పెంకుటిల్లు (నవల)

పెంకుటిల్లు కొమ్మూరి వేణుగోపాలరావు 1956లో రాసిన ప్రసిద్ధ నవల.[1] 1950ల నాటి తెలుగు మధ్యతరగతి జీవనాన్ని నవలలో ప్రతిబింబించారు. ఆ కాలంలో మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా పెంకుటిళ్ళలో నివసించేవారు కాబట్టి రచయిత ఆ పేరును ఎంచుకున్నాడు. తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖమైన నవలల్లో ఒకటిగా కొందరు విమర్శకులు పెంకుటిల్లు నవలను గుర్తించారు. ఈ నవల ద్వారా కొమ్మూరికి ఆంధ్రా శరత్ అనే బిరుదు వచ్చింది. పెంకుటిల్లు వేణుగోపాలరావు అని కూడా పేరు తెచ్చుకున్నాడు.[2]

రచనా నేపథ్యం

మార్చు

రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు నవలను 1956లో రాశారు. కథలో 1940 నుంచి 1950ల మధ్యకాలం, కృష్ణా డెల్టాలోని ఒకానొక పట్టణం స్థలకాలాలుగా అమరాయి.[3]

చిదంబరశాస్త్రి తన వృద్ధురాలైన తల్లి, భార్య శారదాంబ, ముగ్గురు కూతుళ్ళు అన్నపూర్ణ, రాధ, ఛాయ, ముగ్గురు కొడుకులు నారాయణ, ప్రకాశ రావు, వాసుదేవరావుతో కలిసి ఉంటుంటాడు. పిల్లల్లో అన్నపూర్ణకి పెళ్ళి చేసి పంపిస్తారు. రాధ యుక్త వయస్కురాలు. ఛాయ ఇంకా చిన్న పిల్ల. కుటుంబం కోసం చదువు మధ్యలోనే ఆపేసి పెద్ద కొడుకు నారాయణ బ్యాంకు ఉద్యోగంలో ప్రవేశించగా, రెండోవాడు ప్రకాశం మద్రాసులో లా చదువుతూ ఉంటాడు. ఆఖరివాడైన వాసూ బళ్ళో చదువుకుంటూ ఉంటాడు.

చిదంబర శాస్త్రికి పిత్రార్జితమైన రెండెకరాల పొలం, ఓ పెంకుటిల్లూ తప్ప ఇతరత్రా ఆస్తిపాస్తులేవీ ఉండవు. అయినా, అతను వేరే పనేమీ చేయకుండా ఇంట్లోనే ఉండి మిత్రులతో తీరికలేకుండా పేకాడుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ కుటుంబ ఖర్చులు మొత్తం పొలం మీద వచ్చే కొద్దిపాటి ఆదాయం, నారాయణకి వచ్చే వందరూపాయల జీతంతో సాగుతుంటాయి.

ప్రకాశానికి తను బీదవాడిననే భావన కుంగదీస్తూ ఉంటుంది. అతను అద్దెకి ఉండే ఇంటి యజమాని రామారావు, ఆయన కూతురు శకుంతల సహృదయులు. వాళ్ళ కలిమికి తోడు, కులం పట్టింపు కారణంగా ప్రకాశం వాళ్లకి దూరంగానే మసలుతూ ఉంటాడు. ఆ కుటుంబానికి దూరంగా ఉండలనుకుంటాడో పరిస్థితులు అతన్ని అంతగా దగ్గర చేస్తాయి. ఇటు అతని ఇంట్లో ఒకదానిమీద ఒకటిగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాసుకి రోడ్డు ప్రమాదం జరగడం, ముసలావిడకి అనారోగ్యం, చావుబతుకుల్లో ఉన్న ఆవిడ నారాయణ పెళ్ళి చూడాలని పట్టు పట్టి కూర్చోడం, కొన్ని బాధ్యతలైనా నేరవేర్చాక పెళ్ళి చేసుకోవాలనుకున్న నారాయణ, కుటుంబ సభ్యుల బలవంతం వల్ల సుగుణని పెళ్ళి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి.

రాధ కుటుంబం కోసం ఏదన్నా చేయాలని ఉంటుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితులు. అందగత్తె కావడంతో ఆమెని ప్రేమించామని వెంట పడేవాళ్ళు, కోరిక తీర్చమనే వాళ్ళు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. తన సమస్యలు ఇంట్లో చెప్పి వాళ్లకి మరింత సమస్య కాలేక తనలో తానే మధన పడుతూ ఉంటుంది. అనుకోని పరిణామాల అనంతరం, చిదంబర శాస్త్రి జైలుకి వెళ్ళాల్సివస్తుంది. ఆ కుటుంబం పెంకుటిల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. మిగతా కథంతా ఆ కుటుంబం ఆ ఇంటిని ఎలా నిలబెట్టుకోగలిగిందీ నారాయణ తను బాధ్యతలు ఎలా తీర్చుకున్నాదీ అనే విషయాలపై నడుస్తుంది.

మూలాలు

మార్చు
  1. "ఒక పెంకుటిల్లు..." sakshi.com. సాక్షి. Retrieved 19 December 2016.
  2. నెమలికన్ను, మురళి. "పెంకుటిల్లు సమీక్ష". నెమలికన్ను. మురళి. Retrieved 20 May 2016.
  3. సహవాసి (2015). "పెంకుటిల్లు". In డి., వెంకట్రామయ్య (ed.). నూరేళ్ళ తెలుగు నవల (1 ed.). హైదరాబాద్: పర్స్పెక్టివ్స్. pp. 115–120.