శలు

మార్చు

నాట్ గ్రిడ్ అనేది డేటాను నిల్వ (store) చేయకపోయినప్పటికి, వివిధ డేటా బేస్ ల నుండి డేటాను ట్రాన్సఫర్ చేస్తుంది. ఏ దశలో నైనా సమాచారం అనుకోని పరిస్థితిలో లీక్ అయితే ఎలా అన్నది నాట్ గ్రిడ్ ప్రాజెక్ట్ మీద వస్తున్న ప్రధాన విమర్శ. ఇతరత్రా గానీ, హాకింగ్ ద్వారా గాని నాట్ గ్రిడ్ చెందిన అన్ని రక్షణ వలయాలు ఛేదించబడి వ్యక్తిగత గోప్యనీయమైన సమాచారం బయటకు వెల్లడి అయితే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. అమెరికాలో అతి చిన్న స్థాయి లోని సైనికుడైన అయిన బ్రాడ్లీ మాన్నింగ్ (వికిలీక్స్ సూత్రధారి) లాంటి వాడే అత్యున్నత సురక్షితంగా భావించబడే అమెరికన్ డిఫెన్సు నెట్ వర్క్ SIPRNET లోకి జోరబడ్డాడంటే, NAT GRID లాంటి వ్యవస్థ లోని డేటా ట్రాన్సఫర్ సురక్షితం కాకపోవచ్చు. అదే విధంగా ఐ.ఎం.ఎఫ్., యు.ఎస్. సెనేట్ వంటి అత్యున్నత సైబర్ సిస్టంలే హకర్స్ దాడికి గురవుతుంటే నాట్ గ్రిడ్ లోని డేటా ట్రాన్సఫర్ కి రక్షణ వుంటుందని పూర్తిగా విశ్వసించలేము.

అదేవిధంగా టెర్రరిజం, గ్లోబల్ టెర్రరిజంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నప్పుడు భారత పౌరులకు సంబంధించిన కీలక సమాచారం మార్పిడి పైన పేర్కొన్న 11 దేశీయ నిఘా సంస్థలకు మాత్రమే పరిమితమవుతుందా లేదా విదేశీ నిఘా సంస్థలకు క్రమేణా విస్తరించకుండా ఆగగాలదా అనేది మరో ప్రశ్న.

అయితే ఉగ్రవాద దాడులతో ప్రజల ఆలోచనలలో కూడా నెమ్మదిగా అయినా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తీవ్రవాదదాడులు పంజాబ్, కాశ్మీర్, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితంగా వుండేది. క్రమేణా ఉగ్రవాదుల దాడులు దేశం నలుమూలలకు, లోతట్టు ప్రాంతాలకు కూడా చెలరేగిపోవడంతో తదనుగుణంగా దేశ ప్రజల వైఖిరిలో మార్పు వచ్చింది. ఉగ్రవాదం సరిహద్దులనుండి లోతట్టు ప్రాంతాలకు విస్తరించడంతో వ్యక్తిగత సమాచార గోప్యత ముఖ్యమా లేదా దేశ భద్రత ముఖ్యమా అన్న వాదనలు క్రమేణా తగ్గిపోయాయి. వ్యక్తిగత సమాచార గోప్యతను పణంగా పెట్టి అయినా దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులేర్పడుతున్నాయి.

మొదటి దశలో రాష్ట్రాలకు నాట్ గ్రిడ్ సమాచారాన్ని మార్పిడి చేయబోవడం లేదు. కేవలం కేంద్ర నిఘా సంస్థల మధ్యనే సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే ఒకసారి నాట్ గ్రిడ్ పని చేయడం ప్రారంభం అయితే లేదా తరువాత దశలోనైనా రాష్ట్రాలకు కూడా సమాచారాన్ని మార్పిడి చేయడం జరుగుతుందని తెలియచేస్తున్నారు. ఏది ఏమైనా ఉగ్రవాద నిరోద చర్యలను క్షేత్ర స్థాయిలో సకాలంలో చేపట్టాల్సిన రాష్ట్ర పోలీస్ వంటి సంస్థలకు ముందస్తు సమాచార మార్పిడి నిరాకరించడం వలన ఉగ్రవాద నిరోదక చర్యలు నాట్ గ్రిడ్ ద్వారా అనుకున్నంత సఫలం కాలేవనే విమర్శ ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Global Terrorism Index 2020: The ten countries most impacted by terrorism". Vision of Humanity (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-27. Retrieved 2020-12-06.