పర్వతనేని బ్రహ్మయ్య
పర్వతనేని బ్రహ్మయ్య (అక్టోబర్ 2, 1908 - జులై 20, 1980) ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (Chartered Accountant). పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించి దానికి దేశవ్యాప్తముగా గౌరవము సంపాదించి, ఆడిటింగ్ అనే వృత్తిలో వేలమందికి శిక్షణనిచ్చి చిరస్మరణీయుడయ్యాడు.
జననం
మార్చుబ్రహ్మయ్య 1908, అక్టోబర్ 2వ తేదీన కృష్ణా జిల్లా నూజెళ్ళలో జన్మించాడు. 1928 లో మద్రాసు లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత లండన్ వెళ్ళి యఫ్.సి.ఎ అభ్యసించి ఇంకార్పొరేటెడ్ అకౌంటెంట్ అయ్యాడు.
వృత్తి
మార్చుఇంగ్లాండు నుండి స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో సి.ఏ.గా వృత్తి ప్రారంభించాడు. 1932 ఏప్రిల్ 1న బ్రహ్మయ్య అండ్ కంపెనీ స్థాపించాడు. క్రమముగా తన కార్యకలాపాలు ఆంధ్ర రాష్ట్రము, బెంగుళూరు ప్రాంతాలకు వ్యాపింపచేశాడు. 40 ఏళ్ళపాటు క్రియాశీలంగా విధులు నిర్వర్తించి 1972లో పదవీ విరమణ చేశాడు. దేశంలో ఎన్నో ప్రైవేటు రంగ దిగ్గజాలకు తనదైన శైలిలో సేవలందించిన ఘనత బ్రహ్మయ్యది. పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, పరిశ్రమలకు ఛార్టర్డ్ అకౌంటెన్సీ సేవలందించాడు. బ్రహ్మయ్య సంస్థ వారు ప్రభుత్వ రంగానికి చెందిన పలు సంస్థలకు ఆడిటర్లుగా పనిచేస్తున్నారు. పలు కంపెనీల బోర్డులలో డైరెక్టరుగా వ్యవహరించిన బ్రహ్మయ్యకు వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొన్న సమస్యలపై నిశిత అవగాహన ఉండేది. అఖండ మేధా సంపత్తితో తానే ఒక సంస్థగా ఎదిగిన వ్యక్తిత్వం బ్రహ్మయ్యది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలగు సంస్థలకు అధ్యక్షునిగా పనిచేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర మండలిలో డైరెక్టరుగా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ధర్మకర్తలలో ఒకరుగా ఉన్నాడు.
బ్రహ్మయ్య గొప్ప కళాభిమాని కూడ. మద్రాసులో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 'కళాభారతి' కి ఏడేళ్ళపాటు అధ్యక్షునిగా పనిచేశాడు. తెలుగు భాష సమితికి మూడు దశాబ్దాలకు పైగా గౌరవ కోశాధికారి.
ఎన్నో దానాలు, పలు విద్యాసంస్థలకు విరాళాలిచ్చాడు. ఆయన పేరు మీద విజయవాడలో సిద్ధార్థ విద్యా సంస్థ ఒక కళాశాల స్థాపించింది.