పారనంది రామశాస్త్రి

పారనంది రామశాస్త్రి (1853-1930) మహావ్యాఖ్యాతగా, విమర్శకుడుగా పేరుపొందిన పండితుడు.[1][2]

పారనంది రామశాస్త్రి
Paranandi ramasastry.jpg
జననం1853
మరణం1930
తల్లిదండ్రులు
  • ముఖలింగేశ్వరుడు (తండ్రి)
  • రామలక్ష్మమ్మ (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

ఇతడు కాసలనాటి వైదిక బ్రాహ్మణకుటుంబంలో పరీధావి సంవత్సరం(1853) శ్రావణ శుక్ల నవమితిథి నాడు రామలక్ష్మమ్మ, ముఖలింగేశ్వరుడు దంపతులకు పర్లాకిమిడి సంస్థానానికి చెందిన పిండివాడ గ్రామంలో జన్మించాడు. ఆశ్వలాయన సూత్రుడు.ఇతని గోత్రము కాశ్యపస గోత్రం.

ఇతడు పేరు మోసిన పండితుడు, క్రొత్తతీరు లెరిగిన విమర్శకుడు. సంస్కృతాంధ్రములలో సరితూకముగల పరిశ్రమ పాటవము కలవాడు. తొలుత కావ్యపాఠము కావించి శాస్త్రపఠనముపై మనసు పెట్టి బొబ్బిలి చేరి సుసర్ల సీతారామశాస్త్రి వద్ద తర్కాలంకార వేదాంతములు అధ్యయనం చేశాడు. సంస్కృతములో పాండిత్యం సంపాదించాడు. తెలుగుభాషలోని సొంపులను గుర్తించినాడు.

పర్లాకిమిడి రాజు ఇతని సామర్ధ్యము తెలిసికొని తన సంస్థానంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ పదవి యిచ్చి గౌరవించాడు. ఆ ఉద్యోగం 1853 మొదలు 1911 వరకు నిరాటంకంగా కొనసాగినది. ఇతడు తాత్వికదృష్టిగల కర్మిష్ఠియగుటచే, ఇతని కుమారుడు పట్టభద్రుడై, ఉద్యోగియై, పదిరాళ్లు సంపాదించుకొను ప్రయోజకుడైన తరువాత ఈ ఉద్యోగాన్ని విరమించాడు.

సారస్వత రంగంసవరించు

దేవీ భాగవతమును తెలిగించిన త్రిపురాన తమ్మయదొర ఇతడిని సత్కరించాడు. ఉర్లాము మొదలైన ఆస్థానాలలో ఇతడు ధర్మాది శాస్త్రాల పరీక్షలలో గెలిచి సన్మానాలందుకున్నాడు. పండితులతో శాస్త్రార్థములు "నీవా నేనా" యని చేయగల రామశాస్త్రికి చాలకాలం వరకు తెలుగు సాహిత్యం తెలియదు. గిడుగు వెంకట రామమూర్తి వాదములు విని ఆంధ్రభారతము తీరెట్లుండునో అని చదవడం ప్రారంభించాడు. అది మొదలు, అగస్త్యునివలె యావదాంధ్ర వాజ్మయ మహోదధిని ఇతడు ఆపోశన పట్టాడు. దాని ఫలితమే "ఆంధ్ర మహాభారత విమర్శనము". ఇది 500 పుటలు పైబడిన కూర్పు. ఉద్యోగపర్వ విమర్శనము మాత్రమే ముద్రించబడినది.

ఆంధ్రశబ్దచింతామణిపై "ఉద్ద్యోతిని" అను గొప్ప వ్యాఖ్యా గ్రంథము ఇతడు రచించాడు. వీరేశలింగము పంతులు చింతామణి నన్నయ కృతము కాదనగా, ఆ వాదము తప్పు అని ఇతడు సోదాహరణముగా నన్నయకృతమే అని నిరూపించాడు. ఇది తెలుగులో ఇతని తొలిరచన. జంకులేని విద్వాంసుడు కావటం మూలాన, ఇతడేమి వ్రాసినా స్వాతంత్ర్య రేఖలు స్పష్టముగ గోచరిస్తుంది. "జ్ఞ" యను వర్ణము కంఠ్యమా, తాలవ్యమా అనే విషయాన్ని చర్చిస్తూ గొప్ప విమర్శ వెలువరించాడు. ఇతని విమర్శనా రచనలెన్నో "భారతి" మొదలైన పత్రికలలో ప్రచురితాలు. పర్లాకిమిడి ప్రభువుల పిన్నతండ్రి అయిన ఒక రోజు ప్రోత్సాహంతో ఇతడు సంస్కృతరూపక రచనకు పూనుకున్నాడు. ధర్మశాస్త్రముపై ఇతడికి మంచి అభినివేశం ఉంది. నిరంతరం ధర్మగ్రంథావలొకనంతో కాలక్షేపం చేసేవాడు.

రచించిన గ్రంథాలుసవరించు

  1. ఆంధ్రశబ్దచింతామణి (ఉద్ద్యోతినీ వ్యాఖ్య)
  2. ఆంధ్రమహాభారత విమర్శనము
  3. కురుక్షేత్రయుద్ధ కాలనిర్ణయము
  4. మధుకేశ్వరీయము (సంస్కృత నాటకము).

మరణంసవరించు

ఇతడు 1930, డిసెంబరు 6వ తేదీన మరణించాడు.

మూలాలుసవరించు

  1. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (1940). "  పారనంది రామశాస్త్రి".   ఆంధ్ర రచయితలు. అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి. వికీసోర్స్. 
  2. ఒక శిష్యుడు (1 February 1932). "కీ.శే.శ్రీ పారనంది రామశాస్త్రులు గారు". భారతి మాసపత్రిక. 8 (2): 329–331. Retrieved 22 May 2020.[permanent dead link]

బయటి లంకెలుసవరించు