ఫ్రెండ్స్ బుక్
ఫ్రెండ్స్ బుక్ వెల్‌ఫేర్ క్రియేషన్స్ బ్యానర్‌పై మళ్ళ విజయప్రసాద్ నిర్మాతగా ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఇది 2012, ఏప్రిల్ 13న విడుదలయ్యింది.
ఫ్రెండ్స్ బుక్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.పి.పట్నాయక్ |
రచన | ఆర్.పి.పట్నాయక్ |
నిర్మాత | విజయప్రసాద్ మళ్ళ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అభినందన్ రామానుజం |
కూర్పు | విజయ్ ఆనంద్ వడిగి |
సంగీతం | ఆర్.పి.పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | వెల్‌ఫేర్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 13 ఏప్రిల్ 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నిషాల్ - నిశ్చల్
- నండూరి ఉదయ్ - అక్షయ్
- సూర్యతేజ - సూర్య
- అర్చనా శర్మ - నిత్య
- అర్చనా శెట్టి - మధు
- సూరి - వేణుగోపాల్
- సురేష్
- రావు రమేష్
- చలపతిరావు
సాంకేతికవర్గం
మార్చు- కథ, దర్శకత్వం, సంగీతం: ఆర్.పి.పట్నాయక్
- కూర్పు: విజయానంద్ వడిగి
- ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం
- నిర్మాత: మళ్ల విజయ ప్రసాద్
కథ
మార్చుఆరుగురు స్నేహితులకు సంబంధించిన కథ ఇది. అందులో ఐదుగురు సాఫ్ట్వేర్‌కు సంబంధించిన ప్రొఫెషనల్స్, ఒకరు రియల్ ఎస్టేట్ రాజా. చేస్తున్న ఉద్యోగాలు విసుగు కలిగించడంతో ఈ ఐదుగురు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటారు. అందుకు తగిన ఆర్థిక సాయం రాజా అందిస్తానని హామీ ఇస్తాడు. దాంతో 'ఫేస్బుక్’లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో ఫేక్ అక్కౌంట్స్‌కు చెక్ చెప్పే సాఫ్ట్వేర్ తయారు చేయడానికి రంగం సిద్ధం చేస్తారు. దానికి టీమ్ లీడర్‌గా సూర్య ఉంటాడు. దీనికి సంబంధించిన పాస్ వర్డ్ కూడా అతని దగ్గరే ఉంటుంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ యాజమాన్యంకూ తెలియచేస్తారు. వాళ్ళూ ప్రోత్సహించడంతో దాదాపుగా ప్రాజెక్ట్ను పూర్తి చేస్తారు. దీనిని అమెరికాలోని ఫేస్బుక్ కంపెనీలో డెమో ఇవ్వడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు సూర్య కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. ఊహించని ఈ ఉపద్రవానికి స్నేహితులంతా షాక్ అవుతారు. అయితే ఆ తర్వాత సూర్యది ప్రమాదం కాదని హత్య అని తెలుస్తుంది. జెస్సికా అనే అమ్మాయి బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా సూర్య తనంతట తానే యాక్సిడెంట్ చేసుకునేలా చేసిందని అతని స్నేహితులు గ్రహిస్తారు. పోలీసుల సాయంతో జెస్సికా ఆచూకి తెలుసుకుంటారు. అయితే వీళ్ళంతా అక్కడకు వెళ్ళే సరికే జెస్సికా హత్యకు గురవుతుంది. సూర్య, జెస్సికాల హత్యకు కారణం ఎవరు? ఏ ప్రయోజనాలు ఆశించి వీరు ఈ పనిచేశారన్నది మిగతా కథ.[1]
స్పందన
మార్చు- "కంప్యూటర్ పరిజ్ఞానం గానీ, 'ఫేస్బుక్' నాలెడ్జ్ గానీ లేనివాళ్ళకు ఇదో గందరగోళ సినిమాలా అనిపిస్తుంది. ఫేక్ అక్కౌంట్స్‌కు చెక్ చెప్పాలనే టీమ్ ఆలోచన కొత్తగా ఉంది. దానిని ఓ మర్డర్ మిస్టరీతో మిళితం చేయడమూ ఆసక్తి కలిగించేదే. అయితే చనిపోయిన సూర్య ఆత్మ ఛాటింగ్ చేసేట్టు చూపడం, తన స్నేహితుల ప్రాణాలను కాపాడినట్టు చూపడం జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే హంతకుడిని పట్టుకున్నట్టు చూపించి ఉంటే బాగుండేది." అని ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "నిరుపయోగమైన 'ఫ్రెండ్స్ బుక్'!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 14 February 2024.