పల్లెర్ల రామ్మోహనరావు
పల్లెర్ల రామ్మోహనరావు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి, కళాకారుడు. విమోచనోద్యమకారుడు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పల్లెర్ల హనమంతరావు ఇతని పెద్దనాన్న. రామ్మోహనరవు 1965, ఆగస్టు 9న జన్మించాడు.[1] పాలమూరు పట్టణంలోనే విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం వేముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి శ్రేణి తెలుగు పండితులుగా పనిచేస్తున్నాడు[2]. 2014-15 విద్యా సంవత్సరానికి గానూ మార్చిన పాఠశాల తెలుగు పాఠ్యపుస్తకాలకు సమన్వయకర్తగా పనిచేశాడు. 2015-16 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం మార్చాలనుకుంటున్న పాఠ్యపుస్తకాల కమిటీలో కూడా వీరు సభ్యులు. జిల్లాలోని కళాకారులను ఏకం చేసి రంగస్థల నాటకాలపై ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా భజన కీర్తనలు కూడా రచించాడు. శ్రీఅప్పన్నపల్లి ఆంజనేయస్వామి చరిత్ర, శ్రీపార్వతీశ్వర భజనకీర్తనలు రచించాడు. కళారంగానికి సంబంధించి ఇతను రాసిన ఎన్నో వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. నాటకాలలో పాత్రలు కూడా వేశాడు.
సాహితీ సేవ
మార్చుపద్యం, వచన కవిత్వం రెండిటిలోనూ వీరిది అందె వేసిన చెయ్యి. మరీ ముఖ్యంగా పద్యం పాడటంలో జిల్లాలో వీరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో! పాలమూరు అంటే వెనుకబడిన ప్రాంతం అని అందరూ అంటారు. నిజమే. కానీ ఈ కవి మాటల్లో చూడండి ఆ వెనుకబడటం ఎలాంటిదో తెలుస్తుంది...
వెనుకబడిన జిల్లా అని వెక్కిరింత మాకు
నిజమే మరి,
ప్రజాకంటకుడైన నిజాం తోక ముడిచేవరకు వెనుకబడిన జిల్లా
వైదుష్యంతో విర్రవీగే వారి వెర్రి కుదిర్చే వరకు వెనుకబడిన జిల్లా
పాలమూరు లేబరై ప్రాజెక్టులు కడుతూ
దేశాభ్యుదయం కోసం వెనుకబడిన జిల్లా
[3].