పందిళ్లపల్లి శ్రీనివాస్

పందిళ్లపల్లి శ్రీనివాస్

పందిళ్లపల్లి శ్రీనివాస్ దేశంకోసం ప్రాణాలర్పించిన వీరుడు. ఇతను కర్ణాటక కేడర్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రముఖ స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

పందిళ్లపల్లి శ్రీనివాస్

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఇతని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం KAMARAJUPETA. 1954 సెప్టెంబరు 12న లోkamarajupeta loజన్మించాడు. తండ్రి పందిళ్ళపల్లి అనంతరావు. ప్రాథమిక విద్య రాజమహేంద్రవరం ఫిషర్స్ కాలనీ పాఠశాలలో చదివాడు. 1975-1977 కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, బంగారు పతకాన్ని పొందాడు.[1]

ఉద్యోగం

మార్చు

అటవీశాఖలో చేరిననాటి నుంచి వీరప్పన్ పట్టుబడి తప్పించుకోవడం దాకా

మార్చు

1978లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై 1979లో ఇండియన్ ఫారెస్టు సర్వీస్‌కు ఎంపికై 1981 నాటికి శిక్షణ పూర్తిచేసుకున్నాడు. 1981లో ఇండియన్ ఫారెస్టు సర్వీసులో కర్ణాటక కేడర్‌ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చామరాజనగర్‌లో అసిస్టెంట్ కన్సర్వేటివ్ ఆఫ్‌ ఫారెస్ట్‌గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. అదే ఏడాది చిక్ మంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్ నిరోధక బాధ్యతలతో డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్టుగా పదోన్నతి పొందాడు. అదనపు బాధ్యత అయిన అక్రమ రవాణా నిరోధాన్ని శ్రీనివాస్‌ చాలా శ్రద్ధతో నిర్వహించాడు. ఆ క్రమంలో అదే అడవుల్లో ఏనుగులను చంపి, ఏనుగు దంతాలను అక్రమ రవాణా చేస్తున్న వీరప్పన్‌ని ఎదుర్కొన్నాడు. నిజాయితీ గల అధికారిగా అటవీ గ్రామాల్లోని ప్రజల మన్ననలను చూరగొన్నారు. 1985లో వీరప్పన్‌ను శ్రీనివాస్‌ పట్టుకుని, మైసూరు జిల్లా బూదిగపాడు అటవీశాఖ అతిథిగృహంలో బంధించాడు. అయితే వీరప్పన్ చాకచక్యంగా నిర్బంధం నుంచి తప్పించుకుని పారపోయాడు.[1]

అమెరికా పర్యటన

మార్చు

1985లో నిర్బంధం నుంచి తప్పించుకున్న వీరప్పన్ తన అక్రమ రవాణా కార్యకలాపాలు మరింత జాగ్రత్తగా సాగించాడు. శ్రీనివాస్ తన ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తూ 1989లో అమెరికాకు పరిశోధన కోసం పర్యటించాడు. అడవుల్లో కార్చిచ్చు, కాలిపోతున్న అడవులను పరిరక్షించే చర్యలు వంటి అంశాలపై పరిశోధించి, నేర్చుకోవడానికి శ్రీనివాస్ అమెరికా పర్యటన చేశాడు. 1990లో అటవీశాఖ అభ్యర్థన మేరకు భారతదేశానికి హుటాహుటిన తిరిగివచ్చాడు.[1]

అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్సులో

మార్చు

అమెరికాలో స్టడీటూర్‌లో ఉన్న శ్రీనివాస్‌ను అక్రమరవాణాకు వ్యతిరేకంగా, వీరప్పన్‌ను పట్టుకునేందుకు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్సులో ప్రత్యేకాధికారిగా ఉండాలంటూ ప్రభుత్వం పిలిచింది. దాంతో అతను అమెరికా నుంచి భారతదేశానికి తిరిగివస్తూనే సొంతూరైన రాజమహేంద్రవరానికి కూడా వెళ్ళకుండా నేరుగా కర్ణాటక వెళ్ళి ఛార్జీ స్వీకరించాడు. ఏనుగు దంతాల అక్రమరవాణా తగ్గించి వీరప్పన్ గంధపు చెక్కల అక్రమరవాణాతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించే స్థితికి చేరుకున్నాడు.[1]

సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ

మార్చు

సాధారణంగా నేరస్తులను పట్టుకునే పద్ధతులకు భిన్నంగా గాంధేయవాద పద్ధతులైన - సహాయ నిరాకరణ, సత్వాన్వేషణ వంటివి శ్రీనివాస్ రూపొందించుకుని అమలుచేశాడు. ఆ క్రమంలో వీరప్పన్‌కు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజాదరణను దెబ్బతీయడానికి ప్రజలను చైతన్యవంతులను, అక్షరాస్యులను, సంపాదనాపరులను చేయడం వంటి పనులు చేశాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు నెలకొల్పడం, రహదారులు అభివృద్ధి చేయడం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం వంటి పనులు చేశాడు. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలో ప్రజల ఇష్టదైవం మారియమ్మన్ ఆలయాన్ని కట్టించాడు. ఈ ప్రయత్నాల వల్ల ప్రజల్లో వీరప్పన్ పట్ల గుడ్డి నమ్మకం సడలిపోసాగింది. లొంగిపోయిన నేరస్తులకు పునరావాసం కల్పించాడు.[1]

వెతుకులాట

మార్చు

అక్రమ రవాణా నివారించడానికి అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, పసిగట్టడానికి "వాచ్ టవర్లు" ఏర్పాటుచేశాడు. అటవీశాఖ ఉద్యోగులు నివసించడానికి, విధులకు అందుబాటులో ఉండడానికి చామరాజనగర్‌లో "ఫారెస్టు కాంప్లెక్స్" నిర్మించాడు. అనుచరులను దెబ్బతీయడం, వెతుకులాట పెంచడం, ఉద్యోగులను మరింత సమర్థంగా పనిచేసేలా చేయడం వంటి కారణాలు వీరప్పన్ అక్రమరవాణాను దెబ్బతీశాయి.[1]

వీరప్పన్ వ్యూహం, శ్రీనివాస్ హత్య

మార్చు

వీరప్పన్‌కి ఆయువుపట్టులాంటి ప్రజల్లో పలుకుబడి మీద సహా పలు అంశాలపై శ్రీనివాస్ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడంతో వీరప్పన్‌కి ఎటూ పాలుపోలేదు. శ్రీనివాస్‌ని దెబ్బతీయడానికి ఏ రకంగానూ వీలుచిక్కకపోవడంతో, మోసగించి దెబ్బతీయడానికి సిద్ధమయ్యాడు.

వీరప్పన్ సహచరుడు అర్జున్‌తో శ్రీనివాస్ ఒంటరిగా వస్తే లొంగిపోతానని వీరప్పన్ కబురు పంపాడు. శ్రీనివాస్ 1991 నవంబరు 10 తేదీ తెల్లవారుజామున గోపీనాథం సమీపంలోని నెమళ్ల కొండ వద్దకు శ్రీనివాస్ వెళ్లాడు. శ్రీనివాస్‌ను చూడగానే వీరప్పన్ ఇచ్చిన సూచనలు అందుకుని అతని అనుచరుడు పలాండీ తుపాకీతో కాల్చి చంపాడు. అతని వెన్నంటి వచ్చిన మరో ముగ్గురు అటవీ శాఖ ఉద్యోగులను కూడా దారుణంగా చంపేశారు.[1] శ్రీనివాస్ తలను మొండెం నుంచి వేరుచేసి వీరప్పన్ తీసుకుని అడవుల్లోకి వెళ్ళాడు.

స్మృతి

మార్చు

తమ అభిమానాన్ని చూరగొన్న శ్రీనివాస్ చిత్ర పటాన్ని దైవంతో సమానంగా మారియమ్మన్ గుడిలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. వీరప్పన్ ఆయనను హతమార్చిన చోట స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1992లో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్‌కు కీర్తి చక్ర (మరణానంతరం) అవార్డును ప్రకటించింది.

ఇతర విశేషాలు

మార్చు
  • ఈయన పేరున రాజమండ్రిలో ఒక వీధి ఉంది.
  • శ్రీనివాస్ జీవిత చరిత్రను దైర్య సాహసాలను కొత్తగా శిక్షణకు వచ్చే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ లకు భోదిస్తున్నారు.
  • శ్రీనివాస్ చనిపోయిన 10 వతేదీని జాతీయ అటవీశాఖాదికారుల అమరవీరుల సంస్మరణదినంగా ప్రభుత్వం ప్రకటించింది
  • శ్రీనివాస్ కుటుంబానికి అటవీ శాఖ మంత్రి విజయ శంకర్ బీడీఏ ఇంటి స్థలంతో పాటు శ్రీనివాస్ సర్వీసు కాలానికి చెల్లించాల్సిన రూ. 33 లక్షలను ఆయన తల్లిదండ్రులు అనంతరావు, జయలక్ష్మిలకు అందజేశారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 ఎం., సతీష్ చందర్ (20 November 1991). "కారడవిలో వీరగంధం". సుప్రభాతం.