పశ్చిమ గాంగులు
పశ్చిమ గాంగులు భారతదేశంలోని ప్రాచీన కాలం నాటి కర్ణాటకకు చెందిన ఒక ముఖ్యమైన పాలక రాజవంశం, ఇది సా.శ. 350 నుండి 1000 వరకు కొనసాగింది. తర్వాతి శతాబ్దాలలో ఇప్పటి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో విస్తరించిన కళింగ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు గాంగుల నుండి వారిని వేరుగా గుర్తుపట్టడానికి "పశ్చిమ గాంగులు" అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో పల్లవ సామ్రాజ్యం బలహీనపడటం వల్ల బహుళ స్థానిక వంశాలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటున్న కాలంలో పశ్చిమ గాంగులు తమ పాలనను ప్రారంభించారని సాధారణంగా నమ్ముతారు. ఈ ఘటనను కొన్నిసార్లు సముద్ర గుప్తుని దక్షిణభారతదేశ విజయాలకు ముడిపెట్టి చెప్తారు. పశ్చిమ గాంగుల సార్వభౌమాధికార పరిపాలన సా.శ. 350 నుండి 550 వరకు కొనసాగింది, మొదట కోలార్ నుండి పాలించి, తరువాత వారి రాజధానిని ఇప్పటి మైసూర్ జిల్లాలోని కావేరి నది ఒడ్డున ఉన్న తలకాడుకు మార్చుకున్నారు.
పశ్చిమ గాంగ సామ్రాజ్యం | ||
---|---|---|
Capital | కోలార్ తలకాడు | |
Government | రాచరికం |