బోడో భాష
బోడో, లేక మెక్, అన్నది మౌలికంగా వాయువ్య భారతదేశంలోనూ, నేపాల్, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో బోడో ప్రజలు మాట్లాడే భాష. స్వయంపాలిత ప్రాంతమైన బోడోలాండ్‌కి అధికారిక భాష కాగా, భారతదేశానికి, అసోంకి ఉన్న అధికారిక భాషల్లో ఒకటి.[2] 22 షెడ్యూల్డ్ భాషల్లో ఒకటిగా భారతదేశంలో రాజ్యాంగ హోదా కలిగివుంది. 1963 నుంచి బోడో భాషను అధికారికంగా దేవనాగరి లిపిలో రాస్తున్నారు. పూర్వం లాటిన్, అస్సామీస్ లిపుల్లో రాసేవారు. ప్రస్తుతం అంతరించిపోయిన డియోధాయ్ లిపి ఈ భాషకు ఉండేదని పండితులు భావిస్తున్నారు. 20వ శతాబ్దిలో క్రమంగా రోమన్ లిపి, బెంగాలీ లిపి, అస్సామీ లిపి బోడో భాష రాసేందుకు ఒక్కొక్కటి కొన్ని దశాబ్దాల పాటు వినియోగంలో ఉండి, తుదకు 1975 నుంచి దేవనాగరి లిపి అధికారిక లిపిగా స్థిరపడింది.
బోడో | |
---|---|
మెక్ | |
बर'/బోరో | |
![]() దేవనగరిలో బోడో అన్న పదం | |
స్థానిక భాష | అసోం, భారత దేశం |
స్వజాతీయత | బోడో, మెక్, |
స్థానికంగా మాట్లాడేవారు | 13,30,775 (2001)[1] |
సినో-టిబెటన్
| |
దేవనాగరి (అధికారికం) లాటిన్ లిపి (తరచు వాడేది) డియోధాయ్ (చారిత్రకం) | |
అధికారిక హోదా | |
అధికార భాష | ![]() |
భాషా సంకేతాలు | |
ISO 639-3 | brx |
Glottolog | bodo1269 |
చరిత్ర, భాషా కుటుంబ విభజనసవరించు
బోడో భాష సినో-టిబెటన్ కుటుంబంలో బోడో-గారో భాషా సమూహానికి చెందినది. దిమసా, డ్యూరి, తివా వంటి అసోం ప్రాంతపు భాషలతోనూ, మేఘాలయాకు చెందిన గారో భాషతోనూ, త్రిపురకు సంబంధించిన కోక్‌బోరోక్ భాషతోనూ దీనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అస్సాంలో పశ్చిమాన ధుబ్రీ నుంచి తూర్పున సాదియా వరకూ, అలీపూర్‌దౌర్, కూచ్ బీహార్, జల్పైగురీ సహా అసోం సరిహద్దులను ఆనుకునివున్న బెంగాల్ జిల్లాల్లో ఎక్కువగా బోడో భాష మాట్లాడతారు. 1991 జనగణన ప్రకారం 19,84,569 మంది బోడో భాష మాట్లాడుతూండగా వీరిలో 13 లక్షల 24 వేల పైచిలుకు బోడో జాతి వారు కాగగా, 6 లక్షల 59 వేల పైచిలుకు మెక్ జాతీయులు.
బోడో భాషలో మూడు ప్రధానమైన మాండలికాలు ఉన్నాయి:
- పశ్చిమ బోరో మాండలికం
- తూర్పు బోరో మాండలికం
- దక్షిణ బోరో మాండలికం
కోక్రఝార్, చిరంగ్, బక్స, బోంగైగావ్ జిల్లాల్లో పశ్చిమ బోరో మాండలికం మాట్లాడతారు. తూర్పు బోరో మాండలికం బార్పేట, నల్బారి, కామ్‌రూపు జిల్లాల్లో, డరాంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడతారు. పశ్చిమ బోరో మాండలికం ప్రామాణికమైనదిగా ప్రాధాన్యత పొంది, రాత రూపంలోనూ బాగా ఉపయోగంలో ఉంది.
శబ్దాలు, పదాలను బట్టి ఈ మాండలికాల్లో మార్పు ఉంటుంది.
బోధనా మాధ్యమంసవరించు
1913 నుంచి పలు బోడో సంస్థల ఆధ్వర్యంలో సామాజిక రాజకీయ చైతన్యం అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఉద్యమం అనంతరం 1963లో బోడో భాష ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల్లో బోడోని బోధనా మాధ్యమంగా వినియోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం బోడో భాష మాధ్యమిక స్థాయి వరకూ బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. 1985 నుంచి అసోం రాష్ట్రానికి అనుబంధ అధికార భాషగా ఉంది. 1996లో గౌహతి విశ్వవిద్యాలయంలో బోడో భాష మీద పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు ప్రవేశపెట్టారు. బోడో భాషను ఆధునిక భాషల్లో ఒకటిగా గుర్తించి విశ్వవిద్యాలయాల్లో బోధనకు స్వీకరించే ప్రయత్నాలు 1977లో గౌహతి విశ్వవిద్యాలయంతో ప్రారంభమయ్యాయి. క్రమేపీ నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ, షిల్లాంగ్ విశ్వవిద్యాలయం, చివరగా దిబ్రుఘర్ విశ్వవిద్యాలయం బోడో భాషను బోధనా మాధ్యమంగా స్వీకరించాయి.[3]
రాత పద్ధతులుసవరించు
బోడో భాషను చారిత్రకంగా పలు లిపుల్లో రాశారు. బోడో రాజుల పరిపాలన కాలంలో బోడో భాషను డియోధాయ్ లిపిలో రాసేవారని పరిశోధకులు చెప్తారు. ఇది క్రమేపీ అంతరించిపోయింది. అసోంలో మిషనరీలు క్రైస్తవ మత ప్రచారం సాగిస్తున్న రోజుల్లో రోమన్ లిపిలో బోడో భాషను రాసేవారు. బ్రిటీష్ పాలన తుది దశకాల్లోనూ, భారత స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దిలోనూ బెంగాలీ లిపిలో బోడో భాష రాసే పద్ధతి ఉండేది. 1963 నుంచి అస్సామీ లిపిని బోడో భాషకు ఉపయోగించడం ప్రారంభమైంది. తుదకు 1975లో దేవనాగరి లిపి బోడో భాషకు ఉపయోగించాలన్న నిర్ణయం జరిగి, 1976 నుంచి దేవనాగరి లిపిని అధికారిక, ప్రామాణిక లిపిగా ఉపయోగిస్తున్నారు.[4]
సాహిత్యంసవరించు
బోడో సాహిత్యాన్ని మౌఖిక సాహిత్య యుగం, మిషనరీ సాహిత్య యుగం, పాత, కొత్త సాహిత్య యుగాలుగా విభజిస్తున్నారు.[5] 20వ శతాబ్ది తొలినాళ్ళలో క్రైస్తవ మత ప్రచార సంస్థలు బోడో భాషలో ప్రచురణలు ప్రారంభించేంత వరకూ బోడోలో సాహిత్యం ముద్రణలో లేదు. మిషనరీలు బోడో భాష వ్యాకరణం, నిఘంటువులు వంటి పుస్తకాలు కూడా ప్రచురించారు. బోడో భాషలో మొట్టమొదటి పత్రిక - బీబర్ 1920లో ప్రారంభమైంది. 1930లో హతోర్కీ హలా అన్న పత్రికలో బోడో భాషలోని మొట్టమొదటి చిన్న కథ ఇషాన్ ముషాహరీ అనే రచయిత రాయగా ప్రచురించారు.[6]
బోడో మాట్లాడే ప్రాంతాలు సహా అసోంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలూ బ్రిటీష్ పరిపాలనలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉండేవి. ఈ స్థితి లిఖిత సాహిత్యం అభివృద్ధికి ఆటంకంగా ఉండేది. 1947 తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెంది ఈ ప్రాంతం ఆర్థికంగా ముందడుగు వేయడంతో మధ్యతరగతి పాఠకులు ఏర్పడి, సాహిత్య సృష్టి పుంజుకుందని పరిశోధకుడు రణేన్‌చంద్ర ముచహరి పేర్కొన్నాడు. 1950ల తర్వాత చిత్తరంజన్ ముషాహరీ, నీల్ కమల్ బ్రహ్మ, మనోరంజన్ లహరీ, హరిభూషణ్ బ్రహ్మ, నందేశ్వర్ దైమరీ, జనీల్ కుమార్ బ్రహ్మ, జుమయ్ దళ బసుమతరీ, కథీంద్ర స్వర్గీరీ, నబీన్ మల్ల బోరో, ఇంద్రమాలతీ నర్జరీ, గోబింద బసుమతరీ, సునీల్ ఫుకన్ బసుమతరీ, యు. జి. బ్రహ్మ, తదితరులు చిన్న కథలు రాసి సాహిత్య రంగాన్ని అభివృద్ధి చేశారు.[6] 1952 నవంబరు 1న బోడో సాహిత్య సభ ఆవిర్భవించింది. దీని ఆవిర్భావంతో బోడో సాహిత్య రంగంలో కొత్త శకం ఆవిర్భవించినట్లు భావిస్తారు. [7] బోడో భాషలో కవిత్వం, నాటకం, చిన్న కథలు, నవలలు, జీవిత చరిత్రలు, యాత్రాచరిత్రలు, బాలల సాహిత్యం, సాహిత్య విమర్శ వంటి అంశాలపై పలు పుస్తకాలు ఉన్నాయి.
మూలాలుసవరించు
- ↑ "Archived copy". Archived from the original on 6 ఫిబ్రవరి 2012. Retrieved 23 మార్చి 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) 2001 census - ↑ "OMG! These 8 famous facts about India are actually myths | Free Press Journal". www.freepressjournal.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 18 ఆగస్టు 2017.
- ↑ ముచహరీ 2014, pp. 14–15, అధ్యాయం. 2.
- ↑ ముచహరీ 2014, p. 13, అధ్యాయం. 2.
- ↑ ముచహరీ 2014, p. 15, అధ్యాయం. 2.
- ↑ 6.0 6.1 ముచహరీ 2014, p. 1, అధ్యాయం. 1.
- ↑ ముచహరీ 2014, p. 2, అధ్యాయం. 1.
ఆధార గ్రంథాలుసవరించు
- ముచహరి, రణేన్‌చంద్ర (2014), Bodo Short stories a critical study