భర్తృహరి' రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు,సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇ

జననంఉజ్జయిని
యుగం5వ శతాబ్దం CE
ప్రాంతంమధ్యప్రదేశ్, భారతదేశం
ప్రధాన అభిరుచులువ్యాకరణం, భాషాశాస్త్రం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుస్ఫోటా
సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.

"సుభాషిత త్రిశతి" లేక "సుభాషిత రత్నావళి" అనేది, కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినది. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయములగు చారిత్రికాధారములు దొరకలేదు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానావిధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తనభార్య దుశ్శీలముచే సంసారమునకు ఇష్టపడక, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వనప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే 'విక్రమ శకాబ్దమునకు' మూల పురుషుడు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి అతనికి జీవితమున ఆశాభంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మదృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో కొంత తెలుసుకుందాం.

అయన గూర్చి వివిధ గ్రంథములలో విషయములు

మార్చు
  • పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు అనంగసేన అని యున్నది.
  • ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యునుగా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
  • భర్తృహరి భార్య పద్మాక్షి అని యింకొక కథ ఉంది.
  • భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాథ.
  • చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
  • మరియొక గాథ ననుసరించి విక్రమాదిత్యునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలు నలువురు భార్య లనియు, వారియందు వరరుచి, విక్రమార్క, భట్టి, భర్తృహరులు జన్మించినారని తెలిసింది.

ఇట్టి గాథల పరంపరను బట్టి కవి చరిత్రను నిర్థారించుట ఎంత కష్టమో చదువరులు ఊహించవచ్చును. కాని పై గాథలనుండి ఈ కవి మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ తెలియుచున్నది.

కవి-కాలము

మార్చు

ఈ కవి తన గ్రంథములలో తన జీవిత కాలమును గూర్చి తెలియ జేయలేదు. కనుక పండిత ప్రతీతిని, గ్రంథస్థ ప్రమాణములను, ఇతర కవుల వ్రాతలను సాథనములుగా చేసుకొని నిర్థారింపవలసియున్నది.

భర్తృహరి శకపురుషుడగు విక్రమార్కుని సోదరుడని పండిత ప్రతీతి. ప్రాచీన చరిత్రాన్వేషకులు ఈఅంశమును ఆక్షేపించినట్లు కానరాదు. విక్రమ శకము క్రీ.పూ. 56 వ సం. ఆరంభ మనుదానిని శిష్టులు అంగీకరించిన విషయము

ఇక గ్రంథ నిదర్శనములు అంతగా కవికాల నిర్ణయమునకు ఉపకరింపక పోవుటయే కాక, సందిగ్ధములు కూడా అయి ఉన్నాయి. ఆ శతకములు వేదాంత పరిభాషా జటిలములు. ఆయినను వేదాంత సిద్ధాంతములు వందల సంవత్సరములుగా చర్చించినవై, పూర్వ పక్ష, సిద్ధాంతీకరణముల నివృత్తి నొందినవి కావున కేవలము వాటి ఆధారమున కాల నిర్ణయము అసాధ్యము. ఈ సిద్ధాంతములను లోక సామాన్యమునకు ప్రప్రథమమున వెల్లడించిన వాడు కుమారిలభట్టు. ఇతడు ఎనిమిదవ శతాబ్దమువాడు. తరువాత వ్యక్తి ఆది శంకరులు. ఈయన తొమ్మిదవ శతాబ్దమువాడని కొందరును, కాదని కొందరును వాదింతురు. కావున వేదాంతము తొమ్మిదవ శతాబ్దమాదిగా వ్యాపృతి నొందినా, దాని యుద్భవమంతయు బహుకాలము పూర్వమే యనుట సువిదితము కదా! కనుక వేదాంత పరిభాషను ఆశ్రయించి మనము కవికాల మూహింపనెంచుట సమంజసము కాదు.

భర్తృహరి శతకములను వ్యాఖ్యానించినవారు మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు అను వారలని సంస్కృత వాఙ్మయ చరిత్రకారులు శ్రీ యుత కావ్య వినోదుల కృష్ణమాచార్యుల వారు పేర్కొని యున్నారు. వారిలో ఒక్కరైనను కవికాల నిర్ణాయక విషయమై శ్రద్ధ పూనినట్లు కానరాదు. కాని వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశమున గాదు, యావద్భారతమున వ్యాప్తిలో ఉంది. ఆయన పీఠికలో

విప్రేణా భూతపూర్వం ఫలమిధి తపసా ౽ లంబి సూర్యప్రసాదా
ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్
హిత్వా మోహం స్వకాన్తా స్వతివిమల ధియీ తం నిషే వ్యాక్త భవ్యో
యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసం.

—రామచంద్ర బుధేంద్రుడు

అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దానిని అతడు తన ప్రియభార్యకు ఇచ్చెను. ఆమె దానిని తాను భుజింపక, తన జారునకును, అతడు తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను." అన్న జన ప్రతీతిని ఇచట తడవి యున్నాడు గాని, దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణంగా ప్రసిద్ధ పురుషులను గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథలను ఎన్నింటినో కల్పించుటయు, వాటిని అలాగే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. ఇదియొక గ్రుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమే కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలమును నిర్ణయించుటకు తగినంత విశదముగా అతనిని ప్రశాసించిన వారును లేరు.

అట్లుండినను ప్రబలమైన ఆధారాంతరముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంథము ఉంది. ఇది సా.శ. 531-579 ప్రాంతముల పారసీక దేశమును పాలించిన యొకానొక పాదుషా ప్రోత్సాహమున రచియింపబడిన గ్రంథము. దీనికి మూలము మన సంస్కృత పంచతంత్ర మనుట సర్వాంగీకరింపబడిన విషయము. కనుక పంచతంత్రము అధమ పక్షము సా.శ. ఆరవ శతాబ్దారంభము నాటికే ప్రాచుర్యమందియుండెననుట కెలాంటి సంశయమును లేదు. పంచతంత్ర మా మూలాగ్రము స్వతంత్ర మైన రచన కాదు. నాటికి ప్రశస్తము లైయుండిన గ్రంథరాజము లనేకముల నుండి బహుళముగా నుదాహరణముల గైకొనియున్నది. దాని కాధారములగు గ్రంథములలో ఈ నీతి శతక మొకటి. ఇందుండి యొక శ్లోకము " గజభుజఙ్గ విహఙ్గమ బంధనం శశిదివాకరయోర్గ్రం హపీడనమ్; మతిమతాం చ విలోక్య దరిద్ర్క్వ తాం విధిరహో బలవాని తిమే మతిః" (చూడండి. 85 నీతి శతకం) అను శ్లోకమందు లోనికి గ్రహింపబడియున్నది.

ఈ యుదాహరణమే పారశీక గ్రంథమునందును గలదు. కనుక నీతి శతక కర్త సా.శ. 500 కు పూర్వమే యుండెననుట స్థిరము. అనగా కవికాలమును అయిదవ శతాబ్ది కీవలికి లాగుటకు వీలులేదు.

మరొక మతము భర్తృహరి సా.శ. 7 వ శతాబ్దము వాడనుట. దానికి భర్తృహరి కాళిదాసీయ మగు నొక శ్లోకమును - "భువన్తి నమ్రాస్తర వః పలోద్గమైర్న వాంబుభిర్దూరవిలంబినో ఘనాః, అనుద్దతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం." (శాకుం. 5 అం. శ్లో.12) అనుదానిని (చూ. శ్లో.61 భర్తృ) స్వగ్రంథమున నుదాహరించుటయు, కాళిదాసు 6 వ శతాబ్ది వాడను మతమునే యాధారములు. దీని కాక్షేపణమిది. కాళిదాసు కాలమే చాల వివాదగ్రస్తమై యుండినది. కాని చాలినన్ని ప్రమాణములను గొని అతడు సా.శ. ప్రథమ శతాబ్దమువాడని పండితులు నిశ్చయించియున్నారు. కావున నీవాదము నిలువజాలదు. ఇంకనొక విషయము. ఇత్సింగను చైనా యాత్రికుడు యాత్ర చేయుటకు ఈ దేశానికి 7 వ శతాబ్దాంతమున వచ్చియుండి భర్తృహరి తాను వచ్చుటకు పూర్వము నలువది యేండ్ల క్రితము గతించినట్లు వ్రాసి యున్నాడు. ఈ భర్తృహరి వైయాకరణి. ఆధునిక విద్వాంసుల మతమున శతక కవియు, వైయాకరణియు భిన్నులు. ఈ మతమును గూడ నేటిదనుక నాక్షేపించినవారొక్కరు లేరు. కనుక నేడవ శతాబ్దమై యున్నది. భర్తృహరి తన గ్రంథమున నెచటను సమకాలిక కవులనో, సమకాలిక సంభవములనో తడవి యుండని కారణము చేతను, ఇతరు లెవరు నాతనిపేరు నుదాహరింపని కారణమున సాంప్రదాయికాభిప్రాయములకు విరుద్ధముగా నేలాటి ప్రబల ప్రమాణములును గన్పట్టణందు వలనను పండిత ప్రతీతినే యనుసరింపవచ్చును.

పై విషయ వర్యాలోచన ఫలితముగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మద్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.

భర్తృహరి చాటిన సిద్ధాంతములు

మార్చు

వేదములందును వేదాంత సిద్ధాంతములందును ధర్మపరులకు విశ్వాస మత్యవసరము. పరబ్రహ్మమందు లయించుటయే యానందమునకు పరమావధి. తత్సిద్ధికై ఆశా త్యాగము, వైరాగ్యానుభవము, కర్మోస్మూలనమును సాధనములు. ఇవియు ముఖ్య వేదాంత సిద్ధాంతములు. కనుక భర్తృహరి వేదాంత మతామలంబకుడనుట విస్పష్టము. అచ్చటచ్చట యోగమును, దశావతారములను, గంగను, హిమాలయములను బ్రశంసించి యుండుట జూడ మానవులు తమ దైనందిన చర్యలలో నెట్టి దృష్టితో వ్యవహరింపవలెనని కవి యుద్దేశించెనో తెలియును.

పురుషుడీ లోకమున వాంఛింపదగిన వానిలో నతి ముఖ్యమైనది ఆత్మ గౌరవము. ఎన్నెన్ని సంకటములు పైకొన్నను ఆత్మ గౌరవమునకును స్వాతంత్ర్యమునకును లోటు పాటు కలుగనీయరాదని యెంతో మృదుల మగు భాషలో నెన్నో పట్టుల కవి వివరించెను. మానవ దృష్టి లక్షింప దగిన రెండవగుణము పట్టుదల. దృఢపవృత్తి, అభినివేశమును, వ్యవసాయమును కొరత పడిన నేకార్యమును సిద్ధింపదు. ధీరులు తాము పూనిన కార్యము సిద్ధినందు వరకు వదలరని రూఢిగా పలిగెను. కవి మనకు ఉద్బోధింపనెంచిన మూడవ నీతి ధర్మానుష్ఠానము. సాంఘిక సేవ, పరోపకాది మహిమలు వర్ణించు శ్లోకము అతి సుందరములు. భావగంభీరములై యున్నవి. భర్తృహరి రచనలు ధైర్యమునందు సచ్ఛీలమునందు వాస్తవాభినివేశమును పురికొల్పును. సద్గుణము లన్నింటిలో సచ్చీలము ఉత్తమోత్తమస్థానమధిష్టించు ననుట కవి మతము. తన్మూలమున సాధింపదగిన శ్రేయములను పలురీతుల వివరించియున్నాడు కవి.

శృంగార శతకమున సామాన్య ప్రసక్తములు కామాదికములు వెన్నెల, మందమారుతము, సౌభాగ్య సంపద మున్నగునవి తరుణ వయస్కుల మనముల నెట్టి భావముల నుద్రేకింపజేయునో, అవి యెట్లు మనస్సును కలచివైచి శాంతిని దూరము చేయునో ఆ భావముల వశీకరణ మొనర్చుకొని జితేంద్రియు లగుట కేది యుపాయమో కవి బహు హృద్యముగా మనసు నొప్పింపని తీరున వర్ణించెను.

వైరాగ్య శతకము వేదాంత సిద్ధాంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్చేదన మావశ్యకము. ఐహిక బంధమునకు మూలము లోభము. దాని మూలమున ధనవంతులు మదాంధు లగుదురు. కావున దాని విషయమున జాగ్రత్త వహించుట శ్రేయము. ఇహ లోక సుఖములో తగుల్కొని శాశ్వత పరలోకమును విస్మరించి మనశ్శాంతిని కోల్పోవుట కన్నా అడవుల జేరి శాంత మనస్కులగుటయే పరమోత్కృష్టమనుట కవి యాశయము. వైరాగ్య తత్పరుడై సర్వ శక్తి యగు భగవంతుని యందు మనస్సును లీనము గావింపగల్గిన సన్యాసి దేశపాలనము చేయు నెపమున భోగ లాలసుడగు రాజు కన్నను ఉత్తముడు. ఆత్మైక్యముచే సన్యాసి శాశ్వతానందముననుభవించుననుట యతని యుపదేశము.

భర్తృహరి త్రిశతిపై వివిధ వ్యాఖ్యానాలు

మార్చు

ప్రొఫెసర్ లాలసు గారి వ్యాఖ్య

మార్చు
భర్తృహరి శ్లోకములు సంక్షిప్తములు, సూత్రప్రాయములు, కనుకనే యవి సర్వజనాదరణీయములైనవి. అతని కృతులు భారతీయ సారస్వతమున నుత్తమ స్థానమలంకరించునటుల నిస్సంశయము. అని చెప్పినారు. శైలి సగటున సులభమైనను కొన్ని యెడల సంక్షేపకార్య ప్రయత్నము విష్పష్టతకు ఆడ్డుతగులును. చిన్న చిన్న శ్లోకములన్నచో భావ గంభీరములు లలిత పద యుక్తములునుగా నితింప బడుటచే నొకపరి చదివినంతనే మనమున నాటుకొనదగి యుండును. ఈ శ్లోకములను వ్యవహరింపనివారరుదు. పెద్ద వృత్తములందు సైతము దీర్ఘ సమాసములు కానరావు. కొన్ని పట్టుల మాత్రము శ్లోకము తుదిపాదమొక్కటే దీర్ఘ సమాస ప్రాయమైనను, దాని మూలమున శ్లోక భావము కుంతుపడక గాంభీర్యయుక్తమగును. పేశలముగ ముగించునో నంతహృద్యము కాకపోవచ్చును. దానివలన మాధుర్యమున కొక్కింత లోటు చేకూరినను ఉద్దిష్టార్థమునిరాడంబరము సునిశితమునై మనోహరమగును శాఇలి నీతి మత బోధనకు సహజముగ నున్నది. శతకములన్నింటి యందును అలంకారములు సహజములు, అక్లిష్టములు, విషయస్ఫూర్తికి సహకారములు. భర్తృహరి తన భావములను సహృదయాహ్లాదముగ దృష్టాంతముల నొసగుటలో మేలుచేయి. అతని వర్ణనలు, చిత్రములు, చిత్తాకర్షకములు. అతడు ప్రకృతి పరిశీలనము సూక్ష్మ తర దృష్టితో చేసినవాడనుట నిస్సంశయము. ఇయ్యది యతనికి నీతి గర్భిత రచనములు మిక్కిలి తోడ్పడెను. స్వోద్ధిష్టకృతిని అనుపమానముగా రచించుటలో నతని నందెవెసిన చేయి. దీని కతని గ్రంధముపరమ జనాదరణీయమగుటయే నిదర్శనము. అతనికి సంస్కృత సారస్వతమున నుత్తమ స్థానము కలిగెను.

పాశ్చాత్య పండితుడు మేక్డోనెల్ వ్యాఖ్య

మార్చు
Scattered throughout the various departments of Sanskrit literature, are innumerable apophthegms in which wise and noble, striking and original thoughts often appear in a highly finished and poetical garb. Owing to universality of this mode of expression in Sanskrit literature, there area but few works consisting exclusively of poetical aphorisms. The most important are the two collections by the highly gifted Bharthihari entitled respectively, Nitisataka or century or conduct and Vairagya Sataka or century of renunciation.

మోనియర్ విలియమ్సు పండితుని వ్యాఖ్య

మార్చు
Numbers of wise sayings have from time immemorial, been constantly quoted in conversation. Many, thus orally current, were of such antiquity that to settle their authorship was impossible. But occasional attempts were made to give permanence to the floating wisdom of the day. by stringing, like beads on a necklace, representing a separate topic, and the authorship of a whole series being naturally ascribed to men of known wisdom like Bhartrihari, Chanakya, much in the same way as the authorship of the puranas and the Mahabharata was referred to the sage Vyasa.

సుభాషిత త్రిశతి - వివిధ భాషలలో అనువాదాలు

మార్చు

ఇటీవల సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైనవి గోపీనాథుడు, టానీ పండితుడు, బి.హెచ్. వార్తాం పండితుడు, పీటర్సన్ అనువారి రచనలు. వీరిలో కొందరు విదేశీయులు. అన్నియు నాంగ్ల భాషలోనివి. వీనియన్నింటికన్నా మిన్నయై కవి హృదయమును వ్యాఖ్యాతృ భావమును చక్కని పరిశీలన, విమర్శనములకు గురిచేసి రచించినట్టిది శ్రీ గోపాలాచార్ల ఆంగ్లానువాద వ్యాఖ్యలు. సా.శ. 1654 వ సం. నాటికే అబ్రహాము రోజరు దీనిని డచ్చి భాషలోనికి పరివర్తనము గావించెను. ఆంధ్రానువాదకులలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి యనువారు ముఖ్యులు.

ఆంధ్రానువాదకులు మువ్వురిలో పుష్పగిరి తిమ్మన అర్వాచీనుడు; ఇతనికి గొంత పూర్వుడు ఏనుగు లక్ష్మణకవి. ఈ యిరువురకును ముందటివాడు ఎలకూచి బాలసరస్వతి.

మూలాలు

మార్చు

1. "భర్తృహరి సుభాషితములు" (సంస్కృత వ్యాఖ్యానాంధ్రపద్య టీకా తాత్పర్య సహితము) - లిఖిత ప్రచురణలు, అశోక్ నగర్, విజయవాడ-10 లోని అంశములు

ఇవీ చూడండి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
"https://te.wikipedia.org/w/index.php?title=భర్తృహరి&oldid=4352156" నుండి వెలికితీశారు