భట్టిప్రోలు స్తూపం

భట్టిప్రోలు స్తూపం, సారవంతమైన కృష్ణానదీ మైదానములో సముద్రతీరానికి సమీపములో గల గ్రామం భట్టిప్రోలు లో వున్నది. పురాతన కాలంలో పట్టణం వుండేది[1] ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్తూపం ఇక్కడ ఉంది.[2][3][4] సా.శ.పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్తూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి.[5] గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది.[6][7]

భట్టిప్రోలు స్తూపం
Maha Stupa at Bhattiprolu 01.jpg
భట్టిప్రోలు స్తూపం శిథిలావశేషాలు
ప్రదేశంభట్టిప్రోలు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎత్తునిర్మించినపుడు బహుశా 20.12 మీ (66 అ)
నిర్మాణముక్రీ.పూ 4వశతాబ్దం

చరిత్రసవరించు

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు భట్టిప్రోలుకు నామాంతరాలని చరిత్రకారుల అభిప్రాయం. సా.శ. 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని వ్రాసిన 'ధర్మామృత' కావ్యములో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. ఇది సా.శ.పూ. 5వ శతాబ్దిలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఈతని వారసుడు ధనదుడు జైన మతము వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథే బృహత్కథాకోశములో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. కుభీరక, కుబేర ధనదుడి నామాంతరాలు. జైనరాజగు ఖారవేలుడు పితుడ్రనగరం బౌద్ధక్షేత్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ఖారవేలుని శాసనాలలో చెప్పబడింది. ఆ శాసనాలలోని పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.[8]

స్తూపంసవరించు

కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం సా.శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), సర్ వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి. లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 132 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది. స్తూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదరపు స్తంభాలు (ఆయక స్తంభాలు) ఆయకవేదికలు. వీటిపై చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్తంభముల ఎత్తు 15 అడుగులు. వానిపై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది.

భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడింది. శాసనాలలోని 'బుధ శరీరాని నిఖేతుం', 'బుధ శరీరాని మహనీయాని కమ్మనే' అనే వాక్యాలనుబట్టి స్తూపం యథార్థమయిన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టం. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉంది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. స్తూపంలోపల మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.[2]

స్తూప వైశిష్ట్యముసవరించు

ఆంధ్రులు ఒక విశిష్టమైన స్తూప నిర్మాణశైలిని అభివృద్ధి చేశారు. ఇందు ఆయక స్తంభములు ప్రధానమైన ప్రత్యేకతలు. చక్రాకార స్తూపనిర్మాణము భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్తూపములలో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్తూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం, ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్తూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలు.

శిలా మంజూషికలుసవరించు

 
భట్టిప్రోలు స్తూపం నిర్మాణం

అలెక్జాండర్ రే 1892లో నిర్వహించిన త్రవ్వకాలలో మూడు శిలా మంజూషికలు ( బండరాతి పేటికలు) లభించాయి. మొత్తము మంజూషికలు ఐదు. ఇట్టి శిలా మంజూషికలు మరెక్కడా లభించలేదు. ఈ మంజూషికలలో పవిత్రమయిన బుద్ధధాతువులు నిక్షిప్తమయి ఉన్నాయి. మంజూషికలపైన శాసనాలు చెక్కిఉన్నాయి.[2]

ఒకటవ శిలా మంజూషికసవరించు

1870లో బాస్వెల్ కు ఒక మంజూషిక లభించింది. ఇందులో స్ఫటికపు బరిణె, రాతిపూసలు ఉన్నాయి. బరిణెలో కూన్ని గింజలు, ముత్యాలు ఉన్నాయి.

రెండవ శిలా మంజూషికసవరించు

రాబర్ట్ సెవెల్ ఆరు పలకలుగల రాతిపేటిక కనుగొన్నాడు. ఇందులో ఒక మట్టిపాత్ర, బలపపు రాతిబరిణె, బరిణెలో స్ఫటికపు కరండం (చిన్నపెట్టె) దొరికాయి. దీనిలో మరలా ఒక ముత్యము, బంగారు పుష్పాల ముక్కలు, బూడిద ఉన్నాయి. ఈ రాతిపేటిక పగిలిపోయింది. ఇంగ్లాండుకు తరలిస్తుండగా మట్టిపాత్ర, బలపపు బరిణే పగిలిపోయాయి.

మూడవ శిలా మంజూషికసవరించు

అలెగ్జాండర్ రే చేసిన త్రవ్వకాలలో ఉపరితలంనుండి 14 అడుగుల లోతున బండరాతి పేటిక లభించింది. ఇందులో చేయబడిన గుంటలో ధాతుపేటిక ఉంది. పేటికలో రాగి ఉంగరం, రాగి ముక్కలు, పూస, రెండు ముత్యాలు, బంగారు పూసలు, రంధ్రం ఉండి ఆరు పలకలుగా ఉన్న స్పటికపు పూస, బంగారురేకులతో మలచిన త్రిరత్న చిహ్నాలు, 8 రేకులున్న రెండు స్వర్ణ పుష్పాలు, ఏడు బంగారు ముక్కలు, రెండు గట్టి బరిణే మూతలవలె ఉన్న కప్పులు ఉన్నాయి. గుండ్రని రాతి కరండములో స్పటికపు బరిణే ఉంది. అందులో 1/2 అంగుళం వెడల్పు ఉన్న అస్థిక ఉంది. ధాతువును పీతాంబరములో భద్రపరిచిన ఆనవాళ్ళున్నాయి.

నాలుగవ శిలా మంజూషికసవరించు

 
భట్టిప్రోలు నాలుగవ, ఐదవ శిలా మంజూషికల నమూనాలు

దీనికి మూతరాయి, క్రిందిరాయి ఉన్నాయి. మూతరాయి అడుగున 19వరుసల శాసనం చెక్కబడిఉంది. పేటికలో స్ఫటికపు బరిణే ఉంది. బరిణెలో 6, 8, 9 రేకులు కలిగిఉన్న 164 స్వర్ణపుష్పాలున్నాయి. గుంటలున్న 6 బంగారు పూసలు, ఒక బంగారు ఉంగరం, రెండు ముత్యాలు, 6 కొరల్ పూసలు, ఒక నీలి స్ఫటికపు పూస, చిన్నగొడుగులు, వెండిరేకు చుట్ట, చుట్ట మడతలో మూడు వరుసలలో అక్షరాలు ఉన్నాయి.

ఐదవ శిలా మంజూషికసవరించు

పేటిక మూతభాగం వంకరగా ఉన్న గుండ్రటి రాయి. దీని లోపల అంచు మెరుగు పెట్టి 9 వరుసలలో శాసనం చెక్కి ఉంది. ఒక స్ఫటికపు కరండం లభించింది. దీనిలో బెరిల్ తో చేసిన బరిణే ఉంది. బరిణే అడుగున మూడు గుంటలున్నాయి. గుంటలలో చిన్న చిన్న అస్థికలున్నాయి. స్ఫటికపు మూతతో బరిణే బిగించి ఉంది. బరిణే క్రింద బంగారు రేకులున్నాయి. రెండు గోమేధిక పూసలు, స్ఫటికపు పోగులు, బంగారు రేకు బొమ్మ, బంగారు చుట్ట, 30 స్వర్ణ పుష్పాలు, 6 ముత్యాలు, తెల్లటి ఖనిజ లవణం, ఇనుప ముక్కలు, రాగి ముక్కలు, ఒక ఎముక పూస మొదలైనవి దొరికాయి.

శాసనాలుసవరించు

భట్టిప్రోలు శాసనాలలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలో కొద్ది తేడాలు కలది. రాతిపేటికలపైన, స్ఫటికపు మంజూషికపైన, వెండిరేకుపైన, స్ఫటికపు పూసపైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనముల వల్ల స్థానిక సభ దానధర్మములలో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ. మూడవ పేటిక శాసనంలో బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేయుటకు 'కుర' అనే అతడు పేటిక చేయించాడు అని ఉంది. నాలుగవ పేటిక శాసనంలో గోష్ఠి సభ్యులందరి పేర్లూ ఉన్నాయి. ఐదవ పేటిక శాసనములో 'రాజా కుబేరక' అని ఉంది.

భాష, లిపిసవరించు

 
బ్రహ్మీ లిపి శాసనము (1894 కాలంలో 3 వ పేటిక, ఆతరువాతి కాలంలో 5 వ పేటిక)

తెలుగు దక్షిణభాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి సా.శ.పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగులిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి'ని పేర్కొంటారు. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణములు మౌర్యుల కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని 'ళ' ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు.

రాజ్యముసవరించు

శాసనముల ఆధారముగా భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరకుడు అనే రాజు పాలించాడు. 'మహాపరినిబ్బానసుత్త' లో భారతదేశములోని జనపదాల ప్రసక్తి ఉంది. అమరావతి, వడ్డమాను, దంతపురము మున్నగు జనపదాలు దక్షిణ దేశములో ఉన్నట్లు వాటికి ఉత్తర భారతదేశములోని జనపదాలకు మధ్య సంబంధాలున్నట్లు చరిత్రకారులు ధ్రువీకరించారు. శాసనాధారముల ప్రకారము భట్టిప్రోలులో గణతంత్ర పరిస్థితులున్నట్లు తెలుస్తున్నది. కుభీరకుడు ఎన్నికైన ప్రతినిధి, సభానాయకుడు. స్వతంత్ర ప్రతిపత్తిగల పాలకుడు. అంటే మౌర్యులకు ముందువాడని అర్థంచేసుకోవచ్చు. ప్రజాస్వామ్యభావాలతో సహా బౌద్ధం ఆంధ్రదేశంలో బుద్ధుని కాలంలోనే ప్రవేశించి ఉంటుంది. రాజ్యపాలనాంగాలలో ముఖ్యమయిన మూడింటిని భట్టిప్రోలు శాసనాలు ప్రతిఫలిస్తున్నాయి: రాజు - కుబేరుడు; మతసంబంధమైన మండలి- సింహగోష్ఠి; ఆర్థిక సంబంధమైన మండలి - నిగమసభ. గోష్ఠి అనేది బౌద్ధసంఘ స్థానిక శాఖ; నిగమ అనేది వర్తకశ్రేణి. కుభేరుని గోష్ఠిప్రముఖుడని శాసనం వర్ణిస్తున్నది. దీనిని బట్టి ఉపాసకులను సంఘంలో చేర్చుకుని వారిని నాయకులుగా అంగీకరించే వారని భావించవచ్చును. ఇది మహాసాంఘికుల సంప్రదాయం. గోష్ఠి నిగమసభల సహాయముతో కుభేరుడు భట్టిప్రోలు స్తూపవిహారాలను రూపొందించాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. బి.ఎస్.ఎల్. హనుమంతరావు, ed. (1995). బౌద్ధము, ఆంధ్రము. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.
  2. 2.0 2.1 2.2 భట్టిప్రోలు ఆంజనేయ శర్మ, (2007). భట్టిప్రోలు మహాస్తూపము,. భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.CS1 maint: extra punctuation (link)
  3. పి. ఆర్. కె. ప్రసాద్ (2004). "శాతవాహన పూర్వయుగపు స్థావరాలు: చారిత్రక నేపథ్యం". గుంటూరు జిల్లా సమగ్ర చరిత్ర. గుంటూరు జిల్లా చరిత్ర సంఘం, గుంటూరు.
  4. D. J. Das (1993). The Buddhist Architecture in Andhra. Books and Books, New Delhi.
  5. కార్తికేయ శర్మ (1986). "భట్టిప్రోలు స్తూపము: వాస్తువు, బ్రాహ్మీ శాసనములు, ప్రాక్తెలుగు". భారతి (10).
  6. H. Hoffman (1973). "Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka". German Scholars on India. I. Varanasi. pp. 136–140.
  7. E. Henning. (2015-10-02). "The history of the Kālacakra tradition in Sambhala and India". Archived from the original on 2015-11-26.
  8. ముప్పాళ్ళ హనుమంతరావు. సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి మొదటి భాగం. రాజమండ్రి: ఏ.బి.ఎస్.పబ్లిషర్స్. p. 417.