పునర్జన్మ (1963 సినిమా)

పునర్జన్మ 1963 లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎ. వి. సుబ్బారావు నిర్మించాడు. టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు. ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా అంతగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా ప్రజల మన్నన పొందింది.[1] ఈ చిత్రానికి హిందీ రచయిత గుల్షన్ నందా రాసిన పత్తర్ కీ హోట్ అనే నవల ఆధారం.

పునర్జన్మ
దర్శకత్వంకె.ప్రత్యాగాత్మ
నిర్మాతఎ. వి. సుబ్బారావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు ,
కృష్ణకుమారి
సంగీతంటి.చలపతిరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఆగస్టు 29, 1963 (1963-08-29)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

గోపి ఒక శిల్పి, చిత్రకారుడు. సంగీతమన్నా, కళలన్నా ప్రాణం. తండ్రి పెద్ద జమీందారు. గోపి మేనత్త యశోదాదేవి. ఆమె కూతురు వాసంతి గోపీని ప్రేమిస్తుంది. గోపి ఒక అత్యత్భుత శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ శిల్పాన్ని ఊహించుకుటుంటూ సితార మీటుతూ పాట పాడుతుండగా అగ్ని ప్రమాదం జరిగి విగ్రహం తగలబడిపోతుంది. దాంతో గోపి మతిస్థిమితం కోల్పోతాడు. నాట్యం, సంగీతం తెలిసిన వారినెవరినైనా గోపీకి తోడుగా ఉంచమని వైద్యులు సలహా ఇస్తారు. జమీందారు ముందుగా వాసంతిని తోడుగా ఉంచమంటే చెల్లెలు ఒప్పుకోదు. వాసంతి కూడా తనకు సంగీతంలో, కళల్లో పెద్దగా ప్రవేశం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతుంది. జమీందారు అలాంటి ఆమె కోసం అన్వేషిస్తుండగా నర్తకియైన రాధ తారసపడుతుంది. ఆమెను ఒప్పించి కొడుకు సేవకోసం పనిలో పెడతాడు. ఒకరోజు గోపి పిల్లలు ఆడుకుంటున్న తాళి తీసుకుని యధాలాపంగా ఆమె మెడలో కట్టేస్తాడు. రాధ గోపీని మామూలు మనిషిని చేస్తుంది. కానీ అదే సమయానికి యశోదాదేవి తన కూతురే గోపీకి సేవలు చేసి మామూలు మనిషిని చేసిందని అతన్ని నమ్మిస్తుంది. కానీ గోపీకి మాత్రం ఏదో జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. యశోదాదేవి గోపీని తొందరగా పెళ్ళి చేసుకోమని తన కూతురు వాసంతిని పురమాయిస్తుంది. కానీ గోపి బాధను చూసి తట్టుకోలేక వాసంతి నిజాన్ని చెప్పేస్తుంది. గోపి రాధను వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

ఫలితం

మార్చు

ఈ సినిమా క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునింది కానీ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు ప్రత్యగాత్మ ఈ ఫలితంపై వివరణ ఇస్తూ కొన్ని కథలుంటాయి. వాటిని తీస్తే కళాత్మకంగానైనా తీయాలి. లేదా వ్యాపారధోరణిలోనైనా తీయాలి. అంతేకాని, రెంటినీ మేళవిస్తూ తీసి ఆ రెండింటినీ సాధించాలనుకోవడం తప్పు. ఈ చిత్రం విషయంలో అక్కడే దెబ్బతిన్నాను అన్నాడు.[1]

పాటలు

మార్చు

ఈ సినిమాకు టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు. శ్రీశ్రీ, దాశరథి పాటలు రాశారు.[2][3]

పాట రచయత సంగీతం గాయకులు
ఎవరివో నీవెవరివో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో శ్రీశ్రీ టి.చలపతిరావు ఘంటసాల
అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో దాశరథి కృష్ణమాచార్య టి.చలపతిరావు పి.సుశీల
దీపాలు వెలిగె పరదాలు తొలగె ప్రియురాలు పిలిచె రావోయీ శ్రీశ్రీ టి.చలపతిరావు పి.సుశీల
నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం సి.నా.రె. టి.చలపతిరావు పి.సుశీల
ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా నా హృదయమే కడలియై శ్రీశ్రీ టి.చలపతిరావు ఘంటసాల
మానవుడా మనసు తెరచి నిజము తరచి చూడు గత శ్రీశ్రీ టి.చలపతిరావు పి.సుశీల బృందం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "కళల కోసమే.. పునర్జన్మ". సితార. Archived from the original on 2019-11-09. Retrieved 2020-04-19.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  3. సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006