పడమటి గాలి (నాటకం)

‘పడమటి గాలి తెలుగు నాటకరంగ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సాంఘిక నాటకాలలో ఒకటి. దీనిని పాటిబండ్ల ఆనందరావు రాసాడు. ఈ నాటకంలో ఆధునిక మానవ జీవనంలోని రుగ్మతలన్నీ చూపెట్టడం విశేషం. వాటిలో పనిచేసే టీచర్లు, ఆస్పత్రులు, వాటిని పట్టించుకోని డాక్టర్లు, రేషన్ షాపుల లోగుట్టులు, గ్రామాన్ని చుట్టేస్తున్న కేబుల్ వైర్లు, రాజకీయాలు, కులాల కొట్లాటలు, వర్గవైషమ్యాలు...వంటి ఎన్నో అప శృతులు ఉన్నాయి. ఇక పల్లెకు జీవనాధారమైన వ్యవసాయరంగంలో కొస్తే రచయిత స్పృసించని అంశమే లేదు. మట్టినే నమ్ముకొని తిండిగింజలే పండించాలన్న పాతతరం, వ్యాపార పంటల వెంట పరుగులెత్తే కొత్త తరం, రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే దురాశాపరులు, నకిలీ విత్తనాలూ పురుగుల మందులమ్మే డీలర్లు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఇన్సూరెన్స్ కోసం డమ్మీ గోదాములు తగలబెట్టే మోసగాళ్ళు, గిట్టుబాటుకాని ధరలకు పంటను తాకట్టు పెట్టుకొనే వ్యాపారులు, అబద్ధాలతో పబ్బం గడుపుకొనే దళారులు, ప్రకృతి వైపరీత్యాలు, రైతుని చుట్టుముట్టి ఆత్మహత్యల దాకా వెంటాడుతున్న అన్ని కోణాలూ శాస్త్రీయంగా, ప్రామాణికంగా చెప్పబడినాయి. భార్యాభర్తల అనుబంధాన్నీ, కన్నవాళ్లకూ బిడ్డలకూ మధ్య మమకారాన్ని ధ్వంసం చేస్తున్న ఆర్ధిక సంబంధాలూ, రైతుకూలీని రైతుకు దూరం చేస్తున్న విషాదాలూ, రైతుకు ప్రాణాధారమైన భూమిని తనకి కాకుండా చేయాలన్న బడాబాబుల కుట్రలూ, అనైతిక శారీరక సంబంధాలూ, కట్నాల కోసం వెంపర్లాటలూ, అమెరికా వ్యామోహాలూ, మనిషి జీవితాన్ని కలుషితం చేస్తున్న విషాదాలూ అడుగడుగునా కనిపిస్తాయి పడమటి గాలి నాటకంలో. మట్టీ మనిషి వున్నంతకాలం యీ నాటకం బ్రతికే వుంటుంది.

రచయిత పరిచయం

మార్చు

పాటిబండ్ల ఆనందరావు ప్రస్తుత ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు వీధి బడి నుండి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిపి, కారుమంచి గ్రామం ఉన్నత పాఠశాలలో స్కూలు ఫైనల్ వరకు చదివారు. కావలి జవహర్ భారతి కాలేజీలో పియుసి, ఆ తరువాత నెల్లూరు మూలాపేట లోని వేద సంస్కృత పాఠశాలలో తెలుగు విద్వాన్ కోర్సూ చదివారు. ఒంగోలులో ఏబీఎన్ విద్యాసంస్థల్లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేసి 2009వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశాడు.

నాటక శీర్షిక

మార్చు

పడమటిగాలి అంటే పడమటివైపు నుంచి వీచే గాలి అని అర్థం. భారతదేశంలోని చాలా భాగాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏప్రిల్ నెల రెండో భాగం నుండి జూన్ నెలలో ఋతుపవనాలు ప్రవేశించేదాకా ప్రతిరోజూ భయంకరమైన వడగాలులు వీస్తాయి. వాటినే తెలుగులో పడమటి గాలులంటారు. అవి సామాన్యమైనవి కావు. రాకాశిగాలులు. మరీ కొండలకు తూర్పువైపున వున్న ప్రాంతాల్లో చూడాలి. ముందే చండప్రచండంగా మండిపోతున్న ఎండలు. ఆ పైన యీవడగాల్పులు. అవి వాతావరణంలో వున్న తేమనంతా ఆవిరి చేస్తాయి. చెట్లలో ఆకులు లేకుండా రాల్చి ఊడ్చేస్తాయి. నేలలో తడి లేకుండా పీల్చేస్తాయి.

ఈ నాటకంలోని యితివృత్తానికి మూలకారణం, భారతదేశానికి పడమటి వైపున, ఎక్కడో వేలమైళ్ళ దూరంలో సముద్రాలకవతల వొక వ్యాపారవేత్త మెదడులో మెరిసిన ఆలోచన – ఇక్కడో బహుళజాతి కంపెనీ స్థాపించాలని. ఆయాలోచన మహోధృత మారుతంలా మారి దేశ, రాష్ట్ర రాజధానులలోని స్వార్థ రాజకీయ పెద్దల మస్తిష్కాలను తొలిచి, పట్టణాలను కబళించి, పల్లెపైకి పంజా విసిరింది. మనుషుల్లోని మంచినీ, మానవత్వాన్నీ ఆవిరిచేసేసింది. ప్రేమానురాగాల్నీ, నీతినియమాల్నీ, పరువు మర్యాదల్నీ ఎండగట్టింది. న్యాయధర్మాలను ఎండుటాకుల్లా రాల్చి వూడ్చేసింది.

అందుకే రచయిత యీ నాటకానికి ‘పడమటి గాలి‘ అనే పేరు పెట్టాడు. మామూలుగా ప్రతి సంవత్సరము పధ్ధతి ప్రకారము వీచే పడమటి గాలి ప్రమాదం నుండి బయటపడవచ్చునేమో గాని, ఎప్పుడొస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలియని పాశ్చాత్య దేశాలనుండి వీచే ఆ పడమటి వడగాలి నుండి తప్పించుకోవడం వెనుకబడిన, అభివృద్ధి చెందని దేశాలలోని జనసామాన్యానికి సాధ్యమయ్యే పని కాదు.

ఇతివృత్తమూ, దానికి తగ్గ పేరు, నాందీ ప్రస్థావన లోనే మొత్తం నాటకసారాంశం వివరించడం మహాద్భుతం.

ఇతివృత్తం

మార్చు

పడమటి గాలి నాటకం ఒక  కథ కాదు. అది నడుస్తున్న చరిత్ర. చరిత్ర అంటే జరిగిపోయిందీ కాదు. దాన్ని నడిచిన, నడుస్తున్న, నడువ బోయే చరిత్ర అనాలి. అందులో ఉన్నది కథ కాదు. వాస్తవం. అది ఒక పల్లెటూరి వాస్తవ జీవన చిత్రణ. ప్రధాన కథ, ఉప కథ, ప్రధాన పాత్రలు, దుష్ట పాత్రలు, నీచ పాత్రలూ అంటూ ఏవీ లేవు. పేర్లూ, సంఘటనలూ పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని ఇతివృత్తం అనే చట్రంలో బంధించ లేము.

1990 దశకం మొదటి రోజుల్లో సోవియట్ యూనియన్ పతనమైపోయింది. దాంతో ప్రపంచీకరణా ఆర్థిక సరళీకరణా ప్రారంభమైనాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ తమతమ దేశాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచాయి. ప్రతి రంగంలోనూ ప్రైవేటు సంస్థలు వేళ్లూనుకున్నాయి. ప్రపంచమంతా ఒక కుగ్రామమై పోయింది. బహుళజాతి కంపెనీలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. గ్రామ గ్రామానికీ దళారులు తయారయ్యారు. ప్రభుత్వాల మీద బహుళ జాతి కంపెనీల ఆధిపత్యం ప్రారంభమైంది. పరిశ్రమలు స్థాపించడానికి రెట్టింపు ధర ఆశ చూపి నయాన్నో భయాన్నో  రైతుల పొలాలు లాక్కోవడం జరిగింది. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలు పెరిగాయ్. సంపద పెరిగింది. మనుషుల అవసరాలు పెరిగాయి. అంతకు ముందు లేని అలవాట్లు పెరిగాయి. డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చెయ్యొచ్చు అన్న ఆలోచన పెరిగింది. మానవ సంబంధాలూ ప్రేమానురాగాలూ అడుగంటిపోయాయి. రౌడీలూ, ప్రభుత్వాధికారులూ, రాజకీయ నాయకులూ  ప్రైవేటు కంపెనీల తొత్తులుగా, మధ్యవర్తులుగా మారిపోయారు. ప్రజలకు సంబంధించిన వ్యవస్థలన్నీ ధ్వంసమై పోయాయి. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీలు మృగ్యమై పోయాయి. భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు.

కథాంశం

మార్చు

ఓ బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వో యాభై యెకరాల భూమి అవసరమౌతుంది. ఆ వూళ్ళో పైవర్గాల ఏజెంట్ గా ఆ భూమిని కొనిపెట్టే పనికి పూనుకుంటాడు  ఆ వూరి మోతుబరి అంజయ్య. దళారి మాయోడు రంగం మీదికొస్తాడు.

ఫ్యాక్టరీ యెదురుగా పెద్ద టౌన్ షిప్ ఏర్పడుతుందని పుకారు. పనికిరాని చవిటి భూముల అమ్మకాలూ, కొనుగోళ్ళూ వూపందుకున్నాయ్. అమ్మినవాళ్ళు ఆస్తిపరులవుతున్నారు . కలవగూడని వాళ్ళు కలుస్తూన్నారు. విడిపోకూడని వాళ్ళు విడిపోతున్నారు. మాయోడు మెట్టు మెట్టుగా పైకెక్కుతున్నాడు.

ఆ యాభైయెకరాల నడుమ నాలుగెకరాల భూమున్న సన్నకారు రైతు రాంకోటు. మట్టితోనూ చెట్టుతోనూ సజీవ సంబంధన్నేర్పర్చుకున్నది అతని కుటుంబం. రాంకోటు ప్రాణంగా చూసుకొనే ఆ భూమి యిప్పుడు అమ్మబడాలీ, కొనబడాలి-- మాయోడి కమీషన్ కోసం, అంజయ్య కాంట్రాక్టు కోసం, పైవాళ్ళ ప్రయోజనం కోసం. రాంకోటు చుట్టూ పద్మవ్యూహం పన్నుతాడు మాయోడు.

ధాన్యపు గింజలే పండిచాలనుకున్న రాంకోటు అప్పుల వూబిలోకూరుకుపోతాడు . ‘ఈజీమనీ’ ఎరలో చిక్కిన రాంకోటు కొడుకు రాంపండు పెళ్లి విషయంలో తండ్రిని యెదిరిస్తాడు. రాజీపడని రాంకోటు ఎద్దుల్ని పోగొట్టుకుంటాడు. ఇల్లమ్ముకుంటాడు. చివరకు చేలోనే కాపురం పెడతాడు. కట్నం కోసం, అమెరికా వ్యామోహంలో వున్న హైమని పెళ్ళాడతాడు రాంపండు. మాయోడి మాటలు నమ్మి ‘’స్పీడ్ మనీ’ కోసం పరుగులు దీసి చిక్కుల్లో యిరుక్కుపోతాడు.

 బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ కట్టే ఆలోచనని మానుకుంటుంది. ఈ మలుపుని కూడా స్వప్రయోజనానికి వాడుకుంటాడు అంజయ్య. మళ్ళీ  మాయోడి వుచ్చులో పడిన రాంపండు తమ భూమిని అమ్మేందుకు అంగీకరించని తండ్రిని అడ్డు తొలగించుకొనే ప్రయత్నం చేస్తాడు. చివరికి డబ్బు వున్మాదం తలకెక్కి మతిస్థిమితం కోల్పోతాడు.

రాంకోటుకి నాలుగు వైపులా వుచ్చులు బిగిస్తాడు మాయోడు. తెల్లవారితే భూమి రాంకోటుకి దక్కని పరిస్థితి వస్తుంది. తాను బ్రతికుండగా భూమి పరాధీనం కాగూడ దనుకుంటాడు. ఆ గడ్డ మీదనే ఆత్మత్యాగానికి పూనుకుంటాడు.

ఆ క్షణంలో... నిండు చూలాలైన కోడలు హైమ నొప్పులతో బాధపడుతూ అక్కడికొస్తుంది. ఆ గడ్డమీదే ప్రసవించి మగబిడ్డను రాంకోటు చేతుల్లో పెడుతుంది. ‘ఆ పసికందుని బ్రతికించాలం’టూ రాంకోటు కి కర్తవ్యాన్ని బోధపరుస్తుంది భార్య లచ్చిందేవి. మనవణ్ణి గుండెలకేసి హత్తుకుంటాడు రాంకోటు. తన చారెడు చెక్కను తనకు కాకుండా ఎవరు చేస్తారో చూస్తానని మొండికేసుకుని “మల్లీ మట్టిని మొలిపిస్తానం’టూ విత్తనాలు పిడికిట్లోకి తీసుకుంటాడు.

సూర్యాస్తమయంతో ప్రారంభమైన నాటకం సూర్యోదయంతో అంతమవుతుంది.

నాటకీకరణ

మార్చు

ఎంచుకున్న కథ లేక ఇతివృత్తానికి సంబంధించిన పాత్రలను ఎన్నుకుని, సన్నివేశాలను కల్పించుకొని, సంభాషణల ద్వారా పాఠకులకూ, ప్రేక్షకులకూ, రచయిత తాను ఉద్దేశించిన భావాలను స్పష్టంగా తెలియజేయడమే నాటకీకరణ.  ఇతివృత్తము ప్రసిద్ధమో లేక కల్పితమో ఉంటుంది. పాత్రలు కూడా కథను నడిపించడానికి ఎన్ని అవసరముంటాయో అన్ని ఉంటాయి. సంభాషణలు పాత్రోచితంగా అందరికీ అర్థం అయ్యేట్టుగా ఉండాలి. ఇక సన్నివేశాల కల్పన విషయానికొస్తే అవి వస్తు విస్తృతి మీద ఆధారపడి ఉంటాయి. సంస్కృత నాటకాల్లోనూ, ఆంగ్ల నాటకాల్లోనూ, తెలుగు సాంప్రదాయ నాటకాల్లోనూ ఇతివృత్తాన్ని అంకాలుగా, వాటిని మళ్ళీ రంగాలుగా లేక దృశ్యాలుగా విభజించారు. ఒక్కో నాటకంలో కనీసం మూడు ఆపైన అవసరాన్ని బట్టి పది వరకూ అంకాలు ఉన్నాయి. ఒక్కో అంకంలో ఏడెనిమిది రంగాలుండవచ్చు. ఈ రంగం గానీ దృశ్యం కానీ ఒక ప్రదేశంలో జరుగుతుంది. అవసరాన్ని బట్టీ ఇతివృత్తాన్నిబట్టీ ఈ స్థలాలు పడికి మించి కూడా ఉంటాయి.

పందొమ్మిది వందలా యాభయ్యవ దశకం నుండి తెలుగు నాటకం పోటీ పరిషత్తుల ప్రభావంలో పడిపోయింది. వచ్చిన నాటకాలన్నీ ఔత్సాహిక నాటక సమాజాల ఆర్థిక స్తోమత మీదా, పరిషత్తులు విధించిన కాల పరిమితి మీదా ఆధారపడి రాయబడ్డాయి. కాబట్టి అవన్నీ రెండు స్థలాలూ, నాలుగు రంగాలూ, పదికి మించిన పాత్రలూ, అందులో రెంటికి మించని స్త్రీ పాత్రలూ, మూడు గంటల వ్యవధిలో ప్రదర్శించేట్టు గా ముగించబడ్డాయి.

పడమటి గాలి నాటక రచనలో ఆనంద రావు , ప్రదర్శనా కాలపరిమితినీ, పాత్రలూ, అందులో స్త్రీ పాత్రల సంఖ్యనూ నియంత్రించుకోలేదు. ఒక్కో అంకానికి మధ్య చాలా కాలవ్యవధి ఉంటే నాటకాన్ని అంకాలుగా విభజించాలి. పడమటి గాలి నాటకం మొత్తం రెండు మూడు సంవత్సరాల కాలంలో జరిగిపోతుంది. కాబట్టి అంక విభజన చేయలేదు. అందువల్ల చెప్పదలుచుకున్న విషయాలను దృశ్యాలుగా విభజించి సంభాషణల ద్వారా జీవ భాషలో రాశారు. ఐదు స్త్రీ పాత్రలతో సహా ముప్పైఐదు పాత్రలతో నాలుగున్నర గంటల సేపు నడిచే నాటకం తయారు చేశారు. ఇందులో పదమూడు దృశ్యాలు ఏడు స్థలాల్లో జరుగుతాయి. రెండు దృశ్యాలు రచ్చబండ దగ్గరా , రెండు అంజయ్య ఇంటిలో, మూడు రాంకోటు కళ్ళందిబ్బ మీదా,రెండు రాంపండు ఇంటిలో ఉంటాయి. వీధిలో, కోనేటి గట్టు మీదా రాంకోటు ఇంటిలో ఒక్కోటీ జరుగుతాయి

రచ్చబండ దగ్గర జరిగే దృశ్యాల్లో ఆ గ్రామంలో జరుగుతున్న పరిణామాలూ, రాజకీయాలూ, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తుల్నీ, వ్యవస్థల్నీ ఉపయోగించుకోవడం, వర్గ, వర్ణ, కులాల ఘర్షణలనూ తెలియజేయడానికి ఉపయోగించుకున్నారు. అంజయ్య ఇంటిలో జరిగే దృశ్యాల్లో ఫ్యాక్టరీ నిర్మించాలంటే కావలసిన భూముల్ని కొనేందుకు చేయవలసిన కుట్రలూ, కుతంత్రాలూ, పురుషాధిపత్యమూ చెప్పడానికి ఉపయోగించుకున్నారు.  రాంకోటు కళ్ళం దిబ్బమీద జరిగే దృశ్యాల్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలూ, మానవ సంబంధాలూ తెలియజేయడానికీ,వీధిలో, కొనేటిగట్టు కాడా జరిగే దృశ్యాల్లో భ్రష్టు పట్టి పోతున్న నైతిక విలువల్ని వివరించడానికీ ఉపయోగించారు. ఇలా ప్రతి దృశ్యాన్ని ఒక యిదమిద్దమైన విషయాన్ని వివరించడానికీ, పాత్రల స్వభావం తెలియజేయడానికీ ఉపయోగించుకున్న తీరూ, నేర్పూ అపూర్వం.

నాటక రచనకు ఉండవలసిన ఇంకో ముఖ్య లక్షణం ప్రదర్శనా సౌలభ్యం. అసంఖ్యాకమైన రంగాలూ, స్థలాలూ ఉంటే వాటికనుగుణంగా రంగాలంకరణలు అంటే సెట్లు తయారు చేసుకోవడం, వాటిని వెంటవెంటనే మార్చుకోవడం కష్టమైపోతుంది. సెట్టు మార్చుకోవడం ఆలస్యమైతే ప్రదర్శనలో పట్టు పోతుంది. ఒక్కో దృశ్యం కనీసం పది పదిహేను నిమిషాలయినా లేకపోతే ప్రదర్శనను ఆస్వాదించడం కష్టం. పడమటి గాలి నాటకం నాలుగున్నర గంటల సేపు  సాగినా ఆరు సార్లు మాత్రమే సెట్ మార్పిడి ఉండడం, ఒక దృశ్యం కనీసం పదిహేను నిమిషాలు ఉండడం వల్లే దాని ప్రదర్శన రసవత్తరంగా, ప్రజారంజకంగా సాగుతుంది. ఇప్పటికి నూట యిరవైకి పైగా ప్రదర్శనలు జరగడమే అందుకు నిదర్శనం.

కన్యాశుల్కం నాటకంలోని అంక, దృశ్య విభజనా, నిడివీ గురించి సూక్ష్మంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది.అందులో ఏడు అంకాలు ముప్పయి దృశ్యాలూ ఉన్నాయి. కొన్ని దృశ్యాలు మరీ నాలుగైదు నిమిషాల్లో ముగుస్తాయి. నాలుగైదు దృశ్యాలు తప్ప మిగతావన్నీ జరిగిన చోట మళ్లీ జరగవు. అంటే దాదాపు ఇరవై విభిన్న ప్రదేశాల్లో నాటకం జరుగుతుంది. యధాతధంగా రాసింది రాసినట్టు ఆడాలంటే ఇరవై సెట్లు తయారు చేసుకోవాలి. దాదాపు ఏడు గంటల సేపు ప్రదర్శించాలి. చాలా కష్టతరమైన పని. పైగా అంత సేపు ప్రేక్షకులను రంజింప చేయడం కూడా అసాధ్యం. అందుకే కన్యాశుల్కం నాటకాన్ని కుదించి మూడు గంటల సేపు మాత్రమే ప్రదర్శించడం జరిగింది.

అయితే గురజాడ వారు తెలుగులో మొదటి స్వతంత్ర సాంఘిక నాటకకర్త. కన్యాశుల్కం నాటకం భవిష్యత్ తరాల వారికి మార్గదర్శి. ఆయన కన్యాశుల్కం నాటకాన్ని ఎందుకు రాయవలసి వచ్చిందో వివరించారు.

" నాటక కర్తలు సమకాలీన జీవితంలోని సంక్లిష్ట     సామాజిక పరిస్థితులను పట్టించుకోవడం లేదు. కొత్తదనం కోల్పోయిన కాల్పనిక ఇతివృత్తాలను నిరంతరం పట్టుకు వేల్లాడ్డం వల్ల నవ్య భావ దారిద్ర్యం బట్టబయలు అవుతోంది. తెలుగు భాష నాటకాలకు తగింది కాదని ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు రాశాను"

నూట ముప్పయి సంవత్సరాల క్రితం తెలుగు నాటక రచనలో ఉన్న పరిస్థితులను వివరించి ఉత్తమోత్తమమైన నాటకాన్ని రచించి అజరామరంగా నిలిచి పోయారు గురజాడ. ఆయన నిర్దేశించిన బాటలో కన్యాశుల్కానికి సరితూగే నాటకాలు రాకపోవడమే దురదృష్టం. పడమటి గాలి నాటకం గురజాడ వారి ఆశయాల్ని పండించిన మహోత్కృష్ట నాటకం. సమకాలీన జీవితంలోని సంక్లిష్ట , సామాజిక పరిస్థితుల ననుసరించి సరికొత్తదయిన ఇతివృత్తాన్ని నవ్య భావ ప్రభాసితంగా స్వచ్ఛ ప్రాంతీయ జీవద్భాష లో రాసి ఆనంద రావు గురజాడ వారికి  నిజమైన వారసులయ్యారు.

ఇతి వృత్తం లోని ప్రతి అంశానన్నీ స్వగతాలూ అర్ధోపక్షేపకముల ద్వారా కాక సంభాషణల ద్వారానే తెలియజేశారు ఆనంద రావు . సంభాషణలు కూడా పాత్రోచితంగా జీవద్భాష లోనే రచించారు. అసంఖ్యాకమైనా, వైవిధ్యమైనా, విస్తృతమైనా అంశాలను నాటకీకరించిన విధానం అద్భుతం, అనితర సాధ్యం.

నాటకంలో భాష

మార్చు

‘పడమటి గాలి’ నాటకంలో ఆనందరావు ఒంగోలు ప్రాంత జనుల వాడుక భాషను అత్యంత ప్రతిభావంతంగా వుపయోగించారు. ఆ ప్రాంతంలో నిత్యం ప్రజల నాలుకలపై నడయాడుతున్న జాతీయాలనూ, పలుకుబళ్లనూ, నానుడులనూ, తిట్లూ,శాపనార్థాలనూ, సామెతలనూ, పాత్రల సంభాషణల్లో గుదికూర్చారు. ఆయన తెలుగు పదాలనే వుపయోగించాలని నియమం పెట్టుకోలేదు. ప్రజలు ఎలా మాట్లాడితే అదే రాశారు. అందులో యింగ్లీషు పదాలుండొచ్చు లేక మరే యితర భాషా పదాలైనా వుండొచ్చు. ఒక పాత్ర రాగ ద్వేషాలను ప్రకటించడానికి సందర్భానుసారంగా బూతుపదాలను వుపయోగిస్తుంటే వాటిని గ్రంధస్థం చేయడానికి ఆనందరావు అరమరికలు పాటించలేదు. ఎటువంటి భేషజాలు  లేకుండా నిర్భయంగా, సహజాతి సహజంగా సంభాషణలు రాశారు. ప్రజలు మాట్లాడే తీరును బట్టి ఆ శబ్దాలను గ్రంధస్థం చేయడనికి తనదైన, అపూర్వమైన శైలిని అనుసరించారు.

తెలుగు లిపిలో కొన్ని శబ్దాలు రాయడానికి తగిన అక్షరాల కొరత యింకా వుంది. ఇంగ్లీషు అక్షరాలు A,F,Z  అక్షరాల స్వరాలను తెలుగులో రాయాడానికి అక్షరాలు లేవు. ‘RAT’ అనే పదాన్ని ‘రాట్’ అనో, ‘రేట్’ అనో రాయాలి. ‘FOX’ ను ‘ఫాక్స్ అని ఒత్తు ’ఫ’ ను వుపయోగించాలి. ఫాక్స్, ఫలం రెంటి ఉచ్చారణ వొకటే కాదు గద. అలాగే ‘ZOOM’ అనే దానికి ‘జూమ్’ అని రాయాలి. మరి “JAM” అనే దానికి కూడా ‘జా’ నే కదా వుపయోగిస్తున్నాము. తమిళంలో వున్న ‘ళ్ష’ అనే స్వరానికి తెలుగులో అక్షరం లేదు.

‘తాటాకు’, ‘చెప్పాడు’ పదాల్ని అందరూ ఆ రూపలోనే రాశారు. ఆనందరావు ‘తాటేకు’, ‘చెప్పేడు’ అని రాశారు. ఇక్కడ ‘ఆ’ కు బదులు ‘ఏ’ రాసినందువల్ల వుచ్చారణకు దగ్గరగా వున్నాయి.

‘రాముడు’, ‘దేముడు’ అనే మాటల్ని కొందరు అదేవిధంగా రాస్తే, యింకొందరు ‘రావుడు’, ‘దేవుడు’ అని రాశారు. వీటితో బాటు ‘మిడిమేలపోడు’, ‘ఏమన్నా’, ‘అల్లుడేమో’ అనే పదాలకు ఆనందరావు వొక కొత్త పధ్ధతి అవలంబించారు. ‘రా’ కి ‘దే’ కి మధ్య పూర్ణానుస్వారాన్నివాడి, ఆ తరువాత వచ్చే ‘మ’ కారాన్ని ‘వ’ కారంగా రాశారు. అందువల్ల వుచ్చారణలో స్వచ్చ ప్రాంతీయత ప్రస్ఫుటంగా పలకడానికి వీలవుతుంది.

కొన్ని వుదాహరణలు.

రాంవుడు - దేంవుడు

ఏంవన్నా - మిడింవేలపోడు

అల్లుడేంవో - సోంవయ్య

బతికేంవా - కొందాంవంటాడు

“ఏ భాషలో మన సుఖదుఃఖాలను జంకులేకుండా వ్యక్తపరుస్తామో, ఏ భాషను తల్లి వొడిలో నేర్చుకుంటామో, ఆ సజీవమైన భాష కావాలి. “

అని గురజాడ అన్నారు. అందుకే, ఆ సజీవ భాషలోనే ఆయన కన్యాశుల్కం రచించారు.

నాటకాన్ని నడిపించేవి సంభాషణలు. వాటిలో జనజీవనం ప్రతిఫలించాలి. సంభాషణలు రచయిత నోటివెంట వచినట్లుగా గాక, పాత్రల నోటిద్వారా, వాటి జీవన విధానాల్నిబట్టి వచ్చినట్లుండాలి. అప్పుడే అది జీవభాష అవుతుంది. అది జీవనాటక మవుతుంది.

కన్యాశుల్కం సార్వకాలీన, సార్వజనీనమైన నాటకమై యింకా సజీవంగా వుందంటే కారణం అందులోని జీవద్భాషే. అందులోని కథ కాదు. కానీ పడమటి గాలి లోని భాషే కాదు, కథ కూడా సార్వజనీనం, సార్వకాలీనం.

లోకోత్తర వాక్యాలు

మార్చు

పడమటి గాలి నాటకంలో ఆనంద రావు సందర్భం వచ్చినప్పుడల్లా తన అపారమైన అనుభవాన్నీ, విజ్ఞానాన్నీ, విజ్ఞతను ఉపయోగించి కాంతిమంతాలైన సూక్తులనూ, సామెతలనూ ప్రజల నాలుకలపై చిరకాలం నిలిచిపోయేట్టుగా రచించారు. అవి కొన్ని సుభాషితాలుగా, కొన్ని ప్రబోధకాలుగా, కొన్ని అందమైన కవితాభివ్యక్తీకరణలుగా, మరికొన్ని ప్రపంచ పోకడలను తెలిపే ప్రకటనలుగా కనిపిస్తాయి. పడమటి గాలి చదివినవారూ, చూసినవారూ వాటి ప్రభావం నుంచి తప్పించుకోలేరు. తమ దైనందిన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర వాటిని తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ఆనంద రావు గారికే సొంతమైనా, ప్రజల మనసుల్లోకి లోతుగా నాటుకుపోయినా కొన్ని ప్రత్యేక వాక్యాలను గమనించండి.

  • రైతింట పుట్టిన్నాకొడుక్కి నాగేలు బుజాన పెట్టుకోవడం నామోసినా .
  • ఏదన్నా ఎదవ పని సెయ్యాలనుకున్నప్పుడు ఆ పాపం మోయడానికి ఇంకొకణ్ణి రడీ సేసుకోనుండాల.
  • సెప్పేవాడికి లేకపోయినా యినే వాడికన్నా ఉండాలరా బుద్ధి.
  • అమ్మాయి బలే మంచిదిరా అని సేసుకున్నాక సెడిపోతే ఏంజేస్తామూ అని.
  • జనం సెప్పుకునేయన్నీ నిజమనుకుంటే మూడొంతుల కాపురాలు నిలవ్వు.
  • పెళ్లికాకముందు నలుగురు నోళ్లలో పడ్డ అమ్మాయిలే పెళ్ళైనాక కుదురుగా సంసార పచ్చంగా  కాపురాల్జేస్తారు.
  • రైతు పుటక పుట్టినోడు కాడికింద గొడ్డు నమ్మకోకూడదు.
  • బాగు కోరే వాళ్ళు బాద పడరు.
  • ఐదొందలు సేతిలో ఉంటే ఐదేలకి టర్నోవర్ సెయ్యాల.
  • లేసిపోయింది అట్నుంచి అటే పోద్దా.
  • పెళ్ళాలు వయసులో పెద్దోళ్ళు కావడం వల్లే వాళ్ళంతా గొప్పోళ్లయ్యారు.
  • అమెరికాలోఎరన్ చేయాలి ఇండియాలో ఎంజాయ్ చేయాలి.
  • గోడౌన్ తగలెయ్యకుండా గొప్పోడైన టుబాకో డీలర్ యెవుడైనా వుండాడా.
  • తాను పది లచ్చలు తింటుడప్పుడు తన కిందోడు పదేలు తింటే తప్పేముంది.
  • తానూ బతకాల ఎదటోడూ బతకాల అనే నీతి ఇంకా మన నాయకుల్లో మిగిలుండబట్టే ఈ మాత్రమైనా పనులు జరగ తుండాయి.
  • పెద్ద ఆపీసర్లు కూడా పైసలు ముట్టుకున్నాక ఎంత నిజాయితీగా పని జేస్తారో.
  • దొంగ నాయాల్లు జేసే పనికి సాచ్చాలుంటాయా.
  • సేతిలో పనితనం వుంది. ఎనక ఎమ్మెల్యే ఉండాడు.
  • రచ్చ బండ కాడెవ్వారాల్లో మా తరం వాళ్ల అవసరం తీరిపోయిందిరా.
  • మాటలతో కడుపు నిండదు. మణీ కావాల.
  • నకిలీ మందులమ్మే  నాకొడుకుల్ని నడీదిలో ఉరి తియ్యాల.
  • కడుపున పుట్టినోడు కాటికీడవలేక పోతాడా.
  • పైసా వసూల్ జేయాలంటే గొంతు మీద కత్తి పెట్టక తప్పడం లేదు.
  • కోటర్ మందు బోయిచ్చి కోడి పలావ్ పెట్టిస్తే ఎవుడైనా పొడిసి పెడతాడు.
  • పైకెక్కాలంటేలంటే పవర్ లో ఉండే వోణ్ణి పట్టుకోవాలి రోజు.
  • రోజు కూలీ జేసే ఓడి  కంటే పదిమందిసేత పంజేపిచ్చే ఓడికి యిలవెక్కువ.
  • కత్తితో బతికినోడు కత్తితో పోవాలనేది పాత పాట. కత్తి పట్టుకున్నోడు ఖద్దరులేకి పోవడ ఇవాల్టి మాట. ఏదైనా పనిలో దిగినాక ఒక పట్టు దొరికిందాక ముందుకు పోవాల.
  • ఏ పని జేసినా తెలివిగా, సేతికి మట్టి అంటకుండా చేయాల.
  • ఒకరు బతకాలంటే ఒకరు సావాల.
  • పల్లు దాటితే పాలసనైపోతాం.
  • తాలిబొట్టు కడితేనే మొగుడా.
  • తెల్లారేలకి లచ్చలు సంపాయించాలనే ఆశపోతు నాయాలున్నంనతకాలం.
  • పరువు పోయి బతకడం కంటే ప్రాణం పోయి బతకడం మంచిది.
  • బాధలు పడే వోళ్లంతా సచ్చిపోతే ఈ భూమ్మీద ఎవురూ మిగలరయ్యా.
  • ఈనేల ఎవురిదీ కాదు. శాకిరీ సేసే వోడిది.
  • బిడ్డను బాయిలో యేసి లోతు సూసే గవర్నమెంట్ పురిటి బిడ్డ గొంతులో వడ్ల గింజలేసి జోల పాడే నాయకులు.
  • ఈ యిత్తనాలు మొలిపిచ్చాల. ఆ నెత్తురు కందును బతికిచ్చాల .
  • ఈనేల చెక్క కోసం ఈతరం హక్కు కోసం చెమట ధారపోసిన ఈ మట్టిలోనే రక్తం ధారపోసి చావడం గొప్ప కాదా.

ప్రత్యేకతలు

మార్చు
  • నాలుగున్నర గంటలసేపు నాటకాన్ని ప్రదర్శించడం.
  • పద్నాలుగు జిల్లాల నుంచి డెభైమంది కళాకారుల్ని సమీకరించడం.
  • ముప్పై ఐదు పాత్రలున్న నాటకంలో ఐదు    స్త్రీపాత్రలే వుండడం.
  • ఆట, పాట, పద్యంలేకుండా ఆద్యంతం ప్రేక్షకుణ్ణి తల తిప్పుకోకుండా చేయడం.
  • అరవై అడుగుల పొడవు, నలభై అడుగుల వెడల్పు, పదహారు అడుగుల ఎత్తులో సర్కస్ గుడారంలా స్టేజీ నిర్మించుకోవడం.
  • పురాతన సురభి నాటక పద్ధతుల్ని ఆధునిక సాంకేతిక పద్ధతులతో మేళవించడం.
  • వర్షం కురవడం, మంటలు మండడం, వెన్నెల కాయడం, సూర్యుడుదయించడం లాంటి దృశ్యాల్ని రంగస్థలం పైన ప్రదర్శించడం.
  • స్టేజీ మీదకు మోటారు సైకిళ్ళు, సైకిళ్ళు, రిక్షాలూ రావడం.
  • తెలుగులో సాంఘిక నాటకాన్ని టికెట్టు పెట్టి ప్రదర్శించడం.
  • ప్రకటించిన సమయానికే నాటకాన్ని ప్రారంభించడం.
  • నాటకానికి ముందు సభలు, సన్మానాలు లేకపోవడం.
  • ఒకే వేదిక మీద మూడునుండి ఐదు రోజుల పాటు వరుసగా ప్రదర్శించడం.
  • ఒక ఐ.ఏ.యస్ ఆఫీసరు, ఒక డిఫ్యూటీ సెక్రెటరీ, ఒక సి.ఐ. తో బాటు పదిమంది ప్రభుత్వాధికారులు నటించడం.
  • కొన్ని లక్షలమంది మళ్ళీ మళ్ళీ చూడడం.
  • రాష్ట్ర అసెంబ్లీలో నాటకం మీద చర్చ జరగడం.
  • పడమటి గాలి మీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం.
  • వేమన విశ్వవిద్యాలయం ఎం. ఏ. రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పడమటి గాలి నాటకాన్ని నియమించడం.

అభిప్రాయాలు

మార్చు
  • “వ్యక్తుల్ని గ్రహించి, వారి మధ్య నడిచిన వ్యవహారాన్ని అక్షరబద్ధం చేసి, యితివృత్తాన్ని పాఠకులచే, ప్రేక్షకులచే భావింప జేశాడు ఆనందరావు. ఇది నాటకం కాదు, ప్రకాశం జిల్లాలో పడమటి గాలి సోకిన ఒక గ్రామపు వృత్తాంతం. ప్రాంతం మారితే భాష మారుతుంది, ఇతి వృత్తం మారదు.“ - ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు, నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
  • “పడమటి గాలి వాస్తవానికి కొంత కల్పన జోడించి చేసిన రచన కాదు. దానిలోని యితివృత్తం భావననుండి వచ్చినది కాదు. దైనందిన జీవనం లోనిది. యధాతథంగా దానినలాగే భాషలోనికి అనువర్తింపజేసినది.” - ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు, నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
  • వంద సంవత్సరాల నాటి సమాజ స్వరూపానికి దర్పణం కన్యాశుల్కమైతే, వర్తమాన సమాజ విచిత్ర పోకడలకు నిలువుటద్దం పడమటి గాలి. మహాకవి గురజాడ కూడా తడివి చూడని రాజకీయ పలుకుబడి, వత్తిడి, దానివల్ల సామాన్యుడు ఎన్ని అవస్థలకు లోనవుతున్నాడో చూడండని ఆనందరావు ఆవేదన చెందుతారు. ఇది జీవనాటకం. పాటిబండ్ల ఆనందరావు ‘నేటి గురజాడ’.” -  శ్రీ కె. యస్. టి. శాయి, సినీ నాటక నటులు,  నాటక రచయిత
  • “మానవనైజంలోని చీకటి కోణాల్ని బట్టబయలు చేస్తూ, వాటిపై వెలుగుని ప్రసరించిన పవర్ ఫుల్  టార్చిలైట్ పడమటిగాలి. కర్షక జీవితాల్లోని నిస్సహాయతనూ, నిర్వేదాన్నీ  క్రిస్టల్ క్లియర్ గా కళ్ళెదుట నిలిపిన కెలిడోస్కోపే యీ నాటకం. వేదికమీది పాత్రలు మనోవేదికమీదకొచ్చి మనసునంతా కలచివేసి కన్నీరు పెట్టిస్తాయి. పాత్రల హృదయఘోష గుండెల్లో ప్రళయఘోషలా ప్రతిధ్వనిస్తుంది. భాషకున్న పవరుకీ, భావానికున్న విగరుకీ, నాటకానికున్న శక్తికీ, అణగారిన జీవితాల మీద నాటక రచయితకున్న అనురక్తికీ పడమటిగాలి నాటకం నిలువెత్తు దర్పణం. ఇది అభినవ వేదం. కాదు కాదు. అభినయ వేదం.” - కొంపల్లి గౌరిశంకర్, సహాయాచార్యులు, శర్మ కళాశాల, ఒంగోలు
  • “జనారణ్యంలో బ్రతుకుతూ, నరహంతకుల దాహానికీ, నయవంచకుల ద్రోహానికీ, ప్రకృతి శక్తుల పరిహాసానికీ గురై, కుడి ఎడమల పగతో కుమిలి కృశించిపోతున్న శిథిల జీవితాలకిచ్చిన రుధిరతర్పణం పడమటిగాలి. గుండెల్ని పిండి కళ్ళని కన్నీటి చెలమలుగా మార్చి, లోపలి మనిషిని నిద్రలేపి, పాత్రల బాధలతో మమేకం చేసి, స్టేజీమీది పాత్రలకూ, స్టేజీ క్రింది ప్రేక్షకులకూ మనో వారధి నిర్పించిన మహోన్నత నాటకం పడమటి గాలి. “ - శ్రీ కొంపల్లి గౌరిశంకర్, సహాయాచార్యులు, శర్మ కళాశాల, ఒంగోలు
  • "కూల్చివేయబడ్డ జీవితాల తాలూకూ వేదన, రోదన, ఆశ, ఆవేశం, దురాశ, దుఃఖం, శబ్దాలు, చప్పుళ్ళు, స్మృతులు, చిహ్నాలు, సంస్కృతి, భాషల్నీ  చరిత్ర పుటల్లో రికార్డు చేశాడు ఆనందరావు పడమటిగాలి నాటకంలో. సమస్యల విషవృక్షానికి వేళ్ళు ఎక్కడున్నాయో కరెక్ట్ గా ఐడెంటిఫై చేశాడు.” - శ్రీ కె. ఆదియ్య, జిల్లా ఆడిట్ అధికారి, ఒంగోలు
  • "సమస్యా సంక్షుభితమైన సమకాలీన సమాజాన్నంతా రంగం మీదకు తెచ్చిన నాటకం పడమటి గాలి. పాశ్చాత్యనాగరిక జీవన ప్రభావం, ప్రపంచీకరణ పోకడల ఆరాటం, స్పీడ్ గా ఈజీగా ధనం సంపాయించాలన్న తపనల ఫలితంగా, దేశానికి గుండె వంటి పల్లెజీవనం నైతికంగా ఎంత పతనమయిందో, భూమినే నమ్ముకొని బ్రతుకీడ్చే భూమిపుత్రుని మనుగడ ఎంత దైన్యస్థితికి దిగజారిందో అత్యంత శక్తిమంతంగా చూపెట్ట గలిగాడు ఆనందరావు.” - డాక్టర్ పి. వి. రమణ. ప్రోఫెసర్,థియేటర్ ఆర్ట్స్ తెలుగు విశ్వవిదాలయం, హైదరాబాద్
  • "పాశ్చాత్య నాగరికత పేరిట యువతీ యువకులు నిష్క్రియాపరులుగా, దురాశాపరులుగా, స్వార్థపరులుగా, నాయకులు వ్యాపారులుగా, సమాజంలోని వివిధ వర్గాలను వాడుకునే దగుల్బాజీలుగా, వివిధ వర్గాలకూ, నాయకులకూ మధ్యవున్న దళారులు కార్యసాధకులుగా పరిగణింపబడే వాతావరణాన్ని చూపించిన పడమటి గాలి, యీ స్థితి నుండి బయట పడాలని బలంగా హెచ్చరిస్తుంది.” - శ్రీ అంగలకుర్తి విద్యాసాగర్, ఐ.ఏ.ఎస్. రిటైర్డ్
  • "ఆధునిక పల్లెల్ని అక్షరబద్ధం చేసిన నాటకం పడమటి గాలి. అది ఆధునిక భారతం. శతాబ్ది మొదట్లో కన్యాశుల్కం, ముగింపులో పడమటి గాలి.” - డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు, ప్రజాకవి, అవధాని
  • "తెలుగునాడి తెలిసిన తెలుగువాడు తెలుగులో వ్రాసిన నాటకం పడమటి గాలి. చావుతోనో, కేకలతోనో, నినాదాలతోనో కాకుండా, భవిష్యత్తు మీద నమ్మకంతో వొక కొత్త అధ్యాయ ప్రారంభాన్ని సూచించే గొప్ప నాటకం పడమటి గాలి.” - శ్రీ వి.యస్. కామేశ్వరరావు, నటులు, దర్శకులు, రచయిత
  • "తెలుగు నాటక చరిత్రలో కన్యాశుల్కం తరువాత మరో గొప్ప నాటకం పడమటి గాలి.” - డాక్టర్ సి. నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత
  • "రైతుల జీవితాలను కళ్ళకు కట్టిన నాటకం పడమటి గాలి. పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు పడమటి గాలి పరిష్కారం.” - డాక్టర్ దాసరి నారాయణరావు, సినీ దర్శకులు

సదస్సులు

మార్చు

పడమటి గాలి నాటకం ఇప్పటివరకు తెలంగాణాతో కలిసి ఆంధ్ర దేశంలోనూ ఢిల్లీ లోనూ  నలభై ప్రదేశాల్లో  ప్రదర్శించబడింది. ప్రతి దగ్గర కనీసం వరుసగా మూడు రోజులపాటు ప్రతిరోజూ ప్రదర్శించబడింది. ఒంగోలు, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, విశాఖపట్నం లాంటి ప్రదేశాల్లో మూడింటి కంటే ఎక్కువసార్లు ప్రదర్శించబడింది. ప్రదర్శన జరిగన ప్రతి ఊరిలోనూ అక్కడ ఉన్న రచయితలూ విమర్శకులతో పడమటి గాలి మీద సదస్సులు నిర్వహించారు.అటువంటివాటిలో కొన్ని ముఖ్యమైనవి.

  • 08 -12 -2000 వ తేదీనాడు.... హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన సభలో శ్రీయుతులు దాసరి నారాయణ రావు , సినీ రచయిత డివి నరసరాజు , మిక్కిలినేని , పరుచూరి వెంకటేశ్వరరావు ,పూసల , దివాకర్ బాబు లాంటి వారు పాల్గొన్నారు.
  • 09 -12 -2000 వ తేదీ నాడు....  హైదరాబాదులోని సెంట్రల్ కోర్టు లాడ్జిలో జరిగిన సభలో శ్రీయుతులు దీక్షిత్ , సినీ రచయిత డివి నరసరాజు , దయాచారి ఐఏఎస్ ,మిక్కిలినేని గారూ పాల్గొన్నారు.
  • 21 -10 -2004 వ తేదీ నాడు.... రవీంద్రభారతిలో జరిగిన వేమూరి ఆంజనేయ శర్మ స్మారక ట్రస్టు అవార్డుల బహుకరణ సభలో శ్రీ రావూరి భరద్వాజ గారికి సాహిత్యంలోనూ, నాటకానికి శ్రీ పాటిబండ్ల ఆనంద రావు గారికీ అవార్డు లిచ్చారు . ఆ సభలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి .నారాయణ రెడ్డి "తెలుగులో కన్యాశుల్కం తర్వాత అంత గొప్ప నాటకం పడమటి గాలి" అన్నారు
  • 15-03-2009 నాడు....  హైదరాబాదులోని రవీంద్రభారతిలో పడమటిగాలి వంద ప్రదర్శనల ముగింపు సదస్సులో  శ్రీ చాట్ల శ్రీరాములు , శ్రీ దీర్గాసి విజయ భాస్కర్ , శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ ,శ్రీ విద్యాసాగర్ ఐఏఎస్ , శ్రీ కె.వి.రమణాచారి ఐఏఎస్ మొదలైన వారు పాల్గొన్నారు.
  • 18 -01 -2010 వ తేదీ నాడు.... శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారి ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ నిర్వహించిన సభలో సినిమాకు పరిశ్రమలో  శ్రీ కె. విశ్వనాధ్ గారికి నాటకానికి శ్రీ పాటిబండ్ల ఆనంద రావు గారికి అవార్డు లిచ్చారు.
  • 16-04- 2016 వ తేదీ నాడు.... ఒంగోలులో సీ వీ ఎన్ మీటింగ్ రూమ్ లో పడమటి గాలి నాటకం మీద జరిగిన సదస్సులో  దిగంబర కవి శ్రీయుతులు నగ్నముని , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు శ్రీపతి రాముడు , ఐద్వా అధ్యక్షులు రమాదేవి , విమర్శకులు దివికుమార్ గారూ,శ్రీ వాసిరెడ్డి రమేష్ , జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ హనుమా రెడ్డి పాల్గొన్నారు.
  • మార్చి 2017 వ తేదీ నాడు....  విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ సంచాలకులు శ్రీ విజయభాస్కర్ అంతకు మునుపెన్నడూ లేని విధంగా పడమటి గాలి మీద ఒక ప్రత్యేకమైన సదస్సు నిర్వహించారు. జర్నలిస్టు, సాహిత్య విమర్శకులు శ్రీ సతీష్ చందర్ , శ్రీ బలరామయ్య ఐఏఎస్ రిటైర్డ్ , శ్రీ వైయస్ కృష్ణేశ్వరరావు , శ్రీ అంబటి మురళీకృష్ణ మొదలైన వారు పాల్గొని పడమటి గాలి మీద తమ అభిప్రాయాలను తెలియజేశారు.
  • 07 -01- 2018 న....  గుంటూరులో అజో విభో కందాళం ట్రస్ట్ వారు ప్రత్యేకంగా పడమటి గాలి నాటకం మీద ఒక సదస్సు నిర్వహించారు. అందులో శ్రీయుతులు కందిమళ్ళ సాంబశివరావు , అప్పాజోస్యుల సత్యనారాయణ , శ్రీపతి రాముడు , బలరామయ్య, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలూ వ్యాసాలు:

మార్చు

పడమటి గాలి నాటకం ప్రదర్శించిన తర్వాత ప్రతిసారీ వివిధ దిన,వార పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువడ్డాయి. అన్ని పత్రికలూ  ఆ నాటకాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అవిగాక పడమటి గాలి మీద కొన్ని ప్రత్యేకమైన పుస్తకాలూ వ్యాసాలు కూడా వెలువడ్డాయి. వాటిలో

పడమటి గాలి ప్రదర్శన పంచమి:

07 -10 -2001 వ తేదీ నాడు ఈ పుస్తకం ఆవిష్కరించబడింది .అందులో అనేక వ్యాసాలున్నాయి. వాటిలో ఈ క్రింద పేర్కొనబడిన వ్యాసాలు చాలా ముఖ్యమైనవి.

  • జర్నలిస్ట్ శ్రీ  సతీష్ చందర్ గారి "బుల్లి  తెరకుఎదురు నిలిచిన పడమటి గాలి"
  • డాక్టర్ పివి రమణ, ప్రొఫెసర్ , థియేటర్ ఆర్ట్స్, వారు రచించిన "కుదిపేసిన పడమటి గాలి"
  • ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు రాసిన "పడమటి గాలి ఒక అనుభూతి".
  • అంగలకుర్తి విద్యాసాగర్ రచించిన "సాహిత్య దిశానిర్దేశం చేసే నాటకం ఇది"
  • శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు రచించిన "పడమటి గాలి, పాటిబండ్ల,నేను"
  • శ్రీ వైయస్ కామేశ్వర రావు రచించిన "కొత్త గాలి"
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ శర్మ కాలేజి, ఒంగోలు , శ్రీ గౌరీ శంకర్ రచించిన "అభినయ వేదం"

ముఖ్యమైనవి. వాటితో పాటు శ్రీయుతులు కాకరాల , శ్రీ కెఎస్టీ శాయి , శ్రీ కె అదెయ్య ,శ్రీ పి ఎస్ రావు , శ్రీ నవీన్ మొదలైన వారి వ్యాసాలు ఆ పుస్తకంలో ఉన్నాయి.

"పది వసంతాలు వంద ప్రదర్శనలు"

15-03-2009 వ తేదీ నాడు  పై పేరుతో ఎమెస్కో వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో శ్రీ దూపాటి విజయ్ కుమార్ గారి వ్యాసం "తెలుగు నాటక ప్రదర్శన చరిత్రలో అపూర్వ ఘట్టం" తో బాటు వివిధ రచయితల వ్యాసాలు ఉన్నాయి.

"మహోన్నత దృశ్య కావ్యం పడమటి గాలి"

1919 సంవత్సరం జనవరిలో విజయవాడలో జరిగిన అఖిలభారత పుస్తక ప్రదర్శన సభలో శ్రీయుతులు బలరామయ్య ఐఏఎస్ రిటైడ్ రచించిన "మహోన్నత దృశ్యకావ్యం పడమటి గాలి" అనే పుస్తకం ఆవిష్కరించబడింది. అందులో పడమటి గాలి మీద శ్రీ బలరామయ్య గుమ్మళ్ల అనేక మైన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా రచించారు. అవి.,

  1. ఇతివృత్తం.,
  2. నాటకీకరణ.,
  3. జీవద్భాష.,
  4. పేర్లు-మారుపేర్లు-ఊత పదాలు.,
  5. సామెతలు, లోకోక్తులు,
  6. అల్పమైన మాటల్లో అనల్పమైన దృశ్యాలు., 
  7. రైతుకీ పాలేరుకీ సంబంధం.,
  8. నింనోన్నత వర్గాల మధ్య ఘర్షణ.,
  9. వ్యాపారం.,
  10. నాయకులు-రౌడీలు-అధికారులు.,
  11. ధర్మం-నీతి-నిజాయితీ.,
  12. రైతు భారతం.,
  13. సర్వ లక్షణ సమన్విత కావ్యం.,
  14. ప్రదర్శనా యజ్ఞం.,
  15. నాటక విజయం.,

కన్యాశుల్కం మీద తప్ప ఇంకేనాటకం మీద కూడా ఇటువంటి విశ్లేషణాత్మక పుస్తకం రాలేదు.

నటీనటులు:

మార్చు

పడమటి గాలి నాటకం 2019 వ సంవత్సరం వరకు మూడు సంస్థల ద్వారా 124 సార్లు ప్రదర్శించబడింది. అందులో స్పందన,ఒంగోలు వారు 108 సార్లూ,పండు క్రియేషన్స్, కొప్పోలు, ప్రకాశం జిల్లా వారు 13 సార్లూ, గంగోత్రి, పెద కాకాని , గుంటూరు జిల్లా వారు మూడు సార్లూ ప్రదర్శించారు. నాటకంలో ముప్పయి పాత్రలున్నాయి. సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ వొకే నటుడు అదే పాత్రను అన్ని సార్లూ వేయడం కుదరదు. అందువల్ల చాలా పాత్రలను అనేక మంది నటులు ధరించారు.     

శ్రీ రజిత మూర్తి. నాటకంలో మూడు ప్రధానమైన, రాంకోటు, మాయోడు, అంజయ్య పాత్రలను ధరించారు. శ్రీ గుమ్మళ్ల బలరామయ్య మాయోడు, రాంకోటుగా నటించారు. మిగతా అన్ని పాత్రలనూ యిద్దరు ముగ్గురు నటులు ధరించారు. ఏయే పాత్రలను ఎవరెవరు నటించారో చూడండి.


  • రాంకోటు:యార్లగడ్డ. బుచ్చయ్య చౌదరి, చెట్టేబత్తుల. రజిత మూర్తి  నాయుడు గోపి, గుమ్మళ్ల బలరామయ్య, గోవాడ. వెంకట్.
  • మాయోడు: చెట్టేబత్తుల. రజిత మూర్తి,  గుమ్మళ్ల బలరామయ్య, నాయుడు గోపీ, యెస్. ఎమ్. బాషా  
  • అంజయ్య: కె.ఎస్.టి. శాయి, వున్నం శేషయ్య, చెట్టేబత్తుల. రజిత మూర్తి
  • రాంపండు:  ఎస్.యం.బాషా, నాగేశ్వరరావు, సతీష్
  • లచ్చిందేవి:  జె. పద్మావతి, యం. రత్నకుమారి, సురభి ప్రభావతి
  • హైమ:  పద్మారెడ్డి, సరిత , విజయరాణి, భవాని , జ్యోతి
  • సుబ్బరత్తం: సుజాత , వై. సరోజ
  • దొరసాని: సరోజ , ప్రభావతి , శివరంజని               
  • రాజ్జం: జ్యోతి, ఉమాదేవి, దేవసేన               
  • రాగోలు: మాడుగుల జోసెఫ్, శ్రీనివాస్, పాటిబండ్ల ఆనంద రావు, సాయికుమార్, రమణమూర్తి
  • శ్రీదేవి మొగుడు: హరనాథ్ బాబు, పాటిబండ్ల ఆనంద రావు, మధుశూదన్ రెడ్డి, చంద్ర                   
  • రంగనాయకులు: కొదమల ఆల్ఫ్రెడ్, కె బాబు, భుజంగ రావు                   
  • సుబ్బరాయుడు: అన్నమనేని ప్రసాద్, నాయుడు గోపి, రామచంద్రారెడ్డి
  • పేరాయి: పసుమర్తి దేవానంద్, డి. గాంధి
  • సుందిరి: జంపాల వెంకయ్య, కోటి శివ, డి. జార్జి
  • యంగ ట్రావు: బొట్లారామారావు,శివకోటేశ్వరరావు,విజయ కుమార్.
  • బ్రెమ్మంవు: సత్యనారాయణరాజు,ఫణి పమిడి వెంకటేశ్వర్లు,
  • శీనాయి: పసుమర్తి సుబ్బారావు, అరుణ్ కుమార్, సురభి రాఘవ 
  • స్టిక్కీరాసంవి: పి.వి.ఆర్.చౌదరి, సముద్రం.వెంకటేష్, యేసు   పాదం , వల్లూరు శివప్రసాద్, పూర్ణ సత్యం
  • చారోడు: బాలినవెంకట్రావు, హనుమంతరావు, శ్రీనివాస్
  • బుచ్చయ్య తాత: పసుమర్తి సింగయ్య, డి.ఆర్.కె.మూర్తి,ఆశీర్వాదం.
  • సుబ్బాయి: దామచర్ల వెంకట్రావ, డి.నాగేశ్వర రావు,కమలాకర్.
  • గంటోడు: బొడ్డు తాతారావు, పి. శ్రీనివాసరావు, ఏసుపాదం,మాలకొండయ్య
  • కోటిబాబు: తానికొండ కృష్ణ, అవిశగడ్డ శ్రీను, వెంకటనారాయణ, విజయ కుమార్, డి. శ్రీనివాస్            
  • మూర్తి: కోట్లింగం,  కిశోర్, సి.హెచ్.కృష్ణారావు ,  రామచంద్రమూర్తి,  వరంగల్ బాబు
  • జెండారాజు: బేతంశెట్టి హరిబాబు, కె. రాజ్ కుమార్ ,యస్.కె. పాషా,  మనోహర్, నందకుమార్
  • వడ్డీల శేషయ్య: యం.బ్రహ్మయ్య , సత్యనారాయణ
  • పోస్టెంకటేశర్లు: కమలాకర్, బాదంగీర్ సాయి , డి. రామకృష్ణ, భరద్వాజ
  • కోట్లింగం: పాటిబండ్ల ఎలీషా
  • బాలరాంపండు: ఇండ్ల మిత్ర, కె. శ్రీకాంత్, పాటిబండ్ల రవివర్మ

 

సాంకేతిక  నిపుణులు:

మార్చు

పడమటి గాలి నాటక ప్రదర్శనలో వర్షం కురవడం, మంటలు మండడం, వెన్నెల కాయడం, సూర్యుడుదయించడం-అస్తమించడం లాంటివి చూపించడమే గాక , స్టేజీ మీదకు మోటారు సైకిళ్ళు, సైకిళ్ళు, రీక్షాలూ రావడం జరుగుతుంది . అందుకు సురభి వారి సహకారం తీసుకున్నారు. వీటన్నిటినీ నడిపించడంతో బాటు, సెట్లు మార్చడానికి యిద్దరు ముగ్గురు మనుషులు స్టేజీకి అమర్చిన ట్రస్సుల మీద నాటకం జరిగినంత సేపూ వుంటారు. రాంకోటు,మాయోడు,రాంపండు, లచ్చిందేవి పాత్రల ఆహార్యం ప్రతీ దృశ్యానికీ మారి పోతుంది. మేకప్ ఆర్టిస్టులు నాటకమయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలి. నాటక విజయానికి దోహదపడే సాంకేతిక నిపుణులు వీరే.   

  • ఆహార్యం: మదన్, సారధి, గిరి, థామస్, హరిశ్చంద్ర
  • సంగీతం: సప్దార్ హుసేన్ , సైదారావు , ఇమ్మానియేల్, ఏసు పాదం                   
  • స్పెషల్ ఎఫెక్ట్స్: సురభి రఘునాథ్ , సురభి వెంకటేశ్వరరావు,సురభి సుబ్బారావు, సురభి నాగేశ్వరరావు, సురభి శంకర్
  • లైటింగ్: వసుమర్తి రవికుమార్, పాటిబండ్ల నాగేశ్వరరావు, వసుమర్తి శ్యాంకుమార్
  • సెట్ ఎరక్షన్ & ఆపరేషన్: కె. రూబెన్, లక్ష్మయ్య , ఆశీర్వాదం, మోహన్
  • కో ఆర్దినేటర్స్: ఇండ్ల ఏసుపాదం , కొమ్ము సింగయ్య , పాలపర్తి డేవిడ్
  • స్టేజి నిర్మాణం: కంకణాలతిరుపతిస్వామి
  • స్టేజి మేనేజరు: పాటిబండ్ల కమలాకర్
  • ప్రొడక్షన్ మేనేజరు: పాటిబండ్ల మోషే
  • ఆర్గనైజర్: కాకి జయపాల్

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు:

మార్చు