మహాభారత యుద్ధంలో అర్జనును చేతి భాణంతో మహారధి అయిన భీష్ముడు నేల కూలాడు. అంతటి మహానుభావుడు నేల కూల రాదని అర్జునుడు అనేక బాణాలను సృష్టించి ఒక పడకను ఏర్పాటు చేశాడు. దానినే అంపశయ్య అంటారు. దానిపై భీష్ముడు పడుకున్నాడు. అది దక్షిణాయనం. ఇంకా కొన్ని రోజులకు ఉత్తరాయనం వస్తుంది. అప్పుడు మరణిస్తే తనకు స్వర్గ ప్రాప్తి వస్తుందని తెలిసిన భీష్ముడు అప్పటి దాక ఆగాలని తలపోశాడు. తన కిష్టమైన రోజున మరణించవచ్చుననే తన తండ్రి ఇచ్చిన వరాన్ని భీష్ముడు వినియోగించుకుని రాబోయే ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తనువు చాలించాలని ముహూర్తం నిర్ణయించు కున్నాడు. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి నుండి రోజు కొక ప్రాణం ప్రాణం చొప్పున విడుస్తూ, ఏకాదశి నాటికి పంచ ప్రాణాలను విడిచి భీష్ముడు తనువు చాలించాడు. తన పంచ ప్రాణాలను విడిచిన ఈ ఐదు రోజులను భీష్మ పంచకం అని అంటారు. ఆ విధంగా భీష్ముని నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు.