పోలూరి హనుమత్ జానకీ రామ శర్మ
పోలూరి హనుమజ్జానకీ రామ శర్మ. జననం: జననం:ప్రకాశం జిల్లా వెన్నూరులో, 13-10-1924 తారీకున, మృతి:10-1-2005. నెల్లూరులో. తల్లి:వేంకట నరసమ్మ. తండ్రి:వేంకట నారాయణ రావు. విద్య: నరసరావుపేటలో ప్రాథమిక విద్య, గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ. ఆనర్స్( 1942-45) పింగళి లక్ష్మీకాంతం, గంటి జోగి సోమయాజులు, దువ్వూరి వేంకట రమణ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మల దగ్గర చదువులలో గొప్ప పాండిత్యం సంపాదించారు. 1945లో ఒక సంవత్సరం పాటు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి దగ్గర చదివి, సంస్కృత వ్యాకరణం లోతుపాతులు తెలుసుకొన్నారు. వీరికి భాగవతుల కుటుంబ శాస్త్రి సంస్కృత అలంకార శాస్త్రం, చావలి లక్ష్మీకాంత శాస్త్రి ప్రస్థాన త్రయం బోధించారు. జానకీరామ శర్మ వి.ఆర్. కాలేజీలో తెలుగు ఉపన్యాసకులుగా 37 సంవత్సరాలు పనిచేసి ఆదర్శ ఉపాధ్యాయులుగా పురప్రజల మన్నన పొందారు. కఠిన నియమ నిష్ఠలు పాటించే శర్మగారు ఎప్పుడూ జపతపాలలో ఉంటూ అనేక గ్రంథాలు రాశారు.
పురప్రముఖుల కోరిక మీద నెల్లూరు నగరంలో అనేక ఉపన్యాసాలు చేశారు. వీరు రామాయణం మీద చేసిన ప్రవచనాలు “రామాయణ తరంగిణి” పేర ప్రచురితమైనాయి. శ్రీ కృష్ణ చరిత్రను సాంతం అధ్యయనం చేసి “వాసుదేవ కథా సుధ” పేర మూడు సంపుటాలుగా ప్రచురించారు. వీరి రచనలు నేటికీ పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
వీరి శతజయంతిని శిష్యులూ, అభిమానులూ సంవత్సరం పొడవునా 2024లో జరుపుతూ, రచనలను ప్రచారంలోకి తెస్తున్నారు. ఇనమడుగు ఆశ్రమం ప్రచురణ విశ్వమీమాంస మాస పత్రిక వీరి రచనల ప్రచారానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నది. వాల్మీకి రామాయణాన్ని శ్రీ రామాయణము పేరుతో యథా మాతృకానువాదం చేశారు శర్మగారు. నలచరిత్రను ఒక మహాప్రబంధంగా తీర్చిదిద్దారు. బాపూజీ నిర్యాణం ఖండకావ్యం రచించారు. నన్నయ భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రా ప్రెగ్గడ, రాయల నాటి కవులను పరిచయం చేస్తూ “భువన విజయము” వ్రాసి, ప్రదర్శింప జేశారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక దృష్టి గలిగిన శర్మ విమలానంద భారతీ స్వామి, శివచిదానంద స్వాముల సేవచేసి వారి దగ్గర ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. తన అనుభవ సారాన్ని పూసకరూపంలో వెలువరించారు. రమణ మహర్షిపై అపార గౌరవం. రమణ జీవిత స్మరణోపదేశములు, రమణకథా మణిమాల, త్రిపురా రహస్య జ్ఞాన ఖండ సారము, భగవద్గీత- విజయపథము, శ్రీ రామ హృదయము, శ్రీ రామాయణ దర్శనము మొదలైనవి ఎన్నో రచనలు చేశారు. “బాల ప్రియ” పేరుతో అనేక వేదాంత గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాశారు. దక్షిణామూర్తి స్తోత్రము, దేవీ కాలోత్తరము, వివేక చూడామణి, పరాపూజ, శివానంద లహరి, యోగ వాసిష్ఠము మొదలైన గ్రంథాలకు వ్రాసిన వ్యాఖ్యలు పండితుల ఆమోదం పొందాయి. శర్మగారు పఠన పాఠనాలలో గట్టివారని పేరు పొందారు.
మూలాలు: 1. రామాయణ తరంగిణి,2. శ్రీ రామాయణ దర్శనమ,3.రమణ జీవిత స్మరణోపదేశములు,4.రమణకథా మణిమాల,5. త్రిపురా రహస్య జ్ఞాన ఖండ సారము,6.భగవద్గీత- విజయపథము, 7.శ్రీ రామహృదయము,8.శ్రీ రామాయణ దర్శనము, 9. శ్రీ రామాయణము,10. “వాసుదేవ కథా సుధ” పేర మూడు సంపుటాలు, ప్రకాశకులు: పోలూరు హనుమత్ జానకీ రామశర్మ, 16/216,పొగతోట, నెల్లూరు, 524 001. 11. భువన విజయము,క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీధి, విజయవాడ,2. ఆగష్టు,1979. 12.శ్రీ నలచరిత్ర,{లఘు టీకా సమన్వితము} ప్రకాశకుడు: అన్నలూరు రామమూర్తి, శ్రీ అపార్ట్ మెంట్స్, రామలింగాపురం, నెల్లూరు. 524 002, 1996. 13. పోలూరి హనుమత్ జానకీరామశర్మ జీవితము, సాహిత్యము.