పెద్దగట్టు జాతర

పెద్దగట్టు జాతర, తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ పెద్ద జాతర.[1] ఇక్కడికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలలోనుండే కాక పొరుగున వున్న చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్ళ కొక సారి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.

ప్రస్థానం

మార్చు

ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మిక. దురజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.

దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా... ఓ లింగా ........ అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తారు . ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవులకు పూజచేస్తారు.

లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం (శాకాహారం) సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతా యి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.

చౌడమ్మ

మార్చు

ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్‌లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు.

జాతర జరిగే తీరు

మార్చు

జాతర జరిగే తొలిరోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతుబలులు సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభోగంగా జరుగుతుంది.

ఎలా వెళ్ళాలి

మార్చు

పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి (65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో ఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం. ప్రత్యేక బస్సులుంటాయి.

మూలాలు

మార్చు
  1. కన్నెబోయిన, లక్ష్మీనరసింహా, (2016-10-16). "నమస్తే తెలంగాణా" (ఆదివారం). Archived from the original on 14 October 2016. Retrieved 16 October 2016. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)