ప్లానెటరీ నెబ్యులా
ప్లానెటరీ నెబ్యులా (గ్రహ నీహారిక) అనేది ఒక రకమైన ఎమిషన్ నెబ్యులా (ఉద్గార నీహారిక). రెడ్ జెయింట్ నక్షత్రాలు వాటి జీవిత చరమాంకంలో వెలువరించే అయనీకరణ వాయువు విస్తరిస్తూ ప్రకాశిస్తూ ప్లానెటరీ నెబ్యులాలుగా ఏర్పడతాయి.[2]
నిజానికి "ప్లానెటరీ నెబ్యులా" అనే పదం తప్పు అర్థాన్ని ఇస్తుంది. వాటికి గ్రహాలతో సంబంధమేమీ లేదు. తొలి తరం టెలిస్కోపుల ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు గమనించిన గ్రహం లాంటి గుండ్రని ఆకారాన్ని బట్టి వీటికి ఈ పేరు వచ్చింది. దీన్ని మొదటగా 1780 లలో ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ వాడి ఉండవచ్చు. అతను ఈ నెబ్యులాలను గ్రహాలను పోలి ఉంటాయని వివరించాడు; అయితే, 1779 జనవరి నాటికే, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త ఆంటోయిన్ డార్క్వియర్ డి పెల్లెపోయిక్స్, రింగ్ నెబ్యులా పై చేసిన పరిశీలనలలో, "చాలా మసకగా ఉంది, కానీ ఆకారం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది; ఇది బృహస్పతి అంత పెద్దది, ప్రకాశం కోల్పోతున్న గ్రహాన్ని పోలి ఉంది" అని రాసాడు.[3][4][5] ఆధునిక కాలంలో ప్లానెటరీ నెబ్యులాకు ఇచ్చిన వివరణ భిన్నంగా ఉన్నప్పటికీ, పాత పదాన్నే ఇప్పటికీ వాడుతున్నారు.
1 నుండి 8 వరకూ సౌర ద్రవ్యరాశి కలిగిన మధ్యస్థ ద్రవ్యరాశి నక్షత్రాలు, వాటి జీవితాంతంలో ప్లానెటరీ నెబ్యులాలుగా ఏర్పడతాయి. సూర్యుడు కూడా తన జీవిత చక్రం చివరిలో గ్రహ నీహారికగా (ప్లానెటరీ నెబ్యులా) మారుతుందని అంచనా వేసారు.[6] ఈ పరిణామం సాపేక్షంగా స్వల్పకాలిమైనది; బహుశా కొన్ని పదుల సహస్రాబ్దాల పాటు ఇది జరుగుతుంది. సుదీర్ఘమైన నక్షత్ర పరిణామపు దశలతో పోలిస్తే ఇది బహు స్వల్పకాలమే.[7] రెడ్ జెయింట్ లోని వాతావరణం అంతా చెల్లాచెదురైన తర్వాత బయటపడే కోర్ (దీన్ని ప్లానెటరీ నెబ్యులా న్యూక్లియస్ (PNN) అంటారు), ప్రకాశిస్తూ శక్తివంతమైన అతినీలలోహిత వికిరణాన్ని వెలువరించి, చెల్లాచెదురైన పదార్థాన్ని అయనీకరణం చేస్తుంది.[8] శోషించబడిన ఈ అతినీలలోహిత కాంతి, కోర్ చుట్టూ ఉన్న వాయువును శక్తియుతం చేస్తుంది. దీని వలన అది ప్రకాశవంతమైన రంగులతో, గ్రహ నీహారిక వలె కనిపిస్తుంది.
నక్షత్రాలలో తయారైన మూలకాలను ప్లానెటరీ నెబ్యులాలు నక్షత్రాంతర మాధ్యమంలోకి వెదజల్లి గాలక్సీల రసాయన పరిణామంలో బహుశా కీలక పాత్ర పోషిస్తాయి. మరింత సుదూర గెలాక్సీలలో ఉన్న ప్లానెటరీ నెబ్యులాలను కూడా గమనించారు. వాటి రసాయన సమృద్ధి గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అవి అందించాయి.
1990 ల నుండి, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అందించిన పలు చిత్రాల ద్వారా అనేక గ్రహాల నిహారికలు చాలా సంక్లిష్టమైన, వైవిధ్యమైన స్వరూపాలలో ఉన్నాయని తెలిసింది. వీటిలో ఐదవ వంతు నెబ్యులాలు సుమారుగా గోళాకారంగా ఉండగా, మెజారిటీ నెబ్యులాలు సౌష్టవ గోళాకారంగా ఉండవు. ఇలా అనేక రకాల ఆకారాలు ఎలా ఏర్పడతాయనే విషయం ఇంకా బాగా అర్థం కాలేదు. బహుశా బైనరీ కేంద్ర నక్షత్రాలు, నక్షత్ర గాలులు, అయస్కాంత క్షేత్రాలు ఇందులో పాత్ర పోషిస్తాయి.
గెలాక్సీల సుసంపన్నతలో పాత్ర
మార్చుగెలాక్సీల పరిణామంలో ప్లానెటరీ నెబ్యులాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొత్తగా జన్మించిన నక్షత్రాలలో దాదాపు పూర్తిగా హైడ్రోజన్, హీలియంలే ఉంటాయి.[9] కానీ నక్షత్రాలు వివిధ దశల్లో పరిణామం చెందే క్రమంలో,[10] అవి కేంద్రక సంలీన చర్య ద్వారా భారీ మూలకాలను సృష్టిస్తాయి. చివరికి ఈ మూలకాలు బలమైన నక్షత్ర గాలుల వలన చెల్లాచెదురైపోతాయి.[11] ప్లానెటరీ నెబ్యులాలలో సాధారణంగా కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఈ శక్తివంతమైన గాలుల వలన ఈ మూలకాలు ఇంటర్స్టెల్లార్ మాధ్యమంలోకి విస్తరిస్తాయి. ఈ విధంగా, గ్రహ నీహారికల వలన పాలపుంతను ఈ భారీ మూలకాలతో గొప్పగా పరిపుష్టం చేస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ మూలకాలన్నిటినీ కలిపి లోహాలు అంటారు. వీటిని ప్రత్యేకంగా మెటాలిసిటీ పారామీటర్ అంటూ, దాన్ని Z తో సూచిస్తారు.[12]
అటువంటి నెబ్యులాల నుండి ఏర్పడిన తదుపరి తరాల నక్షత్రాలలో అధిక మెటాలిసిటీ ఉంటుంది. ఈ లోహాలు పరిమాణం నక్షత్రాలలో చాలా తక్కువ గానే ఉన్నప్పటికీ, అవి నక్షత్ర పరిణామంపై, సంలీన చర్యలపై ప్రభావం చూపుతాయి. సైద్ధాంతికంగా, విశ్వంలో గతంలో నక్షత్రాలు ఏర్పడినప్పుడు, వాటిలో భారీ మూలకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి.[13] తెలిసిన ఉదాహరణల్లో తక్కువ మెటాలిసిటీ పాపులేషన్ II నక్షత్రాలు.[14][15] నక్షత్రాల మెటాలిసిటీని స్పెక్ట్రోస్కోపీ ద్వారా కనుగొంటారు.
మూలాలు
మార్చు- ↑ Miszalski et al. 2011
- ↑ Frankowski & Soker 2009
- ↑ Darquier, A. (1777). Observations astronomiques, faites à Toulouse (Astronomical observations, made in Toulouse). Avignon: J. Aubert; (and Paris: Laporte, etc.).
- ↑ Olson, Don; Caglieris, Giovanni Maria (June 2017). "Who Discovered the Ring Nebula?". Sky & Telescope. pp. 32–37.
- ↑ Wolfgang Steinicke. "Antoine Darquier de Pellepoix". Retrieved 9 June 2018.
- ↑ Daley, Jason (May 8, 2018). "The Sun Will Produce a Beautiful Planetary Nebula When It Dies". Smithsonian Magazine (in ఇంగ్లీష్). Retrieved 30 March 2020.
- ↑ They are created after the red giant phase, when most of the outer layers of the star have been expelled by strong stellar winds Frew & Parker 2010
- ↑ Frankowski & Soker 2009
- ↑ W. Sutherland (26 March 2013). "The Galaxy. Chapter 4. Galactic Chemical Evolution" (PDF). Archived from the original (PDF) on 26 జనవరి 2020. Retrieved 13 January 2015.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Kwok 2000
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Marochnik, Shukurov & Yastrzhembsky 1996
- ↑ Zeilik, Michael; Gregory, Stephen A. (1998). Introductory astronomy & astrophysics (4. ed.). Fort Worth [u.a.]: Saunders College Publishing. p. 322. ISBN 0-03-006228-4.