పుష్పక విమానము

(పుష్పకము నుండి దారిమార్పు చెందింది)

పుష్పక విమానం భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం. రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.

పుష్పక విమానం

సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సీతాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించ బడింది.

దేవశిల్పి అయిన విశ్వకర్మ, బ్రహ్మదేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్దనుండి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకొన్నాడు. రావణ వధానంతంరం శ్రీరాముడు దానిని ఎక్కి లంక నుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునికిచ్చాడు.

మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.

వనరులు

మార్చు
  • సుందర కాండము - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారి ప్రచురణ