పీటర్ బార్కర్ హోవార్డ్ మే, సీబీఈ (1929 డిసెంబరు 31 - 1994 డిసెంబరు 27) సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఇంగ్లాండ్ జట్ల తరపున ఆడిన ఇంగ్లిష్ క్రికెటర్. తన పాఠశాల రోజుల్లోనే క్రికెట్ సంచలనంగా పేరొందిన మే తన క్రికెట్ కెరీర్ మొత్తాన్ని ఔత్సాహికుడిగానే (అమెచ్యూర్) కొనసాగించాడు. చాలామంది ఆటగాళ్ళు, అభిమానులు యుద్ధానంతర కాలంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆడిన అత్యుత్తమ బ్యాటర్‌గా అతన్ని పరిగణించారు.[1]

పీటర్ మే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పీటర్ బార్కర్ హోవార్డ్ మే
పుట్టిన తేదీ(1929-12-31)1929 డిసెంబరు 31
రీడింగ్, బెర్క్‌షైర్, ఇంగ్లండ్
మరణించిన తేదీ1994 డిసెంబరు 27(1994-12-27) (వయసు 64)
లిప్‌హూక్, లంకషైర్, ఇంగ్లండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 361)1951 జూలై 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1961 ఆగస్టు 17 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1950–1963సర్రే
1950–1952కేంబ్రిడ్జి యూనివర్శిటీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 66 388
చేసిన పరుగులు 4,537 27,592
బ్యాటింగు సగటు 46.77 51.00
100లు/50లు 13/22 85/122
అత్యధిక స్కోరు 285* 285*
వేసిన బంతులు 102
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 42/– 282/–
మూలం: Cricinfo, 2019 మే 19

అతని విజ్డెన్ అతని సంస్మరణలో "అతను పొడుగ్గా, అందంగా ఉండేవాడు. అతని బ్యాటింగ్ శైలి క్లాసికల్‌కు దగ్గరగా ఉండేది. ఒక తరం పాఠశాల కుర్రాళ్లకు అతను హీరో" అని అభివర్ణించాడు.[2] మేని బ్రిటిష్ ప్రభుత్వం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌గా 1981లో నియమించింది. అతన్ని మరణానంతరం 2009లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.[3] విస్డెన్ క్రికెటర్ అల్మానాక్ మే గురించి "స్కూల్‌బాయ్ ప్రాడిజీ"గా ప్రారంభమై "ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా" అయ్యాడని అభివర్ణించింది.[4]

తొలినాళ్ళ కెరీర్

మార్చు

బెర్క్‌షైర్‌లోని రీడింగ్‌లో జన్మించిన పీటర్ మే లైటన్ పార్క్ జూనియర్ స్కూల్లోనూ, చార్టర్‌హౌస్లోనూ, కేంబ్రిడ్జ్‌లోని పెంబ్రోక్ కాలేజీలో చదువుకున్నాడు. ఈ రెండుచోట్లా అతను బ్యాటింగ్ ప్రాడిజీగా పరిగణించబడ్డాడు.[నోట్స్ 1] ఈటన్ ఫైవ్స్ అనే రగ్బీ వంటి ఇంగ్లిష్ ఆట కూడా ఆడేవాడు. 1951 నుంచి 1953 మధ్యకాలంలో మూడు సంవత్సరాల పాటు కిన్నైర్డ్ కప్‌ను తన సోదరుడు జెడబ్ల్యుహెచ్ మే భాగస్వామ్యంతో గెలుచుకున్నాడు. 1950లలో అతను ఒకపక్కన సర్రే కౌంటీకి ఆడుతూ, మరోపక్క, టెస్ట్ క్రికెట్ కూడా ఆడేవాడు. రెంటిలోనూ అత్యంత స్థిరమైన, ప్రభావవంతమైన ఇంగ్లీష్ బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను 1951లో హెడ్డింగ్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 138 పరుగులు చేశాడు. 1960ల ప్రారంభంలో అనారోగ్యం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకునేవరకూ రెగ్యులర్ ఇంగ్లాండ్ ఆటగాడిగా కొనసాగాడు.[5] 1952 మేలో విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకడిగా నిలిచాడు. మే కెప్టెన్సీలో 1954-55 ఆస్ట్రేలియా పర్యటనలో యాషెస్‌ను విజయవంతంగా నిలబెట్టుకోవడంతో తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్సీ విషయంలో లియోనార్డ్ హట్టన్‌కు సహజంగానే వారసుడయ్యాడు.

కెప్టెన్సీ

మార్చు
 
1954–55లో బిల్ జాన్‌స్టన్‌పై ఆన్-డ్రైవ్ ఆడుతున్న పీటర్ మే.

తన కౌంటీ జట్టుకు, జాతీయ జట్టుకు కూడా కెప్టెన్‌గా విజయవంతమై, తన కెప్టెన్సీని బాగా ఆస్వాదించాడు. సర్రే ఏడు సంవత్సరాల పాటు కౌంటీ ఛాంపియన్స్‌గా నిలిచింది, ఇందులో ఆఖరి రెండు సీజన్లకు మే జట్టు నాయకత్వం వహించాడు. 1958 వరకూ అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ ఓటమి అనేదే లేకుండా కొనసాగింది. 1955లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సీరీస్ యుద్ధానంతర కాలంలో అత్యంత ఉత్కంఠభరితమైన సీరీస్‌గా నిలిచింది. ఈ సీరీస్‌లో ఇతని నాయకత్వంలో 1955లో దక్షిణాఫ్రికాను 3-2తో ఇంగ్లండ్ ఓడించింది. 1956లో ఆస్ట్రేలియా 2-1తో, 1957లో వెస్టిండీస్‌ను 3-0తో, 1958లో న్యూజిలాండ్‌ను 4-0తో మే నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఓడిచింది. పొడవుగా, దృఢంగా ఉండే మే స్ట్రెయిట్ బ్యాట్‌తోనూ, అన్ని రకాల స్ట్రోక్స్‌తోనూ దాదాపు నిర్దుష్టంగా భావించదగ్గ టెక్నిక్‌తోనూ, గొప్ప క్రమశిక్షణతోనూ ఇంగ్లండ్ నుంచి యుద్ధానంతరం కాలంలో వచ్చిన అత్యుత్తమ బ్యాటర్‌గా విస్తృతంగా పరిగణింపబడ్డాడు.[6][7][8]

కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాకా అతని బ్యాటింగ్ ప్రమాణాలు మరింతగా మెరుగయ్యాయి. కెప్టెన్‌గా అతని టెస్ట్ సగటు 54.03. అతని అత్యున్నత స్కోర్ వెస్టిండీస్ జట్టు మీద ఎడ్జ్‌బాస్టన్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 288 పరుగుల వెనుకంజలో ఉండగా చేశాడు; ఆ మ్యాచ్‌లో అజేయంగా 285 పరుగులు సాధించాడు.[9] 1990లో గ్రాహం గూచ్ 333 పరుగుల చేసేవరకూ ఇంగ్లండ్ కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే.[10] ఈ మ్యాచ్‌లో కోలిన్ కౌడ్రీ (154) తో కలిసి 411 పరుగులు జోడించి ఇంగ్లండ్ జట్టులో అత్యధిక భాగస్వామ్యం రికార్డు సృష్టించాడు. 1956లో యాషెస్ సీరీస్ మొత్తం తక్కువ స్కోర్లతో సాగుతున్నప్పుడు అతను 90.60 సగటుతో 453 పరుగులు చేశాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో 43 పరుగులకు అవుటైన సందర్భమే సీరీస్ మొత్తంలో అతను 50 కన్నా తక్కువ పరుగులు చేసిన సందర్భం.

తాను బాగా చదువుకున్నవాడూ, అమెచ్యూర్, జెంటిల్‌మెన్ తరగతికి చెందినవాడూ అయినప్పటికీ పీటర్ మే ఇంగ్లండ్ క్రికెట్లో జరుగుతున్న సామాజిక పరిణామాలను అవగాహన చేసుకుని ఆహ్వానించాడు. లెన్ హట్టన్ నాయకత్వంలో అమెచ్యూర్స్, ప్రొఫెషనల్స్ కలసిపోతున్నారని గ్రహించి తదనుగుణంగా కెప్టెన్సీ చేశాడు. జట్టు సభ్యులు, సెలక్టర్ల పూర్తి విధేయతను ఆస్వాదించాడు. తన జట్టు సభ్యులకు సాయం చేయడం, ఆగ్రహావేశాల్లో వ్యక్తులు ఉన్నప్పుడు పరిస్థితిని చల్లబరచడం వంటివాటిలో అతనికి నైపుణ్యం ఉండేది.[11] కెప్టెన్‌గా అతను జట్టు క్రమశిక్షణ విషయంలో కటువుగా ఉండేవాడు. ఉన్నత ప్రమాణాలను ఆశించేవాడు. సందర్భాన్ని బట్టి అతను నిర్దాక్షిణ్యంగానూ ఉండేవాడు. అయితే, ఊహాశక్తి లేమి, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వంటివి అతని నాయకత్వంలో లోపాలు.[7][8][12] 1958-59లో అతను చాలా డిఫెన్సివ్‌గా ఆడాడు, బ్యాటర్లను అవుట్ చేయడం పక్కన పెట్టి పరుగులు ఇవ్వకుండా ఉండేలా ప్రయత్నించాడు. ఆస్ట్రేలియన్లకు చాలా సులభంగా ఆట గెలిచే అవకాశం దొరికింది. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో ఇంగ్లండ్ సమస్యల్లో చిక్కుకున్న సందర్భంలో కూడా ఇయాన్ మెకిఫ్ సందేహాస్పద బౌలింగ్‌ను ఎదుర్కొన్న మే క్రీడాస్ఫూర్తితో ఉన్నట్టు కనిపించదన్న కారణంతో అధికారికంగా ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. అయితే, నిజానికి చాలా సంవత్సరాల తర్వాత నియమాలకు విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ ఉందన్న కారణంతోనే మెకిఫ్ కెరీర్ ముగిసిపోయింది. ఆస్ట్రేలియా పర్యటన ఇలా ముగిశాకా తర్వాత మే మళ్ళీ పుంజుకున్నాడు. న్యూజిలాండ్‌ను 1-0తో, భారత్ 5-0తో ఓడించి, వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్‌ను 1-0తో మొదటి సిరీస్ విజయానికి నడిపించాడు. అతని నేతృత్వంలో ఇంగ్లండ్ 1961లో తిరిగి ఆస్ట్రేలియన్ల చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యేనాటికి 41 టెస్టులలో (20 విజయాలు, 10 ఓటములు, 11 డ్రాలు) కెప్టెన్‌గా వ్యవహరించి ఆనాటి రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ సిరీస్‌లో అతన్ని ఓడించిన ఏకైక వ్యక్తి బెనాడ్. అతను 1963లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్ అయ్యాడు. ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ విల్లిస్ ఫాబెర్ డుమాస్‌ సంస్థలో లండన్లో ఒక ఉద్యోగాన్ని చేపట్టాడు.[5]

క్రికెట్ నిర్వాహకునిగా

మార్చు

1982 మేలో ఇంగ్లండ్ క్రికెట్ సెలెక్టర్ల ఛైర్మన్‌గా అలెక్ బెడ్సర్‌ తర్వాత బాధ్యతలు చేపట్టాడు. 1988 సమ్మర్ ఆఫ్ ఫోర్ కెప్టెన్‌గా పేరొందిన ఇంగ్లండ్ వెస్టిండీస్ సీరీస్‌కి అధ్యక్షత వహించడంతో పాటు ఏడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు.[5] అతను మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరణానంతరం సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌కు 1995 నుండి 1996 వరకు అధ్యక్షుడిగా అతని పేరు వేశారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాయల్ నేవీలోని రైటర్ శాఖలో మే తన నేషనల్ సర్వీస్ పూర్తిచేశాడు.[13] అతను 1959లో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ హెరాల్డ్ గిల్లిగాన్ కుమార్తె వర్జీనియా గిల్లిగాన్‌ను వివాహం చేసుకున్నాడు; వారికి నలుగురు కుమార్తెలు.

మే తన 65వ పుట్టినరోజుకు నాలుగురోజుల ముందు 1994 డిసెంబరు 27న బ్రెయిన్ ట్యూమర్‌ కారణంగా హాంప్‌షైర్‌లోని లిఫూక్‌లో మరణించాడు. అతని గౌరవార్థం ఓవల్‌లోని ఒక స్టాండ్‌కు అతని పేరు పెట్టారు.

మూలాలు

మార్చు
  1. Woodcock, John. "Peter May - the complete master". Cricinfo. Wisden Almanack. Retrieved 30 December 2017.
  2. "Obituary - Peter May". ESPN Cricinfo.
  3. "Chappell, May, Graveney inducted into Hall of Fame". Archived from the original on 2018-11-12. Retrieved 2023-11-18.
  4. "The Story Of Peter May's Glorious Ascent – Almanack". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-12-31. Retrieved 2021-08-23.
  5. 5.0 5.1 5.2 Bateman, Colin (1993). If The Cap Fits. Tony Williams Publications. pp. 118–119. ISBN 1-869833-21-X.
  6. p72, Bailey, etc…
  7. 7.0 7.1 p175-77, Arlott
  8. 8.0 8.1 p53-54, Graveney and Giller
  9. "The Home of CricketArchive".
  10. "The Home of CricketArchive".
  11. p219-220, Trueman
  12. p128, Brown
  13. http://www.criclife.com/lists/chronicles/peter-may-22-facts-about-the-former-england-captain-60047

గ్రంథ పట్టిక

మార్చు

బాహ్య లింకులు

మార్చు


ఉల్లేఖన లోపం: "నోట్స్" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="నోట్స్"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=పీటర్_మే&oldid=4077095" నుండి వెలికితీశారు