భూరిశ్రవుడు
భూరిశ్రవుడు ఇప్పటి పర్షియాలోని బాహ్లిక రాజ్యానికి యువరాజు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఒక అక్షౌహిణికి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు.
భూరిశ్రవుని తండ్రి సోమదత్తుడు. కృష్ణుని తల్లి అయిన దేవకి వివాహము చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. వాసుదేవుని కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు శైని సోమదత్తుని ఓడించాడు. ఈ సంఘటన వల్ల శైని, సోమదత్తుని కుటుంబముల మధ్య వైరం జనించింది.
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శైని మనుమడైన సాత్యకి పాండవుల పక్షాన, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు.
కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకితో భూరిశ్రవుడు యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందించాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట కూడా యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేశాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండించాడు.