బయలు వీరభద్ర స్వామి ఆలయం

శ్రీశైలం సందర్శించే యాత్రికులలో అతి తక్కువమంది దర్శించుకునే ఆలయం

బయలు వీరభద్ర స్వామి ఆలయం

బయలు వీరభద్ర స్వామి వారి ఆలయం ప్రధానమైన ఆలయంనకు ఆగ్నేయ దిశలో, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకం వారి హోటల్ హరితకు ఎదురు రోడ్డులో, పోలీస్ స్టేషనుకు ఎడమ భాగంలో ఉంది.

ఈ ఆలయమునకు చిన్న ప్రాకారమే తప్ప విమాన గోపురం, గర్భాలయం, శిఖరం ఉండవు. దీనికి కారణమైన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అదమేమిటంటే, శ్రీశైల దేవాలయ నిర్మాణాలు జరుగుతున్న రోజులలో ఈ స్వామి వారికి కూడా ఆలయం నిర్మించారట. కానీ మరుసటి రోజుకు గర్భాలయ గోడలు, పై కప్పు పడిపోయి ఉన్నాయట. దానికి గల కారణం స్వామివారి విగ్రహం యొక్క ఎత్తు పెరగడమే.

మరుసటి రోజు మారిన కొలతలతో మరలా గర్భాలయం, శిఖరం నిర్మింపగా మరలా మరుసటి రోజుకు అవి పడిపోయి ఉన్నాయట. తిరిగి నిర్మించాలని ప్రయత్నిస్తున్న రోజులలో శ్రీ వీరభద్ర స్వామి వారు ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చి తనకు గోపుర నిర్మాణం చేయవద్దని ఆదేశించారట.

దానితో గర్భాలయ నిర్మాణం, శిఖర నిర్మాణాలు నిలిచిపోయాయి. శ్రీ వీరభద్ర స్వామివారిని ( విగ్రహమును ) దర్శించుకున్నప్పుడు స్వామి విగ్రహాపు ఎత్తును గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.

ప్రస్తుతం ఈ ఆలయం వద్ద వాహన పూజలు జరుగుతున్నాయి.