బలరామయ్య గుమ్మళ్ళ

గుమ్మళ్ళ బలరామయ్య విశ్రాంత ఐఏఎస్ అధికారి, రంగస్థల నటుడు, దర్శకుడు. టీటీడీ జే. ఈ. ఓ, దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేశారు.[1]

బలరామయ్య గుమ్మళ్ళ
జననం
బలరామయ్య గుమ్మళ్ళ

జూన్ 1, 1953
వృత్తివిశ్రాంత ఐఏఎస్ అధికారి, రంగస్థల నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిసుగుణశీల (చిత్తూరు జిల్లా పూడి పంచాయితీ మాజీ సర్పంచ్)
పిల్లలుసృజన (ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ అధికారి), చార్వాక్ (బీటెక్, ఎంబిఎ)
తల్లిదండ్రులు
  • చంద్రయ్య (తండ్రి)
  • ఆదిలక్ష్మమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttps://www.facebook.com/balaramaiah.gummalla

బలరామయ్య 1953, జూన్ 1న చంద్రయ్య, ఆదిలక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని మాదమాల అనే పల్లెలో జన్మించారు .

విద్యాభ్యాసం

మార్చు

ఆయన తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులు. సొంత గ్రామంలో పాఠశాల లేనందువల్ల ప్రాథమిక విద్యను తన గ్రామానికి కిలోమీటరు దూరంలో వున్న వేలవేడు అనే గ్రామంలో పూర్తి చేశారు. ఆ రోజుల్లో శ్రీకాళహస్తి తాలూకాలో ఒకేవొక్క ఉన్నత పాఠశాల వుండేది. శ్రీకాళహస్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న పూడి అనే గ్రామంలో తన అక్క గారిని యిచ్చినందువల్ల ఆమె యింటి నుండి శ్రీకాళహస్తికి వెళ్లి చదువుకోడానికి ఆయన అమ్మగారు ఏర్పాటు చేశారు. అలా ప్రతిరోజు 8 కిలోమీటర్లు రానూపోనూ నడిచి రాజాపానుగంటి బంగారమ్మ సీతారామయ్యనింగారి వున్నతోన్నత పాఠశాల (R.P.B.S.H.S) లో పన్నెండవ తరగతి వరకు చదివారు. శ్రీకాళహస్తిలోనే శ్రీ విద్యా ప్రకాశానందస్వామి ప్రభుత్వ కళాశాలలో బి. ఎ. రెండవ తరగతిలో పాసయ్యారు. అప్పటివరకూ ఆ కళాశాలలో సెకెండు క్లాసులో బి.ఎ. పాసైన వారు లేరు. 1972 -1974 కాలంలో తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రములో ఎమ్మే పాసయ్యారు.

ఉద్యోగం

మార్చు

ఎం. ఎ తరువాత 1974 నుండి 1976 వరకు ఒక రీసెర్చి ప్రాజెక్ట్ లో సహాయకుడిగా పనిచేశారు. 1977 లో గ్రూప్ - IV లో సెక్రెటేరియట్ లో జూనియర్ అసిస్టెంట్ గా, 1978 లో గ్రూప్ - IIB లో సీనియర్ అసిస్టెంట్ గా సర్వీస్ కమిషను ఆఫీసులో పనిచేశారు. 1985 లోగ్రూప్ -II లో డిప్యూటీ తహశీల్దారుగా కడప జిల్లాలో MRO గా పనిచేశారు. 1987 లో గ్రూప్ -I లో డిప్యూటీ కలెక్టర్ గా విజయం సాధించి కరీంనగరు జిల్లా పెద్దపల్లి, కడపజిల్లా రాజంపేటల్లో RDO గా, అనంతపురంలో DRO గా, మళ్ళీ కడప జిల్లాలో PD, DRDA గా, కడప, ప్రకాశం జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ గా, కర్నూలు జిల్లా కలెక్టర్ గా, టిటిడి జాయింట్ యి.వో గా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా, ఎండోమెంట్ కమీషనర్ గా పనిచేశారు. 2012 వ సంవత్సరంలో సాంస్కృతికశాఖ కార్యదర్శిగా తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.

క్రీడలు

మార్చు

చిన్నప్పటి నుండి ఆటలమీద అమితమైన ఆసక్తి చూపించేవారు. గోలీలు, బొంగరాలు, కోడు బిళ్ళ, చెడుగుడు లాంటి గ్రామీణ క్రీడల్లోనే గాక బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి వాటిల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. పాఠశాల తరపున ఇతర ప్రాంతాలకు వెళ్ళి పోటీల్లో కూడా పాల్గొన్నారు. 1978వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున బొంబాయిలో జరిగిన అఖిల భారత సివిల్ సర్వీస్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.

డిగ్రీ చదివేప్పుడు కాలేజీ NCC లో చేరి అందులో తన ప్రతిభను కనబరిచారు. మూడుసార్లు సాంవత్సరిక శిక్షణా శిబిరాల్లో పాల్గొనడమే గాక తిరుపతి గ్రూపు స్థాయిలో ఉత్తమ కేడెట్ గా బహుమతినందుకున్నారు. భోపాల్లో 45 రోజులపాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నారు.

కళ, సామాజిక రంగాలు

మార్చు
 
ఆకాశదేవర నాటకంలోని శూన్యస్వామి పాత్రలో బలరామయ్య

1969వ సంవత్సరం అక్టోబరు నెలలో శ్రీకాళహస్తి నాటక బ్రహ్మ శ్రీ గుర్రప్ప పిళ్లె శిక్షణలో మొట్టమొదటిసారిగా దుర్యోధన ఏకపాత్రాభినయంతో నాటకరంగ ప్రవేశం చేశారు. 1970 లో కాలేజీ నాటిక పోటీలలో ఆదివిష్ణు గారి రాతి మనిషిలో రెడ్డి పాత్రకు ఉత్తమ నటుడు, 1971 లో ఎంతెంత దూరంలో పాత్రకు ఉత్తమ ద్వితీయనటుడు, 1972 లో చింతపల్లి హనుమంతరావు గారి సుడిగుండంలో పాత్రకు ఉత్తమనటుడు, 1972 లోనే అంతర్ కళాశాలల నాటికల పోటీలలో చూడు చూడు నీడలు నాటికకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు బహుమతులందుకున్నారు.

బీనాదేవి కథానిక ఆధారంగా డబ్బు ఏకపాత్ర, దుర్యోధన, కర్ణ, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బాలచంద్ర, అశ్వత్థామ మొదలైన సాంఘిక పౌరాణిక ఏక పాత్రలు ప్రదర్శించి అనేక బహుమతులందుకున్నారు. మహానటుడు జలకం రాధయ్య దర్శకత్వంలో గణేష్ పాత్రో గారి ఆగండి కొంచెం ఆలోచించండి, కొడుకుపుట్టాల యండమూరి వీరేంద్రనాథ్ మనుష్యులొస్తున్నారు జాగ్రత్త, చరిత్ర మొదలైన నాటికలు, డా. కొర్రపాటి గంగాధరరావు గారి యధాప్రజా తధారాజా కె.యస్.టి. శాయి సంఘం చెక్కిన శిల్పాలు రామారావు దేవాలయాల్లో బూతుబొమ్మలు మొదలైన నాటకాలు ప్రదర్శించి ఉత్తమ నటుడు, విలన్, హాస్యనటుడు బహుమతులందుకున్నారు.

నటీమణులు డబ్బింగ్ జానకి, ఇందిర, తెలంగాణ శకుంతల బృందంతో కలిసి నటించారు. హైదరాబాదులో పనిచేసేటప్పుడు శ్రీ యర్రంనేని చంద్రమౌళి సిద్ధప్ప నాయుడు, గండవరపు సుబ్బరామిరెడ్డి, రమణారెడ్డి యువకళావాహిని నాగేశ్వరరావు మొదలైన వారితో కలిసి స్టేజి, రేడియో నాటిక నాటకాలు ప్రదర్శించారు. కరీంనగర్, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారితో నాటకాలాడించారు.

ఆయన అటు గ్రామాల్లో నాటకాలు వేయడంతోబాటు, దుర్యోధనుడి ఏకపాత్రభినయం ప్రధానాంశంగా తీసుకొని సుయోధన సార్వభౌమ, అశ్వత్థామ, డబ్బు డబ్బు వంటి ఏకపాత్రాభినయాలు రచించారు.[2]

బలరామయ్యకు పచ్చదనంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. తాను ఎక్కడ పనిచేసినా అక్కడ పచ్చగా ఉండాలని కోరుకునేవారు. దీంతో ఆయన ఎక్కువగా చెట్లు నాటడంపై దృష్టి సారించేవారు. ఆయన ప్రేరణతోనే గ్రామంలోని వారంతా కలిసి స్పందన అనే సంస్థను 2005లో స్థాపించారు. దీనికి బలరామయ్య గౌరవాధ్యక్షులు. యువకులంతా కలిసి ఊళ్లో ఆయన ప్రోద్బలంతో 1991లోనే 2000 మొక్కలను నాటారు.

పెరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో గ్రామాల్లో పలు ఆటలు, వంటలు వంటివి కనుమరుగైపోతున్నాయని, వాటిని సజీవంగా ఉండేలా చేయాలని ఆయన ఎంతగానో తహతహలాడేవారు. గ్రామంలో ఉన్న వారందరిని పోగుచేసి ఆటలు ఆడించేవారు. జిల్లా స్థాయిలో కూడా ఆటల పోటీలను నిర్వహించేవారు.

గ్రామీణ ప్రాంతాల్లో నాటకాల ద్వారా ఉన్న తృప్తి సినిమా ద్వారా ఉండదని ఆయన నమ్మకం. దీంతో ఆయన గ్రామంలో నాటకాలువేయడం వైపు దృష్టి సారించారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకటిచేసి నాటకాలు వేయించారు. సుమారు నలభైమంది నటులతో కూడిన శ్రీ కృష్ణరాయబారం నాటకాన్ని ఊళ్లో వేయంచారు. ఈ నాటకంలో ఆయన దుర్యోధనుని పాత్ర పోషించారు. ఈ పాత్ర అప్పట్లో రామారావుని పోలిఉండేదని ఊరివారంతా ఎంతో మెచ్చుకున్నారు. ఆయన నటనను గమనించి దాసరి నారాయణరావు గారు కూడా సినిమా అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినా నో చెప్పగలిగారు. శ్రీకాళహస్తిలో నాటక కళా పరిషత్ అభివృద్ధిలో తనవంతు కృషి చేశారు.

ఒక అధికారిగా శ్రీకాళహస్తి సమీపంగా ఉండే గ్రామాలలో గుడుల నిర్మాణానికి ప్రభుత్వపరంగా తాను చేయగలిగిన సహాయం చేసేవారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఉపకార్యనిర్వాహణాధికారిగా నిర్వహించిన బాధ్యతలు ఆయన ఆధ్యాత్మిక సేవా ప్రస్థానంలో కీలకమైనవి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేసే సమయంలో పలు సంస్కరణలకు నడుంకట్టారు. బ్రేక్ దర్శనాల వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకున్నారు. తిరుమలలో ఉండే చిన్నచిన్న షాపులను తొలగించి, వారికి శాశ్వత సరిష్కారాన్ని సూచించడంలో ఆయన కృషిచేశారు.

2001 వ సంవత్సరంలో శ్రీపాటిబండ్ల ఆనందరావు గారితో పరిచయమైనప్పటి నుండి ఆయన నాటకాలు నిషిద్ధాక్షరి, అంబేద్కర్, ఆకాశదేవర మొదలైన నాటకాలు ప్రదర్శించారు. అన్నిటికంటే తెలుగు నాటక రంగంలో పేరుగాంచిన పడమటి గాలి నాటకంలో నాటకంలో రాంకోటుగా, మాయోడుగా నటించారు. పడమటి గాలి వంటి నాటకం తెలుగులో ఇప్పటివరకు రాలేదనీ, కన్యాశుల్కంతో సమానమైన, కొన్ని విషయాల్లో అంతకంటె గొప్పదైన నాటకం "పడమటి గాలి" అనీ నిరూపిస్తూ ఒక విశ్లేషణాత్మక గ్రంథాన్ని రచించి వెలువరించారు.

నిరంతరమూ నాటకాన్ని గురించే ఆలోచించే, ఆశ్వాసించే నాటకాభిమాని అతను. నాటకం మనిషిని సర్వ విధాలుగా అభివృద్ధి చేస్తుందని, వ్యక్తిత్వాన్ని పెంపొందింప జేస్తుందనీ, కళాకారులు సమాజాభివృద్ధికి పనిచేస్తారే గాని దాని విచ్ఛిత్తికి కారకులు కారని విశ్వసించేవారు బలరామయ్య.

నాటకరంగం

మార్చు
  1. పడమటి గాలి నాటకం (నటన)
  2. ఆకాశదేవర (దర్శకత్వం, నటన) [3][4][5][6]

మూలాలు

మార్చు
  1. సాక్షి. "ఆచరించాం... అనుసరించారు..." Retrieved 1 June 2017.
  2. సరసభారతి ఉయ్యూరు. "'రంగస్థలం' కోసమే జీవితం అంకితం". sarasabharati-vuyyuru.com. Retrieved 1 June 2017.
  3. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ప్రతి జిల్లాకు ఆడిటోరియం: రిటైర్డ్‌ ఐఏఎస్‌ బలరామయ్య". lit.andhrajyothy.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
  4. ఆంధ్రభూమి, విశాఖపట్టణం (7 August 2017). "ఆకాశదేవర నాటక సమీక్ష (నాటక సమీక్ష)". www.andhrabhoomi.net. శ్రీమతి కోవిల. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
  5. నవతెలంగాణ. "25 నుంచి రసరంజని నాటకోత్సవాలు". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 17 April 2020.
  6. ఆంధ్రప్రభ. "కర్నూలు: నేడు 'ఆకాశ దేవర' నాటకం ప్రదర్శన". Retrieved 17 April 2020.[permanent dead link]