బి. టి. ఆర్ గా ప్రసిద్ధుడైన బాలచంద్ర త్రయంబక్ రణదివే (డిసెంబరు 19, 1904 – ఏప్రిల్ 6, 1990), భారతీయ కమ్యూనిస్టు రాజకీయనాయకుడు, కార్మిక సంఘపు నాయకుడు.

కమ్యూనిస్టు నాయకుడు ఏ.కే.గోపాలన్ తో బి.టి.రణదివే (కుడివైపు కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి)

రణదివే 1927లో ఎం.ఏ డిస్టింక్షనుతో పట్టభద్రుడై విద్యాబ్యాసం పూర్తిచేసాడు. 1928లో రహస్యకలాపాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. అదే సంవత్సరం బొంబాయిలో అఖిలభారత వృత్తి సంఘపు కాంగ్రేసులో పేరొందిన నాయకుడయ్యాడు. ముంబైలోని వస్త్రపరిశ్రమ కార్మికుల గిరిని కామ్‌గార్ సమైక్యలోనూ, రైల్వే కార్మికుల పోరాటాల్లోనూ క్రియాశీలకంగా కృషి చేశాడు.

జి.ఐ.పి. రైల్వేమెన్స్ యూనియన్ యొక్క కార్యదర్శి అయ్యాడు. 1939లో వర్తకసంఘపు కార్యకర్త అయిన విమలను పెళ్ళి చేసుకున్నాడు. 1943లో కమ్యూనిస్టు పార్టీ యొక్క కేంద్ర కార్యవర్గానికి ఎన్నికయ్యాడు. 1946 ఫిబ్రవరిలో నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా సార్వత్రిక సమ్మెను నిర్వహించడంలో రణదివే ప్రధాన పాత్రను పోషించాడు.

1948, ఫిబ్రవరిలో కొల్కతాలో జరిగిన భారతీయ కమ్యూనిష్టు పార్టీ యొక్క రెండవ సమావేశంలో, పి.సి.జోషి స్థానంలో రణదివే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.[1] 1948 నుండి 1950 వరకు ఆ స్థానంలో కొనసాగాడు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నకాలంలో పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటం వంటి తిరుబాటు ఉద్యమాల్లో పాల్గొన్నది. 1950లో రణదివేను "వామపక్ష సాహసికుడు"గా ముద్రవేసి గద్దె దించారు.

1956 లో, పాల్ఘాట్లో జరిగిన నాలుగవ పార్టీ సమావేశంలో రణదివేకు తిరిగి పార్టీ కేంద్రమండలిలో స్థానం కల్పించారు. కేంద్రకమిటీ యొక్క వామపక్ష వర్గపు ప్రధాన నాయకుడయ్యాడు. 1962లో భారత-చైనా యుద్ధపు సమయంలో భారత ప్రభుత్వము జైలులో నిర్భంధించిన ప్రధాన నాయకుల్లో రణదివే ఒకడు. 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) వర్గపు ప్రధాన నాయకుడిగా ఎదిగాడు.

బి.టి.ఆర్ భవన్, కేరళ
అలెప్పీలో రణదివే స్మారకం

1970 మే 28 నుండి మే 31 వరకు కొల్కతాలో జరిగిన భారతీయ కార్మిక సంఘపు కేంద్రము యొక్క వ్యవస్థాపక సమావేశంలో ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కొత్త దిల్లీలోని సి.ఐ.టీ.యూ ప్రధాన భవనానికి బి.టి.ఆర్. భవన్ అని రణదివే పేరుపెట్టారు.

భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నేత, ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఆరవ లోక్‌సభకు ఎన్నికైన అహిల్యా రంగ్నేకర్ స్వయానా రణదివే చెల్లెలు.

మూలాలు మార్చు

  1. Chandra, Bipan & others (2000). India after Independence 1947-2000, New Delhi:Penguin, ISBN 0-14-027825-7, p.204

బయటి లింకులు మార్చు

ఇతర లింకులు మార్చు