పరివేషము (గుడి, గాలిగుడి గానూ వ్యవహరిస్తారు) అనేది సూర్యుని, లేక చంద్రుని కాంతికీ, వాతావరణంలోని మంచు స్ఫటికాలకూ మధ్య పరస్పర చర్య జరిగినప్పుడు ఉద్భవించే కాంతీయ దృగ్విషయం (ఆప్టికల్ ఫెనామెనాన్). [1]పరివేషాలు రంగు వలయాలూ, తెల్లటి వలయాలూ, విల్లు ఆకారాలూ, మచ్చలూ, తదితర పలు రూపాల్లో ఉండవచ్చు. వీటిలో చాలా వరకు సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ కనిపిస్తాయి, కానీ ఆకాశంలో ఎక్కడైనా కనిపించవచ్చు. విరివిగా కనిపించే పరివేషాలు వృత్తాకార పరివేషాలు (సాధారణంగా 22° పరివేషం అంటారు), లైట్ పిల్లర్లు, సన్ డాగ్‌లు. ఇవే కాకుండా, ఎక్కువగా సంభవించేవీ, అరుదుగా కనిపించేవీ ఎన్నో రకాల పరివేషాలు ఉన్నాయి.

2021 ఫిబ్రవరి 13న అమెరికాలోని న్యూ హాంప్షైర్లోని బ్రెట్టన్ వుడ్స్‌లో సూర్యుని చుట్టూ కనిపించిన 22° పరివేషము.
కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ సమీపంలో చంద్రుని చుట్టూ కనిపించిన 22° పరివేషము, దాని చుట్టువలయము
పరివేషంఎగువ నుండి దిగువకు: సర్కంజెనిథల్ ఆర్క్, సుప్రాలాటరల్ ఆర్క్, ప్యారీ ఆర్క్, అప్పర్ ట్యాంజెంట్ ఆర్క్, 22° పరివేషము

పరివేషాలకు కారణమైన మంచు స్ఫటికాలు సాధారణంగా ఎగువ ట్రోపోస్పియర్ (5-10 కి.మీ.)లోని సిర్రస్ లేదా సిర్రోస్ట్రాటస్ మేఘాలను అవలంబించి ఉంటాయి. అయితే చల్లని వాతావరణంలో అవి భూమికి సమీపంలో కూడా తేలుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని డైమండ్ డస్ట్ అని పిలుస్తారు. స్ఫటికాల ఆకారం, ధోరణిని బట్టి పరివేషాల ఆకారం ఉంటుంది. మంచు స్ఫటికాల వద్ద కాంతి పరావర్తనం, వక్రీభవనం చెందడమే కాకుండా, ఏడు రంగులుగా వికిరణం కూడా చెందవచ్చు. స్ఫటికాలు పట్టకాలూ, అద్దాల వలె ప్రవర్తించడం వల్ల ఇలా జరుగుతుంది.

వాతావరణ శాస్త్రం అభివృద్ధి చెందడానికి ముందు ఈ పారివేషాలను ముందస్తు సూచనలకు ప్రమాణాలుగా వాడేవారు. అవి తరచూ సిర్రోస్ట్రాటస్ మబ్బులనూ, వాటిని అనుసరించే వానమేఘాల వ్యవస్థనూ, తదనుగుణంగా రాబోయే 24 గంటల్లో వర్షాన్నీ సూచిస్తాయి.

చరిత్ర

మార్చు

అరిస్టాటిల్ పరివేషాలనూ, పార్హీలియానూ ప్రస్తావించినప్పటికీ, దానికంటే ముందే ఐరోపా నుంచి రోమ్‌లో క్రిస్టాఫ్ షైనర్ (1630), డాన్సిగ్‌లో యొహానెస్ హెవెలియస్ (1661), సెయింట్ పీటర్స్బర్గ్‌లో టోబైయాస్ లోవిట్జ్ (1794) సంక్లిష్ట కాంతీయ దృగ్విషయాలను ప్రస్తావించారు. చైనాలో వీటి ప్రస్తావన మొట్టమొదటి సారిగా 637వ సంవత్సరంలో "అఫీషియల్ హిస్టరీ ఆఫ్ ద చిన్ డైనాస్టీ" (చిన్ షు) పుస్తకంలో కనిపిస్తుంది. "టెన్ హేలోస్" పేరిన్న విభాగంలో 26 రకాల సౌర పరివేషాలకు సాంకేతిక పేర్లు ఇచ్చారు.[2]

వ్యాదర్‌సోల్స్టావ్లాన్

మార్చు
 
1535 నాటి స్టాక్‌హోం నగరాన్నీ, అప్పట్లో అశుభ శకునంగా భావించిన ఖగోళ దృగ్విషయాన్నీ చూపే "సన్‌డాగ్ పెయింటింగ్" (వ్యాదర్‌సోల్స్టావ్లాన్)

స్టాక్‌హోమ్ నగర అత్యంత పురాతన రంగు చిత్రంగా భావించే వ్యాదర్‌సోల్స్టావ్లాన్ (స్వీడిష్‌లో దీనికి "వాతావరణ సూర్యుడి చిత్రం" అని అర్థం, "ది సన్‌డాగ్ పెయింటింగ్" అని కూడా అంటారు), ఒక పరివేషంతో పాటు రెండు సన్‌డాగ్‌లను చూపించే అత్యంత పురాతన చిత్రాల్లో ఒకటి కూడా. 1535 ఏప్రిల్ 20 ఉదయం రెండు గంటల పాటు, నగరంపై ఆకాశంలో తెల్లని వృత్తాలూ, విల్లు ఆకారాలతో పాటు సూర్యుడి చుట్టూ మరికొన్ని సూర్యులు (సన్‌డాగ్‌లు) కనిపించాయి.

లైట్ పిల్లర్

మార్చు

సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుని పైన ఒక కాంతి స్తంభంలా కనిపించేదే లైట్ పిల్లర్ లేదా సన్ పిల్లర్. చూసేవారు ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ లైట్ పిల్లర్లు సూర్యుడి కింద కూడా కనిపించవచ్చు. షట్కోణ ఫలకం, లేదా షట్కోణ స్తంభం ఆకారంలో ఉండే మంచు స్ఫటికాల వల్ల ఇవి ఏర్పడతాయి. సూర్యుడు హరైజన్ నుంచి 6 డెగ్రీల లోపు ఉన్నప్పుడు మాత్రమే ఫలక స్ఫటికాలు పిల్లర్లను ఏర్పర్చగలవు. అదే స్తంభపు ఆకారంలో ఉండే స్ఫటికాలు సూర్యుడు హరైజన్ నుంచి 20 డిగ్రీల ఎత్తులో ఉన్నప్పుడు కూడా పిల్లర్లను ఏర్పర్చగలవు. స్ఫటికాలు గాలిలో తేలుతూ లేదా పడుతూ ఉన్నప్పుడు సమతలంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. వాటి తీరును బట్టే లైట్ పిల్లర్ల వెడల్పూ, దృశ్యతా ఉంటాయి.

చంద్రుడూ, దీపాలూ, ఇతర ప్రకాశవంతమైన దీపాల చుట్టూ కూడా లైట్ పిల్లర్లు ఏర్పడవచ్చు. భూమిపై ఉన్న దీపాల వల్ల ఏర్పడే పిల్లర్లు, సూర్య చంద్రుల వల్ల ఏర్పడే వాటి కంటే పొడవుగా ఉంటాయి. చూసేవారు దీపలకు దగ్గరగా ఉన్నందున, ఈ పిల్లర్ల ఏర్పాటులో స్ఫటికాల తీరు ప్రభావం తక్కువగా ఉంటుంది.

వృత్తాకార పరివేషం

మార్చు
 
మంచు స్ఫటికాల (పై చిత్రంలో నాలుగు మాత్రమే ఉన్నాయి) వద్ద ఎరుపు, నీలం రంగుల కాంతి వేర్వేరుగా వక్రీభవనం చెందడం వల్ల 22° పరివేషం ఏర్పడింది

సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ 22° వ్యసార్థంతో (చేతిని బారుగ చాపినప్పుడు బెత్తెడు వెడల్పు) వృత్తాకారంలో ఏర్పడే పరివేషమే 22° పరివేషం. ఇది బాగా తెలిసినదీ, ఎక్కువగా ఏర్పడేదీ అవ్వడం వల్ల సాధారణంగా "పరివేషం" అంటే 22° పరివేషం అనే అర్థం. సన్ డాగ్‌లూ, లైట్ పిల్లర్లకు సమతల స్ఫటికాలు అవసరమైతే, 22° పరివేషానికి కొంత యధేచ్ఛగా ఉండే స్ఫటికాలు అవసరం. ఈ మంచు స్ఫటికాల లక్షణాల ఫలితంగా, వృత్తం లోపలి వైపుకు కాంతి పరావర్తనం చెందదు. దీని వలన వృత్తం బయటి కంటే లోపల చీకటిగా/ముదురు రంగులో కనిపిస్తూ ఆకాశంలో రంధ్రం ఉన్నట్టు అనిపిస్తుంది.[3] 22° పరివేషమూ, కరోనా భిన్నమైన దృగ్విషయాలు. కరోనా మంచు స్ఫటికాల వలన కాక నీటి బిందువుల వలన ఏర్పడుతుంది. ఇది వలయం లాగా కాక గుండ్రని బిళ్ళ లాగా ఉంటుంది.

సూర్యుడి చుట్టూ 46° వ్యాసార్థంతోనూ, దిగంతం (హరైజన్) వద్దా, ఆకాశమధ్యం (దీనినే ఖస్వస్తికం అనీ అంటారు)లోనూ సంపూర్ణ వృతాలూ, దీర్ఘవృతాలుగానైనా లేక విల్లు ఆకారాల్లోనైనా పరివేషాలు ఏర్పడవచ్చు.

ఇతర పేర్లు

మార్చు

ఆంగ్లం మాండలికం కార్నిష్‌లో కోడి కన్ను అని పిలిచే సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడే పరివేషాన్ని చెడు శకునంగా భావిస్తారు. ఈ పదం బ్రెటన్ భాషలోని కోగ్-హీల్ (సన్ కాక్) నుంచి వచ్చింది.[4] నేపాల్లో, సూర్యుని చుట్టూ ఏర్పడే పరివేషాన్ని ఇంద్రసభ అని పిలుస్తారు. అంటే హిందూ మతంలో వర్షం, ఉరుములు, మెరుపుల దేవుడైన ఇంద్రుడి సభగా భావిస్తారు.[5]

కృత్రిమ పరివేషాలు

మార్చు

సహజ దృగ్విషయమైన పరివేషాన్ని అనేక పద్ధతుల ద్వారా కృత్రిమంగా కూడా పునరుత్పత్తి చేయవచ్చు. కంప్యూటర్ సిమ్యులేషన్ ఒక విధానం అయితే, రెండోది ప్రయోగాత్మకమైన పద్ధతి.[6][7] రెండో పద్ధతిలో ఒక స్ఫటికాన్ని సరైన అక్షం/అక్షాల చుట్టూ తిప్పడం ద్వారా, లేక రసాయనిక విధానం ద్వారా చేస్తారు. సారూప్య వక్రీభవన జ్యామితులను కనుగొనడం అనేది మరింత పరోక్ష ప్రయోగాత్మక విధానం.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. మూస:Cite American Heritage Dictionary
  2. . "Ancient Chinese Observations of Solar Haloes and Parhelia".
  3. "Disk with a hole in the sky". Atmospheric Optics. Retrieved 3 August 2016.
  4. Nance, Robert Morton; Pool, P. A. S. (1963). A Glossary of Cornish Sea-Words. Cornwall: Federation of Old Cornwall Societies. p. 61.
  5. "Nepal skies graced with extraordinary 'circular rainbow' halo around sun". The Himalayan Times. 9 July 2015. Retrieved 3 August 2016.
  6. Cowley, Les; Schroeder, Michael. "HaloSim3". atoptics.co.uk.
  7. "HaloPoint 2.0". saunalahti.fi. Archived from the original on 2016-10-07.
"https://te.wikipedia.org/w/index.php?title=పరివేషము&oldid=4380837" నుండి వెలికితీశారు