ప్లాటినం ఒక రసాయనిక మూలకం. దీని పరమాణు సంఖ్య 78. దీన్ని Pt చిహ్నంతో సూచిస్తారు. ఇది ఎక్కువ సాంద్రత కలిగిన, బాగా సాగే గుణం కలిగిన, చర్యలకు ప్రతిస్పందించని, రజత వర్ణం కలిగిన విలువైన మూలకం. దీని పేరు స్పానిష్ పదం ప్లాటినో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం లిటిల్ సిల్వర్ అని అర్థం.[1][2]

ప్లాటినమ్ స్ఫటికాలు

ఇది ఆవర్తన పట్టిలో 10 గ్రూపు మూలకాలకు చెందినది. వీటినే ప్లాటినం గ్రూపు మూలకాలు అని కూడా అంటారు. ఈ మూలకం ఆరు ఐసోటోపులు సహజసిద్ధంగా లభిస్తాయి. ఇది భూమి అడుగున లభించే అరుదైన మూలకాల్లో ఒకటి. ప్రపంచంలో దీన్ని ఉత్పత్తిలో 80% దక్షిణాఫ్రికా నుంచే వస్తోంది. నికెల్, రాగి గనుల్లో కొన్ని నేటివ్ డిపాజిట్స్ తో కలిసి ఉంటుంది. భూమి పొరల్లో అరుదుగా లభిస్తుంది కాబట్టి సంవత్సరానికి కొన్ని వందల టన్నుల్లో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనికున్న ముఖ్యమైన ఉపయోగాల వలన కమోడిటీ ట్రేడింగ్ లో ముఖ్యమైన లోహంగా పరిగణించబడుతుంది.[3]

ప్లాటినం అత్యంత తక్కువ అభిక్రియాశీలత (రియాక్టివిటీ) కలిగిన మూలకం. ఇది అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతల్లో సైతం తుప్పుపట్టడాన్ని శక్తివంతంగా అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని నోబుల్ మెటల్ అని కూడా వ్యవహరిస్తారు. ఫలితంగా ఇది వేరే లోహంతో కలవక వివిధ నదుల ఒండ్రుమట్టిలో సహజంగా లభిస్తుంది. దీనిని మొదట పూర్వపు కొలంబియన్లయిన దక్షిణ అమెరికా స్థానికులు కళాఖండాలు తయారు చేయడానికి వాడారు. 16వ శతాబ్దం మొదటిభాగానికి చెందిన యూరోపియన్ రచనల్లో దీన్ని గురించి ప్రస్తావించారు. 1748 లో ఆంటోనియో డి ఉల్లోవా అనే శాస్త్రవేత్త కొలంబియన్ మూలాలు కలిగిన ఈ కొత్త లోహం గురించి ప్రస్తావించే వరకు ఇది శాస్త్రవేత్తల దృష్టిలో పడలేదు.

మూలాలు

మార్చు
  1. "platinum (Pt)." Archived 5 ఏప్రిల్ 2012 at the Wayback Machine Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2012. Web. 24 April 2012
  2. Harper, Douglas. "platinum". Online Etymology Dictionary.
  3. Hobson, Peter. "Currency shocks knock platinum to 10-year lows". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2018-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాటినం&oldid=3262632" నుండి వెలికితీశారు